Private lands
-
ఎక్కడి వినతులు అక్కడే
సాక్షి, అమరావతి: నిషేధిత ఆస్తుల జాబితాలోని ఆస్తులు యజమానులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం అసైన్మెంట్ కింద పేదలకిచ్చిన భూములన్నీ ఈ జాబితాలోనే ఉంటాయి. వాటిని పట్టాదారులు లేదా వారి వారసులు అనుభవించడానికి తప్ప ఇతరులకు బదలాయించడానికి, విక్రయించడానికి ఎలాంటి హక్కులు ఉండవు. అయితే, దురదృష్టవశాత్తూ కొన్ని ప్రైవేటు భూములు కూడా పీఓబీ జాబితాలో ఉన్నాయి. ఒక సర్వే నంబరులో పదెకరాలు ఉండి అందులోని ఐదెకరాలు ప్రభుత్వ భూమి ఉందనుకుంటే.. అది మాత్రమే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి. కానీ, మిగిలిన ఐదెకరాల ప్రైవేటు భూమి కూడా పీఓబీలో ఉంటోంది. దీంతో అత్యవసర సమయాల్లో యజమానులు వాటిని విక్రయించాలన్నా, ఎవరికైనా బహుమతి కింద రిజిస్టర్ చేయాలన్నా వీలుకావడంలేదు. అందువల్ల ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్ (పీఓబీ) జాబితాలో ఉన్న భూములను అందులో నుంచి తొలగించాలంటూ భూ యజమానుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. పెండింగ్‌లోనే దరఖాస్తులు ► నిజంగా అవి ప్రైవేటు భూములైతే వాటిని పీఓబీ జాబితా నుంచి తొలగించాలంటూ జిల్లా కలెక్టర్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు పంపించాలి. కలెక్టర్ల నుంచి వచ్చిన జాబితా ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన జిల్లా రిజిస్ట్రార్లు పీఓబీలోని జాబితాను సవరిస్తారు. ► గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి జనవరి నెలాఖరు వరకూ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పీఓబీ నుంచి తొలగించాలంటూ రెవెన్యూ శాఖకు 3,255 దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా అందాయి. అయితే, అధికారులు వీటిలో తొమ్మిదింటిని మాత్రమే ఆమోదించి 42 తిరస్కరించారు. ► మిగిలిన 3,204 అర్జీలు పెండింగులో ఉండటం గమనార్హం. మీసేవ నుంచి వచ్చిన ఈ దరఖాస్తులు కాకుండా తమ భూములను పీఓబీ నుంచి తొలగించాలంటూ నేరుగా అధికారులకు సమర్పించిన వినతులకు లెక్కేలేదు. ► మొత్తం దరఖాస్తుల్లో 72 శాతానికి పైగా గడువు దాటినా పరిష్కారానికి నోచుకోలేదు. ► ఒక్కటంటే ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించని జిల్లాలు అధికంగా ఉన్నాయి. ఈ వినతుల పరిష్కారం విషయంపై అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. -
అడ్డగోలుగా ఆధార్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆధార్ కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోనే వాటిని నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఈ నిబంధన ఆచరణలోకి రావడం లేదు. వెరసి ఈ కేంద్రాల నిర్వహణ అడ్డదిడ్డంగా మారింది. ఆధార్ నమోదు, మార్పుల విషయంలో అవకతవకలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నిర్వహించాలనే నిబంధనను సర్కారు తీసుకొచ్చింది. అవకతవకలకు పాల్ప డినప్పుడు అక్కడికక్కడే వెంటనే ఫిర్యాదు చేసే వీలుంటుందనే భావనతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు స్థలాల్లో ఉన్న కేంద్రాలను ప్రభుత్వ ఆవరణలోకి తరలించాలని సమాచార సాంకేతికశాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది. నిర్వహణ ఇష్టానుసారం... ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆవరణలోనే ఆధార్ కేంద్రాలను నిర్వహించాలనే నిబంధనను నిర్వాహకులు అటకెక్కించారు. నిర్దేశిత ప్రాంతానికి ఆధార్ కేంద్రాన్ని తరలించాలని జిల్లా కలెక్టర్ల నుంచి సూచనలు అందినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వాటిని మార్చలేదు. పలు రకాల సాకులను చూపుతూ వాటిని ప్రైవేటు స్థలాల్లోనే నిర్వహిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఆవరణలో ఆధార్ కేంద్రాన్ని నిర్వహిస్తే నిబంధనల ప్రకారం వ్యవహరించాలనే ఆందోళనతోనే సాకులు వెతుకుతూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 973 ఆధార్ నమోదు కేంద్రాలున్నాయి. ఇందులో మీ–సేవా ఫ్రాంచైజీ (ఈఎస్డీ)కి చెందినవి 460 సెంటర్లున్నాయి. ప్రస్తుతమున్న వాటిలో ఈఎస్డీ ఎక్కువ భాగం ఉన్నప్పటికీ వాటి నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో లొకేషన్లు సైతం కేటాయించారు. సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా నిర్వహిస్తున్న కేంద్రాలు పూర్తిగా ప్రైవేటు ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. లొకేషన్ చూపినా చర్యలు శూన్యం.. ఆధార్ కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే అంశాన్ని ఆన్లైన్ ద్వారా పరిశీలించవచ్చు. ఈ మేరకు సమాచార సాంకేతిక శాఖ వద్ద పరిజ్ఞానం ఉంది. ఆధార్ నమోదు సిస్టంను ఆన్ చేసిన వెంటనే అందులో జీపీఎస్ ద్వారా లొకేషన్ కనిపిస్తుంది. నిర్దే శిత లొకేషన్లో ఉంటేనే అను మతి ఇచ్చే అవకాశం ఉన్నతాధి కారులకు ఉంది. ప్రైవేటు లొకేషన్ చూపితే వెంటనే సర్వీ సును రద్దు చేయొచ్చు. కానీ స్పష్టమైన ఆదేశాలిచ్చిన అధికారులు అమలు తీరును మాత్రం పట్టించు కోవడం లేదు. ఈ కేంద్రాల నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా మేనేజర్లు (డీఎం) నిఘా, పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల డీఎం లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ప్రైవేటు ప్రాంతాల్లోనే నిర్వహిస్తామంటూ కొందరు ఆధార్ కేంద్రాల నిర్వాహకులు డీఎంల చేతులు తడుపు తున్నారు. దీంతో ఇష్టానుసారంగా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో ఆధార్ నమోదుకు రూ. 100 నుంచి రూ. 250 వరకు వసూలు చేస్తున్నారు. ఆధార్ వివరాల్లో తప్పుల సవరణ, చిరునామా మార్పులు తదితరాలకు సంబంధించి రూ. 500పైబడి వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. కేంద్రాలపై నిఘా లేకపోవడంతో ఈ తంతు సాగుతున్నట్లు తెలుస్తోంది. -
వెబ్ కాదు.. డబ్బు ల్యాండ్!
≈ లోపాల పుట్టగా ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’ ≈ సర్కారు అనాలోచిత నిర్ణయం.. భూ యాజమానులకు శాపం ≈ ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు ≈ ప్రభుత్వ ఖాతాలో ప్రైవేట్ భూములు ≈ సవరణల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ≈ ముడుపులిస్తేనే తప్పులను సవరిస్తున్న అధికారులు ≈ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు ≈ పట్టాదారు పాసు పుస్తకాలను కొనసాగించాలని రైతుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇటీవల ఒకరికి చెందిన భూమిని మరొకరు విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిని ప్లాట్లుగా చేసేందుకు కూలీలను తీసుకెళ్లగా అసలైన యజమాని వచ్చి అడ్డుకున్నాడు. ఇది తన భూమి అని చెప్పడంతో వెబ్‌ల్యాండ్ చూసి మోసపోయానని లబోదిబోమనడం కొనుగోలుదారుడి వంతయ్యింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన ఒక రైతు వెబ్‌ల్యాండ్‌లో తన భూమి నమోదు కోసం వెళ్లగా రెవెన్యూ అధికారులు ఏకంగా రూ.లక్ష డిమాండ్ చేశారు. బేరమాడి రూ.80 వేలు ముట్టజెప్పిన తర్వాతే ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో చేరింది. అత్యంత ప్రామాణికంగా, పకడ్బందీగా రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’ అక్రమాల పుట్టగా తయారైంది. ప్రభుత్వం ముందుచూపు లేకుండా, అనాలోచితంగా తీసుకొచ్చిన రెవెన్యూ వెబ్‌ల్యాండ్ భూ యజమానుల పాలిట శాపంగా మారింది. ఇదంతా ‘డబ్బు ల్యాండ్’గా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ (వెబ్‌ల్యాండ్‌లో నమోదు)లో లొసుగులు, అవినీతి అక్రమాలకు అంతూ పొంతూ ఉండడం లేదు. పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ మాన్యువల్ రికార్డుల్లో ఒకరి పేరుతో ఉన్న ఆస్తులు ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరుతో దర్శనమిస్తున్నాయి. వందో రెండొందలో కాదు, ఇలాంటివి లక్షల్లోనే ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లలోని భూములు ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. ఆన్లైన్లో నమోదైన చాలా ఆస్తులను తహసీల్దార్లు ధ్రువీకరించ లేదు. రైతులకు వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణానికి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వివరాలకు పొంతన కనిపించడం లేదు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళితే వారి భూములు వెబ్‌ల్యాండ్‌లో లేవంటూ బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారు. తమ భూములను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతున్న రైతులను రెవెన్యూ సిబ్బంది/దళారులు పీడిస్తున్నారు. డబ్బు ముట్టచెబితేనే వారి భూములను నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో సవరణల కోసం నిత్యం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. కొనుగోలుదారులకు తీవ్ర నష్టం వెబ్‌ల్యాండ్‌లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ఒకరికి చెందిన భూమి వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరిట ఉండడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు, రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, పకడ్బందీగా పూర్తి చేసి, అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ ఆధారిత లావాదేవీలకు ఆమోదం తెలిపితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. సర్వం లోపాలమయం దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ ఖాతాలో కనిపిస్తుండడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంగా సంక్రమించిన పొలాలూ సర్కారు భూముల ఖాతాలో కనిపిస్తున్నాయి. భూ పంపిణీ కింద ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వేరే వారి పేర్లతో ఉండటంతో వాస్తవ లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కిందిస్థాయి రెవెన్యూ అధికారులు/ దళారులు కుమ్మక్కై నకిలీల పేర్లను భూ యజమాని కింద వెబ్‌ల్యాండ్‌లో చేర్చి, విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు బయట పడుతున్నాయి. దీంతో అసలైన యజమానులే కాకుండా కొనుగోలుదారులు కూడా మోసపోతున్నారు. అధికారులు భారీగా సొమ్ము తీసుకుని ప్రభుత్వ భూములను, ప్రైవేట్ వ్యక్తుల పొలాలను ఇతరుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. భూమి విలువను బట్టి రేట్లు ఆన్లైన్లో భూముల నమోదుకు వాటి విలువ, యజమానుల ఆర్థిక పరిస్థితి, వారి అవసరాల ఆధారంగా రెవెన్యూ అధికారులు/ దళారులు రేట్లు ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదుకు భూమి విలువ, ఇతర అంశాల ఆధారంగా రూ.10 వేల నుంచి 60 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. కొంపముంచిన తొందరపాటు నిర్ణయం వెబ్‌ల్యాండ్‌లోని పొరపాట్లను పరిశీలించకుండానే ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసింది. వెబ్‌ల్యాండ్ ఆధారంగానే భూముల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, పంట రుణాలు ఇవ్వాలంటూ ఏకంగా జీవో ఇచ్చేసింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. వెబ్‌ల్యాండ్‌లో తప్పులను సవరించే వరకూ పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే లావాదేవీలకు అనుమతించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం పేరు మాయం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో సర్వే నంబరు 831లో నాకు 2.60 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయి. రెండు నెలల క్రితం వెబ్‌ల్యాండ్‌లో ఈ భూమి యజమానిగా నా పేరు బదులు మరో వ్యక్తి పేరు ప్రత్యక్షమైంది. నిజమైన రైతు పేరును వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడానికి డాక్యుమెంట్లు అడుగుతున్న అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండానే నా భూమి యజమానిగా వేరే వ్యక్తి పేరును ఎలా నమోదు చేశారో అర్థం కావడం లేదు. - చింతకాయల రామాంజనమ్మ ఐదెకరాలుంటే రెండెకరాలుగా నమోదు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన గుంటబోయిన వెంకటరమణకు ఐదెకరాలకు పైగా సాగు భూమి ఉంది. వెబ్ అడంగల్‌లో మాత్రం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు నమోదైంది. దీంతో ఈయన మ్యుటేషన్ కోసం మార్చి నెల లో మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశారు. ఇంతవరకూ వెబ్ అడంగల్‌లో మార్పు చేయలేదు. శ్రీకాకుళం జిల్లా గోళ్లవలస గ్రామంలో 400 మంది రైతులకు చెందిన 2 వేల ఎకరాల భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. దీంతో పంట రుణాలకు నోచుకోకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మోసాలు బయటపడటంతో... వెబ్‌ల్యాండ్‌లోని తప్పులను ఆసరాగా చేసుకుని ఒకరి భూమిని మరొకరు విక్రయిస్తున్నారని, కొందరు రెవెన్యూ అధికారులు ఇలాంటి మోసాలకు సహకరిస్తున్నారని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే వెబ్‌ల్యాండ్ ఆధారిత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఇప్పటికే ఎన్నో మోసాలు బయటపడ్డాయి. దీనివల్లే తాత్కాలిక (నోషనల్) ఖాతాలకు సంబంధించిన భూములను విక్రయ రిజిస్ట్రేషన్లు చేయరాదని, శాశ్వత ఖాతాలేని వారికి పంట రుణాలు ఇవ్వరాదంటూ తాజాగా రెవెన్యూ ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వెబ్‌ల్యాండ్‌లో కొన్ని పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని, వీటిని సవరించే ప్రక్రియ త్వరలో చేపడతామని రెవెన్యూ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
కబ్జాకు రహదారి
► స్టీల్‌ప్లాంట్ భూముల ఆక్రమణ ► రిటైర్డ్ ఉన్నతాధికారి, ఓ వ్యాపారి నిర్వాకం ► చోద్యం చూస్తున్న ప్లాంట్ యంత్రాంగం ఒకరు రిటైర్డ్ స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారి. సర్వోన్నత స్థానంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు... ఆయన పట్ల అధికారులకు ఇప్పటికీ స్వామిభక్తే!మరొకరు స్టీల్ ఉత్పత్తుల వ్యాపారి. భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తుంటారు... తమకు కమీషన్లు ముట్టజెప్పే ఆయన పట్ల అధికారులకు కృతజ్ఞత!ఆ స్వామిభక్తి, కృతజ్ఞత కలగలిపి ఎంతగా ఉందంటే...వారిద్దరూ దర్జాగా స్టీల్‌ప్లాంట్ భూములను కబ్జా చేసి రోడ్డు వేసేసినా చూసీచూడనంత. దాదాపు రూ.5 కోట్ల విలువైన స్టీల్‌ప్లాంట్ భూమి అన్యాక్రాంతమైపోతున్నా పట్టించుకోనంత. ఆభూబాగోతం ఏమిటో మీరే చూడండి... సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గాజువాకకు చెందిన కణితి గ్రామంలో సర్వే నంబర్లు 321, 322లతో స్టీల్‌ప్లాంట్ భూములున్నాయి. ఇవి కొత్త గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే బాలచెరువు గేటుకు సమీపంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో మార్కెట్ ధర ఎకరా రూ.10 కోట్ల వరకు ఉంది. ఆ భూముల వెనుకే స్టీల్‌ప్లాంట్ రిటైర్డ్ ఉన్నతాధికారికి, నగరంలో ఓ బడా స్టీల్ వ్యాపారికి చెందిన భూములున్నాయి. కానీ వారిద్దరి భూములకు రోడ్డు కనెక్టివిటీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రైవేటు భూములుగా చూపిస్తున్నప్పటికీ వాటిపై గతంలో వివాదం ఉండేది. దాంతో ఆ ఇద్దరి భూములకు ఆశించినంత ధర రావడం లేదు. మరోవైపు ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో తమ భూముల పక్కనే ఉన్న స్టీల్‌ప్లాంట్ భూములపై వారిద్దరి కన్ను పడింది. ఎంతైనా గతంలో తాను చక్రం తిప్పిన స్టీల్‌ప్లాంటే కదా అని ఆ రిటైర్డ్ ఉన్నతాధికారి భావించారు. ఇప్పటికీ తాను ఆడిందే ఆటగా సాగుతోంది కదా అని ప్రైవేటు వ్యాపారి ధీమా కనబరిచారు. అదే ధైర్యంతో స్టీల్‌ప్లాంట్ భూముల గుండా తమ భూములకు రోడ్డు వేయాలని భావించారు. అదే తడవుగా మూడు రోజుల క్రితం అనుకున్నంతా చేసేశారు. స్టీల్‌ప్లాంట్ భూముల గుండా తమ భూములకు రోడ్డు వేసేశారు. దాదాపు ముప్పావు ఎకరా భూమిని కబ్జా చేసేసి రోడ్డు నిర్మించారు. మార్కెట్ ధర ప్రకారం కబ్జా చేసిన భూమి విలువ దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. చోద్యం చూస్తున్న స్టీల్‌ప్లాంట్ యంత్రాంగం : స్టీల్‌ప్లాంట్ భూముల గుండా ప్రైవేటు వ్యక్తులు అడ్డంగా రోడ్డు నిర్మించినప్పటికీ ప్లాంట్ అధికారులు స్పందించనే లేదు. ఈ విషయం ప్లాంట్ ఉన్నతాధికారుల దృష్టికి రాలేదా అంటే అదీ కాదు. రెండు రోజుల క్రితం ‘ల్యాండ్ -ఎస్టేట్’ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు ఆ భూములను పరిశీలించారు. కానీ ఇంతవరకు ఉన్నతాధికారులు ఆ రోడ్డును తొలగించడానికి ప్రయత్నించనే లేదు. నిబంధనల ప్రకారం అక్రమంగా రోడ్డు నిర్మించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టాలి. కానీ స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారులు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. పరోక్షంగా తమ మాజీ బాస్‌కు సహకరిస్తున్నారు. తమకు కమీషన్లు ముట్టజెప్పే వ్యాపారినీ సంతోషపెడుతున్నారు. అదండీ సంగతి. -
యాదాద్రికి దిల్ భూములు
529 ఎకరాల బదిలీకి ప్రభుత్వం ఆదేశం నల్లగొండ కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ యాదాద్రి మాస్టర్‌ప్లాన్ అమలులో ముందడుగు ప్రభుత్వ భూముల మధ్య ఉన్న 1,200 ఎకరాల ప్రైవేట్ భూముల కొనుగోలుకు చర్యలు 425 ఎకరాల్లో తిరుపతి తరహా అభయారణ్యం సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి ప్రణాళిక అమలులో మరో ముందడుగు పడింది. గతంలో దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) సంస్థకు కేటాయించిన భూముల స్వాధీనానికి చర్యలు తీసుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వం వాటిని గుట్ట అభివృద్ధి అథారిటీకి అప్పగించేందుకు సిద్ధమైంది. యాదాద్రి పరిసరాల్లోని 529 ఎకరాలను వెనక్కి తీసుకుని గుట్ట అథారిటీకి అప్పగించాలని తాజాగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డు సంస్థకు అనుబంధంగా ఏర్పాటైన దిల్‌కు గత ప్రభుత్వాలు పలుచోట్ల భూములను కేటాయించాయి. పారిశ్రామిక అవసరాల కోసం వాటిని వినియోగించాలని భావించాయి. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లోనూ దిల్‌కు భూములున్నాయి. ఇవన్నీ గుట్టల్లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నాయని, అందులో చాలావరకు నిరుపయోగంగా ఉన్నాయని ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది. ఈ మేరకు రె వెన్యూ విభాగం నుంచి సమాచారం సేకరించింది. వెంటనే నోటీసులు జారీ చేసి దిల్‌కు చెందిన 529 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దిల్ భూములను యాదగిరిగుట్ట అథారిటీకి బదిలీ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. యాదాద్రిని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏర్పడిన యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు బడ్జెట్లో రూ. వంద కోట్లను కూడా సర్కారు కేటాయించింది. ముఖ్యమంత్రి స్వయంగా మూడుసార్లు గుట్టకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఇటీవలే ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌స్వామిని వెంట తీసుకెళ్లి.. ఆయన సూచనల మేరకు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సమీక్ష జరిపారు. గుట్ట పరిసరాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు దాదాపు రెండు వేల ఎకరాల వరకు భూములు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వ భూములను సర్వే చేయించింది. ఖాళీగా ఉన్న రెవెన్యూ భూములను వెంటనే గుట్ట అథారిటీకి అప్పగించాలని సీఎం ఆదేశించారు. మిగతా భూముల సేకరణకూ వేగంగా చర్యలు చేపట్టాలని ఇటీవలే ఉన్నతాధికారుల సమీక్షలో కేసీఆర్ నిర్దేశించారు. గుట్ట పరిసరాల్లో 300 ఎకరాల ప్రభుత్వ భూములు, మరో 425 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతాన్ని నరసింహ అభయారణ్యంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలోని అభయారణ్యం తరహాలోనే దీన్ని అభివృద్ధి చేయనుంది. జింకలు తదితర వన్యప్రాణులను, ఆయుర్వేద మొక్కలను ఇందులో పెంచేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు. రె వెన్యూ, అటవీ భూముల మధ్యలో అక్కడక్కడ ఉన్న ప్రైవేటు భూములు మొత్తం కలిపి 1200 ఎకరాల వరకు ఉన్నాయి. మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసేందుకు వీటిని సేకరించడం తప్పనిసరని సర్వే బృందాలు నిర్ధారించాయి. దీంతో వీటిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఇందులో భాగంగానే దిల్‌కు కేటాయించిన భూముల స్వాధీనానికీ ఉత్తర్వులు జరీ చేసింది. -
ఖాళీ స్థలాలకు పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం
అనంతపురం టౌన్ : నగర, పురపాలక సంఘాలు ప్రైవేటు స్థలాలకు పన్ను విధించడంలోనూ, విధించిన పన్ను వసూలు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ) వసూలు డిమాండ్ రూ.2.15 కోట్లు ఉండగా ఇప్పటి వరకు వసూలు చేసింది రూ.18.28 లక్షలు మాత్రమే. పన్ను వసూలుపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాల పరిధిలో చాలా ప్రైవేటు ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిని గుర్తించి వీఎల్టీ విధించాల్సి ఉన్నా మొక్కుబడిగా కొన్ని స్థలాలకు పన్ను విధించారు. అవీ కూడా స్థల యజమానులు స్వయంగా వచ్చి పన్ను వేయించుకున్నవే కావడం గమనార్హం. విధించిన పన్ను వసూలుపైన దృష్టి పెట్టడం లేదు. ప్రైవేటు స్థలాలకు వీఎల్టీ విధించాలని ప్రభుత్వం కచ్చితంగా సూచించింది. అయితే ఎక్కడా ప్రభుత్వ సూచనలు అమలు కావడం లేదనేందుకు ఈ విషయంలో కనీస ప్రగతి లేకపోవడం నిదర్శనంగా నిలుస్తోంది. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర మునిసిపాలిటీల్లో ఒక స్థలానికి కూడా పన్ను విధించలేదనేది అధికార నివేదిక తెలియజేస్తోంది. వీఎస్‌టీతో యజమానికి ప్రయోజనం ప్రైవేటు ఖాళీ స్థలాలకు వీఎస్టీ విధించడం ద్వారా సంబంధిత స్థల యజమానికి ప్రయోజనంగా ఉంటుంది. స్థలానికి పన్ను విధించే సమయంలో స్థల విస్తీర్ణాన్ని రికార్డుల్లో పక్కగా నమోదు చేస్తారు. వీఎస్టీ ఉన్న స్థలాలు కనీసం ఒక్క అడుగు కూడా దానికి అటు ఇటుగా ఉన్నవారు ఆక్రమించుకునేందుకు వీలు ఉండదు. స్థల యజమానులు దూర ప్రాంతాల్లో ఉంటారు. అలాంటి వారు తమ స్థలాలకు పన్ను చెల్లించడం ద్వారా సంస్థ తరఫున స్థలానికి రక్షణ పొందే అవకాశం లభిస్తుంది. ఎవరైనా ఆక్రమిస్తే సంస్థలో ఫిర్యాదు చేస్తే రికార్డులను పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటారు. -
లక్ష ఎకరాల వెనుక.. లక్ష్యం ఏమిటో?
జిల్లాలో భూసేకరణకు ప్రభుత్వం ఆదేశాలు ఏపీఐఐసీ నేతృత్వంలో జరపాలని సూచన పరిశ్రమల కోసమని పేర్కొనడంపై అనుమానాలు రికార్డుల్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో కానరాని భూములు పేదలు, ప్రైవేట్ భూములపై పడతారని ఆందోళన శ్రీకాకుళం : పారిశ్రామిక అవసరాల పేరుతో జిల్లాలో లక్ష ఎకరాల భూమి సేకరణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేపట్టడంతో రైతులు, వివిధ ప్రభుత్వ పథకాల కింద భూములు పొందిన లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. భూ సేకరణకు సంబంధించి రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ, పరిశ్రమల శాఖలకు ఉత్తర్వులు అందాయి. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో భూ సేకరణ జరపాలని ఆ ఉత్తర్వుల్లో సూచించిన ప్రభుత్వం ఏ రకమైన భూములు సేకరించాలో స్పష్టం చేయలేదు. పైగా జిల్లాలో ఆ స్థాయిలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ భూములు, పేదలకు పంపిణీ చేసిన భూములను లాక్కుంటారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. రికార్డుల్లో 4 లక్షల ఎకరాలు రెవెన్యూ రికార్డుల ప్రకారం జిల్లాలో 4,08,361.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు విడతల భూ పంపిణీ కార్యక్రమంలో పేదలకు 1.04 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అలాగే పక్కా ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు, భవనాలకు మరొకొంత భూమి కేటాయించారు. కొంత భూమి వివాదాల్లోనూ, మరికొంత ఆక్రమణల్లోనూ ఉంది. ఇవన్నీ పోనూ మరో రెండు లక్షల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నట్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అంత భూమి ఎక్కడా కనిపించడంలేదు. గత ప్రభుత్వం భూపంపిణీ సందర్భంగా ప్రభుత్వ భూమిని సేకరించాలని ఆదేశించినప్పుడే అధికారులకు ఎన్నో తలనొప్పులు ఎదురయ్యాయి. రికార్డుల్లో ఉన్న భూములు క్షేత్రస్థాయిలో కనిపించలేదు. ఇక వివాదస్పద, ఆక్రమిత భూములను సేకరించడం అధికారుల తలకు మించిన పనే. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వీలుగా లక్ష ఎకరాలు సేకరించి సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారవర్గాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లక్ష ఎకరాలు అవసరమైనన్ని పరిశ్రమలు స్థాపించే ప్రతిపాదనలేవీ లేవు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులకు అంత భూమి అవసరం లేదు. మరి అంత భూమి ఎందుకు?.. ఈ ప్రశ్నకు సమాధానమా అన్నట్లు పరిశ్రమల స్థాపన పేరిట పచ్చచొక్కాలకు భూసంతర్పణ చేసేందుకేనన్న ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. లబ్ధిదారుల ఆందోళన కాగా ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేటు భూములపై పడతారేమోనన్న ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. అటవీ భూములను సేకరించే అవకాశాలు కూడా లేవు. జిల్లా వైశాల్యంలో అటవీ ప్రాంత నిష్పత్తిని చూస్తే ఇప్పటికే 20 శాతం కంటే తక్కువ అటవీ ప్రాంతం ఉంది. ప్రైవేటు భూములతోపాటు గత ప్రభుత్వం భూపంపిణీలో భాగంగా పేదలకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకుంటారేమోనని లబ్ధిదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయాన్ని ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ సత్యనారాయణ వద్ద ఁసాక్షిరూ. ప్రస్తావించగా భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వాస్తవమేనన్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. భూమిని సేకరించి పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉండాలని మాత్రమే తమకు అందిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని చెప్పారు. -
వాటర్‌గ్రిడ్‌కు 5వేల ఎకరాల భూమి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న తాగునీటి గ్రిడ్‌కు ఐదువేల ఎకరాల మేరకు భూ సేకరణ చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 26 గ్రిడ్ల నుంచి జిల్లాల్లో వేసే ప్రధాన ట్రంక్‌లైను, సబ్ ట్రంక్లైనులకు సంబంధించి ఈ భూమి అవసరం అవుతుందని చెబుతున్నారు. సాధారణంగా రహదారుల పక్క నుంచే ఈ మంచినీటి పైపులైన్లు వేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. దాదాపు పదిశాతం మేరకు ప్రైవేట్ భూములు సేకరించాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. పైపులైను వేసే ప్రాంతంలో పదిమీటర్ల మేరకు భూ సేకరణ చేయాల్సి ఉంటుందని గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ అధికారులు చెబుతున్నారు. వాటర్‌గ్రిడ్ కోసం 26 గ్రిడ్ల నుంచి జిల్లాకేంద్రాలు, ప్రధానప్రాంతాల నుంచి వెళ్లే ప్రధాన ట్రంక్‌లైను పొడవు ఐదు వేల కిలోమీటర్లు ఉంటుందని, అలాగే ఆ ప్రధాన ట్రంక్‌లైను నుంచి సబ్ ట్రంక్‌లైన్లు 45 వేల కిలోమీటర్ల పొడవు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల పొలిమేరల వరకు వేయనున్నారు. ప్రధాన ట్రంక్‌లైను, సబ్ట్రంక్లైన్ల నుంచి బల్క్‌గా గ్రామాల పాయింట్ వరకు సరఫరా చేస్తారు. అటు నుంచి గ్రామాల్లో పంపిణీ చేసే మంచినీటి పైపులైను కూడా కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారానే వేయనున్నారు. ఇది దాదాపు 65 వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందని అధికారులు వివరించారు. ఒక గ్రామానికి అవసరమైన నీటిని లెక్కించి ఆ మేరకు సరఫరా చేస్తామని, ఇందుకోసం గ్రామ పాయింట్ వద్ద మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటర్ రీడింగ్ ఆధారంగా ఆ గ్రామం నుంచి నీటి ఛార్జీలను వసూలు చేయనున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఒక్కోగ్రిడ్ సర్వే పనులు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఐదువేల కిలోమీటర్ల మేరకు సర్వే పూర్తిచేసినట్టు తెలిసింది. -
బీపీఎల్ భూములు వెనక్కి!
రామగుండం : సుమారు 14 ఏళ్ల క్రితం బ్రిటీష్ ఫిజికల్ లాబొరేటరీ (బీపీఎల్) విద్యుత్ కేంద్రం స్థాపనకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లేఖ నంబర్ బీ/233/2014, 09/09/2014 పేరిట పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం నుంచి బీపీఎల్ యాజమాన్యానికి శుక్రవారం ఉత్తర్వులు చేరాయి. బీపీఎల్‌కు కేటాయించిన మొత్తం భూమి 1,817.03 ఎకరాలు. ఇందులో ప్రైవేటు భూములు 1,271.38 ఎకరాలు, మిగిలిన 543.05 ఎకరాలు ప్రభుత్వ భూమి. రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో ఈ స్థలాన్ని ఎన్టీపీసీకి కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. దీనిని గుర్తించిన బీపీఎల్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించి స్థలాలపై స్టేటస్-కో పొందింది. అయితే కోర్టు ఉత్తర్వులు ప్రభుత్వ భూములకు వర్తించవని, సదరు స్థలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోవద్దో తెలపాలని రెవెన్యూ అధికారులు మూడుసార్లు సంజాయిషీ నోటీసులు జారీచేశారు. దీనిపై యాజమాన్యం తమ సంజాయిషీని జిల్లా కలెక్టర్‌కు నివేదించినప్పటికీ మొదటిసారి పంపిన లేఖనే మళ్లీ శుక్రవారం సాయంత్రం పంపించి.. శనివారం సంబంధిత భూమలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. బీపీఎల్‌ను వదిలించుకునేందుకేనా..? విద్యుత్ ఉత్పత్తి విషయంలో బీపీఎల్, ప్రభుత్వం మధ్య పొసగకపోవడంతోనే భూములు స్వాధీనంచేసుకునేందుకు కుట్ర పన్నిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తే 28 నెలల్లోపు ఉత్పత్తి చేసి ఇస్తామని చెప్పినా.. ఇదే విషయాన్ని పలుమార్లు జాయింట్ కలెక్టర్‌కు విన్నవించినా.. తీరా సమయానికి ఉన్న భూములు లాక్కుందని మండిపడుతున్నారు. బీపీఎల్‌కు కేటాయించిన భూములన్నీ ఒకేచోట లేవని, ఆ స్థలాలను స్వాధీనం చేసుకున్నంతమాత్రాన ప్రయోజనం ఉండదని, అదే తమ సంస్థకే విద్యుత్ ఉత్పత్తికి అనుమతిస్తే స్థలాలను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తి చేసేవారమని పేర్కొంటున్నారు. భూముల స్వాధీనంపై ప్రభుత్వ వైఖరి అంతుచిక్కడం లేదని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచా రం. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేర కు భూములను స్వాధీనం చేసుకున్నామని తహశీల్దార్ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్వాధీనంచేసుకున్న భూములు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న బీపీఎల్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు.. మల్యాలపల్లి శివారు పరిధిలో 87.08 ఎకరాలు కుందనపల్లి శివారులో 4.23 ఎకరాలు రామగుండం శివారులో (విడివిడిగా) 128.11 ఎకరాలు, 5.21 ఎకరాలు, 45.15 ఎకరాలు, 2.32 ఎకరాలు రాయదండిలో 227.10 , 0.36 ఎకరాలు బ్రాహ్మణపల్లిలో 33.35 ఎకరాలు ఎల్లంపల్లిలో 4.01 ఎకరాలు గోలివాడలో 5.13 ఎకరాలు -
భూపంపిణీకి అడ్డంకులు
►నియోజకవర్గానికి ఒకే గ్రామం ►ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే.. ►వ్యవసాయ రంగంలోని పేదలకే లబ్ధి ►ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ ►మళ్లీ మొదటికొచ్చిన ప్రక్రియ ముకరంపుర : గతంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారయంత్రాంగం ఆగమేఘాలపై భూ పంపిణీ కార్యక్రమానికి కసరత్తు కొనసాగించింది. ఎస్సీ సబ్‌ప్లాన్ ప్రకారం నలభై శాతం ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను గుర్తించింది. కరీంనగర్ మినహా 48 మండలాల్లో గ్రామాలను ఎంపిక చేసి ప్రభుత్వ, ప్రైవేట్ భూములను గుర్తించింది. కేవలం ఎనిమిది మండలాల్లోనే సర్కారు భూములు అందుబాటులో ఉన్నట్టు తేల్చింది. మిగిలిన మండలాల్లో ప్రైవేట్ భూము లు కొనుగోలు చేయాలని నివేదిక సిద్ధం చేసింది. ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రైవేట్ భూములను ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేయాలని పేర్కొంది. ఇందుకోసం సుమారు రూ.397.47 కోట్ల నిధులు అవసరమవుతాయని లెక్కగట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక ప్రాథమిక నివేదిక సమర్పించింది. సాధ్యాసాధ్యాలను గమనించిన సర్కారు మొదటి విడతగా నియోజకవర్గానికో గ్రామంతో సరిపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ముఖ్యమంత్రి కార్యాలయం జాయింట్ సెక్రటరీ స్మితాసబర్వాల్, పరిశ్రమల కమిషనర్ జయేష్‌రంజన్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ పంపిణీ ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాల గురించి వివరించారు. ఆయా గ్రామాల్లో సాగుయోగ్యమైన భూమిని గుర్తించి తక్కువ ధరలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భూ పంపిణీలో వ్యవసాయ రంగంలో ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. దీంతో అధికారయంత్రాంగం ఇప్పటిదాకా కొనసాగించిన కసరత్తుకు బ్రేక్‌పడింది. గ్రామాల వారీగా లబ్ధిదారులను గుర్తించడానికి ముగ్గురితో కూడిన బృందానికి డివిజన్ల వారీగా ఇస్తున్న శిక్షణను ఆపేశారు. దీంతో గ్రామాల ఎంపిక, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే.. నియోజకవర్గానికో గ్రామానికి ఎంపిక చేయాల్సిన బాధ్యతను సర్కారు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో వారు ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తే.. ఇతర గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేక వచ్చే ప్రమాదముందని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లో మలివిడతలో భూ పంపిణీ జరుగుతుందంటున్నారు. -
ఇసుకేస్తే.. రాలనంత డబ్బు!
చినగంజాం : జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. కొందరు ముఠాలుగా ఏర్పడి ట్రాక్టర్లకు ట్రాక్టర్ల ఇసుకను యథేచ్ఛగా దోచుకెళ్తున్నారు. కోట్ల రూపాయల ఇసుక తరలి వెళ్తున్నా సంబంధిత అధికారులు నిద్ర నటిస్తున్నారు. ఇసుక మాఫియాలో కొందరు అధికారులకు సైతం భాగస్వామ్యం ఉందంటే అతిశయోక్తికాదు. నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు సైతం ప్రస్తుతం అనధికారికంగా ఇసుక క్వారీలుగా చెలామణి అవుతున్నాయి. ప్రైవేట్ భూములు కొనుగోలు చేయడం తలకు మించిన భారం కావడంతో అక్రమార్కుల చూపు పేదల భూములపై పడింది. పేదల డీకే భూములపై కన్నేసి వాటిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి భారీగా ఇసుక తవ్వితీసి కోట్లు గడిస్తున్నారు. చీరాల, ఈపూరుపాలెం, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం తదితర ప్రాంతాల్లో ఇసుక యథేచ్ఛగా రవాణా అవుతున్నా ఇదేమని ప్రశ్నించే అధికారులు లేకపోవడం విచారకరం. రోజూ రూ.లక్షల్లో దోపిడీ తక్కువ రోజుల్లో లక్షాధికారులగా మారేందుకు కొందరు ఇసుక అక్రమ రవాణానే వ్యాపారంగా చేసుకున్నారు. ఒక్క చినగంజాం మండలంలోనే రోజుకు 200 నుంచి 300 వాహనాల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ట్రాక్టర్ ఇసుకలోడు ఖరీదు రూ. 500 నుంచి రూ.1000 వరకు ఉండగా రోజుకు సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు అక్రమార్కులు ఆర్జిస్తున్నారు. ఒక ట్రాక్టర్‌కు మూడు క్యూబిక్ మీటర్లు చొప్పున ఇసుక, పెద్ద లారీకి 6 ట్రాక్టర్లు చొప్పున 18 క్యూబిక్ మీటర్లు తర లిస్తున్నారు. అంటే రోజుకు కనీసం 1000 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలి వెళ్తోందన్నమాట. దాదాపు 90 శాతం మందికి లెసైన్స్‌లు లేవంటే ఆశ్చర్యం వేయక మానదు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారుల్లో కొందరు మామూళ్లకు అలవాటు పడి సమర్థంగా విధులు నిర్వహించే అధికారులను సైతం అపహాస్యం చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు తనిఖీకి వచ్చే విషయం అక్రమార్కులకు ముందుగానే తెలిసిపోతుందంటే వారి పలుకుబడి ఎంతవరకు ఉందో అర్థమవుతోంది. చినగంజాం నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలు రెవెన్యూ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ మీదుగా స్వేచ్ఛగా వెళ్తుండటం గమనార్హం. పర్యావరణానికి ముప్పు భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరపడంతో భవిష్యత్‌లో గ్రామాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం వుంది. 20 అడుగులకు పైబడి ఇసుక తవ్వి తరలిస్తున్నారు. భవిష్యత్తులో పర్యావరణానికి ముప్పు వాటిల్లక తప్పదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపయోగం లేని ఫిర్యాదులు ప్రభుత్వ భూముల్లో ఇసుకను యథేచ్ఛగా తవ్వి తరలిస్తూ ఇదేమని ప్రశ్నించే వారిని వాహనాలతో తొక్కిస్తామని మాఫియా బెదిరిస్తోంది. స్థానికంగా పలువురు కలెక్టర్‌ను కలిసి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదు. కమిటీలు వేసి సర్వే చేయించడం మినహా ఇసుక తవ్వకాలను ఆపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఇసుకాసురులు పేదల భూములే లక్ష్యంగా తమ దందా కొనసాగిస్తున్నారు. చినగంజాం రెవెన్యూ సర్వే నంబర్ 828,829,830లలో, మోటుపల్లి 128, 129, 130 సర్వే నంబర్లలో భూమికి ప్రభుత్వం కొందరు పేదలకు తాత్కాలికంగా పట్టాలు ఇచ్చింది. అక్రమార్కులు ఆ భూములే లక్ష్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు.