నేటితో ముగుస్తున్న చంద్రం పదవీ కాలం
అయినా అదే హోదాలో సెలవు!
కొనసాగింపుపై వెలువడని నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఫైనాన్స్ డైరెక్టర్‌గానూ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ఇన్‌చార్జ్ ఫైనాన్స్ డైరెక్టర్‌గానూ ఉన్న దండగల చంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు సెలవు మంజూరు చేసింది.
వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన కోరిన మేరకు ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు 17 రోజులు సెలవు ఇస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డిసెంబర్ 1వ తేదీన పబ్లిక్ హాలిడేని వినియోగించుకోవడానికి కూడా చంద్రంకు అనుమతినిచ్చారు.
అయితే వాస్తవానికి ఈ నెల 15తోనే చంద్రం పదవీకాలం ముగుస్తోంది. ఇటీవల విద్యుత్ సంస్థల్లో పదిమంది డైరెక్టర్ల చేత బలవంతంగా కూటమి ప్రభుత్వం రాజీనామా చేయించింది. వారితో పాటు ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న డైరెక్టర్ల పోస్టుల భర్తీకి విద్యుత్ సంస్థలు నోటిఫికేషన్‌ను జారీ చేశాయి. కానీ చంద్రం కొనసాగింపుపై నిర్ణయం వెలువడనప్పటికీ ఆ పోస్టుకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు.
చంద్రంపై ఎందుకంత ప్రేమ..
ప్రభుత్వం మారిన వెంటనే చంద్రం టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించుకున్నారు. వ్యాపార వేత్త అయిన తన మామ సాయంతో రాష్ట్ర మంత్రులను తరచుగా కలుస్తూ తన పోస్టును పదిలం చేసుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశారు.
ఏపీసీపీడీసీఎల్‌లో ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టును తనకు ఇవ్వాల్సిందిగా కూటమి మంత్రులను చంద్రం కోరారు. వారి ఆశీస్సులతో ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్‌ఏసీ)తో నియమితులయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రెండు డిస్కంలకు ఒక్కరే ఫైనాన్స్ డైరెక్టర్ అనే కొత్త సంప్రదాయానికి తెరదీశారు. అయితే చంద్రాన్ని ఇంకా కొనసాగించడానికి నిబంధనలు అడ్డురావడంతో ఏం చేయాలనేదానిపై ఇంధన శాఖ కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment