వెబ్ డబ్ | web dub | Sakshi
Sakshi News home page

వెబ్ డబ్

Published Fri, Aug 12 2016 12:10 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వెబ్ డబ్ - Sakshi

వెబ్ డబ్

= తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్‌
= ఒకరి భూమి మరొకరి పేరున నమోదు
= రైతులతో ఆడుకుంటున్న రెవెన్యూ అధికారులు
= బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోని వైనం
= ఇదే అదనుగా సిబ్బంది అక్రమ వసూళ్లు


పట్టాదారు పాసు పుస్తకం, రిజిష్టర్‌ కాగితాలు పట్టుకుని నిల్చున్న ఈమె మండల కేంద్రం పుట్లూరుకు చెందిన తులశమ్మ. ఈమెకు 518–బీ సర్వే నంబర్‌లో 0.87 ఎకరాల పొలముంది. అయితే.. ఈ పొలాన్ని ఆన్‌లైన్‌లో రాణి అనే పేరుపై నమోదు చేశారు. తులశమ్మ తన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కాగితాలను అధికారులకు చూపారు. అయినప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. ‘మీకోసం’లో కూడా ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఒక్క తులశమ్మ మాత్రమే కాదు.. ఇలాంటి బాధితులు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు.


అనంతపురం అర్బన్‌ : భూముల వివరాల నమోదుకు సంబంధించిన ‘మీ భూమి –వెబ్‌ల్యాండ్‌’ తప్పుల తడకగా మారింది. రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒకరి భూమిని మరొకరి పేరుపై నమోదు చేయడం, అసలే నమోదు చేయకపోవడం, తక్కువ విస్తీర్ణాన్ని చూపడం తదితర  తప్పిదాలు చేశారు.  దీనివల్ల బాధిత రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. రైతులు అన్ని ఆధారాలూ చూపుతున్నప్పటికీ వివరాలు సరిచేసేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. డబ్బు ఇవ్వందే పని కావడం లేదని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందే తప్పులు చేయడం, వాటిని సరిచేసేందుకు తమతో డబ్బు గుంజడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో 7.60 లక్షల రైతు ఖాతాలు
జిల్లాలో 7.60 లక్షల రైతు ఖాతాలు ఉన్నాయి. వెబ్‌ల్యాండ్‌లో వంద శాతం భూముల వివరాలను నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే..ఇందులో తప్పులు ఉన్నాయి. ఒకరి పేరున భూమి ఉంటే 1బీలో  వేరొకరి పేరు ఉంది. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి. తప్పులు సరిచేసేందుకు వీఆర్‌ఓ స్థాయిలో కొందరు రూ.1000 నుంచి రూ.1,500 వరకు డిమాండ్‌ చేస్తున్నారు.  క్షేత్ర స్థాయిలో కొందరు సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్న కారణంగానే తప్పిదాలు జరుగుతున్నాయి. తహశీల్దారు స్థాయి అధికారులను అధికార పార్టీ నాయకులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారు.   మరోవైపు తప్పులు సరిచేయాలంటూ బాధితులు నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మండల, జిల్లాస్థాయి గ్రీవెన్స్‌లు (మీకోసం), జేసీ ఫోన్‌ఇన్‌ తదితర కార్యక్రమాల్లోనూ పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. ఇటీవల జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం భూ సమస్యలపై ఫోన్‌ ఇన్‌  నిర్వహించినప్పుడు వెబ్‌ల్యాండ్‌కుS సంబంధించిన

ఫిర్యాదులే అధికంగా వచ్చాయి. వాటిలో కొన్ని..
= సర్వే నంబరు 299–1లో 60 సెంట్లు, 164–5లో 48 సెంట్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదని శింగనమల మండలం జూలకాలువకు చెందిన నాగలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు.
= ‘మేము 1978లో 10.04 ఎకరాల భూమిని కొన్నాం. రిజిస్ట్రేషన్‌ కూడా అయ్యింది. వెబ్‌ల్యాండ్‌లో 9.20 ఎకరాలు చూపిస్తున్నారు. 84 సెంట్లను తగ్గించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేద’ని కళ్యాణదుర్గం మండలం చాపిరికి చెందిన నారాయణప్ప విన్నవించారు.
=‘మాకు సర్వే నంబరు 149–3లో భూమి ఉంది. దీనిపై అనంత గ్రామీణ బ్యాంకులో రుణం కూడా తీసుకున్నాం. ఇదే సర్వే నంబరుపై మరొకరికి రుణం ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చింద’ని కనగానిపల్లి మండలం కోనేటిపాళ్యంకు చెందిన లక్ష్మిదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement