కోల్‌కతా/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరు కాని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయను ఢిల్లీకి రావాలని ఆదేశిస్తూ(రీకాల్) కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అమలవ్వడం సాధ్యం కాకపోవచ్చని మాజీ ఐఏఎస్ అధికారులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఆలాపన్ బందోపాధ్యాయ సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. సివిల్ సర్వీసు అధికారులను రీకాల్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలని నిపుణులు చెబుతున్నారు. ఆలాపన్ విషయంలో బెంగాల్ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు రిలీవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడం లేదన్న కారణంతో సెంట్రల్ డిప్యూటేషన్‌కు నిరాకరిస్తే ఆయనపై పరిపాలనాపరమైన చర్యలు తప్పకపోవచ్చని ఢిల్లీలోని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అడకత్తెరలో...
బెంగాల్‌లో తుపాను నష్టంపై శుక్రవారం మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆలాపన్ బందోపాధ్యాయ హాజరు కాకపోవడాన్ని కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. సోమవారం ఢిల్లీలో సిబ్బంది వ్యవహారాల శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మమత కోరిక మేరకు కొద్దిరోజుల కిందటే ఆలాపన్ బందోపాధ్యాయ పదవీ కాలన్ని కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించడం గమనార్హం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయన సేవలు అవసరమని మమత భావిస్తున్నారు. ఆలిండియా సర్వీసు రూల్స్ (ఏఐఎస్)ను గుర్తుచేస్తూ బెంగాల్ ప్రభుత్వం కేంద్రానికి ఒక మర్యాదపూర్వకమైన లేఖ రాస్తే మంచిదని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి జవహర్ సర్కార్ సూచించారు.
ఆలిండియా సర్వీసు రూల్స్‌లోని 6(1) నిబంధన ప్రకారం.. అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రానికి లేదా ఏదేని ప్రభుత్వరంగ సంస్థకు డిప్యూటేషన్‌పై పంపించాలంటే సదరు అధికారి అప్పటిదాకా పని చేస్తున్న రాష్ట్రంలోని ప్రభుత్వం అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఆలాపన్ బందోపాధ్యాయను డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపడానికి బెంగాల్ ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఆలాపన్ బందోపాధ్యాయ ఈ సంకటం నుంచి తప్పించుకోవాలంటే పదవీకాలం పొడిగింపును వదులుకొని ఈ నెల 31న పదవీ విరమణ చేస్తే మంచిదని మాజీలు సలహా ఇస్తున్నారు. ఆయన సేవలు అవసరమంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సలహదారుడిగా నియమించుకోవాలని మమతకు సూచిస్తున్నారు.
సమ్మతించని బెంగాల్ సర్కారు
ఆలాపన్ బందోపాధ్యాయను డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపడానికి బెంగాల్ సర్కారు ఇంకా సమ్మతించలేదు. దీంతో ఆయన సోమవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు రిపోర్టు చేసే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు. ఆలాపన్ ఆదివారం కూడా బెంగాల్ సచివాలయంలో విధులకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఆయన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సచివాలయంలో నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment