విశాఖ వస్తున్న ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేయాలి
కార్మిక, ప్రజా సంఘాల ర్యాలీలో నాయకుల డిమాండ్
గాజువాక: విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని విజ్ఞప్తి చేశారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాని మోదీ తన విశాఖ పర్యటనలో సానుకూల నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.
పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సాగుతున్న ఉద్యమానికి రాష్ట్ర అభివృద్ధితోపాటు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment