అనంతపురం అర్బన్: పరిపాలనలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. జిల్లా యంత్రాంగానికి రెవెన్యూ శాఖ పెద్దన్నలా వ్యవహరిస్తుంది. కానీ అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన ఈ శాఖలో ‘అంతా నా ఇష్టం’ చందంగా వ్యవహారాలు సాగుతుంటాయి. ప్రధానంగా ఉద్యోగుల పోస్టింగ్, డిప్యుటేషన్ల విషయంలో ఉన్నతాధికారులు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. రాజకీయ సిఫారసులకు పెద్ద పీట వేస్తారు. లాబీయింగ్, పైరవీలు చేసేవారికే ప్రాధాన్యత ఇస్తారు. ఈ శాఖలోని ఉద్యోగులు తాము కోరుకున్న స్థానంలో పనిచేసే అవకాశం ఉండదు. కోరుతున్న స్థానం రాకపోతే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవాలి తప్ప ప్రశ్నించడం ఇక్కడ చెల్లదు.
‘నో’ కౌన్సెలింగ్
రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చే క్రమంలోనూ, బదిలీల విషయంలోనూ కౌన్సెలింగ్ విధానం అమలు కావడం లేదు. అధికారులే తమకు ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్‌లు ఇచ్చి ఉత్తర్వులను జారీ చేస్తారు. స్పౌజ్ విధానం కూడా ఇక్కడ అమలు కాదు.
నేతలు చెబితే ఓకే
రాజకీయ సిఫారసులకు రెవెన్యూ శాఖలో పెద్ద పీట వేస్తారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సూచనలను, సిఫారసులను తప్పనిసరిగా అమలు చేస్తారు. వారు సిఫారసు చేసిన వారికి సూచించిన స్థానంలో పోస్టింగ్ ఇస్తారు. తహసీల్దార్ స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఈ తంతు ఇక్కడ సర్వసాధారణం.
ఉద్యోగులకు హక్కులు లేవు
పోస్టింగ్ ఇచ్చే క్రమంలో అధికారులు నిర్దేశాలే అమలువుతాయి. ఇక్కడ ఉద్యోగులకు ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. ఇష్టం ఉన్నా...లేక పోయినా అధికారులుు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడి వెళ్లి జాయిన్ కావాల్సిందే. రాజకీయ పలుకుబడి, లాబీయింగ్ చేసుకునే సామర్థ్యం లేని ఉద్యోగులు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వీరిని జిల్లా సరిహద్దుకు విసిరేస్తారు. దీంతో అక్కడ పనిచేయలేని ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవును ఆశ్రయిస్తున్నారు.
లాబీయింగ్‌కు ప్రాధాన్యత
‘రెవెన్యూ’లో లాబీయింగ్ చేసేవారికి ప్రాధాన్యత ఉంటుంది. వారు సిఫారసు చేసిన ఉద్యోగులకు సూచించిన స్థానంలో పోస్టింగ్, డిప్యుటేషన్ అవకాశం కల్పిస్తారు. లాబీయింగ్ చేసేవారు ఈ శా>ఖలో ప్రతి అధికారి వద్ద కనిపిస్తారు. అందువల్లే కొందరు ఏళ్ల తరబడి కలెక్టరేట్‌ను విడవకుండా తిష్టవేశారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం డిప్యూటీ తహసిల్దారులను డిప్యుటేషన్లపై నియమించారు. కొందరు ఉద్యోగులు ఏళ్లగా సీట్లకు అతుక్కుపోయారు.
ఉద్యోగుల సంక్షేమం ఆలోచించాలి
ఉన్నతాధికారులు ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించాలి. బదిలీలు, పదోన్నతుల సమయంలో పకడ్బందీగా కౌన్సెలింగ్ చేపట్టాలి. పారదర్శకత పాటిస్తూ ఖాళీ స్థానాల జాబితాను ఉద్యోగులకు ఇవ్వాలి. వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలి. ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్‌లు ఇవ్వాలి. అప్పుడే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది.
– శీలా జయరామప్ప, జిల్లా అధ్యక్షుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment