దాదాకు ఫాల్కే | Disco Dancer Mithun Chakraborty to get Dadasaheb Phalke Award for contribution to Indian cinema | Sakshi
Sakshi News home page

దాదాకు ఫాల్కే

Published Tue, Oct 1 2024 2:49 AM | Last Updated on Tue, Oct 1 2024 2:49 AM

Disco Dancer Mithun Chakraborty to get Dadasaheb Phalke Award for contribution to Indian cinema

బాలీవుడ్‌లో తెల్లరంగు హీరోల మధ్య మొదటిసారి ఒక నల్లరంగు హీరో జెండా ఎగరేశాడు. పంజాబీ హీరోల మధ్య మొదటిసారి ఒక బెంగాలీ సూపర్‌స్టార్‌ అవతరించాడు. దక్షిణాదిలో కమల్‌ హాసన్, చిరంజీవి డాన్స్ను అట్రాక్షన్ గా పూర్తిగా మలచక ముందే ‘డిస్కో డాన్సర్‌’తో మిథున్  చక్రవర్తి డాన్సింగ్‌ సూపర్‌స్టార్‌ అయ్యాడు. వెండితెర మెరుపులను పూర్తిగా నమ్మక ‘మోనార్క్‌’ బ్రాండ్‌తో హోటెలింగ్‌ సామ్రాజ్యాన్ని నిర్మించి స్థిరపడ్డాడు. ఇండస్ట్రీకి అతను ‘మిథున్‌దా’! దాదాకు దాదాసాహెబ్‌ ఫాల్కే!! 

నటించిన తొలి సినిమాకే నేషనల్‌ అవార్డు వస్తుందా ఎవరికైనా? మిథున్  చక్రవర్తికి వచ్చింది. మృణాల్‌సేన్  దర్శకత్వంలో మిథున్  నటించిన బెంగాలీ చిత్రం ‘మృగయా’ (1976) అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. అందులో అతను నేర విచారణను ఎదుర్కొనే అమాయక గిరిజనుడిగా నటించాడు. ఈ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన మిథున్, అవార్డు అందుకున్నాక బయటకు రాగానే జర్నలిస్టులు చుట్టుముట్టి ఇంటర్వ్యూ అడిగారు. ‘ఇస్తాను.. ఇస్తాను.. ముందు నాకు భోజనం పెట్టించండి’ అన్నాడు మిథున్ . జేబులో రూపాయి దారి ఖర్చులు లేని పేదరికం అతడి చేతి అవార్డు కంటే ఆకలి తీరడమే ముఖ్యమనిపించింది.
∙∙ 
మిథున్  చక్రవర్తికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మిథున్  ఇప్పుడు వందల కోట్ల ఆస్తి కలిగినవాడు. కాని అతను పుట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అని నార్త్‌ కోల్‌కతాలో ఇప్పటికీ అలాగే ఉన్న ఆ ఇంటిని రెండో కొడుకు ఉష్‌మయ్‌ చక్రవర్తి సందర్శించాడు. ‘ఇంటి వాకిలిలోనే మురుగునీటి కాలువ ఉంది. దానిని దాటి లోపలికి వెళితే ఆయన పెరిగిన ఇంట్లో కనీసం సూర్యకాంతి రావడం లేదు. ఈ చీకటి కొట్టం నుంచి వచ్చిన మా నాన్న అంత పెద్ద స్వ΄్నాన్ని కన్నాడా అని ఆయన పట్ల నా గౌరవం వందరెట్లు పెరిగింది’ అన్నాడతను.
∙∙ 
మిథున్  చక్రవర్తి అసలు పేరు వేరు. అదేంటనేది మనకు అక్కర్లేదు. కాని అతను కాలేజీ రోజుల్లో రాడికల్‌ స్టూడెంట్‌గా మారాడు. ఆ సమయంలో నక్సలైట్‌ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమంలోనే అతడి సొంత తమ్ముణ్ణి పోగొట్టుకున్నాడు. ఇక కోల్‌కతాలో ఉండేందుకు ఏ మాత్రం వీలు లేని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో ఉన్నప్పుడు మిథున్  చక్రవర్తి వీథి నాటకాలు హుషారుగా వేసేవాడు. అది గమనించిన ఒక మిత్రుడు నువ్వు దాక్కున్నట్టు ఉంటుంది, నటన నేర్చుకున్నట్టు ఉంటుంది అని పూణె ఫిల్మ్‌ ఇన్ స్టిట్యూట్‌లో చేర్పించాడు. అక్కడే అతను సొంతపేరు దాచి మిథున్ గా మారాడు. కోర్సు పూర్తయిన వెంటనే సినిమా కూడా దొరికింది. విడుదలైంది. నేషనల్‌ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక దిగుల్లేదు... బాలీవుడ్‌లో బతికిపోవచ్చు అని ముంబై చేరుకున్నాడు మిథున్ . అక్కడ అతి కర్కశమైన జీవితం అతడికి ఎదురుపడింది.
∙∙ 
‘నలుపు నలుపు అనేరు నలుగురు నవ్వేరు నలుపు నారాయణమూర్తే గాదా’ అనే పాట మనం పాడుకుంటాంగానీ బాలీవుడ్‌ వాళ్లు విని అర్థం చేసుకునే అవకాశం లేదు. బాలీవుడ్‌లో హీరోలంటే తెల్లరంగు పంజాబీవారు. అంతే! దక్షిణాదిలో బాలచందర్‌ ఎలాగో అప్పటికే రజనీకాంత్‌ను ప్రవేశపెట్టాడు కాని బాలీవుడ్‌లో నల్లరంగు హీరో అసాధ్యం. మిథున్  నల్లగా ఉంటాడు. పైగా హిందీ కూడా సరిగ్గా రాదు. దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఒకటి తెచ్చుకున్నాడు. ఇక ఎవరు రానిస్తారు? తినడానికి తిండి, ఉండటానికి గది ఏమీ లేని దారుణమైన రోజులు చూశాడు. చాలారోజులు పార్కుల్లో పడుకున్నాడు. ఒక స్నేహితుడు మాతుంగాలోని జిమ్‌ఖానాలో మెంబర్‌షిప్‌ ఇప్పిస్తే ఉదయాన్నే కాలకృత్యాల కోసం అక్కడకు వెళ్లేవాడు. మిగిలిన సమయం అంతా రోడ్డు మీదే. ప్రసిద్ధ దర్శకుడు మన్ మోహన్  దేశాయ్‌ దగ్గరకు వెళితే ఆయన తన జేబులో ఉన్న పది రూపాయల నోటు ఇచ్చి పంపించేయడం ఇప్పటికీ చెప్పుకుంటారు. మరో దర్శకుడు ‘ఇతను కనుక హీరో అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి పోతాను’ అని ముఖానే చె΄్పాడు. 1980ల కాలం అది. అప్పటికే అమితాబ్‌ సూపర్‌స్టార్‌ అయ్యాడు. యువ ప్రేక్షకుల కోసం రిషికపూర్‌ లాంటి వారు ఉన్నారు. నె΄÷టిజం ఉంది. ఏ తలాతోకా లేని మిథున్  ఎలా హీరో అవుతాడు? 
∙∙ 
కాని దేవుడు కూడా ఏదో ఒక వేళలో ఎదురు పడతాడు. ఈసారి దేవుడు బి.సుభాష్‌ అనే పేరుతో వచ్చాడు. ‘నేను నీతో సినిమా తీస్తాను. దాని పేరు డిస్కో డాన్సర్‌’ అన్నాడు బి.సుభాష్‌. అప్పటికే బప్పి లాహిరి కూడా ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. బి.సుభాష్, మిథున్, బప్పి లాహిరి కలిసి ‘డిస్కో డాన్సర్‌’ తయారు చేశారు. డిసెంబర్‌ నెల 1982లో విడుదల అయిన ఆ సినిమా దేశమంతా అగ్గి పుట్టించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ కుర్రకారు నుంచి గృహిణుల వరకూ అందరి నోటా ‘ఐయామే డిస్కో డాన్సర్‌’ పాటే. ఏ పెళ్లిలో కాలేజీ ఫంక్షన్ లో చూసినా ఆ పాటే. రష్యాలో ఆ సినిమా 1000 ప్రింట్లతో విడుదలై సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ రోజుల్లో 100 కోట్లు సంపాదించిన తొలి సినిమా అది. ఇప్పటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! మిథున్  ఇప్పుడు సూపర్‌స్టార్‌ అయ్యాడు. ఆ తర్వాత బి.సుభాష్‌తోనే తీసిన ‘కసమ్‌ పైదా కర్నేవాలేకీ’, ‘డాన్స్ డాన్స్’ కూడా భారీ హిట్లే. అమితాబ్, జితేంద్ర, శశి కపూర్, వినోద్‌ ఖన్నా అందరూ ఇప్పుడు మిథున్  వైపు కళ్లప్పగించి చూస్తున్నారు. అమితాబ్‌కు ప్రధాన పోటీదారు వచ్చినట్టే.
∙∙ 
మిథున్  చక్రవర్తి బాలీవుడ్‌లో మాస్‌ పాత్రలు పోషించినా బెంగాలీలో తనకు నచ్చిన పాత్రలు పోషిస్తూ అక్కడా తన ప్రాభవం కాపాడుకున్నాడు. ‘స్వామి వివేకానంద’ (1998)లో రామకృష్ణ పరమహంసగా నటిస్తే దానికి మళ్లీ నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చేలా తీసిన ‘΄్యార్‌ ఝక్తా నహీ’ (1985) సంవత్సరాల తరబడి ఆడింది. ఇది తెలుగులో కృష్ణ, శ్రీదేవిలతో ‘పచ్చని కాపురం’ పేరుతో రీమేక్‌ అయ్యింది. పద్మినీ కొల్హాపురి, రంజిత, శ్రీదేవిలతో మిథున్  చేసిన సినిమాలు ప్రేక్షకులకు హిట్‌ జోడీగా నచ్చాయి. 
∙∙ 
మిథున్  చక్రవర్తి ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా హిట్‌ అయ్యాడు. అమితాబ్‌ ‘అగ్నిపథ్‌’లో వేసిన అయ్యర్‌ పాత్ర అతడికి చాలా పేరు తెచ్చింది. మణిరత్నం తీసిన ‘గురు’లో పత్రికాధిపతిగా (గోయెంకా) నటించి ఆశ్చర్యపరిచాడు. ‘ఓ మైగాడ్‌’ (గోపాల గోపాల)లో స్వామీజీగా వేసిన పాత్ర మిథున్ లోని మరో పార్శా్వన్ని చూపింది. టెలివిజన్  షోస్‌ చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మిథున్  అనుక్షణం బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.
∙∙ 
ప్రారంభాలు మర్చిపోనివాడి గమనం స్థిరంగా ఉంటుంది. ఒకరోజు ఊటీలో షూట్‌ జరుగుతుంటే అక్కడొక మురికి కాలువ పారుతూ ఉంది. పక్కన ఉన్న నటిని పిలిచి ‘నా ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పమని అడుగుతావుగా. ఇదే నా ఫ్లాష్‌బ్యాక్‌’ అన్నాడతను ఆ కాలువ చూపుతూ.
మురుగు నీటి నుంచి వెలిసిన వెండితెర వేల్పు మిథున్ .
 

కుప్పతొట్టిలో ఉన్న అమ్మాయిని కూతురిగా
1996 డిసెంబర్‌ 1న కోల్‌కతాలో న్యూస్‌ పేపర్‌ చదువుతున్న మిథున్ కి ఒక వార్త కలుక్కుమనిపిం చింది. తన భార్య యోగితా బాలి (ఒకప్పటి హీరోయిన్ )ని పిలిచి ఆ వార్త చూపించాడు. అందులో కుప్పతొట్టిలో ఎవరో ఆడపిల్లను వదిలేసి పోయారు అని ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. బాధపడ్డారు. ఆ పాపను తెచ్చి పెంచుకోవాలని వెంటనే నిశ్చయించుకున్నారు. ఒక ఎన్ .జి.ఓ ద్వారా ప్రయత్నిస్తే కుప్పతొట్టిలో ఉండటం వల్ల పాప చాలా సీరియస్‌ కండిషన్ లో ఉందని చె΄్పారు. అయినా సరే మిథున్, యోగితా ఆ పాపను తెచ్చుకుని కంటికి రెప్పలా కాపాడారు. చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారు. 
దిశానీ చక్రవర్తి అని పేరు పెట్టారు. అమెరికాలో చదివించారు. మిథున్ కు ఎంతో ప్రాణం ఈ కూతురు.

నవ్వలేను...సంతోషంతో ఏడవలేను
‘దాదాసాహెబ్‌ వచ్చిందన్న వార్త నన్ను చేష్టలుడిగేలా చేసింది. నేను నవ్వలేను... ఆనందంతో ఏడ్వలేను. ఫుట్‌పాత్‌ నుంచి వచ్చిన నేను ఇక్కడ దాకా చేరుకున్నానంటే ఈ పురస్కార ప్రకటన నాలో ఇంకా రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం. నేను ఈ అవార్డు ΄÷ందానంటే ప్రతిభ, అంకితభావం ఉన్న ఎవరైనా ΄÷ందవచ్చు’ అన్నారు మిధున్  చక్రవర్తి, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటన తర్వాత! కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఈ వార్తను సోమవారం ప్రకటించారు. దాదాసాహెబ్‌ పురస్కారం సందర్భంగా మిథున్‌ చక్రవర్తికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement