తికమక పెడుతున్న వెబ్‌ల్యాండ్
– రాత్రికి రాత్రి మారిపోతున్న భూముల వివరాలు
– పెరుగుతున్న భూ వివాదాలు
– విలువ లేని ఈ–పాస్ పుస్తకాలు
– తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ
– దోచుకుంటున్న అధికారులు, దళారులు
– ప్రభుత్వ నిర్ణయంపై గుర్రు
ప్రయివేట్ భూమి.. వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమి...(పోటో: 43బి – చిన్న చెంచన్న
ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన 1–3 సర్వే నెంబర్‌లో 7.30 ఎకరాల భూమి ఉంది. ఇందులో నేరడుచెర్ల గ్రామానికి చెందిన ముసలన్న, చిన్న చెంచన్న, పెద్ద చెంచన్న, శ్రీనివాసులు, శివమ్మల పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్‌లోని భూములపై 1924 నుంచే రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. కానీ ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది ప్రయివేటు భూమిగా పేర్కొంటు రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీకి రెకమెండ్ చేశారు.
కర్నూలు(అగ్రికల్చర్):
వెబ్‌ల్యాండ్ ప్రక్రియ కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. మొన్నటి వరకు ఆన్‌లైన్‌లో ఒకరి పేరు మీదున్న భూమి.. రాత్రికి రాత్రి మరొకరి పేరిట మారిపోతోంది. టెక్నాలజీ ఆధారంగా తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు.. వీఆర్వోలు.. అక్రమార్కులు రైతుల తలరాత మార్చేస్తున్నారు. భూమి విలువను బట్టి ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు డిమాండ్ చేస్తుండటం చూస్తే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గ్రామాల్లో పెద్ద ఎత్తున భూ వివాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే టైటిల్‌డీడ్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా పట్టాదారు పాసు పుస్తకాలతో సంబంధం లేకుండా వెబ్‌ల్యాండ్‌లోని వివరాలతోనే రిజిస్ట్రేషన్‌లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలలుగా ఈ–పాసు పుస్తకాలు జారీ చేస్తుండగా.. వీటికి విలువ లేదని ప్రభుత్వమే ప్రకటిస్తోంది. రైతులకు భూములు ఉన్నాయనడానికి ఇవి ఆధారం మాత్రమేనని.. అన్నింటికీ వెబ్‌ల్యాండ్ వివరాలే ప్రామాణికమని తేల్చడం గందరగోళానికి తావిస్తోంది.
ఆన్‌లైన్‌లో సవరణలకు పేరుకుపోతున్న దరఖాస్తులు
వెబ్‌ల్యాండ్‌లో భుముల వివరాలను సర్వే నెంబర్ల వారీగా నమోదు చేయడంలో వీఆర్‌ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పట్టాదారు పాసు పుస్తకంలో ఎన్ని ఎకరాలు నమోదు చేసి ఉంటే వెబ్‌ల్యాండ్‌లోనూ అన్నే ఎకరాలు న మోదు చేయాలి. వీఆర్‌ఓలు మాత్రం తక్కువగా నమోదు చేయడం.. వందలు, వేలాది సర్వే నెంబర్లను ఎగ్గొట్టడం వల్ల రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వీటిని సవరించుకోవాలంటే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో భూముల వివరాలను సవరించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 45వేల ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇందులో మామూళ్లు ఇచ్చుకున్న వాటిని ఆమోదిస్తూ.. తక్కిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి దరఖాస్తులే దాదాపు 25వేల వరకు ఉండటం గమనార్హం.
ప్రభుత్వ భూముల జాబితాలో ప్రయివేటు భూములు
ప్రయివేటు భూములను సైతం రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూములుగా చూపించారు. ఇందువల్ల వేలాది మంది రైతులు భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్ చేయించుకోలేక అల్లాడుతున్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో 1915 నుంచే రిజిస్ట్రేషన్‌లు అయిన భూములను నేడు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా కనపర్చారు. వీటికి దశాబ్దాల క్రితమే పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా ముద్రవేయడం వల్ల రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సొంత భూమిపైనే ప్రభుత్వం రైతులకు హక్కు లేకుండా చేసింది. జిల్లాలో దాదాపు 1.20 లక్షల సర్వే నెంబర్లను ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చి 1.60 లక్షల రైతుల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది.
నెట్టింటి చిచ్చు!
Published Sat, Sep 3 2016 12:17 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM
Advertisement