Eesha Rebba: సొసైటీ... చట్టమూ మారాలి.. భయపెట్టేలా ఉండాలి | Eesha Rebba Sakshi Interview about kolkata rape case | Sakshi
Sakshi News home page

Eesha Rebba: సొసైటీ... చట్టమూ మారాలి.. భయపెట్టేలా ఉండాలి

Published Sun, Sep 1 2024 1:02 AM | Last Updated on Sun, Sep 1 2024 1:02 AM

Eesha Rebba Sakshi Interview about kolkata rape case

– ఈషా రెబ్బా

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం....  వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో... ఏం చేస్తే నేరాలు తగ్గుతాయి?  ‘చట్టం మారాలి... అమ్మాయిలు నిర్భయంగా ఉండేలా సమాజం మారాలి’ అంటున్నారు ఈషా రెబ్బా. అంతేకాదు... నెగటివిటీని ఇంధనంలా చేసుకుని అమ్మాయిలు ముందుకు సాగాలని కూడా అంటున్నారు. ఇంకా ‘సాక్షి’  ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను ఈ విధంగా పంచుకున్నారు.
 

→ రిపోర్ట్‌ చేయనివి ఎన్నో! 
హత్యాచారాలు జరిగినప్పుడు ర్యాలీలు, ధర్నాలు, కొవ్వొత్తులతో నిరసన... ఇలా చాలా చేస్తుంటాం. ఈ అన్యాయాలకు మన కోపాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తాం. కానీ ఒకటి జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంకోటి. ఈ మధ్యే కోల్‌కతాలో జరిగింది ఒక ఘటన. ఆ తర్వాతా కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఏం చేస్తే ఇవి ఆగుతాయి? ఆగడానికి పరిష్కారమే లేదా? అనే భయం ఉంది. 

ఇలాంటి వార్తలు విన్నా, చూసినా చాలా ఆవేదన. రేప్‌ అనేది చాలా పెద్ద క్రైమ్‌. మన దగ్గర రేప్‌ కేస్‌ల సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి దారుణాలు ఇంతకు ముందు కూడా జరిగాయి. సోషల్‌ మీడియా వల్ల మనకు తెలుస్తున్నాయి. ఇవన్నీ రిపోర్ట్‌ చేసిన కేస్‌లు... రిపోర్ట్‌ చేయనివి ఎన్నో! మన న్యాయ వ్యవస్థని మరింత కఠినంగా మార్చుకోవాలి. అలా ఉంటే అయినా ఇలాంటి ఘటనలు కాస్త తగ్గుతాయని నా అభి్రపాయం. 

→ భయపెట్టాలి 
రేప్‌ జరగడానికి కారణాలు ఏమై ఉంటాయని మొన్న ఏదో సర్వే చేశారు. అందులో ఓ క్యాబ్‌ డ్రైవర్‌తో పాటు ఎక్కువ శాతం మంది చెప్పిన సమాధానం... అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం...  ఇంకొంత మంది ఇంకేదో కారణం. వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉందో చూడండి. మన రాజకీయ నాయకులు కూడా కొందరు ఇంకా ఓల్డ్‌ స్కూల్‌ స్టయిల్‌లోనే ఆలోచిస్తున్నారు. వాళ్లు కూడా సమస్య బట్టల్లోనే ఉందంటారు. కొన్ని దేశాల్లో ఇన్వెస్టిగేషన్‌ చాలా త్వరగా అవుతుంది. వెంటనే ఉరి తీసే దేశాలు ఉన్నాయి. లా స్ట్రిక్ట్‌గా ఉండటం అంటే చంపేయమని కాదు. ఇన్వెస్టిగేషన్‌ త్వరగా, క్లియర్‌గా చేయడం.

 తప్పు చేశాడని రుజువు అయిన వెంటనే శిక్షించాలి. అమెరికాలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేయాలంటేనే భయపడతారు. పాయింట్స్‌ తగ్గిపోతాయేమో అని. చిన్న చిన్న విషయాల్లో అంత కఠినంగా ఉన్నారంటే ఆలోచించండి. అనుకున్న వెంటనే చట్టం అయిపోదు. మన లా కూడా రేపిస్ట్‌ల మీద అంత కఠినంగా లేకపోవడం. ఇలాంటి తప్పు చేస్తే శిక్ష ఇంత భయంకరంగా ఉంటుందని తెలిసేలా చేయాలి. ఇలా చేస్తే ఆగిపోతాయని నేను అనను. అలా అయినా ఎంతో కొంత భయం కలుగుతుందేమో. ముందు భయపెట్టాలి. ఇంట్లోవాళ్లు హెల్మెట్‌ పెట్టుకో అంటున్నా పెట్టుకోరు చాలామంది. కానీ 2000 రూపాయలు జరిమానా విధిస్తారంటే ఆ భయంతో అయినా పెట్టుకుంటారు.  

→ అమ్మాయిలకు బోలెడు ఆంక్షలు 
హీరోయిన్‌ అనే కాదు ఏ అమ్మాయి అయినా తన శరీరం... తన ఇష్టం. అబ్బాయిలు వాళ్లకు నచ్చినట్టు కూర్చుంటారు. నచ్చిన చోటుకి వెళ్తారు. నచ్చిన టైమ్‌లో వెళ్తారు. మాక్కూడా ఆ స్వాతంత్య్రం కావాలి. అమ్మాయిలకు బోలెడన్ని ఆంక్షలు.. ఇలా కూర్చోవాలి... అలా కూడదు. ఇలా మాట్లాడాలి... అలా కూడదు. చిన్నప్పటినుంచి ఇలా పరిమితులు పెట్టిన వాతావరణంలోనే దాదాపు అందరం పెరిగి ఉంటాం. అమ్మాయిలందరూ నిర్భయంగా ఉండే సమాజం ఏర్పాటు జరగాలి. భయం పెట్టాలి... 

→ కంఫర్ట్‌ జోన్‌లో ఉండకూడదు 
నేను ఇంట్రావర్ట్‌ని. నాకు తెలిసిన అతి కొద్ది మంది దగ్గర మాత్రమే హైపర్‌ ఎనర్జీతో ఉండగలను. కానీ నాకు యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్‌ అంటే రోజూ ఓ వంద మంది ఉంటారు సెట్‌లో. కానీ చేయాలి. మనల్ని మనం ఎప్పుడూ కంఫర్ట్‌ జోన్‌లో పెట్టుకుని ఉండకూడదు. మనకున్న భయాలను ఫేస్‌ చేస్తూ ముందుకెళ్లడమే. ఉదాహరణకు నాకు నీళ్లంటే చాలా భయం. దాంతో నీళ్లల్లో దిగేదాన్ని కాదు. కానీ ఎన్నాళ్లని అలా దాటేస్తాను? ధైర్యం తెచ్చుకున్నాను. స్విమ్మింగ్‌ నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ భయం పోగొట్టుకున్నాను. ప్రతి భయాన్ని అధిగమిస్తామో లేదో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. చిన్న చిన్న భయాల్ని అధిగమిస్తేనే జీవితంలో పెద్ద సవాళ్లని, సమస్యలను ఎదుర్కోవచ్చు. 

→ లీవ్‌ ఇస్తే బెటరే 
ఆడవాళ్లకు గవర్నమెంట్‌ అధికారికంగా పీరియడ్‌ లీవ్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే మనమే సెలవు పెడతాం. అయితే గవర్నమెంట్‌ ఇస్తే ఇంకా బాగుంటుంది. కొంత మంది తట్టుకోలేనంత నొప్పితో బాధపడుతుంటారు. కొంతమంది నడవలేరు కూడా. ఒకవేళ సెలవు పెడితే జీతం కట్‌ అవుతుంది లేదా ఆల్రెడీ ఆ నెలకు సరిపడా లీవ్స్‌ తీసేసుకోవడం వల్ల మళ్లీ లీవ్‌ అంటే ఆలోచించాలి. అందుకే ఆ ఇబ్బందిని భరిస్తూనే పనులకు వెళ్తుంటారు. ఆ మూడు రోజులు సెలవు రోజులుగా పరిగణిస్తే బాగుంటుందని నా అభి్రపాయం.  

→ నిన్ను నువ్వు నమ్మాలి 
మన జీవితంలో ప్రతి స్టేజ్‌లో ఎవరో ఒకరు మనల్ని ‘నువ్వు చేయలేవు అనో, నీ వల్ల కాదు’ అనో అంటారు. వాళ్లకు పూర్తిగా తెలియదు కదా మన గురించి. అందుకే నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్లడమే. ఎందుకంటే అనేవాళ్లు ఎప్పుడూ అక్కడే ఆగిపోతారు. నిన్ను నువ్వు నమ్మాలి... కష్టపడాలి. నెగటివిటీని మనల్ని కిందకు తోసేలా కాకుండా పైకి తీసుకెళ్లే ఇంధనంలా వాడుకోవాలి. 

వెరీ హ్యాపీ 
కెరీర్‌ పరంగా నేను చాలా హ్యాపీ. మంచి కథలన్నీ వస్తున్నాయి. కోవిడ్, ఓటీటీ తర్వాత కథల్లో వైవిధ్యం పెరిగింది. రియలిస్టిక్‌గా ఉండే కథలు. అన్ని జానర్స్‌ కథలు చెప్పడానికి ఓటీటీ మాధ్యమాలు ఉన్నాయి. అన్ని రకాల పాత్రలు చేయడానికి యాక్టర్స్‌కి ఇది మంచి టైమ్‌  అని చెపొ్పచ్చు. కోవిడ్‌ ముందు, కోవిడ్‌ తర్వాత నాకు వచ్చే కథల్లో తేడా తెలుస్తోంది. సినిమాల్ని, కథల్ని చూడటంలో ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. సబ్‌ టైటిల్స్‌తో అన్ని భాషల్లో సినిమాలను చూస్తున్నారు కూడా. అన్ని సినిమాలు అన్ని భాషల్లో డబ్‌ చేస్తున్నారు. సో...  సినిమా బాగుంటేనే థియేటర్స్‌కి వస్తున్నారు. అలా థియేటర్స్‌ రప్పించాలంటే కచ్చితంగా ఏదో ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందించాలి.

– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement