ఆన్‌లైన్‌కు తొందరెందుకు...? | web land ..program | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌కు తొందరెందుకు...?

Published Wed, Aug 31 2016 11:37 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఆన్‌లైన్‌కు తొందరెందుకు...? - Sakshi

ఆన్‌లైన్‌కు తొందరెందుకు...?

  • ఈ– విధానం సరికాదు 
  • వెబ్‌ల్యాండ్‌ విధానంపై మండిపడిన రైతులు
  • భూములపై హక్కు పత్రం మా వద్దే్ద ఉంచండి
  • సవరణల కోసం దరఖాస్తు చేసుకున్నా పరిష్కారమేదీ
  • ‘సాక్షి’ అవగాహన సదుస్సులో గళం విప్పిన కర్షకులు
  •  
    భూములపై రైతులకున్న హక్కులను హరించేలా ఉన్న వెబ్‌ ల్యాండ్‌లో అనేక లోపాలు, లొసుగులు ఉన్నాయి...వాటిన్నంటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించిన అనంతరమే భూములను ఆన్‌లైన్‌ చేయాలి ... లేకుంటే తాము కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందని రైతులు గళం విప్పారు. వెబ్‌ల్యాండ్‌తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అమలాపురం గోశాలలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సుకు పెద్దఎత్తున రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు హాజరై వెబ్‌ల్యాండ్‌తో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌  రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
     
    వ్యతిరేకం కాదు...అవకతవకలు సరిచేయిండి
     
    వెబ్‌ల్యాండ్‌కు మేము వ్యతిరేకం కాదు. వాటిలో ఉన్న అవకతవకలను సరిచేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం మా భూములను ఆన్‌లైన్‌ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా భూముల ఆధారాలు, పత్రాలు మాత్రం మా వద్దే భద్రంగా ఉండాలి. అప్పుడే మాకు నిశ్చింతగా ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు, మార్పులు చేసినా మేము స్వాగతించలేం.
    – యాళ్ల వెంకటానందం, బీకేఎస్‌ కోనసీమ నాయకుడు
     
    271 జీవోను రద్దు చేయాలి
    పట్టాదారు పాస్‌ పుస్తకాల రద్దుకు కారణమవుతున్న వెబ్‌ల్యాండ్‌ విధానాన్ని తెచ్చిన జీఓనెం.271ని ప్రభుత్వం రద్దు చేయాలి. లేదా క్షేత్రస్థాయిలో భూములను రీ సర్వే చేయించి వెబ్‌ సమస్యలు తొలగించాలి. ఈ రెండు చేయకుండా వెబ్‌ల్యాండ్‌ భారాన్ని రైతుల నెత్తిన రుద్దితే ఊరుకోం. వెబ్‌లో ఆన్‌లైన్‌ 40 శాతం భూములు కూడా ఇంకా నమోదు కాలేదు. అప్పుడే ప్రభుత్వం 90 శాతం పూర్తయిందని చెబుతూ ఈ కొత్త విధానాన్ని అమలు చేపట్టి భూమి హక్కులను హరించేలా చేస్తోంది.
    – పాలూరి సత్యానందం, బీజేపీ రైతు నాయకుడు
     
    హక్కు పత్రంతోనే రైతుకు ధైర్యం
    ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌ ఆన్‌లైన్‌ ద్వారా భూములకు ఎంత భద్రత కల్పించినా అది రైతులకు ధైర్యాన్ని నింపలేవు. తమ భూముల తాలూకు హక్కు పత్రాలు తన ఇంట్లో భద్రంగా ఉంటేనే ధైర్యం ఉంటుంది. ప్రభుత్వం ఆ భరోసా, ధైర్యాన్ని వెబ్‌తో లాగేసుకున్నట్టుగా ఉంది. ఆన్‌లైన్‌ చేసినా పట్టాదారు పాస్‌ పుస్తకం రైతు వద్దే ఉండేలా చేస్తేనే రైతులకు ఈ కొత్త విధానంపై నమ్మకం ఏర్పడుతుంది. లేకుంటే అనుమానమే.
    – కోరుమిల్లి సత్యనారాయణాచార్యులు, రైతు, విశ్రాంత ఉపాధ్యాయుడు
     
    రెవెన్యూ అధికారులకూ అవగాహన లేదు
    వెబ్‌ల్యాండ్‌పై కొందరు తహసీల్దార్లు, వీఆర్వోలకే అవగాహన లేదు. పంట పొలాల్లో ఉండే రైతులకు ఏం ఉంటుంది. ఎరిరైనా రైతు కంప్యూటర్‌ ముందు కూర్చుని తన భూముల వివరాలను ఆన్‌లైన్‌ చుసుకోగలడా...? రైతులకే అనువుగా లేని అవగాహన లేని ఈ కొత్త విధానం ఎవరి కోసం అమలు చేస్తున్నారు.
    – రాయపురెడ్డి జానకిరామయ్య, ముమ్మిడివరం మండల రైతు నాయకుడు
     
    రైతు మానసికంగా కుంగిపోతున్నాడు
    వెబ్‌ల్యాండ్‌లో తమ భూములు సరిగా లేకపోవడం, వేరే సర్వే నంబర్లలో కనిపించడం... ప్రభుత్వ భూముల్లో ఉండడం వంటి గందర గోళ పరిస్థితులు చూసి రైతులు మానసికంగా కుంగిపోతున్నారు. తమ భూమి తమకు కాకుండా పోతుందేమోనన్న ఆందోళనతో ఉంటున్నాడు. వెబ్‌ల్యాండ్‌ను రద్దు చేసి రైతుల్లో ధైర్యాన్ని నింపాలి.
    – పత్తి దత్తుడు, రైతు అంబాజీపేట
     
    వెబ్‌ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా
    వెబ్‌ల్యాండ్‌ వల్ల కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. వాటి పరిష్కారానికి రెవెన్యూ అధికారులుగా తాము సిద్ధంగా ఉన్నాం. రైతులు వెబ్‌ ఇబ్బందులు ఉంటే తమకు దరఖాస్తు చేసుకుంటే వాటిని సవరిస్తాం. గతంలో కర్ణం, మునసబు వ్యవస్థలో భూములపరంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమైన మాట వాస్తవమే. అప్పటి తప్పిదాలే ఇప్పుడు ఆన్‌లైన్‌కు వచ్చే సరికి ఇబ్బంది పెడుతున్నాయి.
    – నక్కా చిట్టిబాబు, తహసీల్దార్, అమలాపురం
     
    భూముల హెచ్చు తగ్గులు చూపిస్తున్నాయి
    వెబ్‌ల్యాండ్‌లో తమకున్న భూములు లేని భూమిని ఎక్కువగా చూపిస్తూ... మరికొన్ని చోట్ల ఉన్న భూమిలోనే కొంత భూమి వేరొకరి సర్వే నెంబరులో చూపిస్తోంది. సమగ్ర సర్వే, మ్యూటేషన్‌ ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఆన్‌లైన్‌ పూర్తి కాకుండా పాస్‌ పుస్తకాలు రద్దు చేయడం తగదు.
    – అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఉప్పలగుప్తం  మండల రైతు నాయకుడు
     
    దశలవారీగా సమస్యల పరిష్కారం
    వెబ్‌ల్యాండ్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కసరత్తు జరుగుతోంది. కొన్ని జిల్లాలో సర్వేనెంబర్లు, డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ల ద్వారా జరుగుతున్న తప్పిదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రశేపెట్టింది. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందకుండా వెబ్‌ల్యాండింగ్‌ ద్వారా తమ భూముల్లో తేడాల సవరణకు దరఖాస్తులు చేసుకుంటే సవరణలకు సిద్ధంగా ఉన్నాం.
    – గణేష్‌కుమార్, ఆర్డీఓ, అమలాపురం
     
    రీ సర్వే చేయాల్సిందే... ఖర్చులు మేమే భరిస్తాం
    ఏ సమస్యకైనా పరిష్కారం చూపినప్పుడు గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి. మీరు ఇప్పుడు వెబ్‌ల్యాండ్‌ అనే పరిష్కారం చూపినా అప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఇదే పరిష్కారమంటే ఎలా? వెబ్‌ల్యాండ్‌ అంతా గందరగోళంగా, సమస్యల పుట్టలా ఉంది. వెబ్‌ల్యాండ్, ఆన్‌లైన్‌ ద్వారా మీరు పరిష్కరించదలుచుకుంటే ముందు క్షేత్రస్థాయిలో మొత్తం భూములన్నీ రీ సర్వే చేయించి ఓ స్పçష్టతకు రావాలి. అప్పుడే భూముల వాస్తవ తాజా చిత్రం వస్తుంది. ఆ సర్వేకయ్యే ఖర్చులు అవసరమైతే రైతులే భరిస్తాం.
    – రంబాల బోసు, కోనసీమ రైతు సంఘం ప్రతినిధి.
     
    వెబ్‌ల్యాండ్‌ తేడాలతో పరిహారం అందడం లేదు
    అమలాపురం మండలంలోని కొన్ని గ్రామాల మీదుగా 216 జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డు నిర్మించబోతున్నారు. ఆ రోడ్డు కోసం రైతుల నుంచి సేకరించిన భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌ ఆన్‌లైన్‌లో రకరకాల తేడాలతో ఉన్నాయి. దీంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందడంలో సాంకేతిస సమస్యలు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్‌ సక్రమంగా జరిగి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు.
    – జవ్వాది బుజ్జి, డీసీసీబీ డైరెక్టర్‌
     
    ఉమ్మిడి భూముల్లో వెబ్‌ల్యాండ్‌ వెతలు 
    ఉమ్మిడి భూముల్లో వెబ్‌ల్యాండ్‌ సమస్యలు అనేకం ఉంటున్నాయి. ఉమ్మిడి భూములు పంచుకునే అన్నదమ్ములకు వారి తండ్రి, ఆయన తండ్రి, ఆడపిల్లలకు కట్నాలు కింద ఇచ్చిన భూములు కాలక్రమంలో క్రయ విక్రయాలతో జరిగిన మార్పులు సక్రమంగా సబ్‌ డివిజన్‌ చేయకపోవడంతో వెబ్‌ల్యాండ్‌లో ఇబ్బందులు అనివార్యమవుతున్నాయి. ఈ సమస్యలు రెవెన్యూ అధికారులు మ్యూటేషన్‌ ద్వారా తొందరగా పరిష్కరిస్తేనే వెబ్‌ గందరగోళానికి తెరపడుతుంది.
    – జున్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం నాయకుడు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement