విశాఖ ఉక్కులో డిప్యుటేషన్ల రగడ | teel plant workers agitation in visakhapatnam: Andhra pradesh | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కులో డిప్యుటేషన్ల రగడ

Published Tue, Sep 17 2024 3:43 AM | Last Updated on Tue, Sep 17 2024 3:44 AM

teel plant workers agitation in visakhapatnam: Andhra pradesh

నగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌కు అధికారులు, ఉద్యోగుల డిప్యుటేషన్‌

మొదటి దశలో 100 మంది అధికారులు

23 నుంచి ఇంటర్వ్యూలు

వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు

ఉక్కు నగరం (విశాఖ): విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను ఛత్తీస్‌గఢ్‌లోని నగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది. తమకు అవసరమున్న పోస్టులు, విధివిధా­నాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలు నగర్‌నార్‌ ప్లాంట్‌ నుంచి వచ్చిన లేఖ ద్వారా బయటకు పొక్కాయి. స్టీల్‌ప్లాంట్‌ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చేపడుతున్న అనేక పొదుపు చర్యల్లో భాగంగా 500 మంది అధికారులు, ఉద్యోగులను నగర్‌నార్‌ ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపాలని యాజమాన్యం నిర్ణయించింది. తద్వారా ప్లాంట్‌పై ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్యం ప్రకటించింది. 

దశలవారీగా డిప్యుటేషన్‌
దశలవారీగా పంపనున్న జాబితాలో మొదటి విడతగా 100 మంది అధికారులను డిప్యుటేషన్‌పై పంపేందుకు యాజ­మాన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఉక్కు యాజమాన్యం నగర్‌నార్‌ ప్లాంట్‌ యాజమాన్యానికి ఈ నెల 11న లేఖ రాసింది. ఆ లేఖపై స్పందిస్తూ నగర్‌నార్‌ ప్లాంట్‌ యాజమాన్యం తమకు కావాల్సిన సిబ్బంది, విధివిధా­నాలపై విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యానికి లేఖ రాసింది. అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరుతూ ఓ నమూనాను పంపింది. అధికారులకు కావాల్సిన విభాగాలు, గ్రేడ్‌లకు చెందిన సిబ్బంది వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 23 నుంచి 25 వరకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోనే ఇంటర్వ్యూలు చేయనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా డిప్యుటేషన్‌ అంశాన్ని మొదటి నుంచీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు నగర్‌నాగర్‌ ప్లాంట్‌ నుంచి వచ్చిన లేఖను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఖలోని విధి విధానాల్లో క్లారిటీ లేదని, ఉద్యోగుల వ్యక్తిగత అంగీకారంతో డిప్యుటేషన్‌ అంటే.. జరిగే పని కాదని ఉక్కు అధికారుల సంఘం (సీ) నాయకులు వ్యాఖ్యానించారు.

డిప్యుటేషన్‌ ప్రతిపాదనను విరమించుకోవాలి
స్టీల్‌ప్లాంట్‌లో మొత్తం 20 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం 12,600 మంది మాత్రమే ఉన్నారు. ఇందులోంచి కూడా ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు డిప్యుటేషన్‌పై పంపిస్తామంటే మేం ఎలా అంగీకరిస్తాం. ఉన్న ఉద్యోగులను ఉపయోగించి పూర్తి ఉత్పత్తి సాధించాలి గానీ.. డిప్యుటేషన్‌కు పంపడమేంటి. దీనిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. యాజమాన్యం ఆ ప్రతిపాదనను విరమించుకోవాలి.  – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షుడు, స్టీల్‌ప్లాంట్‌ సీఐటీయూ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement