రుణాలు ఇవ్వండి.. అన్ని అనుమతులున్న వాటిని ముట్టుకోం
మహిళా సంఘాలు, వ్యవసాయానికి అధిక నిధులివ్వండి
బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: హైడ్రాను చూసి భయపడొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు ధైర్యం నింపారు. హైడ్రా గురించి ఆందోళన అవసరం లేదని, హైడ్రా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు. బుధవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన బ్యాంకర్ల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం మహిళలు గౌరవ మర్యాదలతో జీవించేందుకు దోహదపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేబినెట్ నిర్ణయించిందని, వీలైతే అంతకుమించి వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.
కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు 9 నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని, బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు. మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలని ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే సూక్ష్మ, మధ్యతర పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించి వన్ టైం సెటిల్‌మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మున్సిపల్ పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, పురపాలక సంచాలకులు, కమిషనర్ శ్రీదేవి పాల్గొన్నారు.
ప్రజలపై భారం మోపకుండా
వనరుల సమీకరణ: సామాన్య ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. బుధవారం ప్రజాభవన్‌లో ఆదాయ వనరుల సమీ కరణపై వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు రిజి్రస్టేషన్లు, మైనింగ్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారు లతో భట్టి భేటీ అయ్యారు.
సమావేశంలో భాగంగా శాఖల వారీగా సాధించిన పురోగతి వివరాలు, ఆదాయ సమీకరణ కోసం రూపొందించిన ప్రణాళి కలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. భట్టి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే పన్ను ఎగవేతదారులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుకుమార్ సుల్తానియా, రెవెన్యూ, వాణిజ్య పనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, భూగర్భ గనుల శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment