steel plant employee
-
మోదీ భజనకే బాబు, పవన్ పరిమితం.. ఇక ఉక్కు ఉద్యమం ఉధృతం
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని మోదీ సభలో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రసంగాలపై ఉక్కు పోరాట కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయిస్తూ.. పోరాటానికి సన్నద్ధమవుతోంది. 35 గంటలకే దీక్ష విరమించి పెద్ద ఎత్తున నిరసన చేయాలని పోరాట కమిటీ నిర్ణయించింది.ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు పోరాట కమిటీ నిర్ణయించింది. పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ తో సహా మరి కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. దీక్షా శిబిరం వద్దే ఉక్కు కార్మికులు ఉక్కు కార్మికులు బైఠాయించారు. కాగా, ఇప్పటికే దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసన చేస్తే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తామంటూ పోలీసులు హెచ్చరించారు.ఏపీ హక్కులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గాలికొదిలేశారు. రాష్ట్ర హక్కుల కోసం ప్రధాని మోదీ ముందు వారు కనీసం నోరు విప్పలేదు. స్టీల్ ప్లాంట్ సహా ఏ సమస్యపై కూడా చంద్రబాబు, పవన్ అడగలేదు. కేవలం ప్రధాని మోదీ భజనకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది.ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అడగని చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్ కోసం అడగని చంద్రబాబు.. పోలవరం నిర్వాసితుల నిధులపై కూడా స్పష్టత కోరలేదు.చంద్రబాబు, పవన్‌లపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడిదంటూ నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబు, పవన్.. ఎంపీల బలం ఉన్నా ఏపీ హక్కుల కోసం నోరువిప్పలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సాగిలపాటు వైఖరి విశాఖ, ఏపీ ప్రజలను పూర్తిగా నిరాశపరిచింది. -
స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం కక్ష సాధింపు.. ఉద్యోగుల ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఉద్యోగుల జీతాల విషయంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. ఈనెల 15వ తేదీ వచ్చినా కార్మికులకు ఇంకా జీతాలు అందలేదు. ఇక, గత రెండు నెలలుగా వారికి కేవలం సగం కన్నా తక్కువ జీతాలే ఇస్తున్నారు.విశాఖ ఉక్కు కార్మికులకు జీతాలు ఇంకా అందలేదు. డిసెంబర్ నెలకు సంబంధించిన 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ నెలలో 50 శాతం, సెప్టెంబర్ నెల జీతం 35 శాతం మాత్రమే యాజమాన్యం చెల్లించింది. ఇప్పటికే పెండింగ్ జీతాలపై యాజమాన్యం ఊసే ఎత్తకపోవడం గమనార్హం.ఈ సందర్బంగా ఉక్కు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఉక్కు కార్మికులు చెబుతున్నారు. యాజమాన్యం ధోరణికి వ్యతిరేకంగా.. జీతాల విషయమై ఈనెల 18న కుటుంబాలతో సహా ఆందోళన చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు కార్మికులు తెలిపారు. ఇక, కార్మికుల ప్రకటనపై కూటమి ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దీనిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ తమకు మద్దతుగా నిలవాలని వ్యాఖ్యలు చేశారు. -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
గాజువాక: విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని విజ్ఞప్తి చేశారు.సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాని మోదీ తన విశాఖ పర్యటనలో సానుకూల నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సాగుతున్న ఉద్యమానికి రాష్ట్ర అభివృద్ధితోపాటు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉక్కు కార్మికుల డెడ్‌లైన్
సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్ లైన్ విధించారు. తమకు చెల్లించాల్సిన జీతాలను వారం రోజుల్లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. జీతాలు ఇవ్వని పక్షంలో ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టేందుకు అర్హత లేదంటూ సీపీఎం నేత కామెంట్స్ చేశారు.విశాఖ ఉక్కు కార్మికుల జీతాల విషయంపై సీపీఎం నేత గంగారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. విశాఖ వచ్చే లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలి. లేదంటే విశాఖలో కాలుపెట్టే అర్హత లేదు.. అడుగడుగునా ముట్టడిస్తాం. ఉద్యోగుల జీతాల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలి.ఉక్కు కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే విశాఖ ఎంపీ ఏం చేస్తున్నారు?. యూనివర్సిటీని నడుపుకోడానికి నిన్ను ఎంపీని చేయలేదు. జీతాలకోసం యాజమాన్యంతో మాట్లాడాలి. ఎంపీ మాట కూడా యాజమాన్యం వినకపోతే ఉద్యమంలోకి రావాలి. ఆయనతో కలిసి మేమంతా ఉద్యమిస్తాం అని చెప్పుకొచ్చారు. -
గీత దాటితే చర్యలు తప్పవ్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు యాజమాన్యం వార్నింగ్
సాక్షి, విశాఖపట్నం : అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై గత నెల ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్‌లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పాటు దసరాకు బోనస్ ఇవ్వలేదని, దీపావళికి జీతం లేదంటూ కార్మికులు వాపోతున్నారు. ఇంత జరగుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమంపై ఉక్కుపాదం
-
విశాఖ ఉక్కులో డిప్యుటేషన్ల రగడ
ఉక్కు నగరం (విశాఖ): విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది. తమకు అవసరమున్న పోస్టులు, విధివిధానాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలు నగర్నార్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖ ద్వారా బయటకు పొక్కాయి. స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చేపడుతున్న అనేక పొదుపు చర్యల్లో భాగంగా 500 మంది అధికారులు, ఉద్యోగులను నగర్నార్ ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపాలని యాజమాన్యం నిర్ణయించింది. తద్వారా ప్లాంట్‌పై ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్యం ప్రకటించింది. దశలవారీగా డిప్యుటేషన్దశలవారీగా పంపనున్న జాబితాలో మొదటి విడతగా 100 మంది అధికారులను డిప్యుటేషన్‌పై పంపేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఉక్కు యాజమాన్యం నగర్నార్ ప్లాంట్ యాజమాన్యానికి ఈ నెల 11న లేఖ రాసింది. ఆ లేఖపై స్పందిస్తూ నగర్నార్ ప్లాంట్ యాజమాన్యం తమకు కావాల్సిన సిబ్బంది, విధివిధానాలపై విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి లేఖ రాసింది. అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరుతూ ఓ నమూనాను పంపింది. అధికారులకు కావాల్సిన విభాగాలు, గ్రేడ్లకు చెందిన సిబ్బంది వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 23 నుంచి 25 వరకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోనే ఇంటర్వ్యూలు చేయనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా డిప్యుటేషన్ అంశాన్ని మొదటి నుంచీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు నగర్నాగర్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఖలోని విధి విధానాల్లో క్లారిటీ లేదని, ఉద్యోగుల వ్యక్తిగత అంగీకారంతో డిప్యుటేషన్ అంటే.. జరిగే పని కాదని ఉక్కు అధికారుల సంఘం (సీ) నాయకులు వ్యాఖ్యానించారు.డిప్యుటేషన్ ప్రతిపాదనను విరమించుకోవాలిస్టీల్ప్లాంట్లో మొత్తం 20 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం 12,600 మంది మాత్రమే ఉన్నారు. ఇందులోంచి కూడా ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు డిప్యుటేషన్‌పై పంపిస్తామంటే మేం ఎలా అంగీకరిస్తాం. ఉన్న ఉద్యోగులను ఉపయోగించి పూర్తి ఉత్పత్తి సాధించాలి గానీ.. డిప్యుటేషన్‌కు పంపడమేంటి. దీనిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. యాజమాన్యం ఆ ప్రతిపాదనను విరమించుకోవాలి. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షుడు, స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ -
అణచివేతపై భగ్గుమన్న స్టీల్‌ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ఉద్యమంపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై కార్మిక లోకం భగ్గుమంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనకు కార్మికులు పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు చూస్తున్నాం. పోలీసులు అనుమతి తీసుకున్న తర్వాత ధర్నా చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఉద్యమకారులకు దువ్వాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నడు నోటీసులు ఇవ్వలేదన్న కార్మికులు.. ప్రభుత్వం మారితే రూల్స్ మారుతాయా అంటూ పోలీసులను కార్మికులను ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యమానికి పూర్తిగా సహకరించింది. స్టీల్ ప్లాంట్స్‌ను కాపాడుతామన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకోవాలన్నారు.రాస్తారోకోకు అనుమతి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన కార్మికులు.. అవసరమైతే అరెస్టు చేసుకోవాలన్నారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. పోలీసుల నోటీసులు లెక్కచేయకుండా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలు అరెస్ట్ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కార్మికుల రాస్తారోకోను పోలీసులు నిరీర్వర్యం చేశారు. కార్మికులను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున సీఐఎస్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు పవన్ కల్యాణ్ నిలబెట్టుకోలేదని కార్మికులు మండిపడుతున్నారు. 3 నెలలు సమయం ఇచ్చిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారి కృషి చేయలేదు. అమరావతిపై చూపిస్తున్న శ్రద్ధను స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చూపించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అదే సంకల్పం...ఆగని సమరం
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 500 రోజులు పూర్తి కానున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను శతశాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని గతేడాది జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఉక్కు కార్మిక వర్గం భగ్గుమంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించింది. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండు రోజలు ధర్నాలు చేపట్టారు. ముఖ్యంగా జాతీయ రహదారిని రెండు రోజుల పాటు దిగ్భందించారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం, గేట్ల ముట్టడి చేపట్టారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు మద్దతు ఇస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. దీక్షలు ప్రారంభించి 500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నేడు నగరానికి మహా ప్రదర్శన ఉద్యమం 500వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా ఆదివారం ఉదయం స్టీల్‌ప్లాంట్ నుంచి నగరానికి మహా ర్యాలీ నిర్వహించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ ఏర్పాట్లు చేసింది. 10వేల మంది ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, యువకులు, మాజీ ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గోనున్నారు. ఈ నెల 27న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. మహా ప్రదర్శన విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పరిరక్షణ పోరాట కమిటీ ప్లాంట్‌లో, ఉక్కునగరంలో, నిర్వాసిత కాలనీల్లో విస్తృత ప్రచారం చేసింది. మహా ప్రదర్శన రూట్‌మ్యాప్ ప్రదర్శన కార్యక్రమం ఆదివారం ఉదయం ఉక్కునగరం నుంచి దేశపాత్రునిపాలెం, శనివాడ, అగనంపూడి, కూర్మన్నపాలెం, వడ్లపూడి మీదుగా కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్దకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు బైక్‌లపై నగరంలో డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుని.. అక్కడ నుంచి కాలినడకన జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 2021 2న కేంద్ర నిర్ణయం బయటకు పొక్కింది. 3న వేలాది మంది కార్మికులు ఉక్కు పరిపాలన భవనాన్ని ముట్టడించారు 5న స్టీల్‌ప్లాంట్ ఆర్చి నుంచి నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. 7న ఉక్కు కార్మిక సంఘాలు, అధికార సంఘం, వివిధ అసోసియేషన్లతో పోరాట కమిటీ ఏర్పాటైంది. 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం 12న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన సీపీఐ నారాయణ, నాటి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 17న విశాఖ విమానాశ్రయంలో పోరాట కమిటీ నాయకులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం 18న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయపార్టీలతో భారీ బహిరంగ సభ 20న జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం దీక్షా స్థలి వరకు 25 కిలోమీటర్ల మేర ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతల పాదయాత్ర 26న జాతీయ రహదారిపై రాస్తారోకో 27, 28వ తేదీల్లో రెండు రోజుల పాటు జాతీయ రహదారి దిగ్భందం మార్చి 2021 9న ఉక్కు పరిపాలన భవనం ముట్టడి 14న కూర్మన్నపాలెం నుంచి గాజువాక వరకు పాదయాత్ర 15న ఢిల్లీలో వివిధ పార్టీల ఎంపీలకు వినతిపత్రాల సమర్పణ 20న వేలాది మందితో ఉక్కు త్రిష్ణా మైదానంలో కార్మిక గర్జన 26న రైతు చట్టాలు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై భారత్ బంద్ 31న నిర్వాసిత సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ఏప్రిల్ 2021 4న ఆర్.కె బీచ్‌లో నిరసన ప్రదర్శన 8న అగనంపూడి నుంచి బీహెచ్‌పీవీ వరకు 10 వేల మందితో 10 కిలో మీటర్ల మానవహారం 18న రైతాంగ పోరాట నాయకుడు రాకేష్ సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో రైతు, కార్మిక గర్జన మే 2021 22న దీక్ష శిబిరం వద్ద 100 జెండాలు, 100 మీటర్ల బ్యానర్‌తో వంద మంది దీక్ష 22న ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన జూన్ 2021 స్టీల్‌ప్లాంట్ కార్మిక నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జూలై 2021 8న ఉక్కు గేట్ల వద్ద ధర్నా 9న సీపీఐ కార్యదర్శి నారాయణ దీక్ష స్థలి సందర్శన 10న నగరంలోని మహాధర్నాకు బైక్ ర్యాలీ 15న కోక్‌ఓవెన్స్ నుంచి మెయిన్ గేటు వరకు పాదయాత్ర 27న చలో అడ్మిన్ కార్యక్రమం (చదవండి: ప్రజల చెంతకే పాలన... జగనన్నతోనే సాధ్యం) -
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులంతా సేఫ్‌జోన్‌లోనే ఉంటారు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులంతా సేఫ్‌జోన్‌లోనే ఉంటారని, ఎవరూ సంక్షేమం, భవిష్యత్ కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఉక్కు ప్రైవేటీకరణ వల్ల పరిశ్రమకు ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను గతంలో పోస్కో, తరువాత టాటా కొనుగోలు చేస్తుందని మీడియాలోనే కథనాలు వచ్చాయి తప్ప కేంద్ర ప్రభుత్వం ఏమీ చెప్పలేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ విక్రయానికి కేంద్రం టెండర్లు పిలవలేదన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీకి ఎంతగానో నష్టం కలిగిందన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతి జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో విధ్వంసకర, కక్ష పూరితమైన పాలన సాగుతోందన్నారు. ఏపీ అప్పులపాలై దీన, హీన స్థితిని ఎదుర్కొంటోందన్నారు. రూ.20 ఖరీదు చేసే మద్యాన్ని రూ.200కి అమ్ముతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్రీకృత అవినీతి వల్లనే ఇసుక ధరలు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్రంపై ప్రజల్లో దురభిప్రాయం కలిగేలా ఇక్కడ ప్రచారం చేస్తున్నారన్నారు. -
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం
సాక్షి, ఉక్కునగరం(గాజువాక): స్టీల్‌ప్లాంట్ స్పెషల్ బార్ మిల్(ఎస్బీఎం) విభాగంలో సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాకినాడకు చెందిన జి.రమణ(28) పెదగంట్యాడ మండలం దిబ్బపాలెంలో నివసిస్తున్నాడు. ఉదయం షిఫ్ట్‌లో ఎస్బీఎం విభాగంలోని స్టాకు యార్డులో ఎత్తులో ఉన్న రౌండు బండిల్స్‌పై కూర్చుని గ్యాస్ కటింగ్ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో ఆపై ఉన్న ఇనుప బండిళ్లు ఒక్కసారిగా ఊడి పడడంతో ఆయన కింద పడిపోయాడు. అంతే కాకుండా అతనిపై గుండ్రపు రాడ్లు ఒక్కసారిగా పడిపోయాయి. రాడ్లు మధ్య నలిగిపోయిన రమణను బయటకు తీసేందుకు సహ ఉద్యోగులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు హైడ్రాతో అతనిపై పడ్డ రాడ్లను తొలగించి ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. అనంతరం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. విభాగం అధికారి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కాంట్రాక్టు కార్మిక నాయకులు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన రమణ నాలుగు రోజుల క్రితమే విధుల్లో చేరినట్టు తెలిసింది. దీంతో తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బైక్ ఢీకొని స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి మృతి
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి ఒకరు చనిపోయారు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేసే వెంకటపతిరాజు విధుల నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా ఆటోనగర్ సిగ్నల్ పాయింట్ వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటపతిరాజు తలకు తీవ్ర గాయాలై... అక్కడికక్కడే మరణించాడు. మరో బైక్‌పై ఉన్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.