అనంతపురం టౌన్ : నగర, పురపాలక సంఘాలు ప్రైవేటు స్థలాలకు పన్ను విధించడంలోనూ, విధించిన పన్ను వసూలు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఖాళీ స్థలాల పన్ను (వీఎల్‌టీ) వసూలు డిమాండ్ రూ.2.15 కోట్లు ఉండగా ఇప్పటి వరకు వసూలు చేసింది రూ.18.28 లక్షలు మాత్రమే. పన్ను వసూలుపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాల పరిధిలో చాలా ప్రైవేటు ఖాళీ స్థలాలు ఉన్నాయి.
వీటిని గుర్తించి వీఎల్‌టీ విధించాల్సి ఉన్నా మొక్కుబడిగా కొన్ని స్థలాలకు పన్ను విధించారు. అవీ కూడా స్థల యజమానులు స్వయంగా వచ్చి పన్ను వేయించుకున్నవే కావడం గమనార్హం. విధించిన పన్ను వసూలుపైన దృష్టి పెట్టడం లేదు. ప్రైవేటు స్థలాలకు వీఎల్‌టీ విధించాలని ప్రభుత్వం కచ్చితంగా సూచించింది. అయితే ఎక్కడా ప్రభుత్వ సూచనలు అమలు కావడం లేదనేందుకు ఈ విషయంలో కనీస ప్రగతి లేకపోవడం నిదర్శనంగా నిలుస్తోంది. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర మునిసిపాలిటీల్లో ఒక స్థలానికి కూడా పన్ను విధించలేదనేది అధికార నివేదిక తెలియజేస్తోంది.
వీఎస్‌టీతో యజమానికి
ప్రయోజనం
ప్రైవేటు ఖాళీ స్థలాలకు వీఎస్‌టీ విధించడం ద్వారా సంబంధిత స్థల యజమానికి ప్రయోజనంగా ఉంటుంది. స్థలానికి పన్ను విధించే సమయంలో స్థల విస్తీర్ణాన్ని రికార్డుల్లో పక్కగా నమోదు చేస్తారు. వీఎస్‌టీ ఉన్న స్థలాలు కనీసం ఒక్క అడుగు కూడా దానికి అటు ఇటుగా ఉన్నవారు ఆక్రమించుకునేందుకు వీలు ఉండదు. స్థల యజమానులు దూర ప్రాంతాల్లో ఉంటారు. అలాంటి వారు తమ స్థలాలకు పన్ను చెల్లించడం ద్వారా సంస్థ తరఫున స్థలానికి రక్షణ పొందే అవకాశం లభిస్తుంది. ఎవరైనా ఆక్రమిస్తే సంస్థలో ఫిర్యాదు చేస్తే రికార్డులను పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటారు.
ఖాళీ స్థలాలకు పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం
Published Wed, Feb 18 2015 1:33 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement