‘వెబ్‌’డబ్‌! | More difficulties for farmers with webland | Sakshi
Sakshi News home page

‘వెబ్‌’డబ్‌!

Published Thu, Jul 6 2017 3:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

‘వెబ్‌’డబ్‌! - Sakshi

‘వెబ్‌’డబ్‌!

వెబ్‌ల్యాండ్‌తో రైతులకు మరిన్ని కష్టాలు
మీసేవ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ   ప్రదక్షిణలు
సాంకేతిక వైఫల్యాలపై దృష్టి సారించని సర్కారు
భూ సమస్యలపై పేరుకుపోతున్న ఫిర్యాదులు
ముందుకుసాగని మ్యుటేషన్, కరెక్షన్‌లు
తలలు పట్టుకుంటున్న రెవెన్యూ అధికారులు
నేటి నుంచి ‘రైతు సేవలో రెవెన్యూ శాఖ’


ఐదు లక్షల మంది రైతాంగం... రెండున్నర లక్షల హెక్టార్ల సాగుభూమి... ఏటా సుమారు తొమ్మిది లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తున్న జిల్లా... కానీ ఖరీఫ్‌ వచ్చేసరికి రైతులకు కష్టాలు తప్పట్లేదు!

ప్రధానంగా భూమికి సంబంధించి రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సిన సమస్యలే ఎక్కువ! వాటి పరిష్కారానికేనంటూ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ‘వెబ్‌ల్యాండ్‌’... ఆ లక్ష్యాన్ని సాధించకపోగా రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది.

గురువారం నుంచి ‘రైతు సేవలో రెవెన్యూ శాఖ’ కార్యక్రమంతో రెవెన్యూ సిబ్బంది రైతుల వద్దకే వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం కొత్త కాదు! మూడేళ్లుగా ఏటా ఖరీఫ్‌ ప్రారంభంలో జరుగుతోంది! రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు! దీనికి వెబ్‌ల్యాండ్‌ సమస్యలు, సిబ్బంది కొరతతో ఎదురవుతున్న పనిఒత్తిడి కారణాలని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే వేలల్లో పేరుకుపోయిన ఫిర్యాదులపై రైతులకు ఎలా సమాధానం చెప్పాలోనని ఆందోళన చెందుతున్నారు!

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో సుమారుగా 5 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులు ఉన్నారు. వీరిలో ఏటా రెండు లక్షల నుంచి దాదాపు 2.50 లక్షల మంది వరకూ ఖరీఫ్‌లో బ్యాంకు రుణాలు పొందుతున్నారు. రబీ సీజన్‌లోనూ మరో 20 వేల మంది వరకూ రుణాలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 41 బ్యాంకులకు సంబంధించిన 302 శాఖల ద్వారా ఈ ఖరీఫ్‌లో రూ.1,500 కోట్లు వ్యవసాయ రుణాలుగా అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. వీటిలో ఎక్కువ శాఖలు ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ)లకు చెందినవే. గత ఖరీఫ్‌ సీజన్‌లో 2.30 లక్షల మంది రైతులు సుమారు రూ.1,300 కోట్ల రుణాలు పొందారు. ఈసారి మరో రూ.200 కోట్లు అదనంగా రుణ లక్ష్యం పెంచారు. కానీ వెబ్‌ల్యాండ్‌ విధానం అమల్లో బాలారిష్టాలు తీరలేదు. భూసమస్యల పరిష్కారం కోసం మీ–సేవ కేంద్రాల్లో రైతులు దాఖలు చేసుకుంటున్న ఫిర్యాదులు లక్షల్లోనే ఉంటున్నాయి. వాటిలో ఎక్కువ మ్యూటేషన్, కరెక్షన్‌ కోసం దాఖలు చేసినవే. ఇవి పరిష్కారం కాకపోవడంతో బ్యాంకు రుణాలతోపాటు రాయితీపై ఇచ్చే విత్తనాలు, ఎరువులు తీసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు.

తహసీల్దార్లకు ‘వెబ్‌ల్యాండ్‌’ పరీక్ష
 రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతుల భూములకు అడంగల్, 1బీ చాలా ముఖ్యం. భూముల క్రయవిక్రయాలతో సర్వే నంబర్లలో తప్పులు, భూవిస్తీర్ణంలో తేడాలు సరి చేయడానికి మ్యుటేషన్, కరెక్షన్‌ల కోసం మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. సాధారణంగా ఈ ప్రక్రియను 21 రోజుల గడువులో పూర్తి చేయాలి. కానీ ఈ సమయంలో ఏదైతే భూమికి సంబంధించి మ్యుటేషన్‌ లేదా కరెక్షన్‌ కోసం దరఖాస్తు చేశారో ఆ భూమికి సంబంధించిన సర్వే నంబరులోని మిగతా రైతులకూ 1బీ జారీ కావట్లేదు. దీనికి ప్రధానంగా తహసీల్దారు బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్ర వేయాలి. లేకపోతే ఆ సవరణ ఆన్‌లైన్‌లో నమోదుకాదు. అయితే నెల రోజులుగా పగటిపూట వెబ్‌ల్యాండ్‌ పూర్తిగా పనిచేయడం లేదు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకూ పనిచేయడం గమనార్హం. కొంతమంది తహసీల్దార్లు తప్పనిసరి పరిస్థితిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ సహాయంతో ఆ సమయంలోనే కరెక్షన్‌లు నమోదు చేస్తున్నారు.

పేరుకుపోతున్న సమస్యలు
భూముల క్రయవిక్రయాలకు సంబంధిం చి కొత్త 1బీ తయారీకి సంబంధించిన మ్యుటేషన్ల కోసం మీ–సేవ కేంద్రాల్లో గత మూడు నెలల్లోనే 1,30,468 దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటిలో 75 వేల వరకూ పరిష్కరించినట్లు అధికారులు లెక్క చూపిస్తున్నారు. ఇంకా 55,225 దరఖాస్తులు తహసీల్దార్ల కార్యాలయాల్లో వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక భూములకు సంబంధించి అడంగల్‌ కరెక్షన్ల కోసం జిల్లావ్యాప్తంగా 1,94,153 ఫిర్యాదులు మీ–సేవ కేంద్రాల్లో దాఖలయ్యాయి. వాటిలో 55,807 పెండింగ్‌లో ఉన్నాయి.  

సర్కారు స్పందన కరువు...
వెబ్‌ల్యాండ్‌ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై తహసీల్దార్లు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర భూపరిపాలన విభాగానికి (సీసీఎల్‌ఏ) ఎప్పటికప్పుడు ఆన్‌లైన్, ఫోన్‌ ద్వారానే గాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ల్లోనూ నివేదిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌ అమల్లో ఎదుర్కొంటున్న సాంకేతికపరమైన సమస్యలకు పరిష్కారం చూపాలని వేడుకొంటున్నారు. కానీ ఫలితం ఉండట్లేదు. జిల్లాలో వెబ్‌ల్యాండ్‌ సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement