పల్లెలకు అందని సాంకేతిక విప్లవం  | TDP Government Fiber Net Project Fails | Sakshi
Sakshi News home page

పల్లెలకు అందని సాంకేతిక విప్లవం 

Published Thu, Jan 2 2020 9:03 AM | Last Updated on Thu, Jan 2 2020 9:03 AM

TDP Government Fiber Net Project Fails - Sakshi

గిరిజన గ్రామంలో ప్రైవేటు చానళ్లు ఏర్పాటు చేసుకున్న గిరిజనులు

సీతంపేట: నాలుగేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన ఫైబర్‌ నెట్‌ పల్లెల్లో ఎక్కడా కానరావడం లేదు. ప్రపంచం సాంకేతికంగా ముందడుగేస్తుంటే అప్పటి టీడీపీ సర్కారు పుణ్యమాని ఏపీ పల్లెలు వెనక్కు నడిచాయి. రూ.149కే ఇంటర్నెట్, ఫోన్, కేబుల్‌ ప్రసారాలను ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొట్టింది. రూ.149కే నెలకు 250 చానళ్లు, 15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 15 జీబీ నెట్‌ సౌకర్యం కల్పించనున్నామని ప్రకటించారు. టీవీ ప్రసారాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడానికే ఈ పథకాన్ని చేపట్టారని అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. దీని కోసం వందల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు తగ్గట్టుగానే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పురోగతిపై ఈ పథకం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. తమకు అనుకూలంగా లేని న్యూస్‌ చానళ్ల నోళ్లు నొక్కే ప్రయత్నాలు జరిగాయి. చివరకు ఆ పథకం ఎందుకూ కొరగాకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా దీని చిరునామా లేదు. అదేంటో తమకు తెలియదని కూడా పాలకొండ నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల ప్రజలు  తెలియజేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫైబర్‌ ప్రాజెక్టు అమలు కావడానికి రూ.300 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జి ల్లాలోని సుమారు 6 లక్షల ఇళ్లకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు అంచనా వేశారు. 40 శాతం కూడా పూర్తి చేయకుండా టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. తలా తోకా లేని ఈ పథకాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లడం కష్టసాధ్యమని తెలుస్తోంది. దీనిపై కనీస అవగాహన కూడా ఎవరికీ లేకపోవడం విశేషం. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలపై కేబుళ్లు వేసి ఇప్పటికే ఏడాది దాటుతోంది. కేవలం అక్కడక్కడ తూతూమంత్రంగా ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ఫైబర్‌ నెట్‌ సౌకర్యం కల్పించారు. పట్టణాల్లో కొన్నిచోట్ల గృహాలకు కనెక్షన్‌ ఇచ్చారు. గ్రామీణ, 

గిరిజన ప్రాంతాల్లో ఇళ్లకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదు. ఎక్కడా కనెక్షన్‌ ఇవ్వలేకపోయారు. దీంతో ప్రైవేటుగా డిష్‌ టీవీ, సన్‌టీవీ, ఎయిర్‌టెల్‌ వంటి నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యనందించడానికి డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులకు బోధించే తరగతులకు సైతం ఫైబర్‌నెట్‌ పూర్తిస్థాయిలో అందని పరిస్థితి ఉంది. మొత్తానికి కోట్లలో ప్రభుత్వ ధనం వృథా అయ్యింది.

ప్రసారాలు రావడం లేదు.. 
మాకు ఎటువంటి ఫైబర్‌నెట్‌ రావడం లేదు. మారుమూల ప్రాంతమైనప్పటికీ ప్రతి ఇంటికీ టీవీ కనెక్షన్‌ ఉంది. కేబుల్‌ స్తంభాలకు వేస్తున్నపుడు మాకు నెట్‌వర్క్‌ వస్తుందని ఆశించాం. అమలు కాకపోవడంతో ప్రయివేట్‌ నెట్‌వర్క్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది.  
–రాము, పొల్లకాలనీ  
 
అదేంటో తెలీదు.. 
ఫైబర్‌ నెట్‌ అంటే ఏంటో మాకు తెలీదు. కేవలం ఫోన్‌ మాత్రమే వినియోగిస్తున్నాం. అక్కడక్కడా ప్రయివేట్‌ సెల్‌ నెట్‌వర్క్‌ కనెక్ట్‌ అవుతుంది. మా గ్రామాలకు ఎటువంటి నెట్, టీవీ కనెక్షన్‌లు లేవు. డిష్‌ ద్వారా టీవీలు చూస్తున్నాం తప్ప రూ.149 కనెక్షన్‌ లేదు. ఇవ్వలేదు.  
–ఎస్‌.బోడయ్య, లంగడుగూడ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement