ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ పథకం మాయగా మారింది. అధికారంలోకి వచ్చిన తరువాత హామీని నీరుగార్చేశారు. వేలల్లో రుణం ఉంటే..వందల్లో చేసి చేతులు దులుపుకున్నారు. అదికూడా కొందరికే పరిమితం చేశారు. లేనిపోని కొర్రీలు పెట్టి చాలామంది రైతుల పేర్లను రుణ మాఫీ జాబితా నుంచి తొలగించేశారు. పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నా బంగారు ఆభరణాల తాకట్టుదారుల ఊసేలేదు. హామీలను నెరవేర్చని సర్కార్‌కు తగిన గుణపాఠం చెబుతామని అన్నదాత శపథం చేస్తున్నాడు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన రుణమాఫీ హామీని నమ్మిన రైతులు ఓట్లు వేసి రుణం తీర్చుకున్నారు. వీరి ఓట్లతోనే గద్దెనెక్కిన ఆయన ఆ తరువాత లేనిపోని నిబంధనలతో అన్నదాత ఆశలపై నీళ్లు చల్లారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రైతులు మండిపడుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల నాటికి జిల్లాలో బంగారు తాకట్టు, ఇతర రుణాలు కలిపి వివిధ బ్యాంకుల్లో అప్పులు ఉన్న రైతులు 5.60 లక్షల మంది. వీరికి మొత్తం రుణం సుమారుగా రూ. 1500 కోట్లు ఉండేవి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ రుణం మొత్తం మాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సి ఉంది. అయితే సర్కార్ అలా చేయలేదు.
ఎన్నికల సమయంలో రైతులందరివీ..అన్ని రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మాటను అధికారంలోకి వచ్చిన తరువాత మార్చేశారు. కమిటీలు వేసి ఆర్హులను గుర్తించి, నిబంధనల మేరకు రుణ మాఫీ చేస్తామన్నారు. కమిటీలను వేసి.. రుణ మాఫీ స్వరూపాన్నే మార్చేశారు. అర్హులను సైతం అనర్హులను చేసేశారు. అప్పటివరకూ లేని నిబంధనలను తెరపైకి తెచ్చి..రైతుల సంఖ్యను కుదించేశారు. 3.54 లక్షల మంది రైతులే మాఫీకి ఆర్హులని లెక్కలు చూపారు. వీరికి గాను రూ. 836.37 కోట్లు బ్యాంకు రుణ ఖాతాల్లో జమ చేయాల్సిఉన్నా అలా చేయలేదు. బంగారు రుణాల విషయంలో నిబంధనలు పెట్టి రుణ మాఫీలో కోత పెట్టారు. రూ. లక్షలు దాటిన వారికి మాఫీని వర్తింపజేయలేదు. రెండు రకాల రుణాలు ఉన్నవారిని అనర్హులుగా చేశారు.
తొలివిడతలో రూ. 50 వేల లోపు రుణం ఉన్న రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి కేవలం 2.46 లక్షల మందికి రూ. 278.75 కోట్లు చెల్లించింది. రెండో విడతలో 50 వేల రూపాయలు పైబడి రుణం ఉన్న రైతులు 37,633 మందికి రూ. 99.98 కోట్లు రుణమాఫీ చేసింది. తరువాత విడతలో రూ. 1.50 లక్షలు పైబడిన రైతుల రుణ మాఫీ చేయలేదు. వారికి ఐదు విడతల్లో బాండ్లు రూపంలో చెల్లింపులు చేస్తామని 2015 ఫిబ్రవరి నెలలో ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చలేదు.
2016 ఫిబ్రవరి నాటికి రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కావాల్సి ఉండగా.. అది జరలేదు. ఇప్పటి వరకూ జిల్లాలో పూర్తి రుణ మాఫీ కేవలం 2,83,633 మంది రైతులకే జరిగింది. వీరికి రూ.378.73 కోట్లు ప్రభుత్వం చెల్లించంది. మిగిలిన రైతులకు మాఫీ లేదు, వడ్డీ లేదు. ఇక బాండ్లు ఇస్తామని చెప్పిన రైతులకు రూ.93.15 కోట్లు, వడ్డీగా మరో రూ. 9.6 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఉద్యానవన రైతుల పరిస్థితి మరీ ఘోరం
ఉద్యాన వన పంటలకు సంబంధించిన రుణ మాఫీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 1500 మంది రైతులకు సుమారు రూ. 30 కోట్లు రుణ మాఫీ జరగాల్సిఉంది. అరుుతే జాబితాను కుదించి 7,410 మందికి రూ. 14.63 కోట్లు చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అరుు తే ఈ నగదు కూడా ఇప్పటి వరకూ రైతుల ఖాతాలో జమకాలేదు.
60 వేల ఫిర్యాదులు బుట్టదాఖలు
ఆధికారులు గుర్తించిన రుణ మాఫీ జాబితాలో చాలామంది పేర్లు గల్లంతయ్యూయి. దీంతో తమ పేర్లు లేవని రైతులు ఆందోళనకు దిగారు. దీనికి దిగివచ్చిన అధికారులు ప్రత్యేక గ్రీవెన్స్‌ను నిర్వహించగా... 60 వేల మందికి పైగా రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఆ దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యూయి. వీటిని పట్టికున్న నాథుడే లేదు. తమకు మాఫీ వర్తింప చేయూలని కలెక్టర్ కార్యాలయం, వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
రుణ మాఫీ కాలేదు
రణస్థలం ఆంధ్రాబ్యాంకు నుంచి రుణం తీసుకున్నాను. అయితే చంద్రబాబు ఇచ్చిన హామీతో మాఫీ అవుతుందని భావించాను. అయితే అలా జరగలేదు. దీంతో పలుసార్లు వ్యవసాయ అధికారులకు విన్నవించుకున్నాను. బ్యాంకు అధికారులను కలిసి నా అప్పు మాఫీ చేయాలని కోరాను. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణ మాఫీ దరఖాస్తుల సెల్‌లో ఫిర్యాదు చేసినా మాఫీ జరగలేదు. తాజాగా పది రోజల క్రితం బ్యాంకు అధికారులు రుణం మొత్తానికి అసలు, వడ్డీ కలిపి రూ. 49,750 వెంటనే చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ నన్ను అప్పుల్లోకి నెట్టేసింది.
- జి.అప్పయ్య, రణస్థలం
మాఫీ..మాయ..!
Published Wed, Jun 1 2016 11:51 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement