chaturvedi
-
Manjari Chaturvedi: సూఫీ కథక్ 25
ఈ అందెల రవళి ‘ఆహా’ ‘ఓహో’లకు పరిమితమైనది కాదు. అద్భుతమైన రెండుకళారూపాల సంగమం. చరిత్రలోని కళను వర్తమానంలో వెలిగించే అఖండ దీపం. విస్మరణకు గురైన కళాకారులకు ఇచ్చే అరుదైన నీరాజనం... పాతికేళ్ల క్రితం సూఫీ కథక్ కళతో ప్రస్థానం ప్రారంభించింది మంజరి చతుర్వేది. ‘సూఫీ, పంజాబీ జానపద సంగీత ప్రదర్శనలు ఇవ్వడం, నలుపు రంగు దుస్తులు ధరించడం, ఖవ్వాలితో కథక్ చేయడం లాంటివి చూసి శాస్త్రీయ కళను వక్రీకరిస్తుంది అని కొందరు నాపై విమర్శ చేశారు. అయితే అవేమీ నా ప్రయాణాన్ని ఆపలేదు’ అంటుంది లక్నోకు చెందిన మంజరి. చిత్ర నిర్మాత ముజఫర్ అలీ, గురువు ప్రోతిమా బేడితో కలిసి ఈ నృత్యరూపంపై పనిచేసింది. మొదట్లో స్పందన ఎలా ఉన్నప్పటికీ సంగీత ప్రియులు సూఫీ కథక్‌ను ప్రశంసిస్తున్నారు. ‘ఇది నా గురువుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను’ అంటుంది మంజరి. పండిట్ అర్జున్ మిశ్రా వద్ద కథక్, కళానిధి నారాయణ్ వద్ద అభినయ్, ఫాహిమ్– ఉద్–దిన్ దాగర్ వద్ద సూఫీ సంగీతం నేర్చుకుంది. సూఫీ సాధువులు, ఆధ్యాత్మికవేత్తలందరినీ తన గురువుగా భావిస్తుంది. ‘సూఫీ కథక్’ తొలి ప్రదర్శన దిల్లీలో ఇచ్చింది. ఇప్పటి వరకు 26 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. కైలాష్ ఖేర్, ఉస్తాద్ శౌకత్ అలీ ఖాన్, సబ్రీ బ్రదర్స్‌లాంటి ఎంతోమంది కళాకారులతో కలిసి పనిచేసింది. ఇరాన్, టర్కీ, మొరాకోకు చెందిన కళకారులతో గొంతు కలిపింది. సూఫీ తత్వంలోని సంగీత, నృత్యరూపాలను లోతుగా అధ్యయనం చేసింది. ‘రాజనర్తకీమణుల నృత్యాలలో అద్భుత ప్రతిభ దాగి ఉన్నప్పటికీ ప్రశంసించడానికి మాత్రం మనకు మనసు రాదు’ అంటున్న మంజరి విస్మరణకు గురైన కళాకారుల ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. రకరకాల ప్రాజెక్ట్‌లు చేపట్టింది. వాటిలోని ఖ్వాజా ప్రాజెక్ట్ మన దేశంలో సూఫీ ప్రతిధ్వనులను వినిపిస్తుంది. సూఫీ కవులను తెర పైకి తెస్తుంది. గొప్ప కవుల జీవితాన్ని, సాహిత్యాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. 18వ శతాబ్దానికి చెందిన సూఫీ ఆధ్యాత్మికవేత్త, పంజాబ్‌కు చెందిన కవి బాబా బుల్లెహ్ షా. ఆయన ఆధ్యాత్మిక కవిత్వాన్ని తన నృత్యప్రదర్శనల ద్వారా ఈ తరానికి చేరువ చేస్తుంది మంజరి. ‘స్వీయ అన్వేషణ, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసమే షా తన జీవితాన్ని అంకితం చేశాడు. కళాత్మక రూపాలు అణచి వేయబడుతున్న కాలంలో ఆయన మౌనంగా కూర్చోలేదు. నియమాలను ధిక్కరించి పంజాబ్ వీధుల్లో తిరుగుతూ పాటలు పాడేవాడు. నృత్యాలు చేసేవాడు. ధిక్కార స్వరాన్ని వినిపించేవాడు’ అంటుంది మంజరి. మంజరి చతుర్వేదికి ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు. శిక్షణలో భాగంగా ‘నాద్ ధ్యాన్’ చేయిస్తుంది. ‘ప్రదర్శన ఇవ్వడానికి పండిట్ జస్రాజ్ నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు నేను సరిౖయెన దారిలోనే ప్రయాణిస్తున్నాను అనే ధైర్యాన్ని ఇస్తాయి’ అంటుంది మంజరి చతుర్వేది. -
గ్రేట్ ఫాదర్.. మా నాన్నహీరో
‘నాన్నంటే మా నాన్నలా ఉండాలి’ అంటోంది శృతి చతుర్వేది. నిజమే... నాన్న అయినా, అమ్మ అయినా పిల్లలకు అండగా నిలవాల్సింది వాళ్లను సమాజం వేలెత్తి చూపించిన క్షణంలోనే. ఆ క్షణంలో మిగిలిన వారికంటే ముందుగా తల్లిదండ్రులే పిల్లలను నేరస్థులుగా చూడడం మొదలు పెడుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులు సమాజానికి భయపడి పిల్లలను దూరంగా ఉంచి, అలా దూరంగా ఉంచడాన్ని తమ నిక్కచ్చితనానికి, కచ్చితత్వానికి కొలమానంగా భావిస్తుంటారు. శృతి చతుర్వేది తండ్రి హరీశ్ చతుర్వేది కూతురు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు అండగా నిలిచాడు. కూతురి వెనుక జరిగిన కుట్రను ఛేదించడంలో సహకరించాడు. తమ ఇంట్లో ఆశ్రయం పొంది, ఘాతుకానికి ఒడిగట్టిన ద్రోహుల్ని ఇంటినుంచి తరిమికొట్టి కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు. అందుకే శృతి చతుర్వేది తన తండ్రి గురించి అంత గొప్పగా చెప్పగలిగింది. అసలేం జరిగింది? శృతి ఫొటోలు మార్ఫింగ్‌కు గురయ్యాయి. గౌరవంగా జీవించే ఆ కుటుంబం గురించి బంధువులు, స్నేహితులు అసభ్యంగా మాట్లాడుకునే పరిస్థితి ఎదురైంది. ఒకరకంగా సామాజిక బహిష్కరణ వంటిది. శృతి తండ్రి ప్రతి ఫొటోనీ నిశితంగా గమనించాడు. నిజానికి ఆ ఫొటోలన్నీ ఆయన గతంలో చూసినవే. అయితే కొత్త పరిసరాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా కనిపిస్తున్నాయి. తమ కుటుంబం పిక్నిక్కి వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలో శృతి పక్కన ఆమె కాలేజ్ స్నేహితుల్లో అబ్బాయిల ఫొటోలున్నాయి. గ్రూప్ ఫొటోల నుంచి ఆ అబ్బాయి ఫొటోను క్రాప్ చేసి శృతి పిక్నిక్ ఫొటోతో జత చేశారెవరో. అలాగే మరికొన్ని ఫొటోల్లో శృతిలాగానే కనిపిస్తోంది. కానీ దేహం శృతిది కాదు. మరెవరి దేహానికో శృతి ముఖాన్ని అతికించారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడంతోపాటు ఆ ఫొటోలను తమ కుటుంబానికి ఆత్మీయులైన వాళ్లకు చేరేటట్లు చేశారు. ఇదంతా చేసింది ఎవరు? హరీశ్ చతుర్వేదికి ఒక సందేహం వచ్చింది. చివరికి అతడి సందేహమే నిజమైంది. ఎలా జరిగింది! శృతి చతుర్వేది వయసు 28. ఢిల్లీలో మీడియా మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగి. ఆమె పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ల కజిన్ అతడి భార్యతోపాటు శృతి ఇంటికి వచ్చాడు. అతడి ప్రేమను అతడి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి ప్రేమించిన అమ్మాయితోపాటు శృతి వాళ్ల ఇంటికి వచ్చి తలదాచుకున్నాడు. అలా వచ్చిన ఆ దంపతులు కొన్ని నెలల పాటు ఉండిపోయారు. ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక ల్యాప్‌టాప్‌ని అందరూ ఉపయోగించేవారు. శృతి ఇంట్లో అందరూ తెరిచిన పుస్తకంలా ఉండేవారు. ఎవరికీ ఏ రహస్యాలు లేని జీవితాలు వాళ్లవి. ఇంట్లో అందరి ముఖ్యమైన సమాచారంతోపాటు పిక్నిక్లకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలు కూడా అదే ల్యాప్‌టాప్‌లో ఉండేవి. శృతి కజిన్ దంపతులకు ఉద్యోగ ప్రయత్నాల కోసం ఆ ల్యాప్‌టాప్‌నే ఇచ్చారు శృతివాళ్లు. శృతి కజిన్ భార్య కంప్యూటర్ ఇంజనీర్. ఇదంతా చేసింది ఆమే. ఫొటోషాప్‌లో శృతి ఫొటోలను మార్ఫింగ్ చేసింది. వాళ్లకు ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో తమకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి వాళ్లనే అభాసుపాలు చేశారు. ఇలా ఉండాలి! శృతి అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ‘‘ఆ రోజు మా నాన్న అంత హుందాగా వ్యవహరించి ఉండకపోతే ఈ రోజు నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్‌గా నిలిచేదాన్ని కాదు. నాకు ధైర్యం చెప్పి, ఆ ద్రోహుల్ని ఇంటి నుంచి తరిమివేశాడు. తండ్రి పిల్లల్ని సమాజం వైపు నిలబడి చూడకూడదు. తన పిల్లల వైపు నిలబడి సమాజాన్ని ఎదుర్కోగలగాలి. ఇది ధైర్యవంతులకే సాధ్యం. మా నాన్న ధీరుడు’’ అంటోంది శృతి చతుర్వేది. -
నా బయోపిక్‌లో ఆయనే హీరో: యువరాజ్
సినిమాల్లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంటుంది. ప్రస్తుతం సినిమాల్లో నడుస్తున్న ట్రెండ్ బయోపిక్స్. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇప్పుడు ఈ ట్రెండే నడుస్తుంది. ఫేమస్ పర్సనాలిటీల లైఫ్ స్టోరీలను తెరమీదకు తీసుకురావడానికి పోటీపడుతున్నారు. సినిమా స్టార్, బిజినెస్ మాన్, పొలిటీషియన్లతో పాటు క్రికెటర్ల లైఫ్ స్టోరీస్ కూడా బయోపిక్‌ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ల బయోపిక్‌లు తెరకెక్కగా, ఇప్పుడు ఇండియన్ గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా రూపొందిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ కూడా తన బయోపిక్‌లో నటించే హీరో ఎవరో తెలియజేశారు. చదవండి: యువ కోచ్‌ను కబలించిన కరోనా ఈ మధ్య ఓ ఇంటర్యూలో యువీ కూడా బయోపిక్‌పై మాట్లాడుతూ.. ‘వాస్తవానికి నా బయోపిక్‌లో నేనే నటిస్తాను. కానీ దీన్ని బాలీవుడ్ చిత్రంగా తెరకెక్కిస్తారు కనుక హీరోను డైరెక్టర్ సెలెక్ట్ చేస్తారు. నాకైతే సిద్దాంత్ చతుర్వేది మంచి ఆప్షన్. ‘గల్లీబాయ్' చిత్రంలో అతను చేసిన షేర్ పాత్ర అద్భుతంగా ఉంది. ఆ చిత్రంలో అతన్ని అలా చూడటం బాగా నచ్చింది' అని యువీ తెలిపారు. తన జీవితాన్ని తెరపై చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ‘గల్లీ బాయ్' చిత్రంతో సిద్ధాంత్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఐపీఎల్ నేపథ్యంలో తెరకెక్కిన ఇన్సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్‌లో కూడా సిద్దాంత్ నటించారు. ఈ సిరీస్‌లో టీమిండియా వెటరన్ బౌలర్ శ్రీశాంత్‌ను పోలి ఉండే ప్రశాంత్ కనుజ పాత్ర పోషించారు. ఇది కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా.. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో ధోని సేన టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించారు. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. అనంతరం ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించిన యువరాజ్.. మళ్లీ బ్యాట్ పట్టి మెరుపులు మెరిపించారు. ఇలా భారత్ క్రికెట్లో తన ఆటతో అభిమానుల గుండెల్లో చెరుగని ముద్రవేసుకొని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. చదవండి: ప్రేక్షకులు లేకుండానే గ్రాండ్‌ప్రి ఈవెంట్లు -
ధైర్యమున్న పిల్లే!
కింగ్ ఫిషర్స్ క్యాలెండర్ గురించి మీరు వినే ఉంటారు. చాలా ఫేమస్.అందులో లేడీ మోడల్స్ ఉంటారు. అయితే ఇందులో మేల్ మోడల్స్ఉంటారు. అందుకే దీన్ని క్వీన్ ఫిషర్స్ క్యాలెండర్ అనొచ్చు. విశేషం ఏంటంటే.. ఈ మేల్ క్యాలెండర్ కోసం బాలీవుడ్ బాయ్స్‌ని షూట్ చేసింది... ఓ లేడీ ఫొటోగ్రాఫర్. ధైర్యమున్న పిల్లే! మహిళా మోడళ్లతో ఏ దివిలోనో ఫొటో సెషన్ పెట్టి, ఏటా అందమైన క్యాలెండర్ రిలీజ్ చేసి, ఓ ట్రెండ్ సెట్ చేసింది ‘కింగ్ ఫిషర్స్’ సంస్థ. అయితే ఆ క్రెడిట్ అంతా ఫొటోగ్రాఫర్ అతుల్ కాస్బేకర్ది. అలా స్త్రీ సౌందర్య రాశులను మగ ఛాయాచిత్ర గ్రాహకులు అందాల చట్రంలో బంధించడం అన్నది ఓ సంప్రదాయం అయింది. అయితే ఇప్పుడా సంప్రదాయాన్ని బద్దలు కొట్టేశారు లేడీ ఫొటోగ్రాఫర్ శర్వీ చతుర్వేది. ఎలా సాధ్యం అయింది? శర్వీ 2015లో తొలిసారిగా.. కింగ్ ఫిషర్ క్యాలెండర్ చిన్నబుచ్చుకునేలా.. ఆల్ మేల్ మోడల్స్‌తో ఫొటో షూట్ చేశారు. మేల్ మోడల్స్‌గా పోజ్ ఇచ్చిన వాళ్లంతా బాలీవుడ్ యంగ్ చాప్స్. ‘‘లైఫ్ ఇన్ ఏ డాట్ సిరీస్’’ అనే పేరుతో ఆ షూట్‌ను నిర్వహించారు శర్వీ. కింగ్‌ఫిషర్ క్యాలెండర్.. స్విమ్ సూట్లో అమ్మాయిలను షూట్ చేసినట్టే శర్వీ కూడా పన్నెండు మంది బాలీవుడ్ అబ్బాయిలను స్విమ్‌సూట్‌లో షూట్ చేశారు. ఇలాంటి షూట్ చేసిన ఫిమేల్ ఫొటోగ్రాఫర్స్ చాలా చాలా అరుదు. వాళ్లలో శర్వీ ఒకరు. ‘‘చాలా మందికి విడ్డూరంగా అనిపించవచ్చు. కాని ఇది ఫోటోగ్రాఫర్ ఈస్థటిక్స్‌కు సంబంధించింది. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి, ఆవిష్కరించడానికి పరిణతి ఉండాలి. కళాత్మకతతో పాటు గ్లామరస్ ఫార్మెట్ కూడా అవసరం’’ అంటారు శర్వీ. ఇక్కడ జెండర్ ప్రాధాన్యం కాదు అని కూడా అంటారు శర్వీ.‘‘ స్విమ్‌సూట్‌లో అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఫొటోగ్రాఫర్‌కు ఇమేజ్ ముఖ్య భూమిక పోషిస్తుంది. అమ్మాయిలతో ఫొటో షూట్ అంటే వందరకాల ప్రయోగాలకు ఆస్కారం ఉంటుంది. అదే అబ్బాయిలతో అంతగా ఉండదు. చాలెంజింగ్ తీసుకోవాలి. స్టీరియోటైప్‌ను బ్రేక్‌ను చేయాలి. మోడల్స్‌తో కంటే యాక్టర్స్‌తో షూట్ తేలిక అనుకుంటున్నా. ఎందుకంటే క్యాలెండర్‌కు ఓ థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ప్రకారమే ఫొటో ఇమేజెస్‌ను ప్రొజెక్ట్ చేయాలి. అంటే ఒకరకంగా వాళ్లతో యాక్ట్ చేయించడమన్నట్టే కదా. యాక్టర్స్ అయితే కాన్సెప్ట్‌ను త్వరగా అర్థం చేసుకుంటారు. కావల్సిన హావభావాలు పలికిస్తారు. అందుకే మెడల్స్ కన్నా యాక్టర్స్తోనే ఫోటో షూట్ ఈజీ అనుకుంటున్నా’’ అని అంటారు శర్వీ. ఈ ఫొటో షూట్ కోసం దబ్బూ రత్నాని, సుభాష్ ఘై లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు శర్వీ. ‘‘దబ్బూ సర్.. అబ్జర్వేషన్ స్కిల్స్‌ను ఎలా పెంపొందించుకోవాలో, సహనంగా ఎలా ఉండాలో నేర్పారు. ఇక సుభాష్ ఘై సర్.. ‘‘గ్రహించాలి.. వినాలి.. చదవాలి’’ అనే మూడు ప్రిన్సిపల్స్ పాటిస్తారు. తనతో పనిచేసేవాళ్లు అవి పాటించేలా చూస్తారు. ‘‘జీవితంలో నువ్వు నిత్య విద్యార్థివే’’ అని చెప్తుంటారు’’ అని వాళ్లతో పనిచేసిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు శర్వీ చతుర్వేది. లైఫ్ ఇన్ ఏ డాట్ అంటే? డాట్ అంటే శర్వీ భావనలో ఒక వృత్తం. జీవితమనే పరిపూర్ణమైన వృత్తం. జీవితంలోని ప్రతి పని ఆ వృత్తాన్ని పెంచుతూ ఉంటుంది. దీనికి లైఫ్ ఇన్ ఏ డాట్ అనే లోగోలో పెద్ద ఎర్ర కుర్చీని సంకేతంగా చూపించారు శర్వీ. ఇలా డిఫరెంట్ ఫొటో షూట్‌ను కంటిన్యూ చేయడం ఇష్టమేనని, చాలెంజెస్‌ను స్వీకరించడం తన నైజమని అంటున్నారు శర్వీ చతుర్వేది. -
బ్రెయిన్ పవర్
యుద్ధోన్మాదం, మారణ హోమం అంతా మగశక్తిదే. నారీశక్తి ఆధిక్యం కోసం చూడదు. నష్ట నివారణ కోసం చూస్తుంది. నవ నిర్మాణం కోసం చూస్తుంది. శత్రువు గురిపెట్టి కూర్చున్న మారణాస్త్రాన్ని ఐదువేల కిలోమీటర్ల దూరం నుంచి టార్గెట్ చేసి ‘ఫట్’మని కొట్టడానికి కావలసింది.. కండలు తిరిగిన బాడీ కాదు, బ్రెయిన్! స్త్రీ, పురుషులలో అంత షార్ప్ బ్రెయిన్ ఎవరికుంది? ఇంకెవరికి! మహిళలకే. ‘మహిళలకే’ అని ఊరికే అనేయడం కాదు. పరిశోధకుల ‘కంపారిటివ్ స్టడీస్’లో.. ఫిమేల్ బ్రెయినే ఎప్పుడూ గుడ్ కండిషన్లోనే ఉంటుందని ఇప్పటికెన్నోసార్లు నిర్ధారణ అయింది. అదికాదు విశేషం. ఎలాంటి వరస్ట్ కండిషన్స్‌లోనైనా గుడ్ కండిషన్లోనే పనిచేస్తుందట మహిళల మైండ్. అదీ వాళ్ల గ్రేట్‌నెస్! కోపమొస్తే అరిచేయడం, రెచ్చగొడితే విరుచుకు పడడం మగవాళ్ల బలంలోని బలహీనతలు. యుద్ధ పరిస్థితుల్లో అవి నడవ్వు. ఓర్పుండాలి. వ్యూహం ఉండాలి. ప్రశాంతంగా ఆలోచించే ‘ప్రెజన్స్ ఆఫ్ మైండ్’ ఉండాలి. ప్రపంచదేశాల రక్షణ వ్యవస్థలు మహిళల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి.. ‘అమ్మా.. రండి’ అని ఆహ్వాన దరఖాస్తులు పెట్టుకుంటున్నాయంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండే కారణం! రెండు వారాల క్రితం అవని చతుర్వేది అనే యువతి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్‌ను గగనంలో సోలోగా గింగిర్లు కొట్టించి నేర్పుగా నేలకు దిగివచ్చింది. అంతటి గట్స్ ఉన్న ఫస్ట్ ఇండియన్ ఉమన్.. అవని. ఇక నిర్మలా సీతారామన్ భారతదేశపు తొలి మహిళా రక్షణశాఖ మంత్రి. (ఇందిరాగాంధీ రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు కానీ, ప్రధానిగా ఉంటూ అదనపు బాధ్యతగా మాత్రమే ఆమె ఆ శాఖను నిర్వహించారు). సోల్జర్లు, బాంబర్ పైలట్లు, కల్నళ్లు, జనరళ్లు.. ఇలా అన్ని స్థాయిలలో, అన్ని దేశాలలో మహిళలు కనిపించడం నిజానికిప్పుడు సాధారణం అయింది. అయితే ఏదో నిరూపించుకోవాలని వీళ్లీ యుద్ధక్షేత్రాల్లోకి రావడం లేదు. ‘వియ్ టూ’ అని పోటీగా కూడా పిడికిలి బిగించడం లేదు. కాన్ఫిడెన్స్ ఉంది. వచ్చేస్తున్నారు. దేశాలకు నమ్మకం ఉంది. వారిని రమ్మంటున్నాయి. నమ్మకం దేనిపైనంటే.. నారీశక్తి మీద! హిస్టరీలో లిస్టవుట్ చేస్తే.. యుద్ధోన్మాదం, మారణహోమం అంతా మగశక్తిదే. ఊరికే దాహం! ఆధిక్యం కోసం. నారీశక్తి ఆధిక్యం కోసం చూడదు. నష్ట నివారణ కోసం చూస్తుంది. నవ నిర్మాణం కోసం చూస్తుంది. యుద్ధం కోసం పురుషుడు మీసాలైనా రాని పిల్లల్ని సైన్యంలోకి రప్పిస్తే, స్త్రీ.. యుద్ధనేతల్ని సైతం పిల్లలుగా కూర్చోబెట్టి.. వాళ్ల చేతిలో తలా ఇంత ‘బుద్ధి’ని ముద్దలు చేసి పెడుతుంది. అభివృద్ధి కన్నా ఇప్పుడు ముఖ్యం బుద్ధి. అది మహిళ చేతిలో ఉంది. చెయ్యి చాపి అడగడం నామోషీ అనుకుంటే, పెట్టడానికి ఆమె చాపిన చెయ్యికి దోసిలి పడితే సరి. మిగ్–21 బైసన్ యుద్ధ విమానాన్ని నింగిలో సోలోగా ఒక ఆట ఆడించేందుకు సిద్ధమవడానికి ముందు చిరునవ్వులు చిందిస్తున్న అవని చతుర్వేది (ఫైల్ ఫొటో) -
'చతుర్వేదిని డిప్యుటేషన్‌పై ఇవ్వండి'
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎఫ్ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది సేవలు తమకెంతో అవసరమని, ఆయన్ను వెంటనే డిప్యుటేషన్‌పై పంపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తాజాగా లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేయడానికి సుముఖత తెలుపుతూ చతుర్వేది రాసిన లేఖను కూడా కేజ్రీవాల్ జతచేశారు. చతుర్వేది హర్యానా కేడర్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ డిప్యూటీ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. ఢిల్లీ సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా ఆయన సేవలు అత్యవసరమని, కాబట్టి ఆయన్ను డిప్యుటేషన్‌పై పంపుతూ ఉత్తర్వులివ్వాలని జవదేకర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. నిజాయితీపరుడైన అధికారిగా పేరుపొందిన చతుర్వేదిని ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక(యాంటీ కరప్షన్) విభాగం అధిపతిగా నియమించే అవకాశమున్నట్టు సమాచారం. చతుర్వేది ఇంతకుముందు ఎయిమ్స్‌లో డిప్యూటీ సెక్రటరీ బాధ్యతలతోపాటు చీఫ్ విజిలెన్స్ అధికారి(సీవీవో)గానూ వ్యవహరించారు. నిజాయితీపరుడైన అధికారిగా గుర్తింపుపొందారు. ఎయిమ్స్‌లో పలు కుంభకోణాలు బయటపెట్టి సంచలనం సృష్టించారు. అయితే మోదీ సర్కారు ఆయన్ను ఎయిమ్స్ సీవీవో విధులనుంచి అర్ధంతరంగా తప్పించింది. కాగా చతుర్వేదిని ఢిల్లీ విధులకు పంపేందుకు వెంటనే ఫైలును సిద్ధం చేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తమ శాఖ అధికారులను మంగళవారం ఆదేశించారు.