రాజకీయ కక్ష.. ఉద్యోగికి శిక్ష!
అతనో చిరుద్యోగి.. పైగా క్యాన్సర్ బాధితుడు. రెండేళ్లుగా జిల్లాపరిషత్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. ఉన్న పళంగా ఇటీవల అతని డిప్యూటేషన్ రద్దు చేసి గతంలో పని చేసిన పాఠశాలకు పంపేశారు. ఇంతకీ అతను చేసిన నేరమేమిటయ్యా అంటే.. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి బంధువు కావడమే. అయితే పైకి మాత్రం ప్రభుత్వ అనుమతి లేదన్న కారణాన్ని అధికారులు చూపుతున్నారు. అటువంటప్పుడు రెండేళ్లుగా ఆయన డిప్యూటేషన్ ఎందుకు కొనసాగించారు?.. కొత్త పాలకవర్గం వచ్చిన కొద్ది రోజులకే ఎందుకు రద్దు చేశారు??.. ఆరా తీస్తే దీని వెనుక ఓ ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని.. ఈ విషయంలో జెడ్పీ చైర్‌పర్సన్, మంత్రి అచ్చెన్నల మధ్య మనస్పర్థలు కూడా ఏర్పడ్డాయని విశ్వసనీయం సమాచారం.
శ్రీకాకుళం:రాజకీయాల ముందు మానవత్వం తలవంచింది. రెండేళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడు తెరపైకి వచ్చింది. జెడ్పీలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న క్యాన్సర్ బాధిత ఉద్యోగిని అతని పాత స్థానానికి పంపేసింది. రాజకీయ కారణాలతో ఓ ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి తీసుకురాగా.. జిల్లా మంత్రి సూచనలను సైతం ఖాతరు చేయకుండా జెడ్పీ చైర్‌పర్సన్ ఈ డిప్యూటేషన్‌ను రద్దు చేయడం ఇటు ఉద్యోగుల్లోనూ.. అటు రాజకీయంగాను కలకలం రేపుతోంది. ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉద్యోగి క్యాన్సర్ బారిన పడటంతో గత రెండేళ్లుగా డిప్యూటేషన్‌పై జెడ్పీ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఓ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు ఇటీవల ఈ ఉద్యోగి డిప్యూటేషన్‌ను రద్దు చేసి తిరిగి బొంతలకోడూరుకు పంపించారు. దీనికి కారణమేమిటని సీఈవోను అడిగితే అతను పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం అంగీకరించలేదని చెబుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేనప్పుడు రెండేళ్లపాటు ఎలా కొనసాగించారన్న ప్రశ్న తలెత్తుతోంది.
తెరవెనుక తతంగం
జెడ్పీ చైర్‌పర్సన్‌గా చౌదరి ధనలక్ష్మి బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా తతంగం నడిచినట్లు సమాచారం. క్యాన్సర్ బాధిత ఉద్యోగి బంధువొకరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొందూరు మండలంలో ఎంపీటీసీగా గెలుపొందారు. ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తమకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నుంచి ఈ ఎంపీటీసీపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఆయన ససేమిరా అనడంతో అప్పటికి మౌనం వహించిన టీడీపీ నేతలు, ఆ తర్వాత అతని బంధువైన ఈ ఉద్యోగిపై కక్ష సాధింపు మొదలెట్టారు. సర్కారు అనుమతి లేదన్న సాకు చూపి అతని అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అతని డిప్యూటేషన్‌ను రద్దు చేయించారు. ఈ విషయంలో ఓ ఎమ్మెల్యే ద్వారా జెడ్పీ చైర్‌పర్సన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చి పని కానిచ్చేశారు.
మంత్రి సూచనలూ బేఖాతరు
కాగా ఈ డిప్యూటేషన్ రద్దు వ్యవహారాన్ని జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు వ్యతిరేకించారు. తన సూచనలను పట్టించుకోకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయంలో జెడ్పీ చైర్‌పర్సన్, మంత్రి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని కూడా తెలిసింది. తాను, ఎంపీ పట్టుపట్టకుండే ధనలక్ష్మికి చైర్‌పర్సన్ పదవే దక్కేది కాదని, ఇప్పుడు ఆమె తనను కాదని సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ వర్గం ఎమ్మెల్యే సూచనను అమలు చేయడాన్ని అచ్చెన్నాయుడు సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలిసింది. దీన్ని పసిగట్టిన ప్రత్యర్థివర్గం ముందు జాగ్రత్తగా మంత్రిపై పార్టీ అధిష్టానానికి వేరే విధంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి బంధువును మంత్రి వెనకేసుకొస్తున్నారని వారు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే మంత్రి, విప్, ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాల ఉచ్చులోకి ఇప్పుడు జెడ్పీ చైర్‌పర్సన్ కూడా వచ్చారు.
అనుమతి లేనందునే:సీఈవో
ఈ విషయాన్ని జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా శ్రీనివాస్ అనే ఉద్యోగి పెట్టుకున్న దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడం వల్లే అతని డిప్యూటేషన్‌ను రద్దు చేశామన్నారు. రెండేళ్లుగా ఎలా కొనసాగించారంటే సరైన సమాధానం చెప్పలేక పోయారు. జెడ్పీ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాతే రద్దు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్ల గురించి తనకు తెలియదన్నారు.