ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన
2 నెలల్లో 2,360 మంది తొలగింపు
రాజకీయ బెదిరింపులతో నలుగురి ఆత్మహత్య
పంచాయతీరాజ్ కమిషనరేట్ ముందు ధర్నా
తొలగించిన వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
ఉద్యోగభద్రతతో పాటు నెలకు రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలని వినతి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉపాధి హామీ పథకం అమలుకు క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు నెలలుగా రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తోందంటూ ఫీల్డ్ అసిసెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా 2,360 మందిని తొలగించినట్లు తెలిపారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, అధ్యక్షుడు ఎం.పరంధామయ్య, ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు, కోశాధికారి ఖాదర్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. 17 సంవత్సరాలుగా కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్నవారిని అక్రమంగా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఇంకా అనేకమందిని తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు చెప్పారు.
అక్రమ తొలగింపులు, రాజకీయ బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు తీసుకోదని, ఉద్యోగాల నుంచి తొలగించదని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చెబుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ బెదిరింపులు, అక్రమ తొలగింపులు కొనసాగడం విచారకరమని చెప్పారు.
అక్రమంగా తొలగించిన వారందరినీ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్న నలుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబాల్లో వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగభద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం రూ.20 వేలకు పెంచాలని వారు కోరారు.
డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళతా: డైరెక్టర్
కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రతినిధులు కొందరిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులపై డ్వామా పీడీలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి వివరాలు తెప్పించుకుంటానని కృష్ణతేజ హామీ ఇచ్చారని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపిన వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామన్నారని చెప్పారు. ఈ ఆందోళనలో శ్రామిక మహిళా కన్వీనర్ కె.ధనలక్ష్మి, ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర నాయకులు వీరే‹Ùగౌడ్, మహే‹Ù, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment