
సాక్షి, సిటీబ్యూరో: ‘అది ఒక రైల్వేస్టేషన్... పదహారు మంది నాట్యకారిణులు అందరూ ఒకే తరహా దుస్తులు, లగేజ్ ట్రాలీలతో ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉన్నారు. రైలు ఎప్పుడు వస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు ఆలస్యంగా వస్తుందని తెలవడంతో తమ పర్యటనలో భాగంగా ఏయే నగరాలను సందర్శించాలో చర్చించుకుంటున్నారు. ఆయా నగరాల్లో ప్రసిద్ధి చెందిన సంగీత రీతుల్లో భరతనాట్య ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించుకున్నారు..’ ఇంతకీ ఇది ఏ రైల్వేస్టేషన్‌లో జరిగిందనేకదా.. మీ అనుమానం!
ఇది నిజంగా జరగలేదు కానీ.. ఇలాంటి థీమ్‌తో ఓ నాట్యప్రదర్శన ఈ నెల 31న సాయంత్రం 6.30 గంటలకు నగరంలోని గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరగనుంది. భరతనాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని దేశంలోని ముఖ్యమైన 16 సంగీత రీతులను ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు. శివాన్‡్ష మ్యూజిక్ అకాడమీ, తత్వ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దాదాపు 1.45 గంటలపాటు ఈ నాట్య ప్రదర్శన నాన్‌స్టాప్‌గా సాగనుంది. ఈ ప్రయోగం కోసం 6 నెలలపాటు శ్రమించినట్లు శివాన్‡్ష అకాడమీ నిర్వాహకురాలు, భరతనాట్య కళాకారిణి మైత్రీరావు చెప్పారు. ‘జర్నీ ఆఫ్ రిథమ్స్’ పేరిట సాగే ఈ నాట్య ప్రదర్శనకు ప్రముఖ రంగస్థల నటి, కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలు పద్మశ్రీ మంజమ్మ జోగతి హాజరుకానున్నారు.