ఈ అందెల రవళి ‘ఆహా’ ‘ఓహో’లకు పరిమితమైనది కాదు. అద్భుతమైన రెండుకళారూపాల సంగమం. చరిత్రలోని కళను వర్తమానంలో వెలిగించే అఖండ దీపం. విస్మరణకు గురైన కళాకారులకు ఇచ్చే అరుదైన నీరాజనం...
పాతికేళ్ల క్రితం సూఫీ కథక్ కళతో ప్రస్థానం ప్రారంభించింది మంజరి చతుర్వేది.
‘సూఫీ, పంజాబీ జానపద సంగీత ప్రదర్శనలు ఇవ్వడం, నలుపు రంగు దుస్తులు ధరించడం, ఖవ్వాలితో కథక్ చేయడం లాంటివి చూసి శాస్త్రీయ కళను వక్రీకరిస్తుంది అని కొందరు నాపై విమర్శ చేశారు. అయితే అవేమీ నా ప్రయాణాన్ని ఆపలేదు’ అంటుంది లక్నోకు చెందిన మంజరి.
చిత్ర నిర్మాత ముజఫర్ అలీ, గురువు ప్రోతిమా బేడితో కలిసి ఈ నృత్యరూపంపై పనిచేసింది. మొదట్లో స్పందన ఎలా ఉన్నప్పటికీ సంగీత ప్రియులు సూఫీ కథక్‌ను ప్రశంసిస్తున్నారు.
‘ఇది నా గురువుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను’ అంటుంది మంజరి.
పండిట్ అర్జున్ మిశ్రా వద్ద కథక్, కళానిధి నారాయణ్ వద్ద అభినయ్, ఫాహిమ్– ఉద్–దిన్ దాగర్ వద్ద సూఫీ సంగీతం నేర్చుకుంది. సూఫీ సాధువులు, ఆధ్యాత్మికవేత్తలందరినీ తన గురువుగా భావిస్తుంది. ‘సూఫీ కథక్’ తొలి ప్రదర్శన దిల్లీలో ఇచ్చింది. ఇప్పటి వరకు 26 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. కైలాష్ ఖేర్, ఉస్తాద్ శౌకత్ అలీ ఖాన్, సబ్రీ బ్రదర్స్‌లాంటి ఎంతోమంది కళాకారులతో కలిసి పనిచేసింది.
ఇరాన్, టర్కీ, మొరాకోకు చెందిన కళకారులతో గొంతు కలిపింది. సూఫీ తత్వంలోని సంగీత, నృత్యరూపాలను లోతుగా అధ్యయనం చేసింది. ‘రాజనర్తకీమణుల నృత్యాలలో అద్భుత ప్రతిభ దాగి ఉన్నప్పటికీ ప్రశంసించడానికి మాత్రం మనకు మనసు రాదు’ అంటున్న మంజరి విస్మరణకు గురైన కళాకారుల ప్రతిభను వెలుగులోకి తెస్తుంది.
రకరకాల ప్రాజెక్ట్‌లు చేపట్టింది. వాటిలోని ఖ్వాజా ప్రాజెక్ట్ మన దేశంలో సూఫీ ప్రతిధ్వనులను వినిపిస్తుంది. సూఫీ కవులను తెర పైకి తెస్తుంది. గొప్ప కవుల జీవితాన్ని, సాహిత్యాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. 18వ శతాబ్దానికి చెందిన సూఫీ ఆధ్యాత్మికవేత్త, పంజాబ్‌కు చెందిన కవి బాబా బుల్లెహ్ షా. ఆయన ఆధ్యాత్మిక కవిత్వాన్ని తన నృత్యప్రదర్శనల ద్వారా ఈ తరానికి చేరువ చేస్తుంది మంజరి.
‘స్వీయ అన్వేషణ, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసమే షా తన జీవితాన్ని అంకితం చేశాడు. కళాత్మక రూపాలు అణచి వేయబడుతున్న కాలంలో ఆయన మౌనంగా కూర్చోలేదు. నియమాలను ధిక్కరించి పంజాబ్ వీధుల్లో తిరుగుతూ పాటలు పాడేవాడు. నృత్యాలు చేసేవాడు. ధిక్కార స్వరాన్ని వినిపించేవాడు’ అంటుంది మంజరి.
మంజరి చతుర్వేదికి ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు. శిక్షణలో భాగంగా ‘నాద్ ధ్యాన్’ చేయిస్తుంది.
‘ప్రదర్శన ఇవ్వడానికి పండిట్ జస్రాజ్ నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు నేను సరిౖయెన దారిలోనే ప్రయాణిస్తున్నాను అనే ధైర్యాన్ని ఇస్తాయి’ అంటుంది మంజరి చతుర్వేది.
Comments
Please login to add a commentAdd a comment