అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు
ఐఫీలో దక్షిణాది సందడి
‘‘మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలోప్రారంభమైంది.
ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడారు నాగార్జున. యాంకర్ కోరిన మీదట తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా..’ డైలాగ్ చెప్పారు నాగార్జున.
ఈ చిత్రోత్సంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు. ‘‘పేపర్ బాయ్‌గా నా ప్రస్థానం ప్రారంభించాను’’ అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమాల్లోని కొత్తదనం, పాజిటివిటీ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు టాలీవుడ్‌ని చేరువ చేస్తున్నాయి’’ అన్నారు అమల.
ఐఫీ... ఇంకొన్ని విశేషాలు
→ కార్యక్రమప్రారంభంలో భారత వందనం నృత్య కార్యక్రమం ఆహూతులను విశేషంగా అలరించింది.
→ సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, రాజ్ కపూర్‌ల జీవితం గురించి బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ అందించిన వీడియో సహిత కార్యక్రమం ఆకట్టుకుంది.
→ పలుమార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం ప్రస్తావన వచ్చింది.
→ చిత్రోత్సవంలో భాగంగా విభిన్న కేటగిరీలో చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీల్లో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్, హైదరాబాద్‌కు చెందిన యువ డిజైనర్ అర్చనా రావు ఉన్నారు.
→ బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ పాటకు నృత్యంతో అలరించారు.
→ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ జీవిత ఘట్టాల ఆధారంగా తీస్తున్న చిత్ర విశేషాలు ప్రదర్శించారు.
→ ఆహూతుల్లో ఖుష్బూ, సుశాంత్ తదితరులు ఉన్నారు.
– గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment