కబ్జాకు రహదారి
► స్టీల్‌ప్లాంట్ భూముల ఆక్రమణ
► రిటైర్డ్ ఉన్నతాధికారి, ఓ వ్యాపారి నిర్వాకం
► చోద్యం చూస్తున్న ప్లాంట్ యంత్రాంగం
ఒకరు రిటైర్డ్ స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారి. సర్వోన్నత స్థానంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు... ఆయన పట్ల అధికారులకు ఇప్పటికీ స్వామిభక్తే!మరొకరు స్టీల్ ఉత్పత్తుల వ్యాపారి. భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తుంటారు... తమకు కమీషన్లు ముట్టజెప్పే ఆయన పట్ల అధికారులకు కృతజ్ఞత!ఆ స్వామిభక్తి, కృతజ్ఞత కలగలిపి ఎంతగా ఉందంటే...వారిద్దరూ దర్జాగా స్టీల్‌ప్లాంట్ భూములను కబ్జా చేసి రోడ్డు వేసేసినా చూసీచూడనంత. దాదాపు రూ.5 కోట్ల విలువైన స్టీల్‌ప్లాంట్ భూమి అన్యాక్రాంతమైపోతున్నా పట్టించుకోనంత. ఆభూబాగోతం ఏమిటో మీరే చూడండి...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గాజువాకకు చెందిన కణితి గ్రామంలో సర్వే నంబర్లు 321, 322లతో స్టీల్‌ప్లాంట్ భూములున్నాయి. ఇవి కొత్త గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే బాలచెరువు గేటుకు సమీపంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో మార్కెట్ ధర ఎకరా రూ.10 కోట్ల వరకు ఉంది. ఆ భూముల వెనుకే స్టీల్‌ప్లాంట్ రిటైర్డ్ ఉన్నతాధికారికి, నగరంలో ఓ బడా స్టీల్ వ్యాపారికి చెందిన భూములున్నాయి. కానీ వారిద్దరి భూములకు రోడ్డు కనెక్టివిటీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రైవేటు భూములుగా చూపిస్తున్నప్పటికీ వాటిపై గతంలో వివాదం ఉండేది. దాంతో ఆ ఇద్దరి భూములకు ఆశించినంత ధర రావడం లేదు. మరోవైపు ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో తమ భూముల పక్కనే ఉన్న స్టీల్‌ప్లాంట్ భూములపై వారిద్దరి కన్ను పడింది.
ఎంతైనా గతంలో తాను చక్రం తిప్పిన స్టీల్‌ప్లాంటే కదా అని ఆ రిటైర్డ్ ఉన్నతాధికారి భావించారు. ఇప్పటికీ తాను ఆడిందే ఆటగా సాగుతోంది కదా అని ప్రైవేటు వ్యాపారి ధీమా కనబరిచారు. అదే ధైర్యంతో స్టీల్‌ప్లాంట్ భూముల గుండా తమ భూములకు రోడ్డు వేయాలని భావించారు. అదే తడవుగా మూడు రోజుల క్రితం అనుకున్నంతా చేసేశారు. స్టీల్‌ప్లాంట్ భూముల గుండా తమ భూములకు రోడ్డు వేసేశారు. దాదాపు ముప్పావు ఎకరా భూమిని కబ్జా చేసేసి రోడ్డు నిర్మించారు. మార్కెట్ ధర ప్రకారం కబ్జా చేసిన భూమి విలువ దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుంది.
చోద్యం చూస్తున్న స్టీల్‌ప్లాంట్ యంత్రాంగం : స్టీల్‌ప్లాంట్ భూముల గుండా ప్రైవేటు వ్యక్తులు అడ్డంగా రోడ్డు నిర్మించినప్పటికీ ప్లాంట్ అధికారులు స్పందించనే లేదు. ఈ విషయం ప్లాంట్ ఉన్నతాధికారుల దృష్టికి రాలేదా అంటే అదీ కాదు. రెండు రోజుల క్రితం ‘ల్యాండ్ -ఎస్టేట్’ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు ఆ భూములను పరిశీలించారు. కానీ ఇంతవరకు ఉన్నతాధికారులు ఆ రోడ్డును తొలగించడానికి ప్రయత్నించనే లేదు. నిబంధనల ప్రకారం అక్రమంగా రోడ్డు నిర్మించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టాలి. కానీ స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారులు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. పరోక్షంగా తమ మాజీ బాస్‌కు సహకరిస్తున్నారు. తమకు కమీషన్లు ముట్టజెప్పే వ్యాపారినీ సంతోషపెడుతున్నారు. అదండీ సంగతి.