టీచర్లు సిటీకి.. చదువులు గాలికి! | Teachers supposed to work in villages are deputed to urban areas | Sakshi
Sakshi News home page

టీచర్లు సిటీకి.. చదువులు గాలికి!

Published Sun, Feb 4 2024 4:20 AM | Last Updated on Sun, Feb 4 2024 4:20 AM

Teachers supposed to work in villages are deputed to urban areas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిరోజులుగా కొత్త టీచర్లు కొలువుదీరుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలేమీ లేకున్నా.. కొత్త నియామకాలేవీ జరగకున్నా.. కొత్త టీచర్లు వస్తుండటంపై తోటి టీచర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త టీచర్లంతా రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పనిచేయాల్సిన వారు. కానీ డిçప్యుటేషన్లపై పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చి తిష్టవేస్తున్నారు.

తమకు పోస్టింగ్‌ ఇచ్చిన గ్రామీణ పాఠశాలలో పనిచేయడం ఇష్టం లేకనో, మరేదైనా కారణాలతోనో.. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు), పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని అధికారులు, రాజకీయ నేతల సహకారంతో ఇలా పట్టణ ప్రాంత బడుల్లోకి మారుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో వంద మందికిపైగా టీచర్లు ఇలా డిçప్యుటేషన్లపై ఇతర చోట్లకు వెళ్లినట్టు అంచనా. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో సతమతం అవుతున్న గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధనకు మరింతగా ఇబ్బంది ఎదురవుతోంది. 

రూ.3 లక్షల దాకా ముట్టజెప్పి.. 
కోరిన చోటికి డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు కొందరు టీచర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు విద్యాశాఖ అధికారులను ఆశ్రయించి డిప్యుటేషన్‌ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో టీచర్‌ రూ.3 లక్షల వరకు ముట్టజెప్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డీఈఓలు అందినకాడికి వసూలు చేసి, ఇలా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ లోపల, శివార్లలోని దగ్గరి ప్రాంతాల స్కూళ్లకు వెళ్లేందుకు అంతకంటే ఎక్కువే చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.  

ఈ నెల 2న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ను ఏకంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాగోల్‌ జెడ్పీ హైసూ్కల్‌కు డిప్యూటేషన్‌పై పంపుతూ యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి అంతర్‌ జిల్లా డిప్యూటేషన్‌ ఇచ్చే అధికారం డీఈఓలకు ఉండదు. అయినా ఇలాంటి ఆదేశాలు రావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా డిప్యూటేషన్లు ఇవ్వలేదని, పాఠశాల విద్య కమిషనరేట్‌ నుంచి అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చెప్తుండటం గమనార్హం. 
 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొన్ని డిప్యూటేషన్లు ఇలా.. 
► రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్‌ జెడ్పీ హైసూ్కల్‌ నుంచి ఓ ఉపాధ్యాయుడు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం రాగన్నగూడ జెడ్పీహెచ్‌ఎస్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. 
► మాడ్గుల మండలం అవురుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేయాల్సిన ఓ టీచర్‌.. చంపాపేట్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో డిప్యూటేషన్‌పైన విధులు నిర్వహిస్తున్నారు. 
► మాడ్గుల మండలం పుట్టగడ్డతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కవాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇదే మండలం అన్నబోయినపల్లి పాఠశాలకు చెందిన టీచర్‌.. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌ పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. 
► ఇలా మాడ్గుల మండలానికి చెందిన సుమారు ఇరవై మంది టీచర్లు డిప్యూటేషన్లపైన ఇతర మండలాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. 
► షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని దాదాపు 60 మంది టీచర్లు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌ పరిధిలో దాదాపు 12 పాఠశాలల్లో టీచర్లెవరూ లేరని సమాచారం. 
 
మానవతా దృక్పథంతో చేస్తున్నాం.. 
పక్షవాతం, కేన్సర్‌ తదితర వ్యాధుల బాధితులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల జీవిత భాగస్వాములు వంటి వారి డిప్యూటేషన్లను అనుమతిస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నా దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆమోదించి పోస్టింగ్‌లు ఇస్తున్నాం. విద్యాశాఖ కమిషనర్‌ నుంచి వస్తున్న ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. 
– బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి 
 
ఒక్క డిప్యూటేషన్‌ కూడా ఇవ్వలేదు 
డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించి నేను ఎక్కడా సంతకాలు చేయలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. గత మూడున్నరేళ్లలో నేను ఒక్క ఆర్డర్‌పై కూడా సంతకం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తా. 
– దేవసేన, విద్యాశాఖ కమిషనర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement