kathak dancer
-
Manjari Chaturvedi: సూఫీ కథక్ 25
ఈ అందెల రవళి ‘ఆహా’ ‘ఓహో’లకు పరిమితమైనది కాదు. అద్భుతమైన రెండుకళారూపాల సంగమం. చరిత్రలోని కళను వర్తమానంలో వెలిగించే అఖండ దీపం. విస్మరణకు గురైన కళాకారులకు ఇచ్చే అరుదైన నీరాజనం... పాతికేళ్ల క్రితం సూఫీ కథక్ కళతో ప్రస్థానం ప్రారంభించింది మంజరి చతుర్వేది. ‘సూఫీ, పంజాబీ జానపద సంగీత ప్రదర్శనలు ఇవ్వడం, నలుపు రంగు దుస్తులు ధరించడం, ఖవ్వాలితో కథక్ చేయడం లాంటివి చూసి శాస్త్రీయ కళను వక్రీకరిస్తుంది అని కొందరు నాపై విమర్శ చేశారు. అయితే అవేమీ నా ప్రయాణాన్ని ఆపలేదు’ అంటుంది లక్నోకు చెందిన మంజరి. చిత్ర నిర్మాత ముజఫర్ అలీ, గురువు ప్రోతిమా బేడితో కలిసి ఈ నృత్యరూపంపై పనిచేసింది. మొదట్లో స్పందన ఎలా ఉన్నప్పటికీ సంగీత ప్రియులు సూఫీ కథక్‌ను ప్రశంసిస్తున్నారు. ‘ఇది నా గురువుల ఆశీర్వాదంగా భావిస్తున్నాను’ అంటుంది మంజరి. పండిట్ అర్జున్ మిశ్రా వద్ద కథక్, కళానిధి నారాయణ్ వద్ద అభినయ్, ఫాహిమ్– ఉద్–దిన్ దాగర్ వద్ద సూఫీ సంగీతం నేర్చుకుంది. సూఫీ సాధువులు, ఆధ్యాత్మికవేత్తలందరినీ తన గురువుగా భావిస్తుంది. ‘సూఫీ కథక్’ తొలి ప్రదర్శన దిల్లీలో ఇచ్చింది. ఇప్పటి వరకు 26 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. కైలాష్ ఖేర్, ఉస్తాద్ శౌకత్ అలీ ఖాన్, సబ్రీ బ్రదర్స్‌లాంటి ఎంతోమంది కళాకారులతో కలిసి పనిచేసింది. ఇరాన్, టర్కీ, మొరాకోకు చెందిన కళకారులతో గొంతు కలిపింది. సూఫీ తత్వంలోని సంగీత, నృత్యరూపాలను లోతుగా అధ్యయనం చేసింది. ‘రాజనర్తకీమణుల నృత్యాలలో అద్భుత ప్రతిభ దాగి ఉన్నప్పటికీ ప్రశంసించడానికి మాత్రం మనకు మనసు రాదు’ అంటున్న మంజరి విస్మరణకు గురైన కళాకారుల ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. రకరకాల ప్రాజెక్ట్‌లు చేపట్టింది. వాటిలోని ఖ్వాజా ప్రాజెక్ట్ మన దేశంలో సూఫీ ప్రతిధ్వనులను వినిపిస్తుంది. సూఫీ కవులను తెర పైకి తెస్తుంది. గొప్ప కవుల జీవితాన్ని, సాహిత్యాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. 18వ శతాబ్దానికి చెందిన సూఫీ ఆధ్యాత్మికవేత్త, పంజాబ్‌కు చెందిన కవి బాబా బుల్లెహ్ షా. ఆయన ఆధ్యాత్మిక కవిత్వాన్ని తన నృత్యప్రదర్శనల ద్వారా ఈ తరానికి చేరువ చేస్తుంది మంజరి. ‘స్వీయ అన్వేషణ, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసమే షా తన జీవితాన్ని అంకితం చేశాడు. కళాత్మక రూపాలు అణచి వేయబడుతున్న కాలంలో ఆయన మౌనంగా కూర్చోలేదు. నియమాలను ధిక్కరించి పంజాబ్ వీధుల్లో తిరుగుతూ పాటలు పాడేవాడు. నృత్యాలు చేసేవాడు. ధిక్కార స్వరాన్ని వినిపించేవాడు’ అంటుంది మంజరి. మంజరి చతుర్వేదికి ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఉన్నారు. శిక్షణలో భాగంగా ‘నాద్ ధ్యాన్’ చేయిస్తుంది. ‘ప్రదర్శన ఇవ్వడానికి పండిట్ జస్రాజ్ నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు నేను సరిౖయెన దారిలోనే ప్రయాణిస్తున్నాను అనే ధైర్యాన్ని ఇస్తాయి’ అంటుంది మంజరి చతుర్వేది. -
ప్రముఖ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత
-
ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు!
అవరోధాలు, ఆటంకాలు, అడ్డుగోడలు ఎన్ని ఎదురైనా మనలో ప్రతిభ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త ఆలస్యమైనా చివరికి నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటాం. అనుకున్న దానిని సాధించేందుకు పట్టుదలతో పాటు ఆత్మస్థైర్యం ఉండాలని నిరూపించి, ఉదాహరణగా నిలుస్తోంది పదిహేడేళ్ల ఖుషీ శర్మ. ఒక పక్క చదువు, మరోపక్క ఆటల్లో రాణిస్తూనే పాఠకులు మెచ్చే నవలను రాసి, టీన్ ఆథర్‌గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చండీగఢ్‌కు చెందిన ఖుషీ శర్మ ఇంటర్మీడియట్ విద్యార్థి. జాతీయ స్థాయి స్క్వాష్ పోటీల్లో పాల్గొని రెండుసార్లు పతకాలను సాధించింది. పియానో బాగా ప్లే చేస్తుంది. కథక్ డ్యాన్సర్. అనేక స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఏది అనిపించినా వెంటనే నోట్ చేసుకునే అలవాటు ఉన్న ఖుషీ..ఏకంగా సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నవలను రాసింది.‘ద మిస్సింగ్ ప్రాఫెసీ– రైజ్ ఆఫ్ ద బ్లూ ఫోనిక్స్’ పేరిట నవలను విడుదల చేసింది. బుక్ విడుదలైన నెలరోజుల్లోనే వెయ్యికాపీలు అమ్ముడవడమేగాక, అమేజాన్ ట్రెండింగ్ బుక్ జాబితాలో టాప్‌ప్లేస్‌లో దూసుకుపోతోంది ఖుషి నవల. ఇంత చిన్నవయసులో థ్రిల్లింగ్ నవలను రాసి పాఠకుల మనసులు దోచుకుంటోంది ఈ టీనేజర్. కరోనా సమయంలో వైరస్‌కు సంబంధించిన అనేక విషయాలపై పరిశోధిస్తూ, అందుకు సంబంధించిన సమాచారాన్ని తను నడుపుతోన్న ‘బ్లాగ్ విత్ ఖుషి’లో పోస్ట్ చేస్తుండేది. ఇలా అనేక విషయాలమీద అవగాహన ఏర్పర్చుకున్న ఖుషి తనకు వచ్చే వినూత్న ఆలోచనలను పుస్తకంలో రాసి దాన్ని నవలగా తీర్చిదిద్దింది. ఈ నవలలో అంబర్ హార్ట్ అనే హీరోయిన్ ఉంటుంది. ఈమె మూడొందల ఏళ్లకోసారి ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే దుష్టశక్తులతో పోరాడుతుంటుంది. దీనిలో అడుగడుగునా సాహసాలు, సైన్స్, పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను ఉత్కంఠ భరితంగా కథలో వర్ణించింది ఖుషి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలు దీనిలో ఉన్నాయి. ఇంత చిన్నవయసులో ఎంతో అనుభవం ఉన్న రచయితలా ఖుషి నవలను రాయడం విశేషం. ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు! ‘‘చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టమేగానీ, నా నవల పాఠకులకు నచ్చుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా రాకముందు పదోతరగతి పరీక్షలు, మరోపక్క స్క్వాష్‌లో బిజీగా ఉండేదాన్ని. కరోనా లాక్‌డౌన్‌తో అన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. ఇలా రాస్తుండగా... ‘వన్ కంట్రోల్స్ ఫైర్, ద అదర్ కంట్రోల్స్ సోల్, టు సేవ్ ది వరల్డ్, ఈచ్ మస్ట్ ప్లే దెయిర్ రోల్’ కవిత తట్టింది. దీని ఆధారంగా పదిహేడు చాప్టర్ల వరకు రాశాను. అయితే మధ్యలో నా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. ఖాళీ సమయం దొరకడంతో అక్కను విసిగిస్తున్నానని చెప్పి ‘నువ్వు రాస్తున్న బుక్‌ను రెండురోజుల్లో’ పూర్తిచేయగలవా? అని ఇంట్లో వాళ్లు డెడ్‌లైన్ పెట్టారు. దీంతో కొన్ని రోజుల్లో తొమ్మిదివేల పదాలు రాశాను. అలా రాస్తూ 75000 పదాలతో ఏకంగా ఈ నవలను రాయగలిగాను’’ అని ఖుషి చెప్పింది. -
కథక్ భూషణుడు
ఆయన చేయి కదిపితే కథక్... కాలు కదిపితే కథక్... కనుల భావాలు కథక్... పెదవి పలికితే కథక్... ఆపాద మస్తకం కథక్... దక్కనీ కథక్ ను సృష్టించారు... వరల్డ్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహించారు... కథక్ మీద పుస్తకం ప్రచురించారు... గోపీకృష్ణ, బిర్జూ మహరాజ్‌లను కలుసుకున్నారు... తబలా వాయించారు... నటరాజ రామకృష్ణను ఆదర్శంగా తీసుకున్నారు... ఆరు పదుల వయసు మీద పడుతున్నా... ఆలోచనలు మాత్రం రెండు పదులు దాటనివ్వని ఆ కథక్ డాన్సర్ పేరు అంజుబాబు... తన నాట్య ప్రయాణం గురించి సాక్షికి ప్రత్యేకంగా చెప్పిన వివరాలు... మా నాన్నగారిది విజయవాడ. ఆయన ఉద్యోగ రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాం. అక్కడే విద్యాభ్యాసం, నాట్యాభ్యాసం కూడా. నాకు బాల్యం నుంచి చదువు మీద కంటె నాట్యం మీద శ్రద్ధ ఉండేది. ముఖ్యంగా ప్రతి యేడూ జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో నాట్య ప్రదర్శనలు చూసేవాడిని. అలాగే నిమజ్జనం సమయంలో డాన్స్ చేసేవాణ్ని. నేను లయబద్ధంగా చేయడం చూసిన మా అమ్మగారి స్నేహితులు, ‘‘మీఅబ్బాయి డాన్స్ చాలా బాగా చేస్తున్నాడు. అతడికి మంచి గురువు దగ్గర నాట్యం నేర్పించండి’ అని సలహా ఇచ్చారు. ఇంకేమీ ఆలోచించకుండా అమ్మ నన్ను ‘ైెహ దరాబాద్, రామ్కోఠీలో వున్న మ్యూజిక్ కాలేజీలో చేరమంది. నేను సరేనని ఆ కాలేజీకి వెళ్లాను. అక్కడ అన్ని నాట్య రీతులు చూసిన మీదట, మగవారికి కథక్ నాట్యమైతే బావుంటుందనిపించి, కథక్ విభాగంలో చేరాను. అప్పుడు నాకు పన్నెండేళ్లు. అలా నా నాట్య ప్రయాణం కథక్‌తో ప్రారంభమైంది. అక్కడ కోర్సు పూర్తయ్యాక ‘ఢిల్లీ సంగీత నాటక అకాడెమీ’ లో కథక్ విభాగంలో 120 రూపాయల ఉపకార వేతనం మీద ఢిల్లీలో అడ్వాన్స్డ్ కోర్సు నేర్చుకున్నాను. సాధారణంగా ఢిల్లీ వెళ్లినవారు అక్కడే స్థిరపడిపోతారు. అయితే నేను మాత్రం మళ్లీ అక్కడికే వచ్చి కథక్ నాట్యాన్ని విద్యార్థులకు నేర్పాను. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి పట్టణంలోనూ శిష్యులతో కలిసి నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. మొదటిసారిగా కోస్తా జిల్లాల్లో కథక్ నాట్యాన్ని ప్రచారం చేసి, ఆ నాట్యం ఇలా ఉంటుందని చూపింది నేనే. ‘కథక్’ దక్షిణాది వారిది కూడా... చాలామంది కథక్ నాట్యం ఉత్తరాది వారిదే అనుకుంటారు. అయితే అవ్వచ్చు కానీ, హైదరాబాద్‌లో మొఘలుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల, హైదరాబాద్ నగరం కథక్‌కి నిలయంగా ఉండేది. నటరాజ రామకృష్ణ వంటి వారు భాగ్యనగరానికి వచ్చాక ఇక్కడ కథక్ నాట్యం కొద్దిగా వెనుకబడింది. ప్రభుత్వాలు కూడా ‘మనం తెలుగువాళ్లం, మన కూచిపూడిని ప్రోత్సహిద్దాం’ అని ఆ నాట్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో, ఇక్కడ కూచిపూడి నేర్చుకునేవారు ఎక్కువై, కథక్ మరికొంత వెనుకబడింది. మరచిపోలేని సంఘటనలు... ప్రతి నాట్య ప్రదర్శనలోనూ నాకు తగినంత ప్రోత్సాహం వచ్చింది. అయితే అందరిలాగే నా జీవితంలోనూ మరపురాని సంఘటనలు ఉన్నాయి. 1970 ప్రాంతంలో, రవీంద్రభారతి మినీ థియేటర్లో నా నాట్య ప్రదర్శన చూసిన ఈల పాట రఘురామయ్యగారు నా దగ్గరకు వచ్చి, భుజం తట్టి, ‘చాలా బాగా చేశావు. వృద్ధిలోకి వస్తావు’ అని నన్ను ప్రశంసించి, ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వదించినట్లే నేను వృద్ధిలోకి వచ్చాను. మరో సంఘటన... టెక్సాస్‌లో వారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశానికి సంబంధించిన అనేక నృత్యరీతుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కథక్‌కి సంబంధించి నన్ను ఆహ్వానించారు. నా నాట్యం చూసి, ‘ఇలాంటి డ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు’ అని కమిటీ వారు మెచ్చుకోవడం, నా జీవితంలో మర్చిపోలేను. దక్కనీ ఘరానా... నటరాజ రామకృష్ణ ‘ఆంధ్రనాట్యం’ సృష్టించాక, నాకు కూడా కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అలా వచ్చిన ఆలోచనకు రూపకల్పనే ‘దక్కనీ ఘరానా’. ప్రతి ఒక్కరూ సులువుగా నేర్చుకునేలా హస్త ముద్రలలో, కదలికలో చిన్న చిన్న మార్పులు చేశాను. ఈ మార్పుల వల్ల, ఏడాది లోపే ప్రదర్శన ఇవ్వగలుగుతున్నారు. వరల్డ్ డాన్స్ ఫెస్టివల్... కోణార్క, ఖజురహో వంటి ప్రదేశాలలో నాట్యోత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి. నేను మన హైదరాబాద్‌లో ‘డెక్కన్ డ్యాన్స్ ఫెస్టివల్’ ప్రారంభించాను. అలాగే ప్రతి యేడాదీ ‘వరల్డ్ డ్యాన్స్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాను. అన్నిరకాల నృత్య రీతులకు సంబంధించిన ప్రసిద్ధ కళాకారుల నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి, వారిని ఘనంగా సన్మానిస్తాను. ప్రత్యేకంగా రూపొందించినవి... ‘నిర్భయ’ సంఘటన మీద చేసిన బ్యాలే చూసి, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నన్ను ప్రశంసించారు. జాతీయ సమైక్యత మీద తయారు చేసిన ‘ఏక్తా కా దివస్’ ప్రదర్శనకు అమెరికాలోని దూరదర్శన్ ‘ఉత్తమ ప్రదర్శన’ అవార్డు వచ్చింది. ఇంకా... జటాయు వధ, ‘రంగ రంగ రంగపతి’ అనే అన్నమయ్య కీర్తనకు నృత్యం సమకూర్చాను. మరిన్ని కీర్తనలకు కూడా నాట్యం సమకూరుస్తున్నాను. కథక్ కళాక్షేత్ర... కథక్ నృత్య వికాసం... చెన్నైలో శ్రీమతి రుక్మిణీ అరండేళ్ స్థాపించిన ‘కళాక్షేత్ర’ స్ఫూర్తితో హైదరాబాద్‌లో కథక్ కళాక్షేత్ర స్థాపించాను. దక్షిణభారతదేశంలో కథక్‌కి సంబంధించిన కళాక్షేత్రం ఇదొక్కటే. పూర్వం రోజుల్లో కథక్‌కి సంబంధించిన పుస్తకాలన్నీ బ్రిజ్ భాషలోనే ఉండేవి. అందువల్ల అందరికీ అర్థం అయ్యేవి కాదు. నటరాజ రామకృష్ణ మాస్టారి సూచనల మేరకు ఆ పుస్తకాన్ని ‘కథక్ నృత్య వికాసం’ పేరుతో తెనిగించాను. ఇందులో కథక్ నాట్యానికి సంబంధించిన అన్ని అంశాలూ ఉంటాయి. ఇప్పటికీ నేను చాలామంది శిష్యులను తయారుచేస్తున్నాను. వారి నాట్యంలో న న్ను నేను చూసుకుంటూ ఆనందిస్తాను. - సంభాషణ: డా.పురాణపండ వైజయంతి మధురానుభూతులు... మొదటి జార్జ్‌బుష్ దగ్గర ప్రదర్శన. {పముఖ కథక్ డ్యాన్సర్లు... గోపీకృష్ణ, బిర్జూ మహరాజ్‌లను కలుసుకోవడం అవార్డులు... 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నృత్యభూషణ అవార్డు రాజమంద్రి కళాసమితి వారిచే వెండి కిరీట బహూకరణ హోస్టన్‌లో ఇందిరా గాంధీ సాంస్కృతికసంస్థ వారి అవార్డు 2011లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం మరెన్నో పురస్కారాలు... -
శర్మిష్ట దారి వేరు, తీరు వేరు...
అనంతరం ఆడపిల్లకు తండ్రి, అన్న, భర్త... ఎవరో ఒకరి తోడు కావాలి అంటారు. కానీ శర్మిష్ట ఎవరి తోడునూ కోరుకోలేదు. ఆమెదో ప్రత్యేక ప్రపంచం. మువ్వల సవ్వళ్లు, నృత్య భంగిమలు, సంస్కృతీ సంప్రదాయాలు... అన్నీ ఆమెకు నచ్చినవే ఉంటాయా ప్రపంచంలో. అందుకే ఆమె దాన్ని విడిచి రారు. దేశాధ్యక్షుడి కూతురిగా కంటే, కథక్ డ్యాన్సర్‌గానే తనను గుర్తించమని కోరే శర్మిష్టను చూసినప్పుడు... ఆమె తండ్రి ప్రణబ్ ముఖర్జీ కళ్లలో కనిపించే గర్వం గురించి ఎంతమందికి తెలుసు! కొద్ది నెలల క్రితం భూటాన్ రాజు, రాణి మన దేశానికి విచ్చేశారు. వారికి ఆహ్వానం పలికేందుకు దేశ ప్రథమ పౌరుడైన ప్రణబ్ ముఖర్జీ విమానాశ్రయానికి వెళ్లారు. ఆయనతో పాటు ఎప్పుడూ ఉండే భార్య సువ్రా కనిపించలేదు. ఆమె బదులు మరో మహిళ ఉన్నారు. ఆమె ఎవరో కాదు... ప్రణబ్ కూతురు, ప్రముఖ కథక్ డ్యాన్సర్ శర్మిష్ట. ఆమెనలా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే... తండ్రి రాజకీయ సామ్రాజ్యంలో స్థానాన్ని కాదనుకుని, తన మనసు మెచ్చిన మార్గంలో నడుచుకుంటూ పోయారామె. అలాంటి ఆమె ఇప్పుడు విదేశీయుల్ని ఆహ్వానించడానికి తండ్రితో పాటు ఎందుకు వచ్చింది, రాజకీయాల వైపు మొగ్గు చూపుతోందా అంటూ అందరూ సందేహపడ్డారు. కానీ అలాంటిదేమీ లేదు అని తేల్చేశారు శర్మిష్ట. ‘అమ్మకు ఆరోగ్యం బాగోక నేను కొన్ని బాధ్యతలు నిర్వరిస్తున్నాను తప్ప, రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు... రాదు’ అని మరోసారి కుండ బద్దలు కొట్టారు. తండ్రి మనసు తెలిసినా... తన ఇద్దరు కొడుకులూ తన మార్గంలో నడుస్తున్నా... కూతురు తన ఆలోచనలను, నమ్మకాలను, సిద్ధాంతాలను స్పష్టంగా అర్థం చేసుకుని, నడుచుకోగలదని ప్రణబ్ నమ్ముతారని అంటారు ఆయన సన్నిహితులు కొందరు. కానీ ఆయన ఆశ శ ర్మిష్టను రాజకీయాల వైపు లాగలేకపోయింది. అందుకే ప్రణబ్ ముద్దుల కూతురు శర్మిష్ట... ఇవాళ రాజకీయ నాయకురాలిగా కాక, నృత్యకారిణిగా సత్తా చాటుతున్నారు. విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నప్పుడు... ఓ రాత్రి ప్రణబ్‌కు ఇరాన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆసియా టూర్లో ఉన్న శర్మిష్టకు ఇరాన్లో అనుమతులకు సంబంధించి ఏదో సమస్య వచ్చింది. ఏం చేయాలో తోచక అక్కడి ఎంబసీకి ఫోన్ చేస్తే, వాళ్లు ఆమె సమస్యను తీర్చి, ఆ విషయాన్ని ప్రణబ్ చెవినవేశారు. కూతురు తనను కోరిన తొలి, చివరి సాయం అదేనంటారు ప్రణబ్. శర్మిష్ట మొదట్నుంచీ తండ్రి పేరును గానీ, పలుకుబడిని గానీ వాడుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఢిల్లీలోనే ఉన్నా, తండ్రితో పాటు రాష్ట్రపతి భవన్లో నివసించరామె. తన ఇంట్లో, తను పెంచుకునే మూడు కుక్కలతో కలసి ప్రైవసీని ఎంజాయ్ చేస్తా నంటారు. ఓ నిర్ణయం తీసుకున్నా, ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నా దాన్నుంచి శర్మిష్ట మనసును మరల్చడం చాలా కష్టం. అన్ని విషయాల్లోనూ క్లియర్‌గా ఉంటారామె. నిర్భయ సంఘటన జరిగినప్పుడు తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ మహిళలను కించపరిచే విధంగా ఓ వ్యాఖ్య చేస్తే... అందరికంటే ముందు శర్మిష్టయే స్పందించారు. ‘నా సోదరుడు ఇలా మాట్లాడతాడని నేను ఊహించలేదు, అతడి స్టేట్మెంట్ విని షాక్ తిన్నాను, తన తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను’ అంటూ దేశ మహిళలందరి ముందూ చేతులు జోడించారామె. అభిజిత్ సోదరిగా కాదు, ఆత్మాభిమానం ఉన్న ఓ మహిళగా స్పందిస్తున్నాను అన్నారు. ఈ విలక్షణ వైఖరియే ఆమెను చూసి తండ్రి గర్వపడేలా చేసింది. ఆ దృఢచిత్తమే ఆమెను తాను కోరుకున్న మార్గంలో నడిపించింది. అంతులేని ఆత్మవిశ్వాసమే కథక్ డ్యాన్సర్‌గా యావత్ ప్రపంచం ముందూ ఆమెను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. అందుకే దేశాధ్యక్షుడి కూతురిగా కాక... ఆమెకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సమాజం ఆమెకిచ్చింది! పన్నెండో యేట పండిట్ దుర్గాలాల్ నృత్య ప్రదర్శన చూశాక, ఆయన శిష్యురాలిగా మారారు శర్మిష్ట. తర్వాత నాట్యమే ఆమె ప్రపంచమయ్యింది. నేటికీ నాట్యమే ఆమెకు తోడుగా సాగుతోంది. - సమీర నేలపూడి