కష్ట జీవుల కడుపు కొట్టారు! | YSRCP sympathizers have stopped employment | Sakshi
Sakshi News home page

కష్ట జీవుల కడుపు కొట్టారు!

Published Fri, Sep 20 2024 5:18 AM | Last Updated on Fri, Sep 20 2024 5:18 AM

YSRCP sympathizers have stopped employment

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని ఉపాధి పనులు ఆపేశారు

కూటమి నేతల గుప్పిట్లో ఉపాధి అధికారులు 

కూలీలు బతిమలాడినా పనులు కల్పించని ఏపీవోలు 

అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు 

132 మంది ఉపాధి పనుల ఫీల్డ్‌ అసిస్టెంట్లపైనా వేటు 

కుప్పం, పుంగనూరు సీఎల్‌ఆర్సీ పరిధుల్లో దారుణం 

హైకోర్టును ఆశ్రయిస్తామంటున్న ఎఫ్‌ఏలు, కూలీలు

పలమనేరు: కడుపుకాలే కష్ట జీవులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. ఉపాధిహామీ కూలీ పనుల్లోనూ పక్షపాతం చూపిస్తోంది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటేశారన్న కారణంతో పనులివ్వకుండా ఉపాధి అధికారులే వేధిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జాబ్‌కార్డున్న కూలీలను కూడా పక్కన బెట్టారు. అయ్యా మాకు ఉపాధి పనులు కల్పించండి అంటూ వేలాది మంది కూలీలు మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు బతిమలాడినా పనులు ఇవ్వడం లేదు. 

మరోవైపు చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో సగానికిపైగా ఉపాధి ఫీల్ట్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలిగించారు. తాము తప్పు చేయకున్నా విధుల్లో నుంచి ఎందుకు తొలగించారని, మా జీవనోపాధిని దెబ్బతీయవద్దని ఫీల్డ్‌ అసిస్టెంట్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమకు న్యాయం కావాలంటూ పలువురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు, జాబ్‌కార్డులున్న కూలీలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 

విన్నవించినా ఫలితం లేదు 
ఉపాధి పనులు చేసుకునే తమకు రాజకీ­యాలతో సంబంధం లేదని, జాబ్‌కార్డులున్న తమకు పని కల్పించాలంటూ  కూలీ­లు ఇప్పటికే మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్‌ దాకా వినతిపత్రాలిచ్చారు. ప్రభుత్వ కార్యా­లయాల వద్ద నిరసనలు చేసినా వారికి ఉపాధి పనులు  కల్పించలేదు. 

కూటమి ప్రభు­త్వం అధికారంలోకి రాగా­నే ఆయా ప్రాంతాల నేతల హెచ్చరికలతో ఈజీఎస్‌ ఏపీవోలు, ఏపీడీలు నడుచుకుంటున్నారు. దీంతో జాబ్‌కార్డున్న కూలీలకు పనులు లేకుండా పోయాయి. ఈ విషయమై కుప్పం ఏపీడీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. బైరెడ్డిపల్లి ఏపీవో హరినాథ్‌ మాట్లాడుతూ.. తాము స్వతంత్రంగా ఏమీ చేసేందుకు వీలు కాదన్నారు.   

60 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఔట్‌
పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో 132 మంది ఉపాధి పనుల ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేవారు. వీరిలో 60 మందికి పైగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను కూటమి ప్రభుత్వం రాగానే విధుల నుంచి తొలగించింది. కూటమి నేతల ఆదేశాలతో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే  వారిని తొలగించేశారు. 

వారి స్థానంలో అధికారపా ర్టీకి అనుకూలమైన వారి­ని పెట్టుకున్నారు. వీరు ఉపాధి పనుల్లో జేసీబీలు పెట్టి పనులు చేసి, బినామీ కూలీల పేరిట బిల్లులు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వీరికి సంబంధిత ఏపీవోల సాయం ఉందని సమాచారం.

30 వేల మంది కూలీలకు పనులు ఇవ్వని వైనం
పలమనేరు రెవెన్యూ డివి­జన్‌­లో పుంగనూరు, కుప్పం క్లస్టర్‌ లైవ్లీహుడ్‌ రిసోర్స్‌ సెంటర్‌ (సీఎల్‌ఆర్సీ)­లు ఉన్నాయి. పుంగనూరు క్లస్టర్‌లో పుంగనూరు, పెద్దపంజాణి, పలమనేరు, గంగవరం, చౌడేపల్లి,  బంగారుపాళెం మండలాలున్నాయి. కుప్పం క్లస్టర్‌లో కుప్పం, గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం, వి కోట, బైరెడ్డిపల్లి మండలాలున్నాయి. ఈ రెండు క్లస్టర్లలో మొత్తం 132 పంచాయతీలకు కలిపి ఉపాధి జాబ్‌కార్డులు మొత్తం 216,603 మందికి ఉన్నాయి. 

ఇందులో ప్రస్తుతం 70,630 మంది పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈజీఎస్‌లో ఫాంపడ్స్, ఫిష్‌ పాండ్స్, ఫీడర్‌ ఛానెల్స్, హార్టీకల్చర్‌ ప్లాంటేషన్స్,  క్యాటిల్‌ పాండ్స్, రోడ్డు పనులు, ట్రెంచిలు, చెక్‌డ్యాం పనులు జరుగుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో పనులు చేసిన 30 వేల మంది దాకా ఉపాధి కూలీలకు ఇప్పటి ప్రభుత్వంలో పనులు ఇవ్వలేదు. 

దీంతో పనుల్లేక ఉపాధి కరువై కుటుంబ జీవనానికి ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వీరంతా వైఎస్సార్‌సీపీకి సానుభూతిపరులుగా ఉన్నారనే అక్కసుతో ఆయా మండలాల కూటమి నేతల సిఫారసులతో సంబంధిత ఏపీవోలు వీరికి ఉపాధి పనులు ఇవ్వకుండా వారి కడుపు కొడుతున్నారు.

ఉపాధి పనులు ఇవ్వరంట.. 
ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాకు ఉపాధి పనులు ఇవ్వలేదు. ఏమిసార్‌ అని అడిగితే మీరంతా వైఎస్సార్‌సీపీకి ఓటేశారంటగా అంటున్నారు. మాకు రాజకీయాలు ఏంటికి సార్‌. కూలి పనులు చేసుకొని బతికేటోళ్లం. రెండునెలలుగా పనులు లేక ఖాళీగా ఉన్నాం. ఎక్కడ ఏ పనిచి్చనా కష్టపడి చేసుకుంటాం. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.  – ఓ.నాగప్ప, ఉపాధి కూలి, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా

పనులివ్వకపోవడం న్యాయమేనా? 
ఉపాధి పనులకు చేసుకుంటూ మా కుటుంబానికి అండగా ఉంటున్నా. ఈ మధ్య మాకు పనులివ్వడం లేదు. మాలాంటి కూలీలకు రాజకీయాలకు ఏంటి సంబంధం. మేము కష్టపడి కూలి పనిచేస్తేనే కదా డబ్బులు వచ్చేది. అలాంటిది మాకు పనులివ్వకుంటే ఎలా.. ఇది న్యాయమేనా? నాయకులు మాట కాదుగానీ అధికారులైనా ఆలోచించాల.  – రాజేష్, ఉపాధి కూలి, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా 

నిష్కారణంగా విధుల్లోంచి తొలగించేశారు 
నేను ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా మా పంచాయతీలో పనిచేస్తున్నా. కూటమి ప్రభుత్వం రాగానే నిష్కారణంగా నన్ను విధులనుంచి తీసేశారు. ఇదేంటి సార్‌ అంటే కూటమి నేత­లు నిన్ను తీసేయమన్నా­రు ఏమన్నా ఉంటే వారితో మాట్లా­డుకోమని చెబుతున్నారు. ఇదేమి న్యాయం.  – సుబ్రమణ్యం, ఫీల్డ్‌ అసిస్టెంట్, జీసీపల్లి, బైరెడ్డిపల్లి మండలం, చిత్తూరు జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement