- 529 ఎకరాల బదిలీకి ప్రభుత్వం ఆదేశం
- నల్లగొండ కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ
- యాదాద్రి మాస్టర్‌ప్లాన్ అమలులో ముందడుగు
- ప్రభుత్వ భూముల మధ్య ఉన్న 1,200 ఎకరాల ప్రైవేట్ భూముల కొనుగోలుకు చర్యలు
- 425 ఎకరాల్లో తిరుపతి తరహా అభయారణ్యం
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి ప్రణాళిక అమలులో మరో ముందడుగు పడింది. గతంలో దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) సంస్థకు కేటాయించిన భూముల స్వాధీనానికి చర్యలు తీసుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వం వాటిని గుట్ట అభివృద్ధి అథారిటీకి అప్పగించేందుకు సిద్ధమైంది. యాదాద్రి పరిసరాల్లోని 529 ఎకరాలను వెనక్కి తీసుకుని గుట్ట అథారిటీకి అప్పగించాలని తాజాగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
హౌసింగ్ బోర్డు సంస్థకు అనుబంధంగా ఏర్పాటైన దిల్‌కు గత ప్రభుత్వాలు పలుచోట్ల భూములను కేటాయించాయి. పారిశ్రామిక అవసరాల కోసం వాటిని వినియోగించాలని భావించాయి. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లోనూ దిల్‌కు భూములున్నాయి. ఇవన్నీ గుట్టల్లో ఎత్తయిన ప్రాంతంలో ఉన్నాయని, అందులో చాలావరకు నిరుపయోగంగా ఉన్నాయని ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది. ఈ మేరకు రె వెన్యూ విభాగం నుంచి సమాచారం సేకరించింది. వెంటనే నోటీసులు జారీ చేసి దిల్‌కు చెందిన 529 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే దిల్ భూములను యాదగిరిగుట్ట అథారిటీకి బదిలీ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. యాదాద్రిని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏర్పడిన యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ ఇప్పటికే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు బడ్జెట్‌లో రూ. వంద కోట్లను కూడా సర్కారు కేటాయించింది. ముఖ్యమంత్రి స్వయంగా మూడుసార్లు గుట్టకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు.
ఇటీవలే ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌స్వామిని వెంట తీసుకెళ్లి.. ఆయన సూచనల మేరకు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సమీక్ష జరిపారు. గుట్ట పరిసరాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు దాదాపు రెండు వేల ఎకరాల వరకు భూములు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వ భూములను సర్వే చేయించింది. ఖాళీగా ఉన్న రెవెన్యూ భూములను వెంటనే గుట్ట అథారిటీకి అప్పగించాలని సీఎం ఆదేశించారు. మిగతా భూముల సేకరణకూ వేగంగా చర్యలు చేపట్టాలని ఇటీవలే ఉన్నతాధికారుల సమీక్షలో కేసీఆర్ నిర్దేశించారు. గుట్ట పరిసరాల్లో 300 ఎకరాల ప్రభుత్వ భూములు, మరో 425 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి.
ఈ అటవీ ప్రాంతాన్ని నరసింహ అభయారణ్యంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలోని అభయారణ్యం తరహాలోనే దీన్ని అభివృద్ధి చేయనుంది. జింకలు తదితర వన్యప్రాణులను, ఆయుర్వేద మొక్కలను ఇందులో పెంచేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు. రె వెన్యూ, అటవీ భూముల మధ్యలో అక్కడక్కడ ఉన్న ప్రైవేటు భూములు మొత్తం కలిపి 1200 ఎకరాల వరకు ఉన్నాయి. మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసేందుకు వీటిని సేకరించడం తప్పనిసరని సర్వే బృందాలు నిర్ధారించాయి. దీంతో వీటిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఇందులో భాగంగానే దిల్‌కు కేటాయించిన భూముల స్వాధీనానికీ ఉత్తర్వులు జరీ చేసింది.