శ్రీకాకుళం రూరల్‌లో వంకర టింకరగా వేసిన చంద్రన్న బాట ఇదే, పలాస మండలం మామిడిపల్లిలో నిలిచిపోయిన చంద్రన్న బాట పనులు
అరసవల్లి: ‘‘ఊరూరా సీసీరోడ్లు వేశాం... అభివృద్ధి చేసి చూపించాం...’’ అని ఊదరగొట్టిన తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు, గ్రామ పంచాయతీల నిధుల సంయుక్త వినియోగంతో వేసిన ‘చంద్రన్న బాట’ల నాణ్యతా ప్రమాణాల పని పట్టేందుకు ఓ వైపు క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో జిల్లాలో ఇంజినీరింగ్ అధికారులతోపాటు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన టీడీపీ నేతల బండారం బయట పడనుంది.
చంద్రన్న బాటలిలా....
జిల్లాలో చంద్రన్న బాటల నిర్మాణంలో భాగంగా 100 నుంచి 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో 90 శాతం ఉపా«ధి నిధులు, 10 శాతం పంచాయతీ నిధులతో కలిపి సీపీ రోడ్లు వేశారు. జనాభా 2,001–4,999 మధ్య ఉన్న పంచాయతీల్లో 70 శాతం ఉపాధి నిధులు, 30 శాతం పంచాయతీ నిధులు, 5 వేలకు మించిన జనాభా ఉన్న పంచాయతీల్లో సగం ఉపాధి నిధులు, మిగిలిన సగం పంచాయతీ నిధులతో సీసీరోడ్లు నిర్మించారు. ఈ క్రమంలో 2014–15 నుంచి 2018–19 వరకు జిల్లాలో 1,460 కిలోమీటర్ల మేర సీసీరోడ్లు నిర్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 2018 అక్టోబర్ 1 నుంచి 2019 మే 31వ తేదీ వరకు రూ.132 కోట్లుతో 350 కిలోమీటర్లు మేర సీసీరోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండలం కాజీపేట, కిల్లిపాలెం, చాపురం తదితర పంచాయతీల్లో రోడ్లపై రోడ్లు వేసినట్లుగా అధికారులు గుర్తించారు. వీటి లెక్కలు తేల్చాలని నిర్ణయించారు.
బిల్లులు చెల్లింపులపైనా విజిలెన్స్...!
జిల్లాలో గత ఐదేళ్లలో 1,460 కిలోమీటర్ల సీసీరోడ్లలో దాదాపుగా టీడీపీ నేతలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి గ్రామీణ ప్రాంతాలకు అనుసంధాన రోడ్లు పేరిట ఇష్టానుసారంగా సీసీరోడ్లు నిర్మించి లక్షలాది రూపాయలు బొక్కేశారు. ఇక్కడ నాణ్యతను అప్పటి అధికారులు పక్కనపెట్టి ఇస్టానుసారంగా క్లియరెన్స్ ఇచ్చి బిల్లులు చెల్లించారని తెలుస్తోంది. ఇందులో ఇంకా బిల్లులు చెల్లించాల్సిన పనుల విషయంలోనైనా ప్రత్యక్షంగా నాణ్యతను పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం జీవో 271 ప్రకారం నిర్మాణ పనులను క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నూటికి నూరు శాతం పనులన్నీ పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాల్సి ఉంది. తనిఖీల్లో భాగంగా ప్రతి రోడ్డుకు కోర్ కటింగ్ శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేసిన తర్వాత నాణ్యతను గుర్తించాల్సి ఉంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుల్లో వీటి నిర్మాణాలు మరింత దూకుడుగా సాగిన విషయం తెలిసిందే.. శ్రీకాకుళం రూరల్‌తో పాటు ఆమదాలవలస, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, రాజాం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల్లో రోడ్లుపై రోడ్లు వేసి మరీ బిల్లులు పెట్టేశారనే సమాచారం అ«ధికారుల వద్ద ఉంది. దీనిపై విజిలెన్స్ రంగంలోకి దిగడంతో త్వరలో బండారం బయటపడనుంది.
రూ.132 కోట్ల పనులపై 10 బృందాల తనిఖీలు..
జిల్లాలో ఉపాధి నిధులు, పంచాయతీ నిధులను సంయుక్తంగా వినియోగించి నిర్మించిన చంద్రన్న బాట సీసీరోడ్లలో అవినీతి అక్రమాల లెక్క పనిలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు పడ్డారు. ఐదారు రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల క్వాలిటీ కంట్రోల్ అధికారులంతా మొత్తం 10 బృందాలుగా తనిఖీలు చేపడుతున్నాయి. డ్వామా పీడీ ఆధ్వర్యంలో ఈ బృందాలు ఇప్పటికే పలు గ్రామ పంచాయతీల్లో సీసీరోడ్ల నాణ్యతను పరీక్షిస్తున్నాయి. ఈప్రక్రియ అంతా త్వరితగతిన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ జే నివాస్ ఆదేశాలు జారీ చేశారు.
విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చంద్రన్న బాట సీసీరోడ్ల నాణ్యతను పరీక్షించేందుకు ముందుగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఇప్పుడు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులకు ఆయా రోడ్లకు సంబంధించిన రికార్డులు సమర్పించాం. రెండు దఫాలుగా తనిఖీలు పూర్తయిన తర్వాత ఉన్నతా««ధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.
– ఎస్ రామమోహన్‌రావు, పీఆర్ ఎస్‌ఈ, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment