web land
-
‘వెబ్’డబ్!
♦ వెబ్‌ల్యాండ్‌తో రైతులకు మరిన్ని కష్టాలు ♦ మీసేవ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ♦ సాంకేతిక వైఫల్యాలపై దృష్టి సారించని సర్కారు ♦ భూ సమస్యలపై పేరుకుపోతున్న ఫిర్యాదులు ♦ ముందుకుసాగని మ్యుటేషన్, కరెక్షన్లు ♦ తలలు పట్టుకుంటున్న రెవెన్యూ అధికారులు ♦ నేటి నుంచి ‘రైతు సేవలో రెవెన్యూ శాఖ’ ఐదు లక్షల మంది రైతాంగం... రెండున్నర లక్షల హెక్టార్ల సాగుభూమి... ఏటా సుమారు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తున్న జిల్లా... కానీ ఖరీఫ్ వచ్చేసరికి రైతులకు కష్టాలు తప్పట్లేదు! ప్రధానంగా భూమికి సంబంధించి రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సిన సమస్యలే ఎక్కువ! వాటి పరిష్కారానికేనంటూ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ‘వెబ్‌ల్యాండ్’... ఆ లక్ష్యాన్ని సాధించకపోగా రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. గురువారం నుంచి ‘రైతు సేవలో రెవెన్యూ శాఖ’ కార్యక్రమంతో రెవెన్యూ సిబ్బంది రైతుల వద్దకే వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం కొత్త కాదు! మూడేళ్లుగా ఏటా ఖరీఫ్ ప్రారంభంలో జరుగుతోంది! రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు! దీనికి వెబ్‌ల్యాండ్ సమస్యలు, సిబ్బంది కొరతతో ఎదురవుతున్న పనిఒత్తిడి కారణాలని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే వేలల్లో పేరుకుపోయిన ఫిర్యాదులపై రైతులకు ఎలా సమాధానం చెప్పాలోనని ఆందోళన చెందుతున్నారు! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో సుమారుగా 5 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులు ఉన్నారు. వీరిలో ఏటా రెండు లక్షల నుంచి దాదాపు 2.50 లక్షల మంది వరకూ ఖరీఫ్‌లో బ్యాంకు రుణాలు పొందుతున్నారు. రబీ సీజన్లోనూ మరో 20 వేల మంది వరకూ రుణాలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 41 బ్యాంకులకు సంబంధించిన 302 శాఖల ద్వారా ఈ ఖరీఫ్‌లో రూ.1,500 కోట్లు వ్యవసాయ రుణాలుగా అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. వీటిలో ఎక్కువ శాఖలు ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ)లకు చెందినవే. గత ఖరీఫ్ సీజన్లో 2.30 లక్షల మంది రైతులు సుమారు రూ.1,300 కోట్ల రుణాలు పొందారు. ఈసారి మరో రూ.200 కోట్లు అదనంగా రుణ లక్ష్యం పెంచారు. కానీ వెబ్‌ల్యాండ్ విధానం అమల్లో బాలారిష్టాలు తీరలేదు. భూసమస్యల పరిష్కారం కోసం మీ–సేవ కేంద్రాల్లో రైతులు దాఖలు చేసుకుంటున్న ఫిర్యాదులు లక్షల్లోనే ఉంటున్నాయి. వాటిలో ఎక్కువ మ్యూటేషన్, కరెక్షన్ కోసం దాఖలు చేసినవే. ఇవి పరిష్కారం కాకపోవడంతో బ్యాంకు రుణాలతోపాటు రాయితీపై ఇచ్చే విత్తనాలు, ఎరువులు తీసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. తహసీల్దార్లకు ‘వెబ్‌ల్యాండ్’ పరీక్ష రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతుల భూములకు అడంగల్, 1బీ చాలా ముఖ్యం. భూముల క్రయవిక్రయాలతో సర్వే నంబర్లలో తప్పులు, భూవిస్తీర్ణంలో తేడాలు సరి చేయడానికి మ్యుటేషన్, కరెక్షన్ల కోసం మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా ఈ ప్రక్రియను 21 రోజుల గడువులో పూర్తి చేయాలి. కానీ ఈ సమయంలో ఏదైతే భూమికి సంబంధించి మ్యుటేషన్ లేదా కరెక్షన్ కోసం దరఖాస్తు చేశారో ఆ భూమికి సంబంధించిన సర్వే నంబరులోని మిగతా రైతులకూ 1బీ జారీ కావట్లేదు. దీనికి ప్రధానంగా తహసీల్దారు బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర వేయాలి. లేకపోతే ఆ సవరణ ఆన్లైన్లో నమోదుకాదు. అయితే నెల రోజులుగా పగటిపూట వెబ్‌ల్యాండ్ పూర్తిగా పనిచేయడం లేదు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకూ పనిచేయడం గమనార్హం. కొంతమంది తహసీల్దార్లు తప్పనిసరి పరిస్థితిలో కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో ఆ సమయంలోనే కరెక్షన్లు నమోదు చేస్తున్నారు. పేరుకుపోతున్న సమస్యలు భూముల క్రయవిక్రయాలకు సంబంధిం చి కొత్త 1బీ తయారీకి సంబంధించిన మ్యుటేషన్ల కోసం మీ–సేవ కేంద్రాల్లో గత మూడు నెలల్లోనే 1,30,468 దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటిలో 75 వేల వరకూ పరిష్కరించినట్లు అధికారులు లెక్క చూపిస్తున్నారు. ఇంకా 55,225 దరఖాస్తులు తహసీల్దార్ల కార్యాలయాల్లో వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక భూములకు సంబంధించి అడంగల్ కరెక్షన్ల కోసం జిల్లావ్యాప్తంగా 1,94,153 ఫిర్యాదులు మీ–సేవ కేంద్రాల్లో దాఖలయ్యాయి. వాటిలో 55,807 పెండింగ్‌లో ఉన్నాయి. సర్కారు స్పందన కరువు... వెబ్‌ల్యాండ్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై తహసీల్దార్లు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర భూపరిపాలన విభాగానికి (సీసీఎల్ఏ) ఎప్పటికప్పుడు ఆన్లైన్, ఫోన్ ద్వారానే గాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ల్లోనూ నివేదిస్తున్నారు. వెబ్‌ల్యాండ్ అమల్లో ఎదుర్కొంటున్న సాంకేతికపరమైన సమస్యలకు పరిష్కారం చూపాలని వేడుకొంటున్నారు. కానీ ఫలితం ఉండట్లేదు. జిల్లాలో వెబ్‌ల్యాండ్ సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. -
విత్తనంపై పెత్తనం!
శ్రీకాకుళం పాతబస్టాండ్/పీఎన్‌కాలనీ: జిల్లాలో గ్రామస్థాయి నాయకులు విత్తనంపై పెత్తనం చెలాయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. ఆదుకోవాల్సిన నేతలు నిద్ర నటిస్తున్నారు... వెరసి అన్నదాతకు ఖరీఫ్ ఆరంభంలో విత్తు విపత్తు ఎదురైంది. వెబ్‌ల్యాండ్ ఇబ్బందులతో విత్తనాల పంపిణీ సక్రమంగా జరగక, ప్రైవేటు రం గంలో మేలురకం విత్తనాలు లభించక రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. రుతుపవనాలు కనికరించినా సర్కారు అనుకూలంగా లేకపోవడంతో విత్తనం కోసం రైతు పాట్లు పడాల్సి వస్తోంది. వేధిస్తున్న వెబ్‌ల్యాండ్ ఈ ఏడాది రైతులకు విత్తనాలు అందించేందుకు వెబ్‌ల్యాండ్‌తో లింకు పె ట్టారు. ఈ వెబ్‌ల్యాండ్‌లో రైతు ల వివరాలు తప్పనిసరిగా కని పించాలి. వేలిముద్ర వేస్తే తప్ప విత్తనాలు కూడా అందవు. అయితే పది రోజులుగా వెబ్‌ల్యాండ్ సక్రమంగా పని చేయడం లేదు. సరైన సమయానికి సాంకేతిక లోపాలు తలెత్తడంతో రైతులు తల పట్టుకుంటున్నారు. ఒక గంటలో జరగాల్సిన పనికి రో జుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వెబ్ ల్యాండ్‌లో సమస్యలు ఉన్నాయని ఇప్పటికే పలువురు తహసీల్దార్లు అమరావతి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రెవెన్యూ అధికారులు సైతం విసిగిపోతున్నారు. అడిగింది కొండంత... జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మంది రైతులు పొలం ప నుల్లో బిజీగా ఉన్నారు. 2.51 హెక్టార్లలో వరి సాగు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది సాగు ఆధారంగా 58 వేల క్వింటాళ్ల విత్తనాలు ముందుగానే పంపిణీ చేయాలి. కా నీ ప్రభుత్వం మాత్రం 37 వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేసింది. అవి కూడా రైతులు కోరుకున్నవి కావు. అవసరం లేని వంగడాలను సరఫరా చేశారు. జిల్లాలో రైతులు ఎక్కువగా కొరుకొనే వరి విత్తనాలు 1001, సాంబ మసూరి, సోనా మసూరి, 1075, స్వర్ణ రకాలు. జిల్లాలో ఉన్న నేలలో ఈ వంగడాలు ఎక్కువ దిగుబడినిస్తాయి. కానీ ఇవి ఆశిం చిన మొత్తంలో రాలేదు. దీంతో కొంతమంది రైతులు ప్రై వేటు వ్యాపారుల బారిన పడుతున్నారు. ఉదాహరణకు 1001 విత్తనాలు 29వేల క్వింటాళ్లు ఇండెంట్ పెడితే, 19, 845 క్వింటాళ్లు వచ్చాయి. సోనా మసూరి వెయ్యి క్వింటాళ్లు కావాలని ఇండెంటు పెడితే, 340 క్వింటాళ్లకే పరిమితమయ్యాయి. ఇలా అన్ని రకాల్లోనూ కొరత ఉంది. ఈ విత్తనాలు అన్ని మండలాల్లోనూ అందజేస్తున్నారు. జిల్లాలో 51 ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, 13 డీసీఎంఎస్ల్లోనూ, ఒక జీసీసీలో ఈ విత్తనాలు పంíపిణీ చేస్తున్నారు. సగం కూడా అందలేదు.. విత్తనాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 37 వేలు క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు వస్తే ఇప్పటివరకు 11 వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేశారు. ఈ ఏడాది బయట మార్కెట్‌కి, రాయితీపై ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాల ధరల్లో పెద్దగా తేడా లేకపోవడం, అధికార పార్టీ కార్యకర్తల పెద్దరికం, కావా ల్సిన రకం వంగడాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో రైతులు ప్రైవేటు మార్కెట్లో ఉన్న విత్తనాలను కొంటున్నారు. నాసిరకమే అయినా రైతుకు గత్యంతరం లేదు. -
నెట్టింటి చిచ్చు!
తికమక పెడుతున్న వెబ్‌ల్యాండ్ – రాత్రికి రాత్రి మారిపోతున్న భూముల వివరాలు – పెరుగుతున్న భూ వివాదాలు – విలువ లేని ఈ–పాస్ పుస్తకాలు – తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ – దోచుకుంటున్న అధికారులు, దళారులు – ప్రభుత్వ నిర్ణయంపై గుర్రు ప్రయివేట్ భూమి.. వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమి...(పోటో: 43బి – చిన్న చెంచన్న ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన 1–3 సర్వే నెంబర్లో 7.30 ఎకరాల భూమి ఉంది. ఇందులో నేరడుచెర్ల గ్రామానికి చెందిన ముసలన్న, చిన్న చెంచన్న, పెద్ద చెంచన్న, శ్రీనివాసులు, శివమ్మల పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లోని భూములపై 1924 నుంచే రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది ప్రయివేటు భూమిగా పేర్కొంటు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీకి రెకమెండ్ చేశారు. కర్నూలు(అగ్రికల్చర్): వెబ్‌ల్యాండ్ ప్రక్రియ కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. మొన్నటి వరకు ఆన్లైన్లో ఒకరి పేరు మీదున్న భూమి.. రాత్రికి రాత్రి మరొకరి పేరిట మారిపోతోంది. టెక్నాలజీ ఆధారంగా తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు.. వీఆర్వోలు.. అక్రమార్కులు రైతుల తలరాత మార్చేస్తున్నారు. భూమి విలువను బట్టి ఆన్లైన్లో ఎక్కించేందుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు డిమాండ్ చేస్తుండటం చూస్తే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గ్రామాల్లో పెద్ద ఎత్తున భూ వివాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే టైటిల్డీడ్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా పట్టాదారు పాసు పుస్తకాలతో సంబంధం లేకుండా వెబ్‌ల్యాండ్‌లోని వివరాలతోనే రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలలుగా ఈ–పాసు పుస్తకాలు జారీ చేస్తుండగా.. వీటికి విలువ లేదని ప్రభుత్వమే ప్రకటిస్తోంది. రైతులకు భూములు ఉన్నాయనడానికి ఇవి ఆధారం మాత్రమేనని.. అన్నింటికీ వెబ్‌ల్యాండ్ వివరాలే ప్రామాణికమని తేల్చడం గందరగోళానికి తావిస్తోంది. ఆన్లైన్లో సవరణలకు పేరుకుపోతున్న దరఖాస్తులు వెబ్‌ల్యాండ్‌లో భుముల వివరాలను సర్వే నెంబర్ల వారీగా నమోదు చేయడంలో వీఆర్ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పట్టాదారు పాసు పుస్తకంలో ఎన్ని ఎకరాలు నమోదు చేసి ఉంటే వెబ్‌ల్యాండ్‌లోనూ అన్నే ఎకరాలు న మోదు చేయాలి. వీఆర్ఓలు మాత్రం తక్కువగా నమోదు చేయడం.. వందలు, వేలాది సర్వే నెంబర్లను ఎగ్గొట్టడం వల్ల రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వీటిని సవరించుకోవాలంటే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో భూముల వివరాలను సవరించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 45వేల ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇందులో మామూళ్లు ఇచ్చుకున్న వాటిని ఆమోదిస్తూ.. తక్కిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి దరఖాస్తులే దాదాపు 25వేల వరకు ఉండటం గమనార్హం. ప్రభుత్వ భూముల జాబితాలో ప్రయివేటు భూములు ప్రయివేటు భూములను సైతం రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూములుగా చూపించారు. ఇందువల్ల వేలాది మంది రైతులు భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్ చేయించుకోలేక అల్లాడుతున్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో 1915 నుంచే రిజిస్ట్రేషన్లు అయిన భూములను నేడు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా కనపర్చారు. వీటికి దశాబ్దాల క్రితమే పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా ముద్రవేయడం వల్ల రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సొంత భూమిపైనే ప్రభుత్వం రైతులకు హక్కు లేకుండా చేసింది. జిల్లాలో దాదాపు 1.20 లక్షల సర్వే నెంబర్లను ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చి 1.60 లక్షల రైతుల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. -
ఆన్‌లైన్‌కు తొందరెందుకు...?
ఈ– విధానం సరికాదు వెబ్‌ల్యాండ్ విధానంపై మండిపడిన రైతులు భూములపై హక్కు పత్రం మా వద్దే్ద ఉంచండి సవరణల కోసం దరఖాస్తు చేసుకున్నా పరిష్కారమేదీ ‘సాక్షి’ అవగాహన సదుస్సులో గళం విప్పిన కర్షకులు భూములపై రైతులకున్న హక్కులను హరించేలా ఉన్న వెబ్ ల్యాండ్‌లో అనేక లోపాలు, లొసుగులు ఉన్నాయి...వాటిన్నంటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించిన అనంతరమే భూములను ఆన్లైన్ చేయాలి ... లేకుంటే తాము కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందని రైతులు గళం విప్పారు. వెబ్‌ల్యాండ్‌తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అమలాపురం గోశాలలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సుకు పెద్దఎత్తున రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు హాజరై వెబ్‌ల్యాండ్‌తో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్ రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వ్యతిరేకం కాదు...అవకతవకలు సరిచేయిండి వెబ్‌ల్యాండ్‌కు మేము వ్యతిరేకం కాదు. వాటిలో ఉన్న అవకతవకలను సరిచేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం మా భూములను ఆన్లైన్ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా భూముల ఆధారాలు, పత్రాలు మాత్రం మా వద్దే భద్రంగా ఉండాలి. అప్పుడే మాకు నిశ్చింతగా ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు, మార్పులు చేసినా మేము స్వాగతించలేం. – యాళ్ల వెంకటానందం, బీకేఎస్ కోనసీమ నాయకుడు 271 జీవోను రద్దు చేయాలి పట్టాదారు పాస్ పుస్తకాల రద్దుకు కారణమవుతున్న వెబ్‌ల్యాండ్ విధానాన్ని తెచ్చిన జీఓనెం.271ని ప్రభుత్వం రద్దు చేయాలి. లేదా క్షేత్రస్థాయిలో భూములను రీ సర్వే చేయించి వెబ్ సమస్యలు తొలగించాలి. ఈ రెండు చేయకుండా వెబ్‌ల్యాండ్ భారాన్ని రైతుల నెత్తిన రుద్దితే ఊరుకోం. వెబ్‌లో ఆన్లైన్ 40 శాతం భూములు కూడా ఇంకా నమోదు కాలేదు. అప్పుడే ప్రభుత్వం 90 శాతం పూర్తయిందని చెబుతూ ఈ కొత్త విధానాన్ని అమలు చేపట్టి భూమి హక్కులను హరించేలా చేస్తోంది. – పాలూరి సత్యానందం, బీజేపీ రైతు నాయకుడు హక్కు పత్రంతోనే రైతుకు ధైర్యం ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ ఆన్లైన్ ద్వారా భూములకు ఎంత భద్రత కల్పించినా అది రైతులకు ధైర్యాన్ని నింపలేవు. తమ భూముల తాలూకు హక్కు పత్రాలు తన ఇంట్లో భద్రంగా ఉంటేనే ధైర్యం ఉంటుంది. ప్రభుత్వం ఆ భరోసా, ధైర్యాన్ని వెబ్‌తో లాగేసుకున్నట్టుగా ఉంది. ఆన్లైన్ చేసినా పట్టాదారు పాస్ పుస్తకం రైతు వద్దే ఉండేలా చేస్తేనే రైతులకు ఈ కొత్త విధానంపై నమ్మకం ఏర్పడుతుంది. లేకుంటే అనుమానమే. – కోరుమిల్లి సత్యనారాయణాచార్యులు, రైతు, విశ్రాంత ఉపాధ్యాయుడు రెవెన్యూ అధికారులకూ అవగాహన లేదు వెబ్‌ల్యాండ్‌పై కొందరు తహసీల్దార్లు, వీఆర్వోలకే అవగాహన లేదు. పంట పొలాల్లో ఉండే రైతులకు ఏం ఉంటుంది. ఎరిరైనా రైతు కంప్యూటర్ ముందు కూర్చుని తన భూముల వివరాలను ఆన్లైన్ చుసుకోగలడా...? రైతులకే అనువుగా లేని అవగాహన లేని ఈ కొత్త విధానం ఎవరి కోసం అమలు చేస్తున్నారు. – రాయపురెడ్డి జానకిరామయ్య, ముమ్మిడివరం మండల రైతు నాయకుడు రైతు మానసికంగా కుంగిపోతున్నాడు వెబ్‌ల్యాండ్‌లో తమ భూములు సరిగా లేకపోవడం, వేరే సర్వే నంబర్లలో కనిపించడం... ప్రభుత్వ భూముల్లో ఉండడం వంటి గందర గోళ పరిస్థితులు చూసి రైతులు మానసికంగా కుంగిపోతున్నారు. తమ భూమి తమకు కాకుండా పోతుందేమోనన్న ఆందోళనతో ఉంటున్నాడు. వెబ్‌ల్యాండ్‌ను రద్దు చేసి రైతుల్లో ధైర్యాన్ని నింపాలి. – పత్తి దత్తుడు, రైతు అంబాజీపేట వెబ్ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా వెబ్‌ల్యాండ్ వల్ల కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. వాటి పరిష్కారానికి రెవెన్యూ అధికారులుగా తాము సిద్ధంగా ఉన్నాం. రైతులు వెబ్ ఇబ్బందులు ఉంటే తమకు దరఖాస్తు చేసుకుంటే వాటిని సవరిస్తాం. గతంలో కర్ణం, మునసబు వ్యవస్థలో భూములపరంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమైన మాట వాస్తవమే. అప్పటి తప్పిదాలే ఇప్పుడు ఆన్‌లైన్‌కు వచ్చే సరికి ఇబ్బంది పెడుతున్నాయి. – నక్కా చిట్టిబాబు, తహసీల్దార్, అమలాపురం భూముల హెచ్చు తగ్గులు చూపిస్తున్నాయి వెబ్‌ల్యాండ్‌లో తమకున్న భూములు లేని భూమిని ఎక్కువగా చూపిస్తూ... మరికొన్ని చోట్ల ఉన్న భూమిలోనే కొంత భూమి వేరొకరి సర్వే నెంబరులో చూపిస్తోంది. సమగ్ర సర్వే, మ్యూటేషన్ ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఆన్లైన్ పూర్తి కాకుండా పాస్ పుస్తకాలు రద్దు చేయడం తగదు. – అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఉప్పలగుప్తం మండల రైతు నాయకుడు దశలవారీగా సమస్యల పరిష్కారం వెబ్‌ల్యాండ్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కసరత్తు జరుగుతోంది. కొన్ని జిల్లాలో సర్వేనెంబర్లు, డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ల ద్వారా జరుగుతున్న తప్పిదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రశేపెట్టింది. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందకుండా వెబ్ల్యాండింగ్ ద్వారా తమ భూముల్లో తేడాల సవరణకు దరఖాస్తులు చేసుకుంటే సవరణలకు సిద్ధంగా ఉన్నాం. – గణేష్‌కుమార్, ఆర్డీఓ, అమలాపురం రీ సర్వే చేయాల్సిందే... ఖర్చులు మేమే భరిస్తాం ఏ సమస్యకైనా పరిష్కారం చూపినప్పుడు గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి. మీరు ఇప్పుడు వెబ్‌ల్యాండ్ అనే పరిష్కారం చూపినా అప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఇదే పరిష్కారమంటే ఎలా? వెబ్‌ల్యాండ్ అంతా గందరగోళంగా, సమస్యల పుట్టలా ఉంది. వెబ్‌ల్యాండ్, ఆన్లైన్ ద్వారా మీరు పరిష్కరించదలుచుకుంటే ముందు క్షేత్రస్థాయిలో మొత్తం భూములన్నీ రీ సర్వే చేయించి ఓ స్పçష్టతకు రావాలి. అప్పుడే భూముల వాస్తవ తాజా చిత్రం వస్తుంది. ఆ సర్వేకయ్యే ఖర్చులు అవసరమైతే రైతులే భరిస్తాం. – రంబాల బోసు, కోనసీమ రైతు సంఘం ప్రతినిధి. వెబ్‌ల్యాండ్ తేడాలతో పరిహారం అందడం లేదు అమలాపురం మండలంలోని కొన్ని గ్రామాల మీదుగా 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మించబోతున్నారు. ఆ రోడ్డు కోసం రైతుల నుంచి సేకరించిన భూముల వివరాలు వెబ్‌ల్యాండ్ ఆన్లైన్లో రకరకాల తేడాలతో ఉన్నాయి. దీంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందడంలో సాంకేతిస సమస్యలు ఎదురవుతున్నాయి. ఆన్లైన్ సక్రమంగా జరిగి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. – జవ్వాది బుజ్జి, డీసీసీబీ డైరెక్టర్ ఉమ్మిడి భూముల్లో వెబ్‌ల్యాండ్ వెతలు ఉమ్మిడి భూముల్లో వెబ్‌ల్యాండ్ సమస్యలు అనేకం ఉంటున్నాయి. ఉమ్మిడి భూములు పంచుకునే అన్నదమ్ములకు వారి తండ్రి, ఆయన తండ్రి, ఆడపిల్లలకు కట్నాలు కింద ఇచ్చిన భూములు కాలక్రమంలో క్రయ విక్రయాలతో జరిగిన మార్పులు సక్రమంగా సబ్ డివిజన్ చేయకపోవడంతో వెబ్‌ల్యాండ్‌లో ఇబ్బందులు అనివార్యమవుతున్నాయి. ఈ సమస్యలు రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ ద్వారా తొందరగా పరిష్కరిస్తేనే వెబ్ గందరగోళానికి తెరపడుతుంది. – జున్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం నాయకుడు -
వెబ్ డబ్
= తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్ = ఒకరి భూమి మరొకరి పేరున నమోదు = రైతులతో ఆడుకుంటున్న రెవెన్యూ అధికారులు = బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోని వైనం = ఇదే అదనుగా సిబ్బంది అక్రమ వసూళ్లు పట్టాదారు పాసు పుస్తకం, రిజిష్టర్ కాగితాలు పట్టుకుని నిల్చున్న ఈమె మండల కేంద్రం పుట్లూరుకు చెందిన తులశమ్మ. ఈమెకు 518–బీ సర్వే నంబర్లో 0.87 ఎకరాల పొలముంది. అయితే.. ఈ పొలాన్ని ఆన్లైన్లో రాణి అనే పేరుపై నమోదు చేశారు. తులశమ్మ తన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలను అధికారులకు చూపారు. అయినప్పటికీ ఆన్లైన్లో నమోదు చేయలేదు. ‘మీకోసం’లో కూడా ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఒక్క తులశమ్మ మాత్రమే కాదు.. ఇలాంటి బాధితులు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు. అనంతపురం అర్బన్ : భూముల వివరాల నమోదుకు సంబంధించిన ‘మీ భూమి –వెబ్‌ల్యాండ్’ తప్పుల తడకగా మారింది. రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒకరి భూమిని మరొకరి పేరుపై నమోదు చేయడం, అసలే నమోదు చేయకపోవడం, తక్కువ విస్తీర్ణాన్ని చూపడం తదితర తప్పిదాలు చేశారు. దీనివల్ల బాధిత రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. రైతులు అన్ని ఆధారాలూ చూపుతున్నప్పటికీ వివరాలు సరిచేసేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. డబ్బు ఇవ్వందే పని కావడం లేదని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందే తప్పులు చేయడం, వాటిని సరిచేసేందుకు తమతో డబ్బు గుంజడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 7.60 లక్షల రైతు ఖాతాలు జిల్లాలో 7.60 లక్షల రైతు ఖాతాలు ఉన్నాయి. వెబ్‌ల్యాండ్‌లో వంద శాతం భూముల వివరాలను నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే..ఇందులో తప్పులు ఉన్నాయి. ఒకరి పేరున భూమి ఉంటే 1బీలో వేరొకరి పేరు ఉంది. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి. తప్పులు సరిచేసేందుకు వీఆర్ఓ స్థాయిలో కొందరు రూ.1000 నుంచి రూ.1,500 వరకు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కొందరు సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్న కారణంగానే తప్పిదాలు జరుగుతున్నాయి. తహశీల్దారు స్థాయి అధికారులను అధికార పార్టీ నాయకులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారు. మరోవైపు తప్పులు సరిచేయాలంటూ బాధితులు నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మండల, జిల్లాస్థాయి గ్రీవెన్స్‌లు (మీకోసం), జేసీ ఫోన్‌ఇన్ తదితర కార్యక్రమాల్లోనూ పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. ఇటీవల జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం భూ సమస్యలపై ఫోన్ ఇన్ నిర్వహించినప్పుడు వెబ్‌ల్యాండ్‌కుS సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వచ్చాయి. వాటిలో కొన్ని.. = సర్వే నంబరు 299–1లో 60 సెంట్లు, 164–5లో 48 సెంట్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదని శింగనమల మండలం జూలకాలువకు చెందిన నాగలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. = ‘మేము 1978లో 10.04 ఎకరాల భూమిని కొన్నాం. రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. వెబ్‌ల్యాండ్‌లో 9.20 ఎకరాలు చూపిస్తున్నారు. 84 సెంట్లను తగ్గించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేద’ని కళ్యాణదుర్గం మండలం చాపిరికి చెందిన నారాయణప్ప విన్నవించారు. =‘మాకు సర్వే నంబరు 149–3లో భూమి ఉంది. దీనిపై అనంత గ్రామీణ బ్యాంకులో రుణం కూడా తీసుకున్నాం. ఇదే సర్వే నంబరుపై మరొకరికి రుణం ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చింద’ని కనగానిపల్లి మండలం కోనేటిపాళ్యంకు చెందిన లక్ష్మిదేవి ఆవేదన వ్యక్తం చేశారు. -
వెబ్ కాదు.. డబ్బు ల్యాండ్!
≈ లోపాల పుట్టగా ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’ ≈ సర్కారు అనాలోచిత నిర్ణయం.. భూ యాజమానులకు శాపం ≈ ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు ≈ ప్రభుత్వ ఖాతాలో ప్రైవేట్ భూములు ≈ సవరణల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ≈ ముడుపులిస్తేనే తప్పులను సవరిస్తున్న అధికారులు ≈ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు ≈ పట్టాదారు పాసు పుస్తకాలను కొనసాగించాలని రైతుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇటీవల ఒకరికి చెందిన భూమిని మరొకరు విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిని ప్లాట్లుగా చేసేందుకు కూలీలను తీసుకెళ్లగా అసలైన యజమాని వచ్చి అడ్డుకున్నాడు. ఇది తన భూమి అని చెప్పడంతో వెబ్‌ల్యాండ్ చూసి మోసపోయానని లబోదిబోమనడం కొనుగోలుదారుడి వంతయ్యింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన ఒక రైతు వెబ్‌ల్యాండ్‌లో తన భూమి నమోదు కోసం వెళ్లగా రెవెన్యూ అధికారులు ఏకంగా రూ.లక్ష డిమాండ్ చేశారు. బేరమాడి రూ.80 వేలు ముట్టజెప్పిన తర్వాతే ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో చేరింది. అత్యంత ప్రామాణికంగా, పకడ్బందీగా రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’ అక్రమాల పుట్టగా తయారైంది. ప్రభుత్వం ముందుచూపు లేకుండా, అనాలోచితంగా తీసుకొచ్చిన రెవెన్యూ వెబ్‌ల్యాండ్ భూ యజమానుల పాలిట శాపంగా మారింది. ఇదంతా ‘డబ్బు ల్యాండ్’గా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ (వెబ్‌ల్యాండ్‌లో నమోదు)లో లొసుగులు, అవినీతి అక్రమాలకు అంతూ పొంతూ ఉండడం లేదు. పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ మాన్యువల్ రికార్డుల్లో ఒకరి పేరుతో ఉన్న ఆస్తులు ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరుతో దర్శనమిస్తున్నాయి. వందో రెండొందలో కాదు, ఇలాంటివి లక్షల్లోనే ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లలోని భూములు ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. ఆన్లైన్లో నమోదైన చాలా ఆస్తులను తహసీల్దార్లు ధ్రువీకరించ లేదు. రైతులకు వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణానికి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వివరాలకు పొంతన కనిపించడం లేదు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళితే వారి భూములు వెబ్‌ల్యాండ్‌లో లేవంటూ బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారు. తమ భూములను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతున్న రైతులను రెవెన్యూ సిబ్బంది/దళారులు పీడిస్తున్నారు. డబ్బు ముట్టచెబితేనే వారి భూములను నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో సవరణల కోసం నిత్యం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. కొనుగోలుదారులకు తీవ్ర నష్టం వెబ్‌ల్యాండ్‌లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ఒకరికి చెందిన భూమి వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరిట ఉండడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు, రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, పకడ్బందీగా పూర్తి చేసి, అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ ఆధారిత లావాదేవీలకు ఆమోదం తెలిపితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. సర్వం లోపాలమయం దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ ఖాతాలో కనిపిస్తుండడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంగా సంక్రమించిన పొలాలూ సర్కారు భూముల ఖాతాలో కనిపిస్తున్నాయి. భూ పంపిణీ కింద ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వేరే వారి పేర్లతో ఉండటంతో వాస్తవ లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కిందిస్థాయి రెవెన్యూ అధికారులు/ దళారులు కుమ్మక్కై నకిలీల పేర్లను భూ యజమాని కింద వెబ్‌ల్యాండ్‌లో చేర్చి, విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు బయట పడుతున్నాయి. దీంతో అసలైన యజమానులే కాకుండా కొనుగోలుదారులు కూడా మోసపోతున్నారు. అధికారులు భారీగా సొమ్ము తీసుకుని ప్రభుత్వ భూములను, ప్రైవేట్ వ్యక్తుల పొలాలను ఇతరుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. భూమి విలువను బట్టి రేట్లు ఆన్లైన్లో భూముల నమోదుకు వాటి విలువ, యజమానుల ఆర్థిక పరిస్థితి, వారి అవసరాల ఆధారంగా రెవెన్యూ అధికారులు/ దళారులు రేట్లు ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదుకు భూమి విలువ, ఇతర అంశాల ఆధారంగా రూ.10 వేల నుంచి 60 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. కొంపముంచిన తొందరపాటు నిర్ణయం వెబ్‌ల్యాండ్‌లోని పొరపాట్లను పరిశీలించకుండానే ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసింది. వెబ్‌ల్యాండ్ ఆధారంగానే భూముల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, పంట రుణాలు ఇవ్వాలంటూ ఏకంగా జీవో ఇచ్చేసింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. వెబ్‌ల్యాండ్‌లో తప్పులను సవరించే వరకూ పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే లావాదేవీలకు అనుమతించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం పేరు మాయం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో సర్వే నంబరు 831లో నాకు 2.60 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయి. రెండు నెలల క్రితం వెబ్‌ల్యాండ్‌లో ఈ భూమి యజమానిగా నా పేరు బదులు మరో వ్యక్తి పేరు ప్రత్యక్షమైంది. నిజమైన రైతు పేరును వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడానికి డాక్యుమెంట్లు అడుగుతున్న అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండానే నా భూమి యజమానిగా వేరే వ్యక్తి పేరును ఎలా నమోదు చేశారో అర్థం కావడం లేదు. - చింతకాయల రామాంజనమ్మ ఐదెకరాలుంటే రెండెకరాలుగా నమోదు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన గుంటబోయిన వెంకటరమణకు ఐదెకరాలకు పైగా సాగు భూమి ఉంది. వెబ్ అడంగల్‌లో మాత్రం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు నమోదైంది. దీంతో ఈయన మ్యుటేషన్ కోసం మార్చి నెల లో మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశారు. ఇంతవరకూ వెబ్ అడంగల్‌లో మార్పు చేయలేదు. శ్రీకాకుళం జిల్లా గోళ్లవలస గ్రామంలో 400 మంది రైతులకు చెందిన 2 వేల ఎకరాల భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. దీంతో పంట రుణాలకు నోచుకోకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మోసాలు బయటపడటంతో... వెబ్‌ల్యాండ్‌లోని తప్పులను ఆసరాగా చేసుకుని ఒకరి భూమిని మరొకరు విక్రయిస్తున్నారని, కొందరు రెవెన్యూ అధికారులు ఇలాంటి మోసాలకు సహకరిస్తున్నారని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే వెబ్‌ల్యాండ్ ఆధారిత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఇప్పటికే ఎన్నో మోసాలు బయటపడ్డాయి. దీనివల్లే తాత్కాలిక (నోషనల్) ఖాతాలకు సంబంధించిన భూములను విక్రయ రిజిస్ట్రేషన్లు చేయరాదని, శాశ్వత ఖాతాలేని వారికి పంట రుణాలు ఇవ్వరాదంటూ తాజాగా రెవెన్యూ ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వెబ్‌ల్యాండ్‌లో కొన్ని పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని, వీటిని సవరించే ప్రక్రియ త్వరలో చేపడతామని రెవెన్యూ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
‘రెవెన్యూ’కు ట్యాబ్స్
♦ వీఆర్ఓల నుంచి తహసీల్దార్ల వరకు పంపిణీ ♦ సమాచారం పంపాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు ♦ ‘వెబ్‌ల్యాండ్’ నిర్వహణ సులభతరం సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెవెన్యూ శాఖను సంస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవినీతి ఆరోపణలు మూటగట్టుకుంటున్న ఈ శాఖను సుపరిపాలన దిశగా నడిపించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. రెవెన్యూ రికార్డులను చిటికెలోనే తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి రెవెన్యూ ఉద్యోగులకు కూడా టాబ్లెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి సర్వే నంబర్ పుట్టు పూర్వోత్తరాలు, క్షేత్రస్థాయిలో స్థితిగతులతో కూడిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు ‘వెబ్‌ల్యాండ్’ పేర కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన ప్రభుత్వం.. తాజాగా క్రోడీకరించిన ఈ సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునేలా గ్రామ రెవెన్యూ అధికారి మొదలు మండల తహసీల్దార్ వరకు టాబ్లెట్లను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పంపాలని రాష్ట్ర భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమాండ్‌పీటర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారి, పోస్టింగ్, ఖాళీలను తెలిపేలా రూపొందించిన ఫార్మెట్కు అనుగుణంగా సమాచారాన్ని నివేదించమని సూచించారు. ఇదిలావుండగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో పనిచేస్తున్న 434 మంది వీఆర్ఓలు, 65 మంది ఆర్ఐలు, 59 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 37 మంది తహసీల్దార్లకు టాబ్లెట్లు రానున్నాయి. -
‘వెబ్ ల్యాండ్’.. డబ్బు ల్యాండే!
హైదరాబాద్: భూముల వివరాల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్ రెవెన్యూశాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కడానికి దోహదం చేస్తోందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికిఈ విషయాన్ని నివేదించారు. సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం కేఈ జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ‘సాక్షి’ కథనాలే అజెండాగా మారాయి. రెవెన్యూశాఖలో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు అధికారుల వల్ల శాఖతోపాటు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, వీరిని ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. నా వయసులో కష్టంగా ఉంటుంది కదా.. ఏ జిల్లాకూ ఇన్చార్జి మంత్రిగా తనను నియమించకపోవడం సంతోషమేనని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. తన వయసులో శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలకు ఇన్చార్జి మంత్రిగా నియమిస్తే.. అక్కడకు వెళ్లడానికి కష్టంగా ఉంటుంది కదా.. అని తనదైన శైలిలో స్పందించారు. మిమ్నల్ని గవర్నర్‌గా పంపేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారట కదా? అన్న ప్రశ్నకు.. ‘ఆ సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తా’ నని సమాధానం దాటవేశారు.