మిస్టరీ ప్రమాదాలు.. ముగ్గురి మృతి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాతి నుంచి ఆమె ఆస్తులకు సంబంధించి ఏదో ఒక మిస్టరీ వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా.. జయలలిత వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి ఒక 'రోడ్డు ప్రమాదం'లో మరణించాడు. అయితే ఇది నిజంగా ప్రమాదమేనా, లేక ఎవరైనా అలా చిత్రించారా అనే విషయం అనుమానంగానే ఉంది. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. చెన్నై పోయెస్ గార్డెన్స్‌లోని జయలలిత నివాసంలో కనకరాజ్ (36) డ్రైవర్‌గా పనిచేసేవాడు. మూడేళ్ల క్రితం అతడిని తీసేశారు. ఆ తర్వాతి నుంచి అతడు టాక్సీ నడుపుకొంటున్నాడు. ఇటీవల కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌లో జరిగిన వాచ్‌మన్ ఓం బహదూర్ హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడు. నీలగిరి పోలీసులు ఇప్పటికే అతడిని ఒకసారి ప్రశ్నించారు. కనకరాజ్ మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఓ వాహనం అతడిని ఢీకొంది.
ఇదే హత్య కేసులో మరో నిందితుడు, కనకరాజ్ స్నేహితుడైన సాయన్ కూడా ఇదే రోజు కేరళలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతడి భార్య, కుమార్తె ఆ ప్రమాదంలో మరణించారు. ఒకే రోజు రెండు ప్రమాదాలు జరగడం, గార్డు హత్యకేసులో నిందితులే ఈ ప్రమాదాల్లో ఉండటం చూస్తుంటే ఇవి మామూలుగా సంభవించినవి కావని, ఏదో కావాలనే చేసి ఉంటారని అంటున్నారు. కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌లో ఈనెల 24న సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ హత్య జరిగింది. అతడి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి మరీ అతడిని హతమార్చారు. అప్పుడు జయలలిత ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కొన్ని చోరీకి గురైనట్లు కూడా భావించారు. ఇప్పుడు ఆ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరినీ హతమార్చేందుకు 'రోడ్డు ప్రమాదాలు' సృష్టించడం, అవి కూడా ఒకేరోజు ఒకటి సేలంలో, మరొకటి కేరళలో జరగడం చూస్తుంటే.. జయలలిత ఆస్తుల మీద కన్నేసిన వాళ్లే ఇవన్నీ చేయించి ఉంటారని భావిస్తున్నారు.