kanakaraj
-
ఇఫీలో గుస్సాడీ నృత్యం
తెలంగాణ సంప్రదాయ నృత్య వైభవం మరోసారి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమననుంది. గోవాలో అట్టహాసంగా బుధవారం జరుగనున్న అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. ఇఫీ)ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనుల గుస్సాడీ నృత్యం ప్రదర్శనకు అవకాశం దక్కించుకుంది. ఈ నృత్య కళాకారునిగా ఇటీవలే కీర్తిశేషులైన పద్మశ్రీ కనకరాజు జాతీయ స్థాయిలో పేరొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవంలో తెలంగాణ సంప్రదాయ నృత్య ప్రదర్శనకు నోచుకోవడం, ఆ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులు అందరూ దివంగత కనకరాజు శిష్యులే కావడంతో ఇది గత నెలలోనే దివికేగిన గుస్సాడీ నృత్య దిగ్గజానికి ఘన నివాళిగా చెప్పొచ్చు. – సాక్షి, హైదరాబాద్ -
వీడియో : మద్యం-మనీ.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే
కోయంబత్తూర్ : అధికార పార్టీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు మద్యం, డబ్బు పంచుతూ అడ్డంగా బుక్కయిపోయారు. ఆ వీడియో వైరల్ కావటంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంజీఆర్ జయంతి ఉత్సవాలను అన్నాడీఎంకే పార్టీ ఆదివారం ఘనంగా నిర్వహించింది. అయితే అందుకు జనాలను సమీకరించేందుకు ఎమ్మెల్యే ఆర్ కనకరాజ్ మద్యం, డబ్బును పంచారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు 60 బస్సుల్లో ఆయన ప్రజలను వేడుకలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే పక్కనే ఓ వ్యక్తి 2వేల రూపాయల నోట్ల కట్టలు పట్టుకుని రిజిస్టర్లో రాసుకుంటూ ఉండటం, ఆ పక్కనే మద్యం బాటిళ్ల కాటన్ డబ్బాల్లో ప్యాక్ చేసి ఉండటం కనిపించింది. దీనిపై ప్రతిపక్షాలు మాత్రం మరో వాదనను రేపుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ప్రలోభపెడుతున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కనకరాజ్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు. ఎంజీఆర్ జయంతి వేడుకల కోసం వేదిక వద్దకు వచ్చే కార్యకర్తల సౌకర్యార్థం తాను డబ్బును కేటాయించినట్లు ఆయన చెబుతున్నారు. తమిళ ప్రజలు డబ్బు, మద్యానికి తలొగ్గే రకం కాదని.. ఆర్కేనగర్ ఉప ఎన్నికలలో అన్నాడీఎంకే పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. డబ్బు,మద్యం, మిల్క్ టోకెన్లు, చివరకు ఫోన్ రీఛార్జీ కూపన్లు, మొబైల్ వాలెట్ పేమెంట్లను కూడా పలువురు నేతలు పంపిణీ చేయటంతో ఎన్నిక రద్దైన విషయం తెలిసిందే. ఈ నెల 21న ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసీ నిర్వహించనుంది. -
మిస్టరీ ప్రమాదాలు.. ముగ్గురి మృతి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాతి నుంచి ఆమె ఆస్తులకు సంబంధించి ఏదో ఒక మిస్టరీ వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా.. జయలలిత వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి ఒక 'రోడ్డు ప్రమాదం'లో మరణించాడు. అయితే ఇది నిజంగా ప్రమాదమేనా, లేక ఎవరైనా అలా చిత్రించారా అనే విషయం అనుమానంగానే ఉంది. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. చెన్నై పోయెస్ గార్డెన్స్‌లోని జయలలిత నివాసంలో కనకరాజ్ (36) డ్రైవర్‌గా పనిచేసేవాడు. మూడేళ్ల క్రితం అతడిని తీసేశారు. ఆ తర్వాతి నుంచి అతడు టాక్సీ నడుపుకొంటున్నాడు. ఇటీవల కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌లో జరిగిన వాచ్‌మన్ ఓం బహదూర్ హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడు. నీలగిరి పోలీసులు ఇప్పటికే అతడిని ఒకసారి ప్రశ్నించారు. కనకరాజ్ మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఓ వాహనం అతడిని ఢీకొంది. ఇదే హత్య కేసులో మరో నిందితుడు, కనకరాజ్ స్నేహితుడైన సాయన్ కూడా ఇదే రోజు కేరళలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతడి భార్య, కుమార్తె ఆ ప్రమాదంలో మరణించారు. ఒకే రోజు రెండు ప్రమాదాలు జరగడం, గార్డు హత్యకేసులో నిందితులే ఈ ప్రమాదాల్లో ఉండటం చూస్తుంటే ఇవి మామూలుగా సంభవించినవి కావని, ఏదో కావాలనే చేసి ఉంటారని అంటున్నారు. కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌లో ఈనెల 24న సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ హత్య జరిగింది. అతడి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి మరీ అతడిని హతమార్చారు. అప్పుడు జయలలిత ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కొన్ని చోరీకి గురైనట్లు కూడా భావించారు. ఇప్పుడు ఆ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరినీ హతమార్చేందుకు 'రోడ్డు ప్రమాదాలు' సృష్టించడం, అవి కూడా ఒకేరోజు ఒకటి సేలంలో, మరొకటి కేరళలో జరగడం చూస్తుంటే.. జయలలిత ఆస్తుల మీద కన్నేసిన వాళ్లే ఇవన్నీ చేయించి ఉంటారని భావిస్తున్నారు. -
తిరువణ్ణామలైలో అన్నాడీఎంకే నేత హత్య
తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలో అన్నాడీఎంకే నేత అరుణాచలేశ్వరాలయం ముందు హత్యకు గురయ్యాడు. తిరువణ్ణామలై సన్నది వీధికి చెందిన కనకరాజ్(50) తిరువణ్ణామలై అన్నాడీఎంకే మాజీ పట్టణ కార్యదర్శిగా ఉండేవారు. ప్రస్తు తం తిరువణ్ణామలై కోఆపరేటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. 18 సంవత్సరాల పాటు అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శిగా వ్యవహరిస్తూ గత మేలో పదవి పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కనకరాజ్ తిరువణ్ణామలైలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బాడ్మింటన్ ఆడేందుకు స్నేహితుడు కన్నదాసన్ బైక్‌లో వెళ్లా డు. అన్నామలైయార్ ఆలయం తిరుమంజన గోపురం దారిలో వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు అతివేగంగా బైక్‌ను ఢీకొంది. దీంతో బైకులో వెళుతున్న కనకరాజ్, కన్నదాసన్ కింద దిగి కారులో ఉన్న వ్యక్తులతో వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాప్ వేసుకుని వచ్చి కత్తితో కనకరాజ్‌పై దాడి చేసి గాయపరిచారు. దీనిని గమనించిన కన్నదాసన్ పరారయ్యారు. దాడిలో కనకరాజ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందారు. తిరువణ్ణామలై పోలీస్‌స్టేషన్ కు ఘటనా స్థలానికి 200 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టేందుకు వెళ్లారు. అ ప్పటికే హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు పోలీస్‌స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల వద్ద విచారణ జరపగా తిరువణ్ణామలై గాంధీనగర్ మూడవ వీధికి చెందిన నటరాజన్ కుమారుడు బంక్ బాబు, పాత కార్కాన వీధికి చెందిన పరశురామన్ కుమారుడు రాజ, ఆర్ముగం కుమారుడు శరవణన్ అని తెలిసింది. ఇదిలా ఉండగా తిరువణ్ణామలైలో పలు కోట్ల విలువ చేసే స్థలాన్ని కనకరాజ్ కబ్జా చేసి మోసం చేసినట్లుగా దీంతోనే తమకు కనకరాజ్‌కు పాతకక్షలు ఉన్నట్లు నిందితులు పోలీసుల వద్ద తెలిపారు. దీంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా గత వారంలో అన్నామలైయార్ ఆలయ కుంభాభిషేకం జరిగిన నేపథ్యంలో మాడ వీధుల్లో నమోదు చేసిన కెమెరాలు అలాగే ఉండడంతో హత్య జరిగిన ప్రాంతంలో పూర్తిగా నమోదు కావడంతో ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అధికారులు వేధింపులు మానుకోవాలి
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలపై అధికారులు వేధింపులు మానుకోవాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కనకరాజ్ అన్నారు. రెడ్‌హిల్స్‌లో ప్రైవేటు పాఠశాలల యజమానుల సంఘం మహానాడు జరిగింది. ఈ సభకు తిరువళ్లూరు జిల్లా సంఘ అధ్యక్షుడు రాజా, ముఖ్య అతిథిగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కనకరాజ్ పాల్గొన్నారు. కనకరాజ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రైవేటు పాఠశాలలపై అధికారులు తనిఖీలు చేస్తూ వేధిస్తున్నారని చెప్పారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలను చిన్నచూపు చూస్తోందన్నారు. ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ముందుగానే అధికారులు పాఠశాలలపై దాడులు చేసి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెట్టిన పెట్టుబడులు రాక ఇబ్బందిపడి అనేక పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. అలాంటి పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే 10 సంవత్సరాలైన పాఠశాలలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని, ఉపాధ్యాయుల నియామకంలో షరతులు సడలించాలనే తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. ఈ సభ సంఘ కార్యదర్శి నందకుమార్, వల్లేనాయక్, జోర్నాల్డ్తో పాటు పలువురు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.