స్ట్రీట్‌లో స్టెప్పులు.. నిరసన నిప్పులు | Actress Mokksha Sen Gupta Powerful Bhadrakali Dance Performance For Kolkata Doctor Protest, See Details | Sakshi
Sakshi News home page

స్ట్రీట్‌లో స్టెప్పులు.. నిరసన నిప్పులు

Published Sun, Sep 29 2024 12:46 AM | Last Updated on Sun, Sep 29 2024 4:35 PM

Actress Mokksha Sen gupta Powerful Bhadrakali Dance Performance For Kolkata Doctor Protest

స్త్రీ అమ్మ... అన్యాయం జరిగితే ఆదిపరాశక్తి.
స్త్రీ భూదేవి... సహనం కోల్పోతే అపరకాళి.

ఈ జగత్తును తల్లిలా ఆదరించే ప్రతి స్త్రీ ఈ జగత్తులో తానొక భాగం అనుకుంటుంది. తనకు గౌరవప్రదమైన ఉనికి కోరుకుంటుంది.  కానీ, మనుషులు ఘోరంగా వ్యవహరించి ఆమె విశ్వాసాన్ని ధ్వంసం చేస్తుంటారు. ఆమె సహనాన్ని పరీక్షిస్తుంటారు. కోల్‌కతాలో డాక్టర్‌పై జరిగిన ఘోరకలి ఈ దేశంలో  ప్రతి స్త్రీని భద్రకాళిని చేసింది. ఆ సమయంలో ఎగసిన నిరసనల్లో కోల్‌కతా వీధుల్లో ఉగ్రతాండవం చేసింది మోక్షా సేన్‌ గుప్తా. ‘సాక్షి’తో ఆమె మాట్లాడింది.

‘‘సమాజంలోని చీడపురుగులకు చికిత్స చేయాలి. లేకపోతే వైద్యులనే కబళించేస్తాయి. చికిత్స ఎంత తీవ్రంగా ఉంటే సమాజానికి అంత మేలు’’ అంటున్నారు మోక్షా సేన్‌ గుప్తా. కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా మోక్షా సేన్‌ గుప్తా స్ట్రీట్‌ డ్యాన్స్‌తో పాటు ఇంకా పలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ‘అలనాటి రామచంద్రుడు’తో తెలుగు తెరపై కనిపించిన ఆమె త్వరలో విడుదల కానున్న ‘రామం రాఘవం’లోనూ నటించారు. బెంగాలీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షా సేన్‌ గుప్తా చెప్పిన విషయాలు.

→ వీధుల్లో కళా ప్రదర్శన మా సంస్కృతి
వీధుల్లో కళా ప్రదర్శన అనేది చాలా సంవత్సరాల నుండి వస్తున్న మా బెంగాల్‌ సంస్కృతి. వర్జీనియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు విభజనకు ముందు బ్రిటిష్‌ ప్రభుత్వ కాలంలో బెంగాల్‌ కూడా రాజధానిగా ఉండేది. మన పూర్వీకులు వీధి కళ, వీధి నాటకం, వీధి నృత్యం, వీధి పాటల ద్వారా వీధి ప్రదర్శనలు చేసేవారు. దర్శకుడు సత్యజిత్‌ రే ఏదైనా సమస్య అంటే బెంగాలీలు అందరూ ఎలా ఒక్కటవుతారో కూడా తన సినిమాల్లో చూపించారు. మన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో బెంగాలీ స్వాతంత్య్ర సమరయోధులు వీధుల్లోకి వచ్చి, నిరసనలు చేశారు. నా రాష్ట్రం, నా కుటుంబం నేర్పిన, పెంపకం నుంచి నాకు సామాజిక బాధ్యత వచ్చింది. పూరీ్వకులు చేసిన నిరసనలే నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే కోల్‌కతా వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా వీధుల్లో కళా ప్రదర్శనలు చేశాను. 

→ సత్యం కోసం... 
కవి ఖాజీ నజ్రుల్‌ ఇస్లాం స్వాతంత్య్ర సమయంలో తన కవితలు, పాటల ద్వారా బెంగాల్‌లో పునరుజ్జీవనం తేవడానికి ప్రయత్నించిన గొప్ప వ్యక్తి. ఆయన్ను నేతాజీ సుభాష్‌ చంద్రబో‹స్, స్వామి వివేకానంద వంటి మహానుభావులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇక నేను వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా కవి ఖాజీ నజ్రుల్‌ ఇస్లాం పాటను స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను రామకృష్ణ పరమహంస ఆరాధకురాలిని. ఆ విధంగా మంచి కోసం నిలబడటం అనేది నా రక్తంలోనే ఉంది. ఏ కళాకారుడైనా... అది వీధి కళాకారుడైనా ‘సత్యమేవ జయతే’ అంటూ నిజం వైపు నిలబడే ధైర్యం ఆ ఆరి్టస్ట్‌కి ఉండాలి. నేను డ్యాన్స్‌ చేసిన పాట అర్థం కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ‘ఒకవేళ నువ్వు చెరసాలలో ఉన్నట్లయితే నిజం కోసం గొంతు ఇవ్వడానికి ఆ చెరసాలను బద్దలు కొట్టి బయటకు రావాలి. సత్యం కోసం స్వరం వినిపించాలి’ అన్నట్లుగా ఆ పాట ఉంటుంది. 

→ వ్యవస్థకి వ్యతిరేకంగా.. 
మృత్తిక అనే స్వచ్ఛంద సేవా సంస్థ, ఇంకా మరికొన్ని అలాంటి సంస్థలు అణగారిన స్త్రీలు, పిల్లల సంక్షేమం కోసం పని చేస్తుంటాయి. వారితో మేం కలిసి పని చేస్తాం. అభయ సంఘటన విషయంలో వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడే వైద్యులతో మేం నిలబడ్డాం. నేను మాత్రమే కాదు... ఎందరో కళాకారులు మాతో వీధుల్లోకి వచ్చారు. అభయ కుటుంబానికి, వైద్యుల కోసం, న్యాయం కోసం మేం అంతా ఉన్నామని చూపించడానికి నాట్యాన్ని ఎన్నుకున్నాం. మేం చేస్తున్న నిరసన కార్యక్రమాలు చాలామందిని ప్రభావితం చేస్తున్నాయని నమ్ముతున్నాను. 

→ డ్యాన్స్‌ కాదు... నిరసన 
నేను చేసినది డ్యాన్స్‌ అని నాకనిపించలేదు. ఎందుకంటే సరైన కొరియోగ్రఫీ లేదు. నిజానికి నేను వేరొక నిరసన ప్రదర్శన నుండి నేరుగా అక్కడికి వెళ్లాను. ఓ 20, 25 కిలోమీటర్ల నిరసన కార్యక్రమం అది. ఆ నిరసన పూర్తయ్యాక అక్కడికి వెళ్లాను. ఒక బలమైన విషయాన్ని నృత్యరూపంలో చె΄్పాలనుకున్నప్పుడు సరైన వేదిక అక్కర్లేదు... కెమెరా, యాక్షన్, లైట్లు అవసరంలేదు. ఓ ఆరి్టస్ట్‌ సత్యం కోసం ఎక్కడ నిలబ డితే అదే పెద్ద వేదిక అవుతుంది. ఆ వేదిక సత్యం, న్యాయం కోసం మాత్రమే నిలబడే వేదిక అయితే చాలు... ముందస్తు ప్రిపరేషన్‌ లేకుండా చేసేయొచ్చు. 

→ ఐక్యత కోసమే... 
పశి్చమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని స్థానిక పార్టీ సమరి్థస్తోంది. అంటే... కొందరు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు, స్థానికులు. నా డ్యాన్స్‌ గురించి కూడా చాలా అవమానకరంగా మాట్లాడారు. ఇది నిరసనా లేక మీరు రెచ్చగొడుతున్నారా? అన్నారు. అయితే ఇప్పుడు కామన్‌ మేన్‌ కూడా తన గొంతు విప్పడానికి సిద్ధమయ్యాడు. సో... ఎక్కడో చోట మొదలయ్యే నిరసనలు సాధారణ వ్యక్తులను ప్రభావితం చేసేందుకూ ఉపయోగపడతాయి. కొన్నేళ్లుగా బెంగాలీల మధ్య ఉన్న ఐక్యత కాస్త సన్నగిల్లింది. అభయ రూపంలో మళ్లీ ఆ ఐక్యతను తిరిగి తేగలిగాం. 

→ తలో చేయీ వేద్దాం 
రాష్ట్ర ప్రభుత్వం 21 మంది లాయర్లను నియమించింది. వారికి వ్యతిరేకంగా డాక్టర్లు, అభయ కుటుంబం పోరాడుతోంది. ఎందరో పెద్దలు ఇన్వాల్వ్‌ అయి ఉన్నారు. వారిని ఎదిరించి పోరాడాలంటే ఆర్థిక బలం అవసరం. వెస్ట్‌ బెంగాల్‌ డాక్టర్స్‌ నిధిని సమకూర్చా లని అనుకుంటున్నారు. నా వంతుగా నేనూ ఫండ్‌ రైజ్‌ చేస్తున్నాను. 100 రూపాయలు కూడా మాకు ఎక్కువే. 50 మంది 100 రూపాయలు ఇస్తే... అదే పెద్ద మొత్తం అవుతుంది. అలా తలో చెయ్యీ వేసి, ముందుకొస్తే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది. అభయ కేసుని ఓ ఉదాహరణగా నిలపగలిగితే ఇలాంటి వెయ్యి సమస్యలను అధిగమించగలం. ‘మేం భారతీయులమని చెప్పుకోవడానికి గర్వపడుతు న్నాం’ అని ప్రపంచానికి చెప్పగలుగుతాం.

→ అవసరమైతే మళ్లీ డ్యాన్స్‌ 
మలయాళంలో నేను చేసిన ‘చిత్ని’ ఈ 27న రిలీజైంది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అలాగే తెలుగులో నా ఫస్ట్‌ మూవీ ‘అలనాటి రామచంద్రుడు’ శుక్రవారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాని చూడనివాళ్లు ఓటీటీలో చూడాలని కోరుకుంటున్నాను. ఇలా నా సినిమా విషయా లను ఫోకస్‌ చేస్తూనే డిజిటల్‌గా బాధితుల పక్షాన వీలైనంతగా ప్రచారం చేస్తున్నాను. అవసరమైతే మళ్లీ ‘స్ట్రీట్‌ డ్యాన్స్‌’ చేస్తా. ఆ ప్రదర్శనతో ఐదు రూపాయలు లాంటి చిన్న మొత్తం వచ్చినా అది ‘అభయ క్లినిక్‌’కి, అది ఏర్పాటు చేసిన డాక్టర్లకు వెళుతుంది. ఎందుకంటే ఈ క్లినిక్‌ నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఉపయోగపడాలన్నది మా ఆశయం. అందుకే సాయం చేయాలనుకునేవారు ఈ ఫోను నంబరు +91 6291485209 లేదా ఠీb్జunజీౌటఛీౌఛ్టిౌటటజటౌn్టఃజఝ్చజీ .ఛిౌఝ ని సంప్రదించాలని కోరుకుంటున్నాను’’ అని మోక్ష విజ్ఞప్తి చేశారు. 


పార్టీలకు తటస్థంగా ఉంటే కొన్ని ప్రశ్నలు లేవనెత్తలేం. అయితే ప్రశ్నలు వేస్తే మీరు ప్రతిపక్ష పార్టీ కేడర్‌ అని అర్థం... ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల ప్రభావం నేనో కొత్త కల కనేలా చేశాయి. ‘మావన హక్కు’ల గురించి క్షుణ్ణంగా చదవాలన్నదే ఆ కల.

అభయ అనేది అంతర్గతంగా, బాహ్యంగా నన్ను మార్చేసింది. ఇక ఇప్పుడు నేను దేని గురించీ పట్టించుకోను. ఎంత దూరం అయినా ఏ మార్గంలో అయినా వెళ్లగలను. ఇది ‘మోక్ష 2.ఓ’ వెర్షన్‌. ఈ మారిన మోక్ష డాక్లర్లకు సపోరి్టవ్‌గా ఉంది... న్యాయం పక్షాన ఉంటుంది.  

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement