దేశంలోని అనేక కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు రావడం గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే కంపెనీలకు ఎందుకిలా వరుసపెట్టి జీఎస్టీ నోటీసులు వస్తున్నాయని పరిశీలిస్తే అసలు కారణం తెలిసింది.
భారత్‌కు చెందిన చాలా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు విదేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే విదేశీ సంస్థలు, వాటి అనుబంధ కంపెనీలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలు ఆయా దేశాల్లో ఉద్యోగులను అక్కడి చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నియమించుకుంటాయి. అయితే బయటి దేశాల్లో నియమించుకున్న ఉద్యోగులను భారత్‌కు డిప్యూటేషన్‌పై తెచ్చుకున్న కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి.
బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన జీతాన్ని తమ విదేశీ సంస్థకు ఇక్కడి కంపెనీలు తిరిగి చెల్లిస్తుంటాయి. ఇలా బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినవారిని సెకెండెడ్ ఎంప్లాయీస్ అంటారు. విదేశీ సంస్థకు రియింబర్స్ చేసే వీరి జీతాలపై సర్వీస్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఈమేరకు నార్తర్న్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కేసులో భాగంగా 2022 మేలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరిస్తూ ఆయా కంపెనీలకు జీఎస్టీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
అయితే ఈ నోటీసులపై కంపెనీల్లోని ట్యాక్స్ నిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. "2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసుల మదింపు పరిమితి కాలం సెప్టెంబర్‌తో ముగిసిన నేపథ్యంలో కంపెనీలకు వరుపెట్టి నోటీసులు వచ్చాయి. ఇటువంటి నోటీసులు అందుకున్న కంపెనీలు వాస్తవాలను పరిశీలించుకుని ముందుకు వెళ్లాల్సిఉంటుంది" అని కేపీఎంజీ-ఇండియా, భాగస్వామి, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment