deputation
-
ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా కొన్ని డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు, సెలవులు, ఎస్ఆర్ ప్రారంభానికి.. ఇలా ప్రతి పనికీ రేటు కట్టి మరీ తమ రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వకుంటే నెలల తరబడి ఫైళ్లను తొక్కిపెడుతున్నారని వాపోతున్నారు. లంచాల వ్యవహారంపై విసిగిపోయిన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొందరు వైద్యులు ఏకంగా మెడికల్ ఆఫీసర్ల వాట్సప్ గ్రూప్‌లోనే అవినీతి తంతును బహిర్గతం చేసినట్టు తెలిసింది. ప్రసూతి సెలవుల ఆమోదానికి రూ. 3 వేలు, మాజీ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు రూ. 4 వేలు, ఎస్ఆర్ ప్రారంభించడానికి రూ. 5 వేలు ఇలా ప్రతి పనికీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఓ రేటు ఖరారు చేశారని ఆరోపించారు. ఇక ప్రొబేషన్ డిక్లరేషన్‌కు రూ. 15 వేలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు రూ. 2 వేల నుంచి రూ.15 వేలు ఇస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలడంలేదని, ఈ అవినీతి దందాకు అడ్డుకట్ట పడాలన్న మెసేజ్‌లు జిల్లా వైద్య శాఖలో కలకలంరేపాయి. దీంతో ఉలిక్కిపడ్డ జిల్లా స్థాయి అధికారి మెసేజ్‌లు పెట్టిన మెడికల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి తన కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామని బ్రతిమాలుకున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వసూళ్లకు పాల్పడుతున్న కొందరు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌లకు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఏవో, క్లర్కులు, కాంట్రాక్టు ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైద్య శాఖ ఉద్యోగి ఒకరు మెడికల్‌గా అన్‌ఫిట్ అవడంతో నిబంధనల ప్రకారం కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి ఫైల్‌ను కలెక్టర్‌కు పంపడానికి చిత్తూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో రూ.లక్షలు వసూలు చేశారు. ప్రైవేటుఆస్పత్రుల్లో బెడ్ల సామర్థ్యం ఆధారంగా రిజి్రస్టేషన్, రెన్యువల్‌కు బెడ్‌కు రూ. వెయ్యి చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. అనధికారికంగా డిప్యుటేషన్లు ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో అనధికార డిప్యుటేషన్ల్లోనూ డీఎంహెచ్‌వోలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ అధికారుల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అర్బన్ పీహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
విశాఖ ఉక్కులో డిప్యుటేషన్ల రగడ
ఉక్కు నగరం (విశాఖ): విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది. తమకు అవసరమున్న పోస్టులు, విధివిధానాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలు నగర్నార్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖ ద్వారా బయటకు పొక్కాయి. స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చేపడుతున్న అనేక పొదుపు చర్యల్లో భాగంగా 500 మంది అధికారులు, ఉద్యోగులను నగర్నార్ ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపాలని యాజమాన్యం నిర్ణయించింది. తద్వారా ప్లాంట్‌పై ఆర్థిక భారం తగ్గుతుందని యాజమాన్యం ప్రకటించింది. దశలవారీగా డిప్యుటేషన్దశలవారీగా పంపనున్న జాబితాలో మొదటి విడతగా 100 మంది అధికారులను డిప్యుటేషన్‌పై పంపేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఉక్కు యాజమాన్యం నగర్నార్ ప్లాంట్ యాజమాన్యానికి ఈ నెల 11న లేఖ రాసింది. ఆ లేఖపై స్పందిస్తూ నగర్నార్ ప్లాంట్ యాజమాన్యం తమకు కావాల్సిన సిబ్బంది, విధివిధానాలపై విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి లేఖ రాసింది. అధికారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరుతూ ఓ నమూనాను పంపింది. అధికారులకు కావాల్సిన విభాగాలు, గ్రేడ్లకు చెందిన సిబ్బంది వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 23 నుంచి 25 వరకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోనే ఇంటర్వ్యూలు చేయనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా డిప్యుటేషన్ అంశాన్ని మొదటి నుంచీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు నగర్నాగర్ ప్లాంట్ నుంచి వచ్చిన లేఖను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఖలోని విధి విధానాల్లో క్లారిటీ లేదని, ఉద్యోగుల వ్యక్తిగత అంగీకారంతో డిప్యుటేషన్ అంటే.. జరిగే పని కాదని ఉక్కు అధికారుల సంఘం (సీ) నాయకులు వ్యాఖ్యానించారు.డిప్యుటేషన్ ప్రతిపాదనను విరమించుకోవాలిస్టీల్ప్లాంట్లో మొత్తం 20 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ప్రస్తుతం 12,600 మంది మాత్రమే ఉన్నారు. ఇందులోంచి కూడా ఉద్యోగులను ఇతర ప్లాంట్లకు డిప్యుటేషన్‌పై పంపిస్తామంటే మేం ఎలా అంగీకరిస్తాం. ఉన్న ఉద్యోగులను ఉపయోగించి పూర్తి ఉత్పత్తి సాధించాలి గానీ.. డిప్యుటేషన్‌కు పంపడమేంటి. దీనిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. యాజమాన్యం ఆ ప్రతిపాదనను విరమించుకోవాలి. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షుడు, స్టీల్‌ప్లాంట్ సీఐటీయూ -
ఏపీ సర్కార్ నిర్ణయం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్–ఏ అధికారుల డిప్యుటేషన్ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత పొడిగింపునకు డీవోపీటీ అనుమతి కావాలి. దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించినట్టు గాని, క్రమశిక్షణ చర్యలపై చర్చించినట్టు గాని లేదు. నిజంగా అప్పీలెంట్ రికార్డులను తారుమారు చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారనే భయాలుంటే జూన్ 7నే సస్పెండ్ చేసి ఉండాలి. కానీ.. రెండు నెలల సమయం తీసుకుని ఆగస్టు 19న చేయడం సరికాదు. అలాగే నాలుగు రోజులైతే డిప్యుటేషన్ ముగుస్తుందనగా సస్పెండ్ చేయడం సమర్థనీయం కాదు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఆదేశాలను నిలుపుదల చేస్తున్నాం’ అని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.కేసు నేపథ్యమిదీఐఆర్ఏఎస్ అధికారి ఎం.మధుసూధన్‌రెడ్డి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లోకి 2019లో వచ్చారు. మూడేళ్లు (2022 ఆగస్టు వరకు) పనిచేసేందుకు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు డిప్యుటేషన్‌ను కేంద్రం మరో రెండేళ్లు (2024 ఆగస్టు వరకు) పొడిగించింది. ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా పనిచేస్తున్న మధుసూధన్‌రెడ్డి సేవలను ఉపసంహరించుకుంటూ.. జీఏడీలో రిపోర్టు చేయాలని జూన్ 7న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేసిన మధుసూదన్‌రెడ్డికి ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన డిప్యుటేషన్ ఈ నెల 22తో పూర్తవుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే అయన ఉండాలని, రిలీవ్ చేసుకోవద్దని 18న ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఒక్క రోజులోనే సస్పెన్షన్ ఉత్తర్వులుఆగస్టు 19న క్రమశిక్షణ చర్యల పేరిట సస్పెన్షన్ ఆదేశాలు చేసింది. ఏపీ ప్రభుత్వం తనకు సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌లోని క్యాట్‌లో ఎం.మధుసూధన్‌రెడ్డి అప్పీల్ దాఖలు చేశారు. ప్రభుత్వ చర్య తన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని, సస్పెన్షన్ ఆదేశాలను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ అప్పీల్‌పై లతా బస్వరాజ్ పాట్నే, శాలిని మిశ్రా ధర్మాసనం గురువారం విచారించింది. సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని మధుసూధన్‌రెడ్డి తరఫున కె.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. డిప్యుటేషన్ పూర్తయిన తర్వాత అధికారిని కొనసాగించడానికి వీల్లేదని మార్చిలో డీవోపీటీ మార్గదర్శకాలు తీసుకొచ్చిన విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. సస్పెన్షన్ నివేదిక ఇంతవరకు ఇవ్వలేదన్నారు. -
ఐపీఎస్‌లను వెంటనే డెప్యుటేషన్‌పై పంపండి
సాక్షి, అమరావతి: కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రత విభాగాల్లో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రాలు డెప్యుటేషన్‌పై ఐపీఎస్ అధికారులను పంపకపోవడంపై కేంద్ర హోం శాఖ అసహనం వ్యక్తం చేసింది. ‘ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై పంపండి. ఇప్పటికే ఓసారి చెప్పాం. అయినా పంపడంలేదు. ఇది సరైన పద్ధతి కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే కోటా మేరకు ఐపీఎస్ అధికారులను పంపించడి’ అని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శు (సీఎస్)లకు లేఖలు రాసింది. కేంద్ర హోం శాఖ ఈ విధంగా రాష్ట్రాలకు లేఖ రాయడం ఈ ఏడాది ఇది రెండోసారి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర భద్రతా విభాగాల్లో రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారులనే డెప్యుటేషన్‌పై నియమిస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి నిర్దేశించిన కోటా ప్రకారం ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై కొంతకాలం కేంద్ర సర్వీసులకు పంపాల్సి ఉంటుంది. డెప్యుటేషన్ ముగిసి తిరిగి రాష్ట్ర సర్వీసులో చేరిన అధికారుల స్థానంలో మరికొందరిని పంపాలి. కానీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోటా మేరకు ఐపీఎస్‌లను కేంద్ర సర్వీసులకు పంపడంలేదు. దీనిపై కొన్ని నెలల క్రితం కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. అయినా హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఐపీఎస్ అధికారులను పంపించలేదు. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. ఐపీఎస్ అధికారులను కేంద్రానికి పంపాలని ఇటీవల మరో లేఖ రాసింది.దాదాపు 250 పోస్టులు ఖాళీరాష్ట్రాల నుంచి ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై పంపించకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 3 నాటికి ఎస్పీ, ఆ పైస్థాయి అధికారుల పోస్టులు 250 వరకు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక డీజీ, అదనపు డీజీ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఎస్పీస్థాయిలో 129 పోస్టులు, డీఐజీ స్థాయిలో 81 పోస్టులు, ఐజీ స్థాయిలో 25 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.దర్యాప్తులో జాప్యం.. దేశ భద్రత విధుల్లో ఇబ్బందులుకేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో ఇంత భారీగా అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. సీబీఐ, ఎన్ఐఏలపై ఇప్పటికే పనిభారం విపరీతంగా పెరిగింది. కీలక కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది. బీఎస్ఎఫ్, ఐటీబీపీ విభాగాల్లో అధికారుల కొరతతో సరిహద్దుల్లో భద్రత విధుల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. సీఆర్పీఎఫ్లో అధికారుల కొరత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో తెలిపింది. విభాగాల వారీగా ఖాళీలు» కేంద్ర దర్యాప్తు సంస్థలో 63 డీఐజీ పోస్టుల్లో 30 పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ కావడంలేదు. రెండు ప్రత్యేక డైరెక్టర్ జనరల్, 8 అదనపు డైరెక్టర్ జనరల్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.» కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో 73 ఎస్పీ స్థాయి పోస్టులకుగాను 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి» ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో 36 ఎస్పీ స్థాయి పోస్టులలో 13 భర్తీ చేయాల్సి ఉంది.» కేంద్ర నిఘా విభాగం (ఐబీ)లో 83 ఎస్పీ పోస్టుల్లో 50 ఖాళీగా ఉన్నాయి.» భారత్–చైనా సరిహద్దుల్లో భద్రత విధులు నిర్వర్తించే ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగంలో 11 డీఐజీ పోస్టుల్లో 5 ఖాళీగా ఉన్నాయి. » సరిహద్దు భద్రతా విభాగం (బీఎస్ఎఫ్) లో ఒక అదనపు డీజీ పోస్టు, 26 డీఐజీ పోస్టుల్లో 10 పోస్టులు, 21 ఐజీ పోస్టులకుగాను ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.» కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు (సీఆర్పీఎఫ్)లో 7 డీఐజీ పోస్టులు, 5 ఐజీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. -
విద్యుత్‌శాఖలో వింత ఆచారం
సాక్షి, అమరావతి: విద్యుత్‌శాఖలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్నవారి విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఉద్యోగవర్గాల్లో సంచలనం సృష్టించింది. డిప్యుటేషన్‌పై వచ్చినవారు శాశ్వతంగా అక్కడే పనిచేసేలా జారీచేసిన ఈ ఉత్తర్వులు.. సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించాయి. ఒక ప్రభుత్వ విభాగంలో ఒక అధికారినిగానీ, సిబ్బందిగానీ వారి సొంత కారణాలతోనో, ఆ శాఖ అవసరానికో ఒకచోటు నుంచి మరోచోటుకి, ఒక శాఖ నుంచి మరో శాఖకు డిప్యుటేషన్‌పై పంపడం సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి కాలాన్ని కూడా చాలా తక్కువగా నిర్ణయిస్తారు. అంటే మూడునెలల నుంచి ఏడాది పాటు తాత్కాలిక విధుల్లో కొనసాగేలా ఆ ఆదేశాలు ఇస్తుంటారు.అయితే ఒకసారి ఒక చోటుకిగానీ, ఒక శాఖకుగానీ వెళ్లిన వారిలో కొందరు అక్కడి నుంచి తిరిగిరావడానికి ఇష్టపడరు. మరికొందరు ఎప్పుడు వెనక్కి వచ్చేద్దామా అని చూస్తుంటారు. వారికిచ్చిన గడువు ప్రకారం డిప్యుటేషన్‌ను పొడిగించడం, రద్దుచేయడం వంటివి ఉన్నతాధికారులు చేస్తుంటారు. ఇదీ సాధారణంగా జరిగేది. రాష్ట్రంలో 11 జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త ఆచారం పుట్టుకొచ్చి0ది. ఇచ్చిపడేశారంతే.. ఏపీఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం (కార్పొరేట్ ఆఫీస్) విశాఖపట్నంలో ఉంది. అక్కడ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ హోదాల్లో 35 మంది ఉద్యోగులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. వీరిలో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న వారు ఉన్నారు. 2015 నుంచి 2023 వరకు ఏటా కొంతమంది చొప్పున వీరంతా వచ్చారు. ఏటా వీరి విజ్ఞప్తిని, సంస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిప్యుటేషన్లు పొడిగిస్తున్నారు. కానీ సడన్‌గా ఏమైందో ఏమోగానీ.. ఇకపై వీరు ఎన్నాళ్లయినా కార్పొరేట్ ఆఫీసులోనే ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ 35 మందికి ఇకపై ఏటేటా డిప్యుటేషన్ పొడించాలా, రద్దుచేయాలా అనే చర్చే రాకుండా చేసేశారు. ఇకపై వీరంతా పర్మినెంట్‌గా కార్పొరేట్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తించేలా సంస్థ ఫైనాన్స్, హెచ్ఆర్డీ విభాగం డైరెక్టర్ డి.చంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. దీంతో జిల్లాల నుంచి ఎవరైనా ఉద్యోగి విశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లాలంటే ఇప్పుడున్నవారు ఉద్యోగ విరమణ చేస్తేగానీ కుదరదు. ఇలాంటి ముఖ్యమైన విధాన నిర్ణయాలు సీఎండీ స్థాయిలోనే తీసుకుంటారు. అలా కాకుండా డైరెక్టర్ స్థాయి అధికారి ఉత్తర్వులు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక ఏవో బలమైన కారణాలున్నాయనే చర్చ విద్యుత్ ఉద్యోగుల మధ్య జరుగుతోంది. ఏటా ఎందుకని.. డిప్యుటేషన్లపై ఏటా ఫైలు నడపడం పెద్ద ప్రాసెస్‌గా ఉంటోంది. అలాంటిదేం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. అయినప్పటికీ ఈ డిప్యుటేషన్లను ఎప్పుడైనా రద్దుచేసే అధికారం సంస్థకు ఉంది. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
టీచర్లు సిటీకి.. చదువులు గాలికి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిరోజులుగా కొత్త టీచర్లు కొలువుదీరుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలేమీ లేకున్నా.. కొత్త నియామకాలేవీ జరగకున్నా.. కొత్త టీచర్లు వస్తుండటంపై తోటి టీచర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త టీచర్లంతా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పనిచేయాల్సిన వారు. కానీ డిçప్యుటేషన్లపై పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చి తిష్టవేస్తున్నారు. తమకు పోస్టింగ్ ఇచ్చిన గ్రామీణ పాఠశాలలో పనిచేయడం ఇష్టం లేకనో, మరేదైనా కారణాలతోనో.. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు), పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని అధికారులు, రాజకీయ నేతల సహకారంతో ఇలా పట్టణ ప్రాంత బడుల్లోకి మారుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో వంద మందికిపైగా టీచర్లు ఇలా డిçప్యుటేషన్లపై ఇతర చోట్లకు వెళ్లినట్టు అంచనా. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో సతమతం అవుతున్న గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధనకు మరింతగా ఇబ్బంది ఎదురవుతోంది. రూ.3 లక్షల దాకా ముట్టజెప్పి.. కోరిన చోటికి డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు కొందరు టీచర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు విద్యాశాఖ అధికారులను ఆశ్రయించి డిప్యుటేషన్ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో టీచర్ రూ.3 లక్షల వరకు ముట్టజెప్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డీఈఓలు అందినకాడికి వసూలు చేసి, ఇలా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోపల, శివార్లలోని దగ్గరి ప్రాంతాల స్కూళ్లకు వెళ్లేందుకు అంతకంటే ఎక్కువే చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 2న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ను ఏకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ జెడ్పీ హైసూ్కల్‌కు డిప్యూటేషన్‌పై పంపుతూ యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి అంతర్ జిల్లా డిప్యూటేషన్ ఇచ్చే అధికారం డీఈఓలకు ఉండదు. అయినా ఇలాంటి ఆదేశాలు రావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా డిప్యూటేషన్లు ఇవ్వలేదని, పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్తుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని డిప్యూటేషన్లు ఇలా.. ► రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ జెడ్పీ హైసూ్కల్ నుంచి ఓ ఉపాధ్యాయుడు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడ జెడ్పీహెచ్‌ఎస్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ► మాడ్గుల మండలం అవురుపల్లి జెడ్పీహెచ్ఎస్లో పనిచేయాల్సిన ఓ టీచర్.. చంపాపేట్ జెడ్పీహెచ్ఎస్లో డిప్యూటేషన్‌పైన విధులు నిర్వహిస్తున్నారు. ► మాడ్గుల మండలం పుట్టగడ్డతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇదే మండలం అన్నబోయినపల్లి పాఠశాలకు చెందిన టీచర్.. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ► ఇలా మాడ్గుల మండలానికి చెందిన సుమారు ఇరవై మంది టీచర్లు డిప్యూటేషన్లపైన ఇతర మండలాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. ► షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాదాపు 60 మంది టీచర్లు.. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 12 పాఠశాలల్లో టీచర్లెవరూ లేరని సమాచారం. మానవతా దృక్పథంతో చేస్తున్నాం.. పక్షవాతం, కేన్సర్ తదితర వ్యాధుల బాధితులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల జీవిత భాగస్వాములు వంటి వారి డిప్యూటేషన్లను అనుమతిస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నా దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆమోదించి పోస్టింగ్‌లు ఇస్తున్నాం. విద్యాశాఖ కమిషనర్ నుంచి వస్తున్న ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక్క డిప్యూటేషన్ కూడా ఇవ్వలేదు డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించి నేను ఎక్కడా సంతకాలు చేయలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. గత మూడున్నరేళ్లలో నేను ఒక్క ఆర్డర్‌పై కూడా సంతకం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తా. – దేవసేన, విద్యాశాఖ కమిషనర్ -
విదేశాల నుంచి ఉద్యోగులు.. కంపెనీలకు జీఎస్టీ నోటీసులు
దేశంలోని అనేక కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు రావడం గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే కంపెనీలకు ఎందుకిలా వరుసపెట్టి జీఎస్టీ నోటీసులు వస్తున్నాయని పరిశీలిస్తే అసలు కారణం తెలిసింది. భారత్‌కు చెందిన చాలా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు విదేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే విదేశీ సంస్థలు, వాటి అనుబంధ కంపెనీలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలు ఆయా దేశాల్లో ఉద్యోగులను అక్కడి చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నియమించుకుంటాయి. అయితే బయటి దేశాల్లో నియమించుకున్న ఉద్యోగులను భారత్‌కు డిప్యూటేషన్‌పై తెచ్చుకున్న కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి. బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన జీతాన్ని తమ విదేశీ సంస్థకు ఇక్కడి కంపెనీలు తిరిగి చెల్లిస్తుంటాయి. ఇలా బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినవారిని సెకెండెడ్ ఎంప్లాయీస్ అంటారు. విదేశీ సంస్థకు రియింబర్స్ చేసే వీరి జీతాలపై సర్వీస్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈమేరకు నార్తర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కేసులో భాగంగా 2022 మేలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరిస్తూ ఆయా కంపెనీలకు జీఎస్టీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై కంపెనీల్లోని ట్యాక్స్ నిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. "2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసుల మదింపు పరిమితి కాలం సెప్టెంబర్‌తో ముగిసిన నేపథ్యంలో కంపెనీలకు వరుపెట్టి నోటీసులు వచ్చాయి. ఇటువంటి నోటీసులు అందుకున్న కంపెనీలు వాస్తవాలను పరిశీలించుకుని ముందుకు వెళ్లాల్సిఉంటుంది" అని కేపీఎంజీ-ఇండియా, భాగస్వామి, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ అన్నారు. -
Telangana-IPS Officers: పోస్టింగ్ లేదు.. వెళ్లిపోదాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్‌శాఖలో పోస్టింగ్ లేకుండా నెలలకొద్దీ అటాచ్మెంట్ల మీద పనిచేస్తున్న ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడింది. దీంతో బయటకు చెప్పలేక, పోస్టింగ్ కోసం తిరగలేక కొంతమంది కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏడాది నుంచి వెయిటింగ్లో ఉన్న ఓ సీనియర్ ఐపీఎస్‌తోపాటు డీఐజీ పదోన్నతికి సిద్ధంగా ఉన్న మరో అధికారి, ఇద్దరు సీనియర్ ఎస్పీ ర్యాంకు అధికారులు కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు జీఏడీకి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కేంద్ర సర్వీసుల్లోని 17 విభాగాల్లో ఎక్కడో ఒకచోట అవకాశం రాకపోతుందా అని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్ లేకపోయినా కనీసం కేంద్ర సర్వీసులో అయినా మూడేళ్లు, అవకాశం ఉంటే మరో రెండేళ్లు అక్కడే పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు... కేంద్ర సర్వీసుల్లో పనిచేసి వచ్చిన రాష్ట్ర కేడర్ అధికారులు, ఇంటర్ కేడర్ డిప్యుటేషన్, కేడర్ మార్చుకొని వచ్చిన అధికారులు పోస్టింగ్ లేక ఏడాదిగా ఖాళీగా ఉన్నారు. అయితే కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ పూర్తి చేసుకున్నవారు మళ్లీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలంటే ఏడాదిపాటు కూలింగ్ పీరియడ్‌గా సొంత కేడర్ స్టేట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే డిప్యుటేషన్ పూర్తిచేసుకొని వచ్చినవారికి ఏడాదిపాటు వెయిటింగ్లో ఉండటం నిరాశను కలిగించినట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడ చేసేదేమీలేక మళ్లీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కేడర్ మార్చుకొని తెలంగాణకు వచ్చిన అధికారులు సైతం ఇదే పద్ధతిలో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోవాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. భారీగానే ఖాళీలు కేంద్ర సర్వీసుల్లోని 17 విభాగాల్లో డిప్యుటేషన్‌కు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జూలై చివరి వరకు ఉన్న వేకెన్సీ పరిస్థితిని పరిశీలిస్తే భారీగానే ఖాళీలున్నట్టు కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. డైరెక్టర్ జనరల్(డీజీ) ర్యాంకులో రెండు పోస్టులు, స్పెషల్ డైరెక్టర్ జనరల్ ర్యాంకులో రెండు పోస్టులు, ఐజీ ర్యాంకులో 25 పోస్టులు, డీఐజీ హోదాలో 102 పోస్టులు, ఎస్పీ ర్యాంకులో 116 పోస్టులు కేంద్ర పోలీస్ సంస్థలు, కేంద్ర పారామిలిటరీ బలగాల్లో ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పోస్టింగ్ లేని అధికారులు కేంద్రంలోకి వెళ్లేందుకే సానుకూలంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. -
డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. నచ్చినవారికి ఎక్కడంటే అక్కడే! ఫిర్యాదుకు రెడీ?
సాక్షి, హైదరాబాద్: ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో డిప్యుటేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలే ఫైనల్. ఉద్యోగులు ఇదేమని ప్రశ్నిస్తే దశాబ్దాల క్రితం వచ్చిన ఆకాశ రామన్నల ఫిర్యాదులను మళ్లీ తెరమీదకు తెస్తామంటూ హెచ్చరిస్తుంటారు. డిప్యుటేషన్ల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్ని ఆధారాలతో ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అందులో డిప్యుటేషన్లకు సంబంధించి వికలాంగులు, మహిళలు, తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనలున్నా అవేవి పట్టించుకోకుండా అస్మదీయులకు మాత్రమే కోరుకున్నచోట డిప్యుటేషన్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాను అంగవైకల్యంతో బాధపడుతున్నానని, ఒకరోజు విధులకు వెళ్లి వస్తే మూడురోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని, దూరభారంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే డిప్యుటేషన్ ఇవ్వాలని వేడుకున్నా కనికరించలేదు. ఎలాంటి ఇబ్బందిలేని ఓ అధికారికి మాత్రం వైరా నుంచి ఖమ్మం జిల్లాకేంద్రానికి డిప్యుటేషన్ ఇచ్చారు. కుటుంబసభ్యుల అనారోగ్యం కారణంగా మంచిర్యాల నుంచి క్లియర్ వేకెన్సీ ఉన్న వైరాకు డిప్యుటేష¯న్ ఇవ్వాలని కోరితే కనీస స్పందన లేదని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో పనిచేస్తున్న మరో అవివాహిత ఉద్యోగి క్లియర్ వేకెన్సీ ఉన్న సంగారెడ్డికి డిప్యుటేషన్‌పై పంపాలని చాలాకాలంగా వేడుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. మానవతాదృక్పథంతో డిప్యుటేషన్లు పరిశీలించి చర్య తీసుకోవాలని ఆర్థికమంత్రి పేషీ సిఫారసు చేసినా డైరెక్టరేట్‌లో మాత్రం బుట్టదాఖలవుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. (చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..) సిమ్‌కార్డుల పితలాటకం తరచూ సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ను మారుస్తుండటం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. తాజాగా మరో కంపెనీకి సెల్ నెట్‌వర్క్‌ను మార్చటంతో గ్రామీణప్రాంతాలు, కార్యాలయ ఆవరణల్లోనూ సిగ్నల్స్ రాకపోవటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం కార్యాలయాలకు రాగానే విధుల్లో లాగిన్ కావాలంటే వారి సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీయే ఆధారం. కానీ, ఓటీపీ వచ్చేందుకు గంటల సమయం పడుతుండటంతో ఒక్కపూట మొత్తం అవస్థలు పడుతున్నామని, సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సీనియర్ ఐఏఎస్ అండ ఉందన్న ధీమాతో నిబంధనలన్నీ బేఖాతర్ చేస్తున్న ఉన్నతాధికారుల తీరుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఆపై ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించాలని ఉద్యోగులు, సంఘాలనేతలు భావిస్తున్నారు. రూ.23.8 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను స్వాధీనం చేసుకోకపోవటం, కొత్త కంప్యూటర్ల మొరాయింపు అంశంపైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. (చదవండి: పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్) -
అంతా ఆ తాను ముక్కలే!
సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన.. డిప్యుటేషన్లపై జీహెచ్ఎంసీకి వచ్చి,దాదాపుగా మెడలు పట్టి గెంటినంత పరిస్థితి వచ్చేంత దాకా సహాయ వైద్యాధికారులు (ఏఎంఓహెచ్‌లు) మాతృసంస్థలకు వెళ్లకపోవడంలో పలువురు అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడమేనని తెలుస్తోంది. డిప్యుటేషన్లకు సంబంధించి అవగాహన ఉన్నవారు తెలిపిన వివరాల మేరకు, డిప్యుటేషన్ ముగిసినా వెళ్లకపోవడంలో ప్రధాన పాత్రధారులు ఏఎంఓహెచ్‌లే కాగా.. వారు కొనసాగేందుకు పరోక్షంగా సహకరించిన సంబంధిత అధికారులు సైతం బాధ్యులేనని తెలుస్తోంది. ► జీహెచ్ఎంసీకి వేరే ప్రభుత్వ విభాగం నుంచి డిప్యుటేషన్ మీద పనిచేసేందుకు రావడానికి సంబంధిత అధికారి విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు అంగీకరించాలి. అందుకనుగుణంగా అధికారి మాతృసంస్థ ఉన్నతాధికారులు డిప్యుటేషన్‌పై పంపేందుకు అంగీకరిస్తారు. ఆ మేరకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ► తొలుత ఏడాది కాలానికని వచ్చేవీరు విజ్ఞప్తి చేసుకుంటే.. వీరి పనితీరు నచ్చితే మరో ఏడు పొడిగించేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అంగీకరిస్తారు.అలా ప్రతియేటా పొడిగింపుతో మూడేళ్ల వరకు కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత సైతం కొనసాగాలనుకుంటే.. జీహెచ్ఎంసీ అంగీకరించడంతోపాటు సంబంధిత అధికారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలి. ఆమోదిస్తే ఐదేళ్ల వరకు కొనసాగవచ్చు. ఆ తర్వాత ఉండేందుకు వీల్లేదు. ► ఇలా.. ఒక్కో ఏడాది ముగియగానే నిబంధనలకనుగుణంగా పొడిగింపు లేని పక్షంలో జీహెచ్ఎంసీలోని వారి పైఅధికారి, పరిపాలన విభాగం, వారికి వేతనాలు చెల్లించే విభాగం, అకౌంట్స్ విభాగం గాని గడువు ముగియడానికి ముందస్తుగానే ఆ విషయాన్ని తెలియజేయాలి. నిబంధనలు పాటించనిపక్షంలో వేతనం చెల్లించకుండా తగు చర్యలు తీసుకోవాలి. లేదా మాతృసంస్థకు సరెండర్ చేయాలి. కానీ.. జీహెచ్ఎంసీలో దాదాపు గత అయిదేళ్లుగా ఈ పద్ధతిని పాటించిన దాఖలాల్లేవు. ప్రశ్నించిన సీఎస్? ► ఎప్పుడైతే విస్తృతాధికారాలను జోన్లకు అప్పగించారో, ప్రధాన కార్యాలయం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. సంబంధిత అధికారులకు ఈ విషయాల గురించి తగిన అవగాహన లేదో, లేక మనకెందుకులే అని మిన్నకున్నారో, లేక ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయో తెలియదు గాని అయిదేళ్లు దాటాక కొనసాగుతున్న వారు సైతం ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఉండేవారో తెలియదు గాని.. వారిలో కొందరి అవినీతి పెచ్చరిల్లి బట్టబయలు కావడం... ఒకరిపై ఏకంగా పోలీసు కేసు సైతం నమోదైన నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వారిని డిప్యుటేషన్ గడువు ముగిసినా ఎందుకు కొనసాగిస్తున్నారని సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
Alapan Bandyopadhyay: ఆలాపన్ ఢిల్లీకి వెళ్లనట్లే!
కోల్‌కతా/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరు కాని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయను ఢిల్లీకి రావాలని ఆదేశిస్తూ(రీకాల్) కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అమలవ్వడం సాధ్యం కాకపోవచ్చని మాజీ ఐఏఎస్ అధికారులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఆలాపన్ బందోపాధ్యాయ సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. సివిల్ సర్వీసు అధికారులను రీకాల్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలని నిపుణులు చెబుతున్నారు. ఆలాపన్ విషయంలో బెంగాల్ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు రిలీవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడం లేదన్న కారణంతో సెంట్రల్ డిప్యూటేషన్‌కు నిరాకరిస్తే ఆయనపై పరిపాలనాపరమైన చర్యలు తప్పకపోవచ్చని ఢిల్లీలోని అధికార వర్గాలు చెబుతున్నాయి. అడకత్తెరలో... బెంగాల్లో తుపాను నష్టంపై శుక్రవారం మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆలాపన్ బందోపాధ్యాయ హాజరు కాకపోవడాన్ని కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. సోమవారం ఢిల్లీలో సిబ్బంది వ్యవహారాల శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మమత కోరిక మేరకు కొద్దిరోజుల కిందటే ఆలాపన్ బందోపాధ్యాయ పదవీ కాలన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించడం గమనార్హం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయన సేవలు అవసరమని మమత భావిస్తున్నారు. ఆలిండియా సర్వీసు రూల్స్ (ఏఐఎస్)ను గుర్తుచేస్తూ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి ఒక మర్యాదపూర్వకమైన లేఖ రాస్తే మంచిదని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి జవహర్ సర్కార్ సూచించారు. ఆలిండియా సర్వీసు రూల్స్‌లోని 6(1) నిబంధన ప్రకారం.. అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రానికి లేదా ఏదేని ప్రభుత్వరంగ సంస్థకు డిప్యూటేషన్‌పై పంపించాలంటే సదరు అధికారి అప్పటిదాకా పని చేస్తున్న రాష్ట్రంలోని ప్రభుత్వం అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఆలాపన్ బందోపాధ్యాయను డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపడానికి బెంగాల్ ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆలాపన్ బందోపాధ్యాయ ఈ సంకటం నుంచి తప్పించుకోవాలంటే పదవీకాలం పొడిగింపును వదులుకొని ఈ నెల 31న పదవీ విరమణ చేస్తే మంచిదని మాజీలు సలహా ఇస్తున్నారు. ఆయన సేవలు అవసరమంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సలహదారుడిగా నియమించుకోవాలని మమతకు సూచిస్తున్నారు. సమ్మతించని బెంగాల్ సర్కారు ఆలాపన్ బందోపాధ్యాయను డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపడానికి బెంగాల్ సర్కారు ఇంకా సమ్మతించలేదు. దీంతో ఆయన సోమవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు రిపోర్టు చేసే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు. ఆలాపన్ ఆదివారం కూడా బెంగాల్ సచివాలయంలో విధులకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఆయన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సచివాలయంలో నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. -
ముగ్గురు ఐపీఎస్‌లపై కేంద్రం బదిలీ వేటు
న్యూఢిలీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఇరు పక్షాల మధ్య మరింత అగ్గి రాజేసింది. తమ విధుల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ బెంగాల్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌పై రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఏకపక్షంగా సమన్లు జారీ చేసింది. ఐపీఎస్ అధికారులైన భోలనాథ్ పాండే (డైమండ్ హార్బర్ ఎస్పీ), ప్రవీణ్ త్రిపాఠి (డీఐజీ, ప్రెసిడెన్సీ రేంజ్), రాజీవ్ మిశ్రా (ఏడీజీ, సౌత్ బెంగాల్) నడ్డా బెంగాల్ పర్యటనకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తమ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించనందుకు వారిని కేంద్రానికి డిప్యుటేషన్ రావాల్సిందిగా హోంశాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా పోలీసు అధికారుల్ని కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌కి రమ్మంటే ముందస్తుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ కేంద్రం ఏకపక్షంగా ఈ సమన్లు జారీ చేసింది. శాంతి భద్రతలు రాష్ట్ర అంశం: మమతా సర్కార్ ఎదురు దాడి నడ్డా పర్యటనలో భద్రతా వైఫల్యాలపై చర్చించడానికి పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేయడంపై మమతా సర్కార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశమని, కేంద్రం అందులో తలదూర్చాల్సిన అవసరం లేదంటూ ఎదురు దాడికి దిగింది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకి లేఖ రాశారు. నిబంధనలేమంటున్నాయి? కేంద్ర డిప్యుటేషన్‌కు రమ్మని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఐపీఎస్ అధికారులు తప్పక పాటించాలని, వేరే ఆప్షన్ ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. అలాంటి ఉత్తర్వులు పొందిన ఐపీఎస్ ఆఫీసర్లను సదరు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రిలీవ్ చేయాల్సిఉంటుంది. ఐపీఎస్ రూల్స్– 1954 ప్రకారం ఐపీఎస్‌ల విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య విభేదాలు వస్తే, రాష్ట్రాలు కేంద్ర ఆదేశాన్ని అనుసరించక తప్పదు. సమాధానం ఇవ్వకపోతే: మరోవైపు పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 267 ఫిర్యాదుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తప్పు పట్టింది. మరో 15 రోజుల్లో మమతా సర్కార్ ఏమీ మాట్లాడకపోతే ఆ ఫిర్యాదుల్ని కేంద్ర హోంశాఖకు పంపిస్తామని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖ శర్మ హెచ్చరించారు. -
తంగళ్లపల్లి ఎస్సైపై వేటు
సాక్షి, సిరిసిల్ల : తంగళపల్లి ఎస్సై వొల్లొజుల శేఖర్‌పై గురువారం వేటు పడింది. ఆయనను జిల్లా ఎస్పీ జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో జరుగుతున్న ఇసుక మామూళ్లతోపాటు వాటాల పంపకంపై వచ్చిన ఆరోపణలతో పోలీసు నిఘా వర్గాలు నివేదిక అందించినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇసుక అక్రమ రవాణాతోపాటు మామూళ్ల వసూళ్లపై జిల్లాలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. సిరిసిల్ల మానేరు నుంచి ఇసుక తరలింపు వాహనాల నుంచి పైసల వసూల్ తీరును బహిర్గతం చేస్తూ ’దసరా హు‘సార్’ శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై నిఘా వర్గాలు సమగ్ర నివేదికను తయారు చేసేందుకు ఆరా తీస్తున్నట్లు మరో కథనం ఈ నెల 6న ప్రచురితమైన విషయం విదితమే. ఈ క్రమంలోనే తంగళ్లపల్లి ఎస్సైగా పని చేస్తున్న శేఖర్‌పై పోలీసు అధికారులు వేటు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సై శేఖర్‌ను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. బుధవారం నలుగురు సీఐలు ఒకేసారి బదిలీ కావడంతో అసలేం జరుగుతోంది. అన్న ఆందోళనలో ఉన్న పోలీస్ అధికారులకు మరో ఎస్సైని బదిలీ చేశారంటూ ఉత్తర్వులు అందడంతో అందరిలో అంతర్మథనం ప్రారంభమైంది. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసిన దాదాపు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇసుక అక్రమ రవాణా వివాదాలతోనే వేటును ఎదుర్కొన్నట్లు చర్చ జరుగుతోంది. మానేరు వాగు నుంచి జరుగుతున్న ఇసుక దందాలో మామూళ్ల వాటాలు, కేసులు నమోదు జాప్యాన్ని ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో అధికారులు ఆ వైపుగా దర్యాప్తు చేసి క్రమశిక్షణ చర్యలకు వెళ్లినట్లు తెలుస్తోంది. -
ఉపాధ్యాయులకు దేహశుద్ధి?
సాక్షి, పశ్చిమగోదావరి : చింతలపూడి మండలం ఉర్లగూడెం గ్రామంలో ఇద్దరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారన్న వదంతులు వ్యాపించడంతో శుక్రవారం గ్రామంలో కలకలం రేగింది. అయితే తమ గ్రామంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ జి.రామారావును వివరణ కోరగా గురువారం పాఠశాల వద్ద ఘర్షణ జరుగుతుందని తెలుసుకుని వెళ్లి విచారణ జరిపానని చెప్పారు. తన విచారణలో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొట్టుకున్నారని వారిలో ఒక విద్యార్థినికి గాయాలవ్వడంతో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై అడగడానికి వచ్చామని గ్రామస్తులు చెప్పినట్లు తెలిపారు. ఉమామహేశ్వరరావు, రాజశేఖర్ అనే ఉపాధ్యాయులను వేర్వేరు పాఠశాలలకు మార్చమని గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. శుక్రవారం ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు సెలవు పెట్టడంతో డెప్యుటేషన్‌పై మరో ఉపాధ్యాయినిని నియమించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులపై చాలాకాలంగా గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. గురువారం జరిగిన సంఘటనలో కూడా పాఠశాలలో అసాంఘిక చర్యలకు పాల్పడటంతోనే ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు మధ్య వివాదం చెలరేగి ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి జరిమానా కూడా విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవిని వివరణ కోరగా శనివారం పాఠశాలకు వెళ్లి విచారణ జరుపుతానని తెలిపారు. విచారణలో ఉపాధ్యాయులపై ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రెవెన్యూ ఉక్కిరిబిక్కిరి
కర్నూలు(అగ్రికల్చర్) : 1985లో మండల వ్యవస్థ ఏర్పాటైంది. అప్పట్లో జిల్లా జనాభా 22 లక్షలు. అందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖకు సంబంధించి మండల రెవెన్యూ అధికారి కార్యాలయాలకు పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుత జనాభా దాదాపు 45 లక్షలు. పదేళ్లకోసారి రెవెన్యూ శాఖను పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో 33ఏళ్ల క్రితం ఉన్న పోస్టులతోనే పని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది పై పనిభారం అధికమవుతోంది. ఒక్కోసారి రాత్రి పొద్దుపోయే వరకు పనిచేయడంతో పాటు సెలవు రోజుల్లోనూ పనిచేయాల్సి వస్తోంది. లేకపోతే మెమోలు అందుకోవాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి జనాభా ప్రకారం.. మండలాలకు 1985లో జనాభా ప్రాతిపదికన ఎమ్మార్వో, సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంటు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు మంజూరు చేశారు. నియోజకవర్గ కేంద్రాల మండలాలకు ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టు, ఒక ఎన్నికల డీటీ పోస్టును అదనంగా కేటాయించారు. చుక్కల భూముల క్రమబద్ధీకరణకు సిబ్బంది కొరత.. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు మూడు తహసీల్దారు, మూడు డీటీ పోస్టులు, ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు మంజూరు చేసింది. 2017లో చుక్కల భూముల క్రమబద్ధీ్దకరణకు ప్రత్యేక చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం పోస్టులను మాత్రం కేటాయించలేదు. డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమించుకోవాలని మాత్రమే సూచించింది. ఇప్పటికే పని ఒత్తిడి, సిబ్బంది కొరతతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టంతో ఊపిరితిప్పుకోలేకపోతున్నారు. మండలస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సిబ్బంది కరువయ్యారు. వీటికి సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకొని దరఖాస్తుల పరిశీలనకు చర్యలు తీసుకున్నారు. ఉన్న పోస్టుల్లోనూ ఖాళీలు.. 1985లో మంజూరు చేసిన పోస్టులయిన భర్తీగా ఉన్నాయా అంటే అదీ లేదు. గ్రామ రెవెన్యూ అధికారి, జూనియర్ అసిస్టెంట్ మొదలుకొని సీనియర్ అసిస్టెంట్లు, డీటీలు, తహసీల్దారు కేడర్ వరకు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీఆర్వో పోస్టులు 792 ఉండగా 150 వరకు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంటు పోస్టులు 216 ఉండగా 35 పోస్టులు, సీనియర్ అసిస్టెంటు పోస్టులు 198 ఉండగా 25 పోస్టులు, తహసీల్దారు పోస్టులు 72 ఉండగా 6 పోస్టులు, డీటీ పోస్టులు 123 ఉండగా 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతంత మాత్రం ఉన్న సిబ్బందిని కూడా వివిధ అవసరాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తుండటం వల్ల ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. రెవెన్యూ సిబ్బందిపై పని ఒత్తిడి.. 1985లో మండలాల్లో సగటున వందల్లోనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం వేలాది మంది విద్యార్థులకు ఇవ్వాల్సి వస్తోంది. ఎన్నికల విధులు, భూముల వ్యవహారాలు, విద్యార్థులు, రైతులు, ఇతర వర్గాలకు అవసరమైన ధ్రువపత్రాల జారీ, ప్రొటోకాల్ విధులు, ప్రజా పంపిణీ, లాం అండ్ ఆర్డర్, విపత్తుల నిర్వహణ, పంటల నమోదు, భూముల సర్వే, మైనింగ్ వ్యవహారాలు, ఇతర శాఖల వ్యవహారాలు తదితర విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా చుక్కల భూముల క్రమబద్ధీక రణ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందిని పెంచాలి జనాభా ప్రాతిపదికన తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు పోస్టులను పెంచాలి. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఉన్న వారిని ఇతర అవసరాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నారు. దీంతో సిబ్బందిపై పని భారం అధికమవుతోంది. అన్ని కేటగిరి పోస్టులను పెంచడంతో పాటు, చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టం అమలుకు ప్రత్యేక పోస్టులు మంజూరు చేయాలని మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం. – రాజశేఖర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ -
పైరవీలకే పెద్దపీట
అనంతపురం అర్బన్: పరిపాలనలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. జిల్లా యంత్రాంగానికి రెవెన్యూ శాఖ పెద్దన్నలా వ్యవహరిస్తుంది. కానీ అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన ఈ శాఖలో ‘అంతా నా ఇష్టం’ చందంగా వ్యవహారాలు సాగుతుంటాయి. ప్రధానంగా ఉద్యోగుల పోస్టింగ్, డిప్యుటేషన్ల విషయంలో ఉన్నతాధికారులు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. రాజకీయ సిఫారసులకు పెద్ద పీట వేస్తారు. లాబీయింగ్, పైరవీలు చేసేవారికే ప్రాధాన్యత ఇస్తారు. ఈ శాఖలోని ఉద్యోగులు తాము కోరుకున్న స్థానంలో పనిచేసే అవకాశం ఉండదు. కోరుతున్న స్థానం రాకపోతే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవాలి తప్ప ప్రశ్నించడం ఇక్కడ చెల్లదు. ‘నో’ కౌన్సెలింగ్ రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చే క్రమంలోనూ, బదిలీల విషయంలోనూ కౌన్సెలింగ్ విధానం అమలు కావడం లేదు. అధికారులే తమకు ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్‌లు ఇచ్చి ఉత్తర్వులను జారీ చేస్తారు. స్పౌజ్ విధానం కూడా ఇక్కడ అమలు కాదు. నేతలు చెబితే ఓకే రాజకీయ సిఫారసులకు రెవెన్యూ శాఖలో పెద్ద పీట వేస్తారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సూచనలను, సిఫారసులను తప్పనిసరిగా అమలు చేస్తారు. వారు సిఫారసు చేసిన వారికి సూచించిన స్థానంలో పోస్టింగ్ ఇస్తారు. తహసీల్దార్ స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఈ తంతు ఇక్కడ సర్వసాధారణం. ఉద్యోగులకు హక్కులు లేవు పోస్టింగ్ ఇచ్చే క్రమంలో అధికారులు నిర్దేశాలే అమలువుతాయి. ఇక్కడ ఉద్యోగులకు ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. ఇష్టం ఉన్నా...లేక పోయినా అధికారులుు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడి వెళ్లి జాయిన్ కావాల్సిందే. రాజకీయ పలుకుబడి, లాబీయింగ్ చేసుకునే సామర్థ్యం లేని ఉద్యోగులు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వీరిని జిల్లా సరిహద్దుకు విసిరేస్తారు. దీంతో అక్కడ పనిచేయలేని ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవును ఆశ్రయిస్తున్నారు. లాబీయింగ్‌కు ప్రాధాన్యత ‘రెవెన్యూ’లో లాబీయింగ్ చేసేవారికి ప్రాధాన్యత ఉంటుంది. వారు సిఫారసు చేసిన ఉద్యోగులకు సూచించిన స్థానంలో పోస్టింగ్, డిప్యుటేషన్ అవకాశం కల్పిస్తారు. లాబీయింగ్ చేసేవారు ఈ శా>ఖలో ప్రతి అధికారి వద్ద కనిపిస్తారు. అందువల్లే కొందరు ఏళ్ల తరబడి కలెక్టరేట్‌ను విడవకుండా తిష్టవేశారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం డిప్యూటీ తహసిల్దారులను డిప్యుటేషన్లపై నియమించారు. కొందరు ఉద్యోగులు ఏళ్లగా సీట్లకు అతుక్కుపోయారు. ఉద్యోగుల సంక్షేమం ఆలోచించాలి ఉన్నతాధికారులు ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించాలి. బదిలీలు, పదోన్నతుల సమయంలో పకడ్బందీగా కౌన్సెలింగ్ చేపట్టాలి. పారదర్శకత పాటిస్తూ ఖాళీ స్థానాల జాబితాను ఉద్యోగులకు ఇవ్వాలి. వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలి. ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్‌లు ఇవ్వాలి. అప్పుడే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. – శీలా జయరామప్ప, జిల్లా అధ్యక్షుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం -
పంచాయతీ కార్యదర్శులు కావలెను
► 462 మంది కార్యదర్శుల పోస్టులు ఖాళీ ► పట్టణ ప్రాంతాల్లో పనిచేసేందుకే మొగ్గు ► గ్రామాల్లో కార్యదర్శలకు అదనంగా బాధ్యతలు సైదాపురం(వెంకటగిరి) : గ్రామీణాభివృద్ధిలో సర్పంచ్‌తో పాటు కీలకపాత్ర పోషించాల్సిన కార్యదర్శుల పోస్టులు జిల్లాలో అధికంగా ఖాళీగా ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించిందే తప్ప అలా జరగలేదు. దీంతో పల్లెల్లో అభివృద్ధి పడకేసింది. జిల్లాలో 940 పంచాయతీలకు 462 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 478 పంచాయతీలకు సమీప గ్రామ పంచాయతీ కార్యదర్శులే ఇన్చార్జిలుగా అదనపు బాధ్యతలు నిర్వహిన్నారు. ఈ క్రమంలో ఒక్కో కార్యదర్శి నాలుగు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తుండటంతో ఏ పంచాయతీకి కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. కాగా పల్లెలల్లో కార్యదర్శుల కొరత కారణంగా పనులు సక్రమంగా జరగడంలేదు. వర్షాలు అడపాదడపా పడుతున్నా పారిశుద్ధ్య పనులు సాగడంలేదు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యదర్శులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలామందికి తమ ఊరికి కార్యదర్శి ఎవరో తెలియదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అక్కడే బాగుంటుంది.. తక్కువ సంఖ్యలో ఉన్న కార్యదర్శులు కూడా అధిక భాగం నియోజకవర్గ కేంద్రాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సమీపంలో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో బదిలీలు జరగ్గా అనేకమంది రీత్యా గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, కావలి, నెల్లూరు నగరం సమీప ప్రాంతాల్లో మాత్రమే పనిచేసేందుకు వెళ్లారు. ఇంకా కొంతమంది పట్టణాలకు డెప్యుటేషన్ చేయించుకుని వెళుతున్నారు. బాధ్యతలు ఇవే.. ⇒ గ్రామ పంచాయతీల్లో రికార్డులను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు ఇంటి పన్నులను వసూలు చేయాలి. ⇒ సర్పంచులతో కలిసి పంచాయతీల్లో అన్ని కార్యక్రమాలను నిర్వహించాలి. ⇒ సమావేశాలకు హాజరై తీర్మానాల అమలులో క్రియాశీలకంగా వ్యవహరించాలి. ⇒ పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలి. భూములు, స్థలాలు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒ స్వచ్ఛమైన నీరును అందించడంతో పాటు గ్రామాల్లో రోగాలు రాకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. ⇒ జనన, మరణ సమాచారాన్ని ప్రతి నెల 5వ తేదీ లోగా రెవెన్యూ అధికారులకు పంపించాలి. ⇒ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలను అందించేందుకు గ్రామసభలను నిర్వహించాలి. ⇒ గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందించే విషయంలో సహాయకారిగా వ్యవహరించాలి. ఉదాహరణకు.. ⇒ చిల్లకూరు మండలంలో 31 గ్రామ పంచాయతీలుండగా తొమ్మిది మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ⇒ సైదాపురం మండలంలో 31 గ్రామ పంచాయతీలకు 11 మంది ఉన్నారు. ⇒ రాపూరు మండలంలో 21 గ్రామ పంచాయతీలుండగా ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. -
గాడితప్పిన ‘ట్రెజరీ’ పాలన
►ఆర్నెళ్లుగా పత్తాలేని రెగ్యులర్ డీడీ ►మేడ్చల్ ఏటీఓకు ఇన్చార్జీ బాధ్యతలు ►సక్రమంగా లేని ఇన్చార్జి డీడీ పనితీరు ►అడ్డగోలుగా ఉద్యోగులకు డిప్యూటేషన్లు ►రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జిల్లా ఉద్యోగులు ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ఆర్నెళ్లుగా రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) లేక జిల్లా ట్రెజరీ కార్యాలయ పాలన గాడితప్పింది. ఈ ప్రభావం బిల్లులు పాస్ చేయడం ఎస్టీఓలకు ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా శాఖలో ఇద్దరు సీనియర్ ఏటీఓలు ఉండగా.. మేడ్చల్ ట్రెజరీ శాఖ ఏటీఓ మోహన్‌రావుకు ఇన్చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించడం శాఖలోని సీనియర్ ఏటీఓలతోపాటు ఎస్టీఓలను కూడా తీవ్ర నిరాశ పర్చింది. ఇన్చార్జి డీడీగా వచ్చిన మేడ్చల్ ఏటీఓ పనితీరు సక్రమంగా లేకపోవడం.. అడ్డగోలుగా అక్రమ డిప్యూటేషన్లు, అలాగే మహిళా ఉద్యోగులను పని పేరిట వేధిస్తున్నారనే ఆరోపణలతో 25 రోజుల క్రితం జిల్లా ట్రెజరీ శాఖ ఉద్యోగులు రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్ కేఎస్‌ఆర్‌సీ మూర్తికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్చార్జి డీడీగా ఉన్న మోహన్‌రావు ప్రస్తుతం అనారోగ్యం పేరిట సెలవులో వెళ్లినట్లు తెలిసింది. ట్రెజరీ ఉద్యోగుల ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర డైరెక్టర్ విచారణకు ఆదేశించగా.. ఇంత వరకు విచారణ జరగలేదు. ఆయన తీరే వేరు.. ట్రెజరీ శాఖకు రెగ్యులర్ డీడీగా గతేడాది ప్రభాకర్‌రెడ్డి పని చేశారు. ఆయన 2016 సెప్టెంబర్‌లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి నేటి వరకు జిల్లాకు ఆర్థికంగా కీలక శాఖ అయిన ట్రెజరీకి రెగ్యులర్ డీడీ లేరు. మధ్యలో హైదరాబాద్‌కు చెందిన యాదగిరికి ఇన్చార్జి డీడీగా బాధ్యతలు అప్పగించగా ఆయన కొద్ది రోజులు మాత్రమే పని చేశారు. తరువాత మేడ్చల్‌కు చెందిన ఏటీఓ మోహన్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే శాఖలో విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మేడ్చల్ నుంచి జిల్లాకు వచ్చే సరికి మధ్యాహ్నం 3 గంటలు కావడం, తిరిగి సాయంత్రమే విధులు ముగించుకుని వెళ్లడం పరిపాటిగా మారింది. ఆయన వచ్చినప్పుడే రిజిస్టర్లో సంతకాలు చేసేవారు. కాగా.. మహిళ ఉద్యోగినులను రాత్రి తొమ్మిది గంటల వరకు పని చేయించి ఇబ్బందులకు గురి పెడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. చివరికి రాత్రుల్లో పని చేసే వాచ్‌మన్‌తో పగలు కూడా పని చేయిస్తున్నట్లు తెలిసింది. నచ్చినట్లుగా డిప్యూటేషన్లు శాఖలో ఇన్చార్జి డీడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్‌రావు తనకు నచ్చిన విధంగా ఉద్యోగులను డిప్యూటేషన్ల పేరిట వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. పక్షం రోజుల క్రితం కొంత మంది అటెండర్లను ఇష్టం లేకున్నా ఎస్టీఓ కార్యాలయాలకు డిప్యూటేషన్లతో బదిలీ చేశారు. సీనియర్ అకౌంటెంట్ రవి కిరణ్‌ను ఇష్టం లేకున్నా బోధన్ నుంచి నిజామాబాద్‌కు డిప్యూటేషన్‌పై వేయించారనే ఆరోపణలు ఉండగా, ఎస్టీఓ గంగాకిషన్‌ను కూడా జిల్లా కార్యాలయం నుంచి భీమ్‌గల్, మళ్లీ భీమ్‌గల్ నుంచి నిజామాబాద్‌కు డిప్యూటేషన్ ఆర్డర్లను తీశారు. నెల రోజుల్లోనే 36 డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించిన ఆఫీస్ ఆర్డర్లును తీశారు. కాగా తనపై రాష్ట్ర డైరెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్న నాల్గవ తరగతి ఉద్యోగిని బిల్లులేవి పాస్ చేయవద్దని సంబంధిత అధికారులకు ఇన్చార్జి డీడీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. ట్రెజరీ శాఖలో ఇన్చార్జి డీడీగా ఉన్న మోహన్‌రావు బాటలోనే శాఖలో పని చేస్తున్న ఓ మహిళా ఇన్చార్జి ఏటీఓ కూడా నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు బిల్లులను పాస్ చేయకుండా తిరిగి పంపుతున్నారని తెలిసింది. ఇబ్బందుల్లో ట్రెజరీ ఉద్యోగులు రెగ్యులర్ డీడీ లేకపోవడం, ఉన్న ఇన్చార్జి డీడీ శాఖను పట్టించుకోకుండా అనారోగ్యం కారణంతో సెలవులో వెళ్లడంతో ట్రెజరీ శాఖ పాలన గాడితప్పుతోంది. ముఖ్యంగా మార్చి నెల ఆర్థిక సంవత్సరానికి ముగింపు కావడంతో జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు బిల్లులను పాస్ చేయించుకోవడం కోసం ట్రెజరీ కార్యాలయంలో రోజు బారులు తీరుతున్నారు. కానీ.. డీడీ లేకపోవడంతో పెన్షన్, తదితర ముఖ్యమైన బిల్లులు నిలిచిపోతున్నాయి. సమస్యలు ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలో డీడీఓలకు పాలు పోవడం లేదు. ఇటు ఎస్టీలు కూడా డీడీ లేకుండా పని చేయడం ఇబ్బందిగా మారింది. మార్చి నెలాఖరితో ప్రభుత్వానికి బడ్జెట్‌ను సరెండర్ చేయాల్సి ఉండగా ప్రస్తుతం డీడీ లేక పనులు నిలిచిపోతున్నాయి. ఈ విషయంపై ప్రస్తుతం ట్రెజరీ శాఖకు తాత్కాలికంగా అధికారిగా వ్యవహరిస్తున్న ఏటీఓ పుష్పలతను ‘సాక్షి’ వివరణ కోరగా.. డీడీ అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఫైళ్లను మేడ్చల్ వరకు తీసుకెళ్లి ఇన్చార్జి డీడీ మోహన్‌రావుతో సంతకాలు చేసుకుని వస్తున్నామని, బిల్లులు అన్నింటినీ పాస్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. -
విద్యుత్ ఇంజినీర్ల ధర్నా
– రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ కర్నూలు(రాజ్‌విహార్): డిప్యూటేషన్ పద్ధతిన సబ్‌స్టేషన్‌లో పోస్టులు భర్తీచేయడడాన్ని నిర్వసిస్తూ పవర్ ప్లాంగ్ వద్ద సోమవారం విద్యుత్ శాఖ ఇంజినీర్లు ధర్నా నిర్వహించారు. సోలార్ పవర్ ప్లాంట్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తే ఆందోళన తప్పదని విద్యుత్ శాఖ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఎం. ఉమాపతి హెచ్చరించారు. ఓర్వకల్లు, గడివేముల మండలాలలోని నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను చార్జ్ చేసేందుకు హైదరాబాదు నుంచి వచ్చిన 400కేవీ చీఫ్ ఇంజనీర్ ఆదామ్‌ను అడ్డుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న డీఈలు, ఏడీఈలను బయటకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 1000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామార్థ్యం కలిగిన అల్ట్రా సోలార్ పవర్ ప్లాంట్‌లో పని చేసేందుకు రెగ్యూలర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అప్పటి వరకు వీటిని చార్జ్ (ప్రారంభించకుండా) చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటేషన్ పద్ధతిలో ఉద్యోగులను నియమిస్తే ఇప్పటికే పనిచేసే ప్రాంతాల్లో పనిభారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 400 కేవీ, 220కేవీ సబ్స్టేషన్లలో రెగ్యులర్ ఏడీఈలు, ఇతర విభాగాల ఉద్యోగులను నియమించాలని కోరారు. కొత్త అధికారులు వచ్చే వరకు ఉపకేంద్రాల ప్రారంభాన్ని నిలిపివేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ట్రాన్స్‌కో ఏడీఈ ఉపేంద్రం శ్రీనివాసులు, ఇంజనీరింగ్ సంఘం ప్రతినిధులు ఇంజనీర్ల సంఘం జిల్లా ప్రతినిధి రవికుమార్, రాజులయ్య, గంగన్న, ఏడీఈలు నవీన్‌బాబు, శ్రీరాముడు, ఏఈలు ఓనేశీము, కోటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు
విద్యారణ్యపురి : హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను రద్దుచేసిన ట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు సదయ్య, ఆంజనేయులు, కవిత, సరేఖలను ఆ విధుల నుంచి రిలీవ్ చేయాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరారు. -
కృష్ణా పుష్కరాలకు అప్పన్న ఉద్యోగులు
సింహాచలం : కృష్ణా పుష్కరాలలో విధులు నిర్వర్తించేందుకు సింహాచలం దేవస్థానానికి చెందిన 42 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై నియమిస్తూ దేవాదాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానం ఈఈ కె.వి.ఎస్.ఆర్. కోటేశ్వరరావు, ఏఈవోలు అనంత లక్ష్మీసత్యవతీదేవి, దుర్గారావు, అసిస్టెంట్ ఇంజినీర్ కుటుంబరావు, సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, టెక్నికల్ మేస్త్రి అప్పారావుతో పాటు ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లు, 14 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఏడుగురు రికార్డు అసిస్టెంట్లు, ఏడుగురు అటెండర్లను నియమిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. -
మీరొచ్చినా...మేమువెళ్లం!
–రెగ్యులర్ సిబ్బంది వచ్చినా తమ స్థానాలకు వెళ్లని డిప్యూటేషన్ సిబ్బంది –వారికి అధికారులు, టీడీపీ నేతల మద్దతు – ఒకే పోస్టులో ఇద్దరు ప్రకారం జేవీఓలు కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో సిబ్బంది కొరత ఒకవైపు తీవ్రంగా వేధిస్తోండగా మరోవైపు ఒకే గ్రామీణ పశువైద్యశాలలో ఒకే హోదా సిబ్బంది ఇద్దరు పనిచేస్తుండటం గమనార్హం. ఆళ్లగడ్డ డివిజన్‌కు చెందిన ఇద్దరు జూనియన్ వెటర్నరీ ఆఫీసర్లను గతంలో డిప్యూటేషన్‌పై కర్నూలు మండలంలోని గ్రామీణ పశువైద్యశాలకు జేవీఓలుగా నియమించారు. ఇటీవల వీటికి రెగ్యులర్ జేవీఓలను నియమించారు. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారు తమ రెగ్యులర్ పోస్టులకు వెళ్లాలి. అయితే, వారు ఆ స్థానాలను వదలడం లేదు. పైగా మేము ఇక్కడే పనిచే స్తాం. మీరు మరో చోటుకు వెళ్లండంటూ ఒత్తిడి తెస్తున్నారు. వీరికి ఒకవైపు అధికార తెలుగు దేశం నేతలు, మరోవైపు పశుసంవర్ధకశాఖ అధికారుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వెల్దుర్తి మండలంలోని రామళ్లకోటలో లైవ్‌స్టాక్ అసిస్టెంటుగా పనిచేస్తున్న రాజశేఖర్‌కు ఇటీవల జేవీఓ గా పదోన్నతి కల్పించి కర్నూలులోని బుధవారపేట పశువైద్యశాలకు బదిలీ చేశారు. గూడూరు మండలం పెంచికలపాడులో లైవ్‌స్టాక్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోవిందుకు జేవీఓగా పదోన్నతి ఇచ్చి కర్నూలు మండలం నిడ్జూరు గ్రామీణ పశువైద్యశాలకు బదిలీ చేశారు. గతంలో ఆళ్లగడ్డ మండలం కిష్టిపాడులో జేవీఓగా పనిచేస్తున్న మహేశ్వరమ్మను బుధవారపేట పశువైద్యశాలకు, ఆళ్లగడ్డ మండలం బత్తులేరులో పనిచేస్తున్న పద్మజను నిడ్జూరు కు రాజకీయ సిపారస్సుల మేరకు డిప్యూటేషన్‌పై నియమించారు. ఆయా ఆసుపత్రులకు పదోన్నతిపై రెగ్యులర్ జేవీఓలను నియమించడంతో డిప్యూటేషన్లపై పనిచేసే వారు తమ స్థానాలకు వెళ్లాలి.అయితే, వారెవరూ వెళ్లడం లేదు. మీరు వేరే పశువైద్యశాలలకు వెళ్లిపోవాలని రెగ్యులర్ జేవీఓలు గోవిందు, రాజశేఖర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అధికారులు సైతం డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారికే వత్తాసు పలుకుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఈ నెల 16 నుంచి ఒక్కో పశువైద్యశాలలో ఇద్దరు పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. -
వారిపై ఎందుకంత ప్రేమ !
కొన్ని సీట్లు అంతే.. కలెక్టరేట్లో తహశీల్దారు ఏళ్లుగా తిష్ట బదిలీ చేస్తారు.. డిప్యుటేషన్ ఇస్తారు అనంతపురం అర్బన్ : ప్రభుత్వ శాఖలకు కలెక్టర్ కార్యాలయం ఆదర్శప్రాయంగా ఉండాలి. పారదర్శకంగా ఉంటూ ప్రతి శాఖకు ఆదర్శంగా నిలవాలి. ముఖ్యంగా నియమ, నిబంధనల విషయంలో ఇతర శాఖలకు మార్గదర్శకంగా వ్యహరించాలి. అయితే ఇక్కడా తిరకాసు వ్యవహారాలు షరా మామూలేనన్న విమర్శలను వినవస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల బదిలీలు, డిప్యుటేషన్ల విషయంలో ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి సిబ్బందిపై ఉన్నతాధికారులు అమితప్రేమ కురిపిస్తున్నారు. అధికారుల్లో బి సెక్షన్ సూపరింటెండెంట్‌గా ఉంటున్న తహశీల్దారు వరదరాజులు ఈ విమర్శలు అధికంగా ఎదుర్కొంటున్నారు. ఈయనపై అధికారులు విపరితమైన ప్రేమ ‘వరద’ని పొంగిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయం బి సెక్షన్ సూపరింటెండెంట్‌గా దాదాపు ఎమిదేళ్లగా ఇతను తిష్టవేశారనే ఆరోపణలు ఉన్నాయి. కూడేరు తహశీల్దారుగా వెళ్లినా కేవలం ఒక్క ఏడాది మాత్రమే అక్కడ చేసి తిరిగి కలెక్టరేట్‌కి డిప్యుటేషన్ వచ్చారు. గత ఏడాది ఈయన్ను బత్తలపల్లి తహశీల్దారుగా బదిలీ చేశారు. ఈయన అక్కడ కనీసం జాయిన్ కాలేదు. డిప్యుటేషన్‌పై బి సెక్షన్ సూపరింటెండెంట్‌గా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల బదిలీలు నిర్వహించిన క్రమంలో ఇతన్ని కలెక్టరేట్‌కి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే షరా మామూలే. తిరిగి డిప్యుటేషన్ వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏళ్లుగా ఒకే సీటులో కొనసాగుతున్న అధికారి ఎవరంటే రెండో ఆలోచన లేకుండా తహశీల్దారు వరదరాజులు అని ఇక్కడి ఉద్యోగులు ఠక్కున సమాధానం ఇస్తారు. డిప్యుటేషన్లు, బదిలీల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించే కలెక్టర్ కూడా ఈయన విషయంలో ఎందుకో ఉదాసీనంగా వ్యవహరిస్తారనే విమర్శలు ఉద్యోగవర్గాల నుంచి వస్తున్నాయి. బదిలీ స్థానాలు మారిపోయాయి : ఇటీవల రెవెన్యూ శాఖలో బదిలీలు జరిగాయి. కొందరు ఉద్యోగుల్ని బదిలీ చేశారు. వారు అక్కడ జాయిన్ కాకుండానే ఆ ఉత్తర్వులు రద్దు కావడం.. మలి ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ బదిలీల వ్యవహారంపైన ఉద్యోగ వర్గాల నుంచి విమర్శలు వినవస్తున్నాయి. కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా (ఎస్ఏ) ఉన్న రమాదేవిని తొలుత ధర్మవరం ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ బదిలీని కాదని అనంతపురం పీఏబీఆర్ భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్ బి.సురేఖరావ్ని గార్లదిన్నె తహశీల్దారు కార్యలయానికి బదిలీ చేశారు. ఆమె తిరిగి కలెక్టరేట్లో ఏస్ఏగా పోస్టింగ్ ఇచ్చారు. ఎస్ఏ మాధవ కృష్ణయ్యని కొత్త చెరువు తహశీల్దారు కార్యాలయంలో ఆర్ఐ–2గా పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేశారు. తిరిగి ఆయనకు బుక్కరాయసముద్రం తహశీల్దారు కార్యాలయంలో ఎస్‌ఏగా పోస్టింగ్ ఇచ్చారు. ఎస్ఏ శోభరాణిని పెనుకొండ తహశీల్దారు కార్యాయంలో ఎస్‌ఏగా బదిలీ చేశారు. తిరిగి ఆమెకి గార్లదిన్నె తహశీల్దారు కార్యాలయం ఆర్ఐ–2గా పోస్టింగ్ ఇచ్చారు. ఇలాగే మరికొన్ని బదిలీల్లో మార్పులు చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ ఉద్యోగుల నుంచే పెద్ద ఎత్తున విమర్శులు వినవస్తున్నాయి. -
గోపాల.. గోపాల..!
భద్రాచలం : భద్రాచలం అటవీశాఖను ఓ గోపాలుడు కుదిపేస్తున్నాడు. దుమ్ముగూడెం రేంజ్ పరిధిలోని డీ కొత్తూరు బీట్‌లో పట్టుబడిన అక్రమ కలప రవాణాలో అసలు దోషులెవరనే దానిపై సాగుతున్న విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రాచలంలో తిష్టవేసిన ఆంధ్రప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆ శాఖలోని ఓ అధికారి, అదేవిధంగా కొంతమంది సిబ్బంది సహకారంతోనే పెద్ద ఎత్తున టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వ చ్చాయి. భద్రాచలం డీఎఫ్ఓ శివాల రాంబాబు సైతం సిబ్బంది పాత్ర ఉందని ప్రకటించారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. తీగ లాగితే డొంక కదలిందన్న చందాన అనేక ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయని తెలిసింది. కలప స్మగ్లింగ్‌కు సూత్రధారిగా అనుమానిస్తున్న భద్రాచలంలోని ఓ ‘గోపాలుడి’సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా కూపీ లాగుతున్నారు. గత నెల రోజుల్లో ఆ వ్యక్తితో టచ్‌లో ఉన్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఎవరనేది ముందుగా ఆరా తీసిన తరువాత, మరింత సమాచారాన్ని రాబట్టే దిశగా విచారణను వేగవంతం చేశారు. డివిజన్ అటవీశాఖలోని ఓ అధికారికి దీనిలో ప్రమేయం ఉందని విస్తృత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అతని కాల్‌డేటాను సైతం నిఘా వర్గాలు పరిశీలిస్తున్నాయి. అయితే రూ.6.80 లక్షల విలువ గల టేకు కలప పట్టుబడిన ఘటనలో విచారణ పక్కదారి పట్టించేందుకు కొంతమంది ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. కలప స్మగ్లర్‌తో టచ్‌లో ఉన్న ఆ శాఖలోని ఓ అధికారి ఈ కే సులో ఇరుక్కోకుండా ఉండేలా భద్రాచలంలోని కొన్నివర్గాల నాయకులతో విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకోస్తున్నారని ఆ శాఖలోని సిబ్బంది బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇది వరకే ఐదు లారీల వరకూ టేకు కలప ఈ ప్రాంతం నుంచి తరలిపోయిందని, అధికారుల పాత్ర లేకుండా ఇది ఎలా సాధ్యమౌతుందని ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. మళ్లీ టెంటు పడనుందా.. భారీ స్థాయిలో స్మగ్లింగ్ జరిగిందని తెలిసినప్పటకీ, క్రింది స్థాయిలో ఉన్న ఉద్యోగులను బలి పశువులుగా చేయటం సరైంది కాదని ఆ శాఖలోని ఉద్యోగులు అంటున్నారు. భద్రాచలం డివిజన్ అటవీశాఖలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలపై తీవ్రంగా పరిగణిస్తున్న ఉద్యోగులు.. ఇక్కడి అధికారులు అవలంభిస్తున్న ఏకపక్ష విధానాలను ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. గతంలోనూ ఇలానే జరిగితే, అప్పటి అధికారికి వ్యతిరేకంగా డివిజన్ కేంద్రంలో టెంట్ వేశామని, మళ్లీ అటువంటి పరిస్థితులే నెలకొంటున్నాయని అటవీశాఖ ఉద్యోగుల సంఘం నాయకుడొకరు ఆవేదన వెళ్లగక్కారు. భద్రాచలం డివిజన్లోని అటవీశాఖలో జరుగుతున్న అడ్డగోలు డిప్యూటేషన్లు, సస్పెన్షన్లపై గుర్రుగా ఉన్న ఆ శాఖలోని ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. -
పల్లెల్లో కరువు.. రాజధానిలో ‘వ్యవసాయం’
సాక్షి, హైదరాబాద్: కరువు.. కరువు.. కరువు! అంతా కరువే. రాష్ట్రంలో వ్యవసాయం చేయబోతే కరువు. జిల్లాల్లో వ్యవసాయశాఖలో సిబ్బంది, అధికారులు కరువు. మంత్రి ఆదేశాలకు స్పందన కరువు. అన్నదాత గోడును ఆలకించేనాథుడు కరువు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇవ్వడానికి పొలంబాట పట్టాల్సిన వ్యవసాయశాఖ అధికారులు డిప్యుటేషన్లపై రాజధానికి, పట్టణాలకు వెళ్లిపోయారు. డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించినా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారన్న ప్రచారం ఉంది. అంతా ఏవో, ఏడీఏ స్థాయి అధికారులే... వ్యవసాయశాఖలో దాదాపు 120 వ్యవసాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేడీఏ స్థాయిలో 20 వరకూ ఖాళీలున్నాయి. ఒక్క జిల్లా మినహా మిగతా 8 జిల్లాలకు ఇన్చార్జులే జేడీఏలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడంలేదు. ఈ నేపథ్యంలో పనిచేస్తున్న కొద్ది మంది అధికారులు కూడా సమీప పట్టణాలు, రాజధాని బాట పట్టారు. కీలకమైన ఏవో, ఏడీఏ స్థాయి అధికారులు దాదాపు 100 మంది రాజధాని హైదరాబాద్, కొద్దిమంది పక్క జిల్లాల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 17 మంది వ్యవసాయాధికారులు డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌లో పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ ఇద్దరు, ఖమ్మం ముగ్గురు, మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు డిప్యుటేషన్‌పైనే బయట పనిచేస్తున్నారు. డిప్యుటేషన్‌పై వెళ్లిన వారిని వెనక్కు పంపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వ్యవసాయ ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోవడంలేదు. మెదక్ జిల్లాకు చెందిన ఒక ఏడీఏ స్థాయి అధికారిని తీసుకొచ్చి హైదరాబాద్ కమిషనరేట్‌లో సాధారణ బాధ్యతల్లో ఉంచారు. తమ జిల్లాకు చెందిన కొందరు డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌లో పనిచేస్తున్నారని, దీనివల్ల రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేవారే లేకుండా పోయారని ఇటీవల మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విన్నవించారు. దీంతో డిప్యుటేషన్లను రద్దు చేసి ఎక్కడివారిని అక్కడకు వెనక్కు పంపాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ మంత్రి ఆదేశాలను పట్టించుకునే నాథుడే లేరు. పైగా ఎవరూ ఎక్కడికి పోవాల్సిన పనిలేదని ఉన్నతాధికారులు ఉద్యోగులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై మంత్రి పోచారం, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథిల వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.