ఏళ్ల తరబడి ఒకేచోట డిప్యుటేషన్లలో ఉద్యోగులు
ఏటా ఆనవాయితీగా పొడిగింపు
ఇకపై ఆ అవసరం కూడా లేకుండా ఆదేశాలు
ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసులో విచిత్రం
35 మంది ఉద్యోగులు ఇక అక్కడే పర్మినెంట్
సాక్షి, అమరావతి: విద్యుత్‌శాఖలో డిప్యుటేషన్లపై పనిచేస్తున్నవారి విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఉద్యోగవర్గాల్లో సంచలనం సృష్టించింది. డిప్యుటేషన్‌పై వచ్చినవారు శాశ్వతంగా అక్కడే పనిచేసేలా జారీచేసిన ఈ ఉత్తర్వులు.. సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించాయి.
ఒక ప్రభుత్వ విభాగంలో ఒక అధికారినిగానీ, సిబ్బందిగానీ వారి సొంత కారణాలతోనో, ఆ శాఖ అవసరానికో ఒకచోటు నుంచి మరోచోటుకి, ఒక శాఖ నుంచి మరో శాఖకు డిప్యుటేషన్‌పై పంపడం సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి కాలాన్ని కూడా చాలా తక్కువగా నిర్ణయిస్తారు. అంటే మూడునెలల నుంచి ఏడాది పాటు తాత్కాలిక విధుల్లో కొనసాగేలా ఆ ఆదేశాలు ఇస్తుంటారు.
అయితే ఒకసారి ఒక చోటుకిగానీ, ఒక శాఖకుగానీ వెళ్లిన వారిలో కొందరు అక్కడి నుంచి తిరిగిరావడానికి ఇష్టపడరు. మరికొందరు ఎప్పుడు వెనక్కి వచ్చేద్దామా అని చూస్తుంటారు. వారికిచ్చిన గడువు ప్రకారం డిప్యుటేషన్‌ను పొడిగించడం, రద్దుచేయడం వంటివి ఉన్నతాధికారులు చేస్తుంటారు. ఇదీ సాధారణంగా జరిగేది. రాష్ట్రంలో 11 జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త ఆచారం పుట్టుకొచ్చి0ది.
ఇచ్చిపడేశారంతే..
ఏపీఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం (కార్పొరేట్ ఆఫీస్) విశాఖపట్నంలో ఉంది. అక్కడ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్ హోదాల్లో 35 మంది ఉద్యోగులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. వీరిలో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న వారు ఉన్నారు. 2015 నుంచి 2023 వరకు ఏటా కొంతమంది చొప్పున వీరంతా వచ్చారు.
ఏటా వీరి విజ్ఞప్తిని, సంస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిప్యుటేషన్లు పొడిగిస్తున్నారు. కానీ సడన్‌గా ఏమైందో ఏమోగానీ.. ఇకపై వీరు ఎన్నాళ్లయినా కార్పొరేట్ ఆఫీసులోనే ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ 35 మందికి ఇకపై ఏటేటా డిప్యుటేషన్ పొడించాలా, రద్దుచేయాలా అనే చర్చే రాకుండా చేసేశారు. ఇకపై వీరంతా పర్మినెంట్‌గా కార్పొరేట్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తించేలా సంస్థ ఫైనాన్స్, హెచ్‌ఆర్‌డీ విభాగం డైరెక్టర్ డి.చంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.
దీంతో జిల్లాల నుంచి ఎవరైనా ఉద్యోగి విశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లాలంటే ఇప్పుడున్నవారు ఉద్యోగ విరమణ చేస్తేగానీ కుదరదు. ఇలాంటి ముఖ్యమైన విధాన నిర్ణయాలు సీఎండీ స్థాయిలోనే తీసుకుంటారు. అలా కాకుండా డైరెక్టర్ స్థాయి అధికారి ఉత్తర్వులు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక ఏవో బలమైన కారణాలున్నాయనే చర్చ విద్యుత్ ఉద్యోగుల మధ్య జరుగుతోంది.
ఏటా ఎందుకని..
డిప్యుటేషన్లపై ఏటా ఫైలు నడపడం పెద్ద ప్రాసెస్‌గా ఉంటోంది. అలాంటిదేం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. అయినప్పటికీ ఈ డిప్యుటేషన్లను ఎప్పుడైనా రద్దుచేసే అధికారం సంస్థకు ఉంది. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment