వెబ్ కాదు.. డబ్బు ల్యాండ్! | Irregulars on Farmers Lands! | Sakshi
Sakshi News home page

వెబ్ కాదు.. డబ్బు ల్యాండ్!

Published Sun, Aug 7 2016 2:23 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

వెబ్ కాదు.. డబ్బు ల్యాండ్!

వెబ్ కాదు.. డబ్బు ల్యాండ్!

లోపాల పుట్టగా ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’
సర్కారు అనాలోచిత నిర్ణయం.. భూ యాజమానులకు శాపం
ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు
ప్రభుత్వ ఖాతాలో ప్రైవేట్ భూములు
సవరణల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
ముడుపులిస్తేనే తప్పులను సవరిస్తున్న అధికారులు
భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
పట్టాదారు పాసు పుస్తకాలను కొనసాగించాలని రైతుల డిమాండ్

 
సాక్షి, హైదరాబాద్:
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇటీవల ఒకరికి చెందిన భూమిని మరొకరు విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిని ప్లాట్లుగా చేసేందుకు కూలీలను తీసుకెళ్లగా అసలైన యజమాని వచ్చి అడ్డుకున్నాడు. ఇది తన భూమి అని చెప్పడంతో వెబ్‌ల్యాండ్ చూసి మోసపోయానని లబోదిబోమనడం కొనుగోలుదారుడి వంతయ్యింది.
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన ఒక రైతు వెబ్‌ల్యాండ్‌లో తన భూమి నమోదు కోసం వెళ్లగా రెవెన్యూ అధికారులు ఏకంగా రూ.లక్ష డిమాండ్ చేశారు. బేరమాడి రూ.80 వేలు ముట్టజెప్పిన తర్వాతే ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో చేరింది.  

 
అత్యంత ప్రామాణికంగా, పకడ్బందీగా రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’ అక్రమాల పుట్టగా తయారైంది. ప్రభుత్వం ముందుచూపు లేకుండా, అనాలోచితంగా తీసుకొచ్చిన రెవెన్యూ వెబ్‌ల్యాండ్ భూ యజమానుల పాలిట శాపంగా మారింది. ఇదంతా ‘డబ్బు ల్యాండ్’గా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్‌లైన్ ప్రక్రియ (వెబ్‌ల్యాండ్‌లో నమోదు)లో లొసుగులు, అవినీతి అక్రమాలకు అంతూ పొంతూ ఉండడం లేదు. పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ మాన్యువల్ రికార్డుల్లో ఒకరి పేరుతో ఉన్న ఆస్తులు ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరుతో దర్శనమిస్తున్నాయి. వందో రెండొందలో కాదు, ఇలాంటివి లక్షల్లోనే ఉండడం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లలోని భూములు ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. ఆన్‌లైన్‌లో నమోదైన చాలా ఆస్తులను తహసీల్దార్లు ధ్రువీకరించ లేదు. రైతులకు వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణానికి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వివరాలకు పొంతన కనిపించడం లేదు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళితే వారి భూములు వెబ్‌ల్యాండ్‌లో లేవంటూ బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారు. తమ భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరుతున్న రైతులను రెవెన్యూ సిబ్బంది/దళారులు పీడిస్తున్నారు. డబ్బు ముట్టచెబితేనే వారి భూములను నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో సవరణల కోసం నిత్యం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి.
 
కొనుగోలుదారులకు తీవ్ర నష్టం
వెబ్‌ల్యాండ్‌లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ఒకరికి చెందిన భూమి వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరిట ఉండడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు, రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్‌లైన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, పకడ్బందీగా పూర్తి చేసి, అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ ఆధారిత లావాదేవీలకు ఆమోదం తెలిపితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు.  
 
సర్వం లోపాలమయం
దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ ఖాతాలో కనిపిస్తుండడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంగా సంక్రమించిన పొలాలూ సర్కారు భూముల ఖాతాలో కనిపిస్తున్నాయి. భూ పంపిణీ కింద ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వేరే వారి పేర్లతో ఉండటంతో వాస్తవ లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కిందిస్థాయి రెవెన్యూ అధికారులు/ దళారులు కుమ్మక్కై నకిలీల పేర్లను భూ యజమాని కింద వెబ్‌ల్యాండ్‌లో చేర్చి, విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు బయట పడుతున్నాయి. దీంతో అసలైన యజమానులే కాకుండా కొనుగోలుదారులు కూడా మోసపోతున్నారు. అధికారులు భారీగా సొమ్ము తీసుకుని ప్రభుత్వ భూములను, ప్రైవేట్ వ్యక్తుల పొలాలను ఇతరుల పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.  
 
భూమి విలువను బట్టి రేట్లు
ఆన్‌లైన్‌లో భూముల నమోదుకు వాటి విలువ, యజమానుల ఆర్థిక పరిస్థితి, వారి అవసరాల ఆధారంగా రెవెన్యూ అధికారులు/ దళారులు రేట్లు ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదుకు భూమి విలువ, ఇతర అంశాల ఆధారంగా రూ.10 వేల నుంచి 60 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు.  
 
కొంపముంచిన తొందరపాటు నిర్ణయం

వెబ్‌ల్యాండ్‌లోని పొరపాట్లను పరిశీలించకుండానే ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసింది. వెబ్‌ల్యాండ్ ఆధారంగానే భూముల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, పంట రుణాలు ఇవ్వాలంటూ ఏకంగా జీవో ఇచ్చేసింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. వెబ్‌ల్యాండ్‌లో తప్పులను సవరించే వరకూ పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే లావాదేవీలకు అనుమతించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి.  
 
రెండు నెలల క్రితం పేరు మాయం
కర్నూలు జిల్లా వెల్దుర్తిలో సర్వే నంబరు 831లో నాకు 2.60 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయి. రెండు నెలల క్రితం వెబ్‌ల్యాండ్‌లో ఈ భూమి యజమానిగా నా పేరు బదులు మరో వ్యక్తి పేరు ప్రత్యక్షమైంది. నిజమైన రైతు పేరును వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడానికి డాక్యుమెంట్లు అడుగుతున్న అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండానే నా భూమి యజమానిగా వేరే వ్యక్తి పేరును ఎలా నమోదు చేశారో అర్థం కావడం లేదు.     
- చింతకాయల రామాంజనమ్మ
 
ఐదెకరాలుంటే రెండెకరాలుగా నమోదు
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన గుంటబోయిన వెంకటరమణకు ఐదెకరాలకు పైగా సాగు భూమి ఉంది. వెబ్ అడంగల్‌లో మాత్రం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు నమోదైంది. దీంతో ఈయన మ్యుటేషన్  కోసం మార్చి నెల లో మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశారు. ఇంతవరకూ వెబ్ అడంగల్‌లో మార్పు చేయలేదు. శ్రీకాకుళం జిల్లా గోళ్లవలస గ్రామంలో 400 మంది రైతులకు చెందిన 2 వేల ఎకరాల భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. దీంతో పంట రుణాలకు నోచుకోకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు.  
 
మోసాలు బయటపడటంతో...
వెబ్‌ల్యాండ్‌లోని తప్పులను ఆసరాగా చేసుకుని ఒకరి భూమిని మరొకరు విక్రయిస్తున్నారని, కొందరు రెవెన్యూ అధికారులు ఇలాంటి మోసాలకు సహకరిస్తున్నారని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే వెబ్‌ల్యాండ్ ఆధారిత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఇప్పటికే ఎన్నో మోసాలు బయటపడ్డాయి. దీనివల్లే తాత్కాలిక (నోషనల్) ఖాతాలకు సంబంధించిన భూములను విక్రయ రిజిస్ట్రేషన్లు చేయరాదని, శాశ్వత ఖాతాలేని వారికి పంట రుణాలు ఇవ్వరాదంటూ తాజాగా రెవెన్యూ ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వెబ్‌ల్యాండ్‌లో కొన్ని పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని, వీటిని సవరించే ప్రక్రియ త్వరలో చేపడతామని రెవెన్యూ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement