
బకాయిలు మస్తు.. ఉగాది నాడూ పస్తు
75 లక్షల మందికి రూ.725 కోట్లు రావాలి
చేతిలో చిల్లిగవ్వలేక పేదల ఇళ్లలో కనిపించని పండుగ శోభ
ఫిబ్రవరి 6 తర్వాత పనులు చేసిన కూలీలకు ఇప్పటివరకు వేతనాల్లేవు
ఇన్ని రోజులుగా ‘కూలీ’ చెల్లించని పరిస్థితి ఎప్పుడూ లేదంటున్న వ్యవసాయ కార్మిక సంఘ నేతలు
బకాయిలు పెరగడంతో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య సగానికి తగ్గుదల
వంద రోజుల పనిదినాలను ఉపయోగించుకున్న కుటుంబాల సంఖ్యా పడిపోయింది
ఈ ఏడాది ఉపాధి పనులు తగ్గడంవల్ల ఎక్కువగా నష్టపోయింది ఎస్సీలే..
సాక్షి, అమరావతి: సొంతూర్లోనే పనులు కల్పించి పల్లెల్లోని పేదల ఆకలి కష్టాలను తీర్చాలన్న లక్ష్యంతో ప్రారంభమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. ఎప్పటికప్పుడు గరిష్టంగా 15రోజుల్లో చెల్లించాల్సిన వేతనాలను దాదాపు రెండు నెలలవుతున్నా చెల్లించకుండా కాలయాపన చేస్తూ వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పైగా.. మొన్న శివరాత్రి, ఇప్పుడు ఉగాది పండుగ రోజు కూలీలను నిర్దాక్షిణ్యంగా పస్తులుంచుతూ తన పబ్బం గడుపుకుంటోంది.
రాష్ట్రంలో 57.87 లక్షల కుటుంబాలకు చెందిన 97.35 లక్షల మంది ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా 47 లక్షల కుటుంబాలకు సంబంధించి 75 లక్షల మందికి ఉపాధి పనులే జీవనాధారం. ఇంత పెద్ద మొత్తంలో పేదలు ఆధారపడ్డ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఆ కుటుంబాల్లో ఉగాది పండుగ ఆనందం అనేది లేకుండా ఆవిరిచేస్తోంది. ఎందుకంటే.. వీరికి వారం వారం కాదు కదా.. కనీసం నెలకు కూడా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో పనులు చేసిన వారు కూలి డబ్బుల కోసం వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు.
శనివారం (మార్చి 29) నాటికి మొత్తం రూ.725 కోట్ల బకాయిలు వీరికి చెల్లించాల్సి ఉందంటే వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది. నిజానికి.. రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 6 తర్వాత పనులు చేసిన కూలీలెవ్వరికీ ప్రభుత్వం ఇప్పటివరకూ వేతనాలు చెల్లించలేదు. అలాగే, జనవరి 9 తర్వాత పనిచేసిన కూలీలకూ అక్కడక్కడ అందలేదు. నిబంధనల ప్రకారం.. గరిష్టంగా 15 రోజులకు మించి ఉపాధి కూలీల వేతనాలు బకాయిలు ఉంచకూడదని కేంద్ర చట్టం చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం దానిని బేఖాతరు చేస్తోంది.
దీనివల్ల రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో సుమారు రెండు నెలలుగా వేతనాలు చెల్లించని పరిస్థితి. ఉపాధి హామీ పథకం చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం పాటు వేతన బకాయిలు రాష్ట్రంలో ఎప్పుడులేవని వ్యవసాయ కారి్మక సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా.. కేంద్రంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా టీడీపీ ఎంపీనే కొనసాగుతుండగా.. రాష్ట్రంలో ఉపాధి పథకానికి సంబంధించిన విభాగాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పరిధిలో ఉన్నాయి. నిత్యం నీతులు వల్లించే వీరు పండగ పూట లక్షలాది మంది పేదల కడుపులు మాడుస్తూ అవస్థలు పాల్జేస్తున్నారు.
పనులకు వెళ్లే వారిలోనూ తగ్గుదల..
ఇదిలా ఉంటే.. చేసిన పనికి టీడీపీ కూటమి ప్రభుత్వం రోజుల తరబడి వేతనాలు చెల్లించకుండా రూ.వందల కోట్లు బకాయిలు పెట్టడంతో గ్రామాల్లో ఉపాధి పనులకు కూలీలు దూరమవుతున్నారు. ఫలితంగా.. పనులకు వెళ్లే కూలీల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సాధారణంగా.. గ్రామాల్లో వ్యవసాయ పనులు బాగా తక్కువగా ఉండే మార్చినెలాఖరు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 10 లక్షల మంది వరకు ఉపాధి పనులకు హజరవుతారని అంచనా.
కానీ, శనివారం కేవలం 4.65 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. దీనికితోడు.. గత 2023–24 ఆరి్థక సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రాష్ట్రంలో సుమారు కోటిన్నర తక్కువ పనిదినాలను ప్రభుత్వం పేదలకు కల్పించింది. 2023–24లో మొత్తం 25.59 కోట్ల పనిదినాలు పేదలకు దక్కాయి.
అదే 2024–25లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు అంటే.. 2024 ఏప్రిల్, మే నెలలో గత ఏడాది కన్నా కోటి పనిదినాలు ఎక్కువగా పేదలకు దక్కాయి. కానీ, ఏడాది మొత్తం చూస్తే మాత్రం గత ఏడాది కన్నా తక్కువగా కేవలం 23.96 కోట్ల పనిదినాలే పేదలు పొందారు.
కూలీలకు ఈ ఏడాది కష్టకాలం..
» గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉపాధి పనులు తగ్గడంవల్ల ఎక్కువగా ఎస్సీలే నష్టపోయారు. ఎలాగంటే.. గత ఆర్థిక ఏడాది మొత్తం 25.59 కోట్ల పనిదినాల్లో 22.41 శాతం మేర ఎస్సీలు పనులు పొందగా.. ఈ ఆరి్థక సంవత్సరంలో మొత్తం 23.96 కోట్ల పనిదినాల్లో 21.61 శాతం మేర మాత్రమే వారు పనులు పొందారు.
» అలాగే, ఉపాధి హామీ పథకంలో గరిష్టంగా వంద రోజుల పనిదినాలను ఉపయోగించుకున్న కుటుంబాల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక ఏడాది 6,87,396 కుటుంబాలు పూర్తిస్థాయిలో వంద రోజుల పనిదినాలు ఉపయోగించుకోగా, ఈ ఆర్థిక ఏడాది కేవలం 4,69,437 లక్షల కుటుంబాలే వంద రోజుల పనిదినాలు పొందాయి.
» మరోవైపు.. ఈ ఆర్థిక ఏడాదిలో కేంద్రం గరిష్ట వేతనాన్ని రూ.300కు పెంచినా, రాష్ట్రంలో కూలీలకు సరాసరిన రూ.255.56 చొప్పున మాత్రమే వేతనాలు దక్కాయి.
» ఇక గత ఆర్థిక సంవత్సరం 80,589 మంది దివ్యాంగులు ‘ఉపాధి’ పొందగా.. ఈ ఏడాది 76,527 మంది మాత్రమే పనులు పొందారు.