
'చతుర్వేదిని డిప్యుటేషన్‌పై ఇవ్వండి'
ఐఎఫ్‌ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది సేవలు తమకెంతో అవసరమని, ఆయన్ను వెంటనే డిప్యుటేషన్‌పై పంపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎఫ్‌ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది సేవలు తమకెంతో అవసరమని, ఆయన్ను వెంటనే డిప్యుటేషన్‌పై పంపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తాజాగా లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేయడానికి సుముఖత తెలుపుతూ చతుర్వేది రాసిన లేఖను కూడా కేజ్రీవాల్ జతచేశారు. చతుర్వేది హర్యానా కేడర్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ డిప్యూటీ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. ఢిల్లీ సీఎం కార్యాలయంలో ఓఎస్‌డీగా ఆయన సేవలు అత్యవసరమని, కాబట్టి ఆయన్ను డిప్యుటేషన్‌పై పంపుతూ ఉత్తర్వులివ్వాలని జవదేకర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. నిజాయితీపరుడైన అధికారిగా పేరుపొందిన చతుర్వేదిని ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక(యాంటీ కరప్షన్) విభాగం అధిపతిగా నియమించే అవకాశమున్నట్టు సమాచారం. చతుర్వేది ఇంతకుముందు ఎయిమ్స్‌లో డిప్యూటీ సెక్రటరీ బాధ్యతలతోపాటు చీఫ్ విజిలెన్స్ అధికారి(సీవీవో)గానూ వ్యవహరించారు. నిజాయితీపరుడైన అధికారిగా గుర్తింపుపొందారు. ఎయిమ్స్‌లో పలు కుంభకోణాలు బయటపెట్టి సంచలనం సృష్టించారు. అయితే మోదీ సర్కారు ఆయన్ను ఎయిమ్స్ సీవీవో విధులనుంచి అర్ధంతరంగా తప్పించింది. కాగా చతుర్వేదిని ఢిల్లీ విధులకు పంపేందుకు వెంటనే ఫైలును సిద్ధం చేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తమ శాఖ అధికారులను మంగళవారం ఆదేశించారు.