
తెలంగాణ సంప్రదాయ నృత్య వైభవం మరోసారి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమననుంది. గోవాలో అట్టహాసంగా బుధవారం జరుగనున్న అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఇఫీ)ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనుల గుస్సాడీ నృత్యం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది.
ఈ నృత్య కళాకారునిగా ఇటీవలే కీర్తిశేషులైన పద్మశ్రీ కనకరాజు జాతీయ స్థాయిలో పేరొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు నోచుకోవడం, ఆ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులు అందరూ దివంగత కనకరాజు శిష్యులే కావడంతో ఇది గత నెలలోనే దివికేగిన గుస్సాడీ నృత్య దిగ్గజానికి ఘన నివాళిగా చెప్పొచ్చు.
– సాక్షి, హైదరాబాద్