డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో ప్రతి పనికీ ఓ రేటు
వైద్యులు, నర్సులు, ఉద్యోగులను పీడిస్తున్న కొందరు అధికారులు
సెలవులు, ఎస్‌ఆర్, ఇంక్రిమెంట్.. దేనికైనా లంచం ఇవ్వాల్సిందే
పనిని బట్టి రూ. 1,000 నుంచి రూ.15 వేలు వసూలు
వసూళ్లపై విసిగిపోతున్న మెడికల్ ఆఫీసర్లు
కోనసీమ జిల్లాలో అధికారిక వాట్సప్ గ్రూప్‌లో మెసేజ్‌లు
అనంతలో డిప్యుటేషన్‌ల వ్యవహారంలోనూ అవినీతి ఆరోపణలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ముఖ్యంగా కొన్ని డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు, సెలవులు, ఎస్‌ఆర్ ప్రారంభానికి.. ఇలా ప్రతి పనికీ రేటు కట్టి మరీ తమ రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వకుంటే నెలల తరబడి ఫైళ్లను తొక్కిపెడుతున్నారని వాపోతున్నారు.
లంచాల వ్యవహారంపై విసిగిపోయిన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొందరు వైద్యులు ఏకంగా మెడికల్ ఆఫీసర్ల వాట్సప్ గ్రూప్‌లోనే అవినీతి తంతును బహిర్గతం చేసినట్టు తెలిసింది. ప్రసూతి సెలవుల ఆమోదానికి రూ. 3 వేలు, మాజీ ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు రూ. 4 వేలు, ఎస్‌ఆర్ ప్రారంభించడానికి రూ. 5 వేలు ఇలా ప్రతి పనికీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఓ రేటు ఖరారు చేశారని ఆరోపించారు.
ఇక ప్రొబేషన్ డిక్లరేషన్‌కు రూ. 15 వేలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు రూ. 2 వేల నుంచి రూ.15 వేలు ఇస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలడంలేదని, ఈ అవినీతి దందాకు అడ్డుకట్ట పడాలన్న మెసేజ్‌లు జిల్లా వైద్య శాఖలో కలకలంరేపాయి. దీంతో ఉలిక్కిపడ్డ జిల్లా స్థాయి అధికారి మెసేజ్‌లు పెట్టిన మెడికల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి తన కార్యాలయానికి వస్తే మాట్లాడుకుందామని బ్రతిమాలుకున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
వసూళ్లకు పాల్పడుతున్న కొందరు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌లకు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఏవో, క్లర్కులు, కాంట్రాక్టు ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైద్య శాఖ ఉద్యోగి ఒకరు మెడికల్‌గా అన్‌ఫిట్ అవడంతో నిబంధనల ప్రకారం కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి ఫైల్‌ను కలెక్టర్‌కు పంపడానికి చిత్తూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో రూ.లక్షలు వసూలు చేశారు. ప్రైవేటుఆస్పత్రుల్లో బెడ్‌ల సామర్థ్యం ఆధారంగా రిజి్రస్టేషన్, రెన్యువల్‌కు బెడ్‌కు రూ. వెయ్యి చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు.
అనధికారికంగా డిప్యుటేషన్లు
ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో అనధికార డిప్యుటేషన్‌ల్లోనూ డీఎంహెచ్‌వోలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ అధికారుల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అర్బన్ పీహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment