శర్మిష్ట దారి వేరు, తీరు వేరు... | a brief description sharmista | Sakshi
Sakshi News home page

శర్మిష్ట దారి వేరు, తీరు వేరు...

Published Sun, Dec 15 2013 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

శర్మిష్ట దారి వేరు, తీరు వేరు...

శర్మిష్ట దారి వేరు, తీరు వేరు...

అనంతరం
  ఆడపిల్లకు తండ్రి, అన్న, భర్త... ఎవరో ఒకరి తోడు కావాలి అంటారు. కానీ శర్మిష్ట ఎవరి తోడునూ కోరుకోలేదు. ఆమెదో ప్రత్యేక ప్రపంచం. మువ్వల సవ్వళ్లు, నృత్య భంగిమలు, సంస్కృతీ సంప్రదాయాలు... అన్నీ ఆమెకు నచ్చినవే ఉంటాయా ప్రపంచంలో. అందుకే ఆమె దాన్ని విడిచి రారు. దేశాధ్యక్షుడి కూతురిగా కంటే, కథక్ డ్యాన్సర్‌గానే తనను గుర్తించమని కోరే శర్మిష్టను చూసినప్పుడు... ఆమె తండ్రి ప్రణబ్ ముఖర్జీ కళ్లలో కనిపించే గర్వం గురించి ఎంతమందికి తెలుసు!
 
 కొద్ది నెలల క్రితం భూటాన్ రాజు, రాణి మన దేశానికి విచ్చేశారు. వారికి ఆహ్వానం పలికేందుకు దేశ ప్రథమ పౌరుడైన ప్రణబ్ ముఖర్జీ విమానాశ్రయానికి వెళ్లారు. ఆయనతో పాటు ఎప్పుడూ ఉండే భార్య సువ్రా కనిపించలేదు. ఆమె బదులు మరో మహిళ ఉన్నారు. ఆమె ఎవరో కాదు...  ప్రణబ్ కూతురు, ప్రముఖ కథక్ డ్యాన్సర్ శర్మిష్ట. ఆమెనలా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే... తండ్రి రాజకీయ సామ్రాజ్యంలో స్థానాన్ని కాదనుకుని, తన మనసు మెచ్చిన మార్గంలో నడుచుకుంటూ పోయారామె. అలాంటి ఆమె ఇప్పుడు విదేశీయుల్ని ఆహ్వానించడానికి తండ్రితో పాటు ఎందుకు వచ్చింది, రాజకీయాల వైపు మొగ్గు చూపుతోందా అంటూ అందరూ సందేహపడ్డారు. కానీ అలాంటిదేమీ లేదు అని తేల్చేశారు శర్మిష్ట. ‘అమ్మకు ఆరోగ్యం బాగోక నేను కొన్ని బాధ్యతలు నిర్వరిస్తున్నాను తప్ప, రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు... రాదు’ అని మరోసారి కుండ బద్దలు కొట్టారు.
 
 తండ్రి మనసు తెలిసినా...
 తన ఇద్దరు కొడుకులూ తన మార్గంలో నడుస్తున్నా... కూతురు తన ఆలోచనలను, నమ్మకాలను, సిద్ధాంతాలను స్పష్టంగా అర్థం చేసుకుని, నడుచుకోగలదని ప్రణబ్ నమ్ముతారని అంటారు ఆయన సన్నిహితులు కొందరు. కానీ ఆయన ఆశ శ ర్మిష్టను రాజకీయాల వైపు లాగలేకపోయింది. అందుకే ప్రణబ్ ముద్దుల కూతురు శర్మిష్ట... ఇవాళ రాజకీయ నాయకురాలిగా కాక, నృత్యకారిణిగా సత్తా చాటుతున్నారు.
 విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నప్పుడు... ఓ రాత్రి ప్రణబ్‌కు ఇరాన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆసియా టూర్‌లో ఉన్న శర్మిష్టకు ఇరాన్‌లో అనుమతులకు సంబంధించి ఏదో సమస్య వచ్చింది. ఏం చేయాలో తోచక అక్కడి ఎంబసీకి ఫోన్ చేస్తే, వాళ్లు ఆమె సమస్యను తీర్చి, ఆ విషయాన్ని ప్రణబ్ చెవినవేశారు. కూతురు తనను కోరిన తొలి, చివరి సాయం అదేనంటారు ప్రణబ్.
 
 శర్మిష్ట మొదట్నుంచీ తండ్రి పేరును గానీ, పలుకుబడిని గానీ వాడుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఢిల్లీలోనే ఉన్నా, తండ్రితో పాటు రాష్ట్రపతి భవన్‌లో నివసించరామె. తన ఇంట్లో, తను పెంచుకునే మూడు కుక్కలతో కలసి ప్రైవసీని ఎంజాయ్ చేస్తా నంటారు. ఓ నిర్ణయం తీసుకున్నా, ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నా దాన్నుంచి శర్మిష్ట మనసును మరల్చడం చాలా కష్టం. అన్ని విషయాల్లోనూ క్లియర్‌గా ఉంటారామె. నిర్భయ సంఘటన జరిగినప్పుడు తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ అభిజిత్ మహిళలను కించపరిచే విధంగా ఓ వ్యాఖ్య చేస్తే... అందరికంటే ముందు శర్మిష్టయే స్పందించారు. ‘నా సోదరుడు ఇలా మాట్లాడతాడని నేను ఊహించలేదు, అతడి స్టేట్‌మెంట్ విని షాక్ తిన్నాను, తన తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను’ అంటూ దేశ మహిళలందరి ముందూ చేతులు జోడించారామె. అభిజిత్ సోదరిగా కాదు, ఆత్మాభిమానం ఉన్న ఓ మహిళగా స్పందిస్తున్నాను అన్నారు.
 
 ఈ విలక్షణ వైఖరియే ఆమెను చూసి తండ్రి గర్వపడేలా చేసింది. ఆ దృఢచిత్తమే ఆమెను తాను కోరుకున్న మార్గంలో నడిపించింది. అంతులేని ఆత్మవిశ్వాసమే కథక్ డ్యాన్సర్‌గా యావత్ ప్రపంచం ముందూ ఆమెను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. అందుకే దేశాధ్యక్షుడి కూతురిగా కాక... ఆమెకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సమాజం ఆమెకిచ్చింది!
 
 పన్నెండో యేట పండిట్ దుర్గాలాల్ నృత్య ప్రదర్శన చూశాక, ఆయన శిష్యురాలిగా మారారు శర్మిష్ట. తర్వాత నాట్యమే ఆమె ప్రపంచమయ్యింది. నేటికీ నాట్యమే ఆమెకు తోడుగా సాగుతోంది.  
 
 - సమీర నేలపూడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement