
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. పెద్దవంక నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. రోజుకు సుమారు 150 టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. హంద్రీనీవా పేరుతో అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పగలు రాత్రి తేడా లేకుండా అతివేగంతో టిప్పర్లు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. టిప్పర్ అతివేగంగా రావడంతో ఎదురుగా ద్విచక్ర వాహనంలో వచ్చిన తాము కింద పడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పిందని బాధితులు అంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుప్పంలో అధికార పార్టీకి చెందిన బడా నాయకుడి బావమరిది కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున ఇసుక మాఫియా అక్రమ రవాణా చేస్తోంది.