సినిమా... సాహిత్యం మధ్య సాన్నిహిత్యం పెరగాలి: దర్శకుడు మణిరత్నం | 55th IFFI Goa International Film Festival of India 2024 | Sakshi
Sakshi News home page

సినిమా... సాహిత్యం మధ్య సాన్నిహిత్యం పెరగాలి: దర్శకుడు మణిరత్నం

Published Sun, Nov 24 2024 12:18 AM | Last Updated on Sun, Nov 24 2024 12:18 AM

55th IFFI Goa International Film Festival of India 2024

‘‘సినిమా... సాహిత్యం మధ్య ఎంత సాన్నిహిత్యం పెరిగితే అంతగా భారతీయ సినిమా మెరుగుపడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు దక్షిణాది దర్శక దిగ్గజం మణిరత్నం. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)లో భాగంగా ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ లిటరరీ మాస్టర్‌పీస్‌’ అనే అంశంపై ‘మాస్టర్‌ క్లాస్‌’లో ఆయన మాట్లాడారు. 

మరో దక్షిణాది ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ కూడా మణిరత్నంతో సంభాషించారు. ‘‘నేను ఇప్పటికీ ప్రేక్షకులలో ఒక్కడిగా కూర్చుని సినిమా చూసే వ్యక్తినే’’ అని మణిరత్నం అన్నారు. ఏళ్లుగా మాస్టర్‌ పీస్‌ లాంటి సినిమాలు అందిస్తున్నప్పటికీ తనను తాను అనుభవశూన్యుడిలా, ప్రారంభ దశలో ఉన్నట్లుగానే భావిస్తాను అన్నారాయన. సినిమా, సాహిత్యం మధ్య లోతైన అనుబంధం ఏర్పడేలా సినిమా నిర్మాతలు చూడాలని మణిరత్నం కోరారు.

పుస్తకానికి దృశ్యరూపం ఇవ్వాలంటే...
పుస్తకాలను చలన చిత్రాలలోకి మార్చడంలోని సూక్ష్మ నైపుణ్యాలను ఈ సందర్భంగా మణిరత్నం వివరించారు.  ‘‘సినిమాలు దృశ్య మాధ్యమానికి చెందినవి. కానీ పుస్తకాలు ప్రధానంగా ఊహాజనితమైనవి. పుస్తకాలకు దృశ్యరూపం ఇచ్చేటప్పుడు ఫిల్మ్‌ మేకర్‌కు అదనపు సామర్థ్యం ఉండాలి. పాఠకుడి ఊహకు ప్రాణం పోయడంలో జాగ్రత్త వహించాలి’’ అని సూచించారు. ఇంకా పురాణాలు, ప్రాచీన భారతీయ చరిత్ర తన దృక్పథాన్ని ప్రభావితం చేశాయని మణిరత్నం అన్నారు. కల్కి కృష్ణమూర్తి 1955 నాటి ఐకానిక్‌ రచనల నుంచి స్వీకరించిన తన ‘΄పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రం గురించి మాట్లాడుతూ... చోళుల కాలాన్ని చిత్రించేందుకు పడిన వ్యయ ప్రయాసలను వివరించారు. 

తంజావూరులో ఆ కాలపు అవశేషాలు కూడా లేకుండా యాయని, అయితే సెట్‌లను రూపొందించడానికి ఇష్టపడక భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో షూటింగ్‌ చేశామని, అక్కడి నిర్మాణాన్ని చోళుల వాస్తుశిల్పం ప్రకారం మార్చామనీ అన్నారు. సృజనాత్మక స్వేచ్ఛను తీసుకుంటున్నప్పుడు ఆలోచనాత్మకంగా, పుస్తకాన్ని దాని అసలు స్ఫూర్తిని కాపాడేలా చూడాలని యువ సినీ రూపకర్తల్ని మణిరత్నం కోరారు.

వినోదమే ప్రధానం: శివ కార్తికేయన్‌
‘‘సినిమా పరిశ్రమలోకి రావడానికి నేను ఏ లక్ష్యాలను పెట్టుకోలేదు. కేవలం ప్రేక్షకులకు వినోదం అందించాలని తప్ప’’ అన్నారు ప్రముఖ నటుడు శివ కార్తికేయన్‌. ‘ఇఫీ’లో భాగంగా కళా అకాడమీ ప్రాంగణంలోని ఇంట్రాక్టీవ్‌ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి ఖుష్బూ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ... తాను స్టార్‌ కావాలని రాలేదని, చేసే పాత్రల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచాలనుకున్నానని, అందుకు అనుగుణంగానే తొలుత టీవీ కార్యక్రమాలు... ఆ తర్వాత అంతకన్నా పెద్దదైన వెండితెరపైనా అవకాశాలు అందుకున్నాననీ శివ కార్తికేయన్‌ పేర్కొన్నారు. 200 సినిమాలకు పైగా నటించినా ఇప్పటికీ తన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం అందించడమే అన్నారాయన. – గోవా నుంచి సాక్షి ప్రతినిధి

ఇఫీలో ఎమ్‌ 4 ఎమ్‌
మోహన్‌ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎమ్‌ 4 ఎమ్‌’(మోటివ్‌ ఫర్‌ మర్డర్‌). జో శర్మ, సంబీత్‌ ఆచార్య లీడ్‌ రోల్స్‌లో నటించారు. మోహన్‌ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్‌విన్‌ గ్రూప్‌ (యూఎస్‌ఏ) బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. కాగా ఈ మూవీ హిందీ ట్రైలర్‌ని ‘ఇఫీ’లో శనివారం విడుదల చేశారు మేకర్స్‌. ఈ చిత్రం గురించి మోహన్‌ వడ్లపట్ల మాట్లాడుతూ–‘‘యూనివర్సల్‌ సబ్జెక్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఎమ్‌ 4 ఎమ్‌’. ప్రేక్షకులు మా మూవీని చూసి థ్రిల్‌ అవుతారు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement