centenary celebration
-
మా నాన్న వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను – నాగార్జున
‘‘మా నాన్న నేర్పిన జీవిత పాఠాలు నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేశాయి. మా నాన్న బాటలో నడవడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) బుధవారం గోవాలోప్రారంభమైంది. ఈ నెల 28 వరకూ ఈ చిత్రోత్సవం జరగనుంది. తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్ గురించి మాట్లాడారు నాగార్జున. యాంకర్ కోరిన మీదట తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలోని ‘వాసివాడి తస్సాదియ్యా..’ డైలాగ్ చెప్పారు నాగార్జున. ఈ చిత్రోత్సంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు. ‘‘పేపర్ బాయ్‌గా నా ప్రస్థానం ప్రారంభించాను’’ అని శరత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమాల్లోని కొత్తదనం, పాజిటివిటీ అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు టాలీవుడ్‌ని చేరువ చేస్తున్నాయి’’ అన్నారు అమల.ఐఫీ... ఇంకొన్ని విశేషాలు→ కార్యక్రమప్రారంభంలో భారత వందనం నృత్య కార్యక్రమం ఆహూతులను విశేషంగా అలరించింది.→ సినీ దిగ్గజాలు అక్కినేని నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, రాజ్ కపూర్ల జీవితం గురించి బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ అందించిన వీడియో సహిత కార్యక్రమం ఆకట్టుకుంది.→ పలుమార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం ప్రస్తావన వచ్చింది.→ చిత్రోత్సవంలో భాగంగా విభిన్న కేటగిరీలో చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీల్లో తెలుగు దర్శకుడు హరీష్ శంకర్, హైదరాబాద్‌కు చెందిన యువ డిజైనర్ అర్చనా రావు ఉన్నారు.→ బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ పాటకు నృత్యంతో అలరించారు.→ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ జీవిత ఘట్టాల ఆధారంగా తీస్తున్న చిత్ర విశేషాలు ప్రదర్శించారు.→ ఆహూతుల్లో ఖుష్బూ, సుశాంత్ తదితరులు ఉన్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
‘అతి తక్కువ గౌరవం, ప్రశంసలు పొందిన వ్యక్తి పీవీ’
సాక్షి, ముంబై: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా రాజకీయనాయకులు, ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర, పీవీని గుర్తు చేసుకుంటూ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. 91 నాటి ఆర్థిక సరళీకరణకు సంబంధించిన అందరు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ప్రశంసిస్తారు. కానీ వాస్తవానికి ఈ గౌరవం దక్కల్సింది పీవీ నరసింహరావుకు అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్ర సోమవారం ట్వీట్ చేశారు. దీనిలో ఆనంద్ మహీంద్ర టైమ్స్ ఆఫ్ ఇండియాలో పీవీ మీద వచ్చిన కథనానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘‘నా సోమవారం మోటీవేషన్ తక్కువ గౌరవం, ప్రశంసలు పొందిన ఈ వ్యక్తిని గుర్తు చేసుకోవడంతో ప్రారంభమైంది. సాధారణంగా దేశ రూపురేఖలు మార్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలకు సంబంధించి అందరు మన్మోహన్ సింగ్‌ని ప్రశంసిస్తారు. కానీ వాస్తవానికి ఆ సంస్కరణలు ఆచరణలోకి రావడం వేనక పీవీ ధైర్యం, తెగువ ఉన్నాయి. కానీ ఆయనకు తక్కువ గుర్తింపు దక్కింది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. My #MondayMotivation is through remembering this man—who’s not just under-rated, but under-appreciated. Shri Manmohan Singh is usually credited for the ‘91 reforms that transformed India. But in reality the pressure & courage for those reforms came from Shri P.V.Narasimha Rao 🙏🏽 https://t.co/oDJJZXM8Jr — anand mahindra (@anandmahindra) June 28, 2021 చదవండి: పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభం: సీఎం కేసీఆర్ -
పీవీ ప్రపంచ మేధావి: శశి థరూర్
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విదేశీ విధానాలపై ఇందిరాభవన్‌లో ఆదివారం వెబ్‌నార్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ పాల్గొని ప్రసంగించారు. శిశిథరూర్ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం విషయంలో పీవీ నర్సింహరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు చేసుకొని, విదేశాంగ విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇరాన్‌తో పటిష్టమైన బంధం ఏర్పరిచారని, దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు లుక్ ఈస్ట్, లుక్ వెస్ట్ పాలసీ రూపొందించారని చెప్పారు. (ఎన్ఎస్యూఐ దీక్ష విరమణ) చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు అనేక వ్యూహాలు రచించి, కమ్యూనిజం నుంచి క్యాపిటలిజం వైపు వేగంగా అడుగులు వేశారని వ్యాఖ్యానించారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచి, రాజీవ్ గాంధీ అడుగు జాడల్లో నడిచి ఆర్థికంగా దేశాన్ని పటిష్టమైన స్థానానికి చేర్చారని అన్నారు. కేవలం 1991 నుంచి రెండేళ్లలో లిబరలైజేషన్‌తో 36 శాతం ఎకానమి పెంపొందించారని చెప్పారు. దేశ ఆర్థిక విధానాల విషయంలో పీవీ నర్సింహరావుకు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చుని వివరించారు. పీవీ నేతృత్వంలో భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని చెప్పారు. 1991 నుంచి 5 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ సహకారంతో ఎకానమిని పరుగులు పెట్టించారని అన్నారు. పీవీ ప్రతీ నిర్ణయం దేశం అభ్యున్నతికి పాటుపడిందని, మైనారిటీ ప్రభుత్వాన్ని తన రాజకీయ చాణక్యంతో నడపగలిగారని కొనియాడారు. ఆయన ప్రపంచ మేధావని దాదాపు 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే మేధస్సు ఉన్న గొప్ప వ్యక్తి అని అన్నారు. న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీ సాధించడంలో కీలకపాత్ర పోషించి, ఇజ్రాయిల్ సాంకేతిక సహకారంతో సైన్యాన్ని పటిష్టం చేశారని తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, కమిటీ చైర్మన్ గీతరెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, కమిటీ సభ్యులు మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, శ్రవణ్‌రెడ్డి పాల్గొన్నారు. -
శతాబ్ది ఉత్సవాలకు ఓయూ ముస్తాబు
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్ల ఉత్సవాల ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో పనులను వేగవంతం చేశారు. వీటిపై వేసిన వివిధ కమిటీల చైర్మన్లు... రోడ్లు, భవనాలకు మరమ్మతులు, రంగులు వేయించడం వంటి పనుల్లో నిమగ్నమ య్యారు. ఈ పనులు దాదాపు పూర్తికావొచ్చా యి. క్యాంపస్‌కు ఆనుకొని ఉన్న ఎ–గ్రౌండ్స్‌లో 15 వేల మంది కూర్చొనేలా శతాబ్ది ఉత్సవాల సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా హాజరు కానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం ఆర్టీసీ ఆసుపత్రి వద్ద, తార్నాకలోని ఆరాధన థియోటర్ సమీపంలో గల ప్రహారీలను కూల్చివేసి ప్రత్యేక ద్వారాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్రపతి వాహనం సభాస్థలికి నేరుగా చేరుకునేల ప్రత్యేక రోడ్డు, ఆయన సేద దీరేందుకు వేదికపై ఏసీ గదిని నిర్మిస్తున్నారు. 270 సీసీ కెమెరాలు... భద్రతా చర్యల్లో భాగంగా క్యాంపస్‌లో 270 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల్లోని ఓయూ పూర్వవిద్యార్థులు కుటుంబ సమేతంగా నగరానికి చేరుకుంటున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నర్సింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి ప్రకాష్జవదేకర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నారు. ఈ నెల 26 ప్రారంభ వేడుకల రోజున క్యాంపస్‌లోని 25 హాస్టళ్లలో విద్యార్థులు, ఫ్యాకల్టీ క్లబ్లో అధ్యాపకులు, నాన్‌టీచింగ్ హోమ్‌లో ఉద్యోగులకు మాంసాహార భోజనం ఏర్పాటు చేశారు. -
వందేళ్ల విద్యా కుసుమం
► శత వసంతాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ► 1917 ఏప్రిల్ 26న వర్సిటీని ఏర్పాటు చేస్తూ ఏడో నిజాం ఫర్మానా ► 1919లో మస్రత్ మహల్లో తరగతులు ప్రారంభం 20 ఏళ్ల పాటు అక్కడే కొనసాగిన యూనివర్సిటీ ► 1934లో ఆర్ట్స్ కాలేజీకి శంకుస్థాపన.. 1939లో పూర్తి అప్పటి నుంచి ఆర్ట్స్ కాలేజీ భవనంలో కొనసాగింపు l ► ఎందరో మేధావులు, ప్రముఖులకు విద్యనందించిన వర్సిటీ ప్రపంచానికి వెలకట్టలేని సేవలను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో మైలురాయికి చేరుకుంటోంది. ఎందరో మేధావులు, ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులు చదువుకున్న ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వందో ఏట అడుగుపెడుతోంది. అటు విద్యా సౌరభాలు వెదజల్లినా.. ఇటు పోరాటాల పురిటిగడ్డగా నిలిచినా.. ఉస్మానియా ప్రత్యేకతలు ఎన్నో. హైదరాబాద్ సంస్థానంలో నాలుగో నిజాం కాలంలో మొదలైన విద్యా సంస్కరణలను.. ఏడో నిజాం కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు శిఖరస్థాయికి చేర్చింది. వర్సిటీ వందేళ్ల పండుగ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. (మహ్మద్ మంజూర్, చింతకింది గణేశ్) అసఫ్‌జాహీ నాలుగో పాలకుడు మీర్ ఫర్కుందా అలీ నాజరుద్దౌలా (1829–1857) వరకు హైదరాబాద్ సంస్థానంలో మదర్సా విద్యా విధానం కొనసాగింది. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో అక్షరాస్యత కేవలం 8 శాతమే. కొద్దిగా చదవడం రాయడం వచ్చే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ అయ్యే వారు. జమీందారీ వ్యవస్థ అమల్లో ఉండేది. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. నిజాం ఆభరణాలు బ్రిటిష్ వారి వద్ద తనఖా పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. ఆ రోజుల్లో సంస్థాన ప్రధానమంత్రిగా మహారాజా చందూలాల్ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా సమయానికి అందేవి కావు. ఉద్యోగులు తరచూ ప్రధానమంత్రి వద్దకు వచ్చి వేతనాలు ఇవ్వాలని అడిగేవారు. ప్రధాని వారికి ‘కల్ ఆవో (రేపు రండి)’చెప్పేవారు. దాంతో ఆ రోజుల్లో ఆయనను చందూలాల్ కల్ అని హాస్యం చేసేవారు. సంస్థానంలో కొత్త వెలుగులు సంస్థానం పరిస్థితిని మెరుగుపర్చేందుకు కొత్త ప్రధానమంత్రిని ఎంపిక చేయాలని కొందరు రాజ ప్రముఖులు ప్రతిపాదించారు. దాంతో విదేశాల్లో చదివిన, బ్రిటిష్ పాలన పట్ల మంచి అవగాహన ఉన్న తురాబ్ అలీఖాన్ సాలార్జంగ్ను ప్రధానిగా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. పాలకులకు నజరానాలను నిలిపేశారు. పట్వారీ, పోలీస్, వైద్య ఆరోగ్య, విద్య, రెవెన్యూ, ల్యాండ్ సర్వే తదితర ప్రభుత్వ శాఖలను పునర్ వ్యవస్థీకరించారు. ఈ క్రమంలోనే మదర్సా వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో హైదరాబాద్ సంస్థానంలో తొలిసారి ప్రభుత్వ విద్యా విధానం ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలకు సిలబస్‌తో పాటు భవనాల నిర్మాణమూ చేపట్టారు. ఈ సమయంలో నాలుగో నిజాం మరణించడంతో... ఐదో నిజాం పదవి చేపట్టారు. 12 ఏళ్లు పాలించిన ఐదో నిజాం హయాంలో ప్రధానమంత్రిగా ఉన్న సాలార్జంగ్–1 విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఉర్దూ, పర్షియన్ భాషల్లో సైన్స్, సోషల్, మ్యాథ్స్ ను బోధించడాన్ని ప్రవేశపెట్టారు. ఇక ఐదో నిజాం మరణించినప్పుడు ఆరో నిజాం కేవలం రెండున్నరేళ్ల పిల్లాడు. ఈ ఆరో నిజాంకు సంరక్షకుడిగా ఉంటూ ప్రధానమంత్రి సాలార్ జంగ్–1 పరిపాలన కొనసాగించారు. ఈ సమయంలోనే సంస్థానం వ్యాప్తంగా జిల్లాల్లో, తాలుకాల్లో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను స్థాపించారు. అందులో మహబూబియా బాలికల పాఠశాల, ఆలియా బాలుర పాఠశాల, చాదర్‌ఘాట్ స్కూల్, జాగిర్గార్ కాలేజ్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్), నిజాం కాలేజీలను ఏర్పాటు చేశారు. ఆరో నిజాం 18వ ఏట సంస్థానం బాధ్యతలు చేపట్టారు. ఆరో నిజాం హయాంలో సంస్థానంలో పెద్ద సంఖ్యలో విద్యాలయాలు ఏర్పాటవడంతో అక్షరాస్యత పెరిగింది. అయితే ఇక్కడి విద్యాలయాల్లో చదువులు పూర్తయిన వారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. ఉస్మానియా ఏర్పాటుకు బీజం తండ్రి మరణానంతరం ఏడో నిజాం తన 25 ఏళ్ల వయసులో సంస్థానం బాధ్యతలు చేపట్టారు. ఆయన విద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. స్కూళ్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యగా వారీగా విభజించారు. హైదరాబాద్‌లోనే ఉన్నత విద్య అందించడం కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి అన్ని వర్గాల విద్యావేత్తలతో సమావేశమై చర్చించారు. హైదరాబాద్ సమీపంలోని ప్రదేశాలను పరిశీలించి.. రెండో నిజాం కాలంలో రాజనర్తకిగా కొనసాగిన మహాలఖాబాయి భూమి విశ్వవిద్యాలయానికి అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. ఆమె వారసుల నుంచి భూమిని సేకరించి.. వర్సిటీ పనులు ప్రారంభించారు. విశ్వవిద్యాలయం భవన నిర్మాణ కమిటీ అప్పట్లో సంస్థానంలోని ప్రముఖ ఇంజనీర్లు దైన్యార్ జంగ్, అలీరజాలతో విశ్వవిద్యాలయ భవన నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశారు. వారిని వారు ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, జపాన్, టర్కీ తదితర దేశాలకు పంపి.. అక్కడి విశ్వవిద్యాలయాల భవనాలపై అధ్యయనం చేయించారు. వారు ఫ్రాన్స్ ఆర్కిటెక్ట్ జాస్పర్‌ను వర్సిటీ భవనం పనుల కోసం ఎంపిక చేశారు. జాస్పర్ ఏడో నిజాం ఆదేశాల మేరకు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలను సందర్శించి.. హిందూ, ముస్లిం సాంస్కృతులు కలగలిపి ఉస్మానియా వర్సిటీ కోసం డిజైన్ రూపొందించారు. వందేళ్ల ఉస్మానియా 1917 ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏడో నిజాం ఫర్మానా జారీ చేశారు. విశ్వవిద్యాలయానికి సరిపడా భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా కింగ్‌కోఠి ప్యాలెస్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కానీ గన్‌ఫౌండ్రీలోని మస్రత్ మహల్(ప్రస్తుత ఎస్బీహెచ్ భవనం)తో పాటు దానికి అనుకుని ఉన్న ఏడు భవనాలను అద్దెకు తీసుకుని 1919 డిసెంబర్ 28న ఆర్ట్స్ కాలేజీని ప్రారంభించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ భవనం నిర్మాణమయ్యే వరకు అంటే దాదాపు 20 ఏళ్ల పాటు యూనివర్సిటీ అక్కడే కొనసాగింది. మేధావులకు పుట్టినిల్లు.. దేశానికి తొలి తెలుగు ప్రధాని పీవీ నర్సింహారావు రాజ నీతిజ్ఞతను అలవరచుకున్నది ఉస్మానియాలోనే. తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక తెలంగాణవాదంతో అనుసంధానమైందీ ఈ ఆవరణలోనే. విద్యార్థి, విప్లవ, సామాజికోద్యమాల పురిటిగడ్డగా, ఉన్నత చదువుల విద్యా కేంద్రంగా దేశానికి ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను అందించింది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతికి నామినేట్ అయిన మహమ్మద్ రజీ–ఉద్దిన్ సిద్దిఖీ, ఆర్థికవేత్త, మాజీ జర్మనీ రాయబారి సయ్యద్ అలీ మహమ్మద్ ఖుస్రో, కెనడాలో భారత పాత్రికేయుడు హరూన్ సిద్ధిఖీ, ప్రముఖ సినిమా దర్శకుడు శ్యాం బెనెగల్ వంటి వారెందరో ఉస్మానియాలో చదువుకున్నవారే. మౌలాలిలోని చందామహల్ మహాలఖాబాయి హైదరాబాద్‌లోని మౌలాలి గుట్ట దిగువన ఓ స్థలంలో వేదికను ఏర్పాటు చేసి.. ముషాయిరాలు నిర్వహించేది. 1792లో ఆమె తల్లి మరణించడంతో అక్కడే సమాధి చేసింది. దాని పక్కనే మహాలఖాబాయిని సమాధి చేశారు. అదే చందా మహల్. 2010లో పరిశోధకుడు కుగ్లే చొరవతో అమెరికా ఆర్థిక సహకారంతో చందా మహల్‌ని పునరుద్ధరించారు. ప్రస్తుతం దానిని పట్టించుకునేవారే లేకపోవడం గమనార్హం. ఎవరీ మహాలఖాబాయి? నూరు వసంతాల ఉస్మానియా చరిత్రకూ మహాలఖాబాయికి విడదీయలేని బంధం ఉంది. ఆమె అసలు పేరు చందాబీబీ. ఆమె తల్లి మిదాబీబీ, అమ్మమ్మది గుజరాత్‌లోని అహ్మదాబాద్. వారి కుటుంబం పలు సమస్యల కారణంగా ఓ భక్తిబృందంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. తల్లీకుమార్తెలు ఆ బృందంలోనే నాట్యం, గానం నేర్చుకుని.. నిజాం రాజ్యంలో నర్తకిలుగా చేరారు. మిదాబీబీకి 1768లో చందాబీబీ జన్మించింది. కవయిత్రిగా, నృత్యకారిణిగా, రాజనీతిజ్ఞురాలిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందింది. రెండో నిజాం దగ్గర కవి, చరిత్రకారుడుగా ఉన్న షాతాజ్అలీతో కలసి పనిచేసింది. ఆమె సామాజిక సేవకురాలు కూడా. ప్రస్తుతం నాంపల్లిలోని బాలికల పాఠశాల భవనం ఆమె నివాసమే. దానిపేరు హస్సా రంగ్ మహల్. ఇక్కడే వందలాది మంది బాలికలు, యువతులకు ఆమె విద్యాబుద్ధులు నేర్పించింది. నృత్యంలోనూ శిక్షణనిచ్చింది. రెండో నిజాం ఇచ్చిన బిరుదు.. రెండో నిజాం మీర్ అలీఖాన్ చందాబీబీకి మహాలఖాబాయిగా బిరుదునిచ్చారు. ఆయన వద్ద ప్రధానిగా పనిచేసిన మీర్ ఆలంకు చందాబీబీ కవిత్వం అంటే అభిమానం. దాంతో నాంపల్లి నుంచి మౌలాలి వరకు ఉన్న వేల ఎకరాల భూములను ఇచ్చి, ఆమెను జాగీర్దారుని చేశారు. మౌలాలి, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న ప్రాంతం, అడిక్‌మెట్, హైదర్గూడల్లోని భూములన్నీ ఆ జాగీర్లోనివే. మహాలఖాబాయి వివాహం చేసుకోలేదు. హుస్సేన్ అఫ్జా భానూ, హసీన్ లఖా భానూ, మహమ్మద్ మఖ్బుల్లను దత్తత తీసుకుంది. ఆమె మరణానంతరం ఈ భూములన్నీ వారికి సంక్రమించాయి. కొన్నాళ్ల తర్వాత మహాలఖాబాయి జాగీరును నిజాం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఆ స్థలంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అయితే స్కాట్లాండ్ రాజనీతిజ్ఞుడు, చరిత్రకారుడు అయిన జాన్ మాల్కం రెండో నిజాం సంస్థానంలో కొద్దిరోజుల పాటు బస చేశారు. ఆయనకు వీడ్కోలు సభలో మహాలఖాబాయి నృత్య ప్రదర్శన ఇచ్చిన అనంతరం తన గజల్స్ రాత ప్రతిని ఆయనకు బహూకరించింది. కాలక్రమేణా అది లండన్ మ్యూజియానికి చేరింది. దానిని పరిశీలించిన కుగ్లే అనే చరిత్రకారుడు మహాలఖాబాయి చరిత్రను తవ్వితీశాడు. ఉర్దూ తొలి స్త్రీ కవయిత్రి ఈమేనని చెబుతారు. భారీగా భవనం.. అడిక్‌మెట్ ప్రాంతంలో 1934 జూలై 5న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ భవనానికి ఏడో నిజాం శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయ్యేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. అన్ని హంగులతో పూర్తయిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని ఏడో నిజాం 1939 డిసెంబర్ 4న ప్రారంభించారు. అప్పటినుంచి అందులోనే వర్సిటీ కొనసాగుతోంది. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న అక్బర్ హైదర్ చాన్సలర్‌గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యారు. 1,600 ఎకరాల సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలితో కూడిన భవంతులతో ఉస్మానియా ఏర్పాటైంది. ఇక దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాతృభాషలో విద్యను బోధించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోని పుస్తకాలను ఉర్దూ భాషలోకి అనువదించడానికి ప్రస్తుతం నాంపల్లిలో ఉన్న రాయల్ హోటల్ భవనంలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముందుచూపుతోనే ఉన్నత విద్య.. ‘‘హైదరాబాద్ సంస్థానంలో కుతుబ్‌షాహీలు, నాలుగో ఆసఫ్జాహీ పాలన వరకు మదర్సాలు ఉండేవి. వాటిలో ధార్మిక విద్యతో పాటు కొద్దిపాటి ప్రాపంచిక విద్య బోధించే వారు. నాలుగో నిజాం హయాంలో ప్రధానమంత్రిగా నియమితుడైన తురాబ్ అలీఖాన్ సాలార్జంగ్.. సంస్థానంలో ఆధునిక విద్యకు బీజం వేశారు. ఆనాటి పాలకుల దూరదృష్టి వల్లనే ఉస్మానియా వర్సిటీ ఏర్పాటైంది. ఇక్కడే ఉన్నత విద్య అవకాశం కలిగింది.. – అల్ అమా ఏజాస్ ఫరూకీ, చరిత్రకారుడు -
నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సాయుధ బలగాల పహారా.. సమైక్యవాదుల నిర్బంధం.. అధికారుల హడావుడి నడుమ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడున్నర గంటల జిల్లా పర్యటన సాగింది. శీతాకాల విడిది కోసం ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం అనంతపురంలో నిర్వహించిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని.. హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జిల్లాకు చేరుకోక మునుపే అనంతపురంలో సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీ, ఎస్కేయూ విద్యార్థులను హాస్టళ్ల నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి 11.40 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక హెలికాప్టర్లో, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరో హెలికాప్టర్లో, రాష్ట్రపతి భద్రత, వ్యక్తిగత సిబ్బంది మూడో హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.16 గంటలకు అనంతపురంలోని ఎన్‌హెచ్-44కు సమీపంలోని ‘సాక్షి’ దినపత్రిక కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎన్‌హెచ్-44, నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా పోలీసు శిక్షణ కేంద్రంలోని స్టేడియానికి 12.35 గంటలకు చేరుకున్నారు. నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకల సభ వేదికపైకి రాష్ట్రపతి చేరుకున్న అనంతరం జాతీయగీతాలాపన చేశారు. అనంతరం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగుజాతి ఐక్యత కోసం నీలం సంజీవరెడ్డి పాటుపడ్డారని.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతిని కోరారు. అనంతరం నీలం సంజీవరెడ్డి తోడల్లుడు జస్టిస్ ఎం.రంగారెడ్డి, నిరుపమాన త్యాగధనుడు పుస్తక రచయిత్రి డాక్టర్ కేవీ కృష్ణకుమారి, నీలం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ వై.రామసుబ్బయ్య, నీలం నివాస సంరక్షకుడు శివారెడ్డిని రాష్ట్రపతి ప్రణబ్ సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నీలం సంజీవరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా సమైక్యాంధ్ర ప్రదేశ్ అన్న మాటను కూడా ఉచ్చరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం కేవీ కృష్ణకుమారి రచించిన ‘నిరుపమాన త్యాగధనుడు నీలం’, ఎస్కేయూ రూపొందించిన ‘ఏ హిస్టారికల్ స్టడీ అండ్ అస్సెస్మెంట్’ పుస్తకాలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆవిష్కరించి.. తొలి ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు. నీలం సంజీవరెడ్డి జీవితంపై నిర్వహించిన రాత, వకృ్తత్వ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఎనిమిది మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను రాష్ట్రపతి అందజేశారు. అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని తెలుగు వజ్రం అంటూ కొనియాడుతూ అచ్చ తెలుగులో ప్రసంగించి.. అబ్బురపరిచారు. సరిగ్గా 1.17 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగాన్ని ప్రారంభించారు. చిత్తశుద్ధి కలిగిన రాజకీయ నేతగా.. పరిపాలనాదక్షుడిగా.. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా నీలం సంజీవరెడ్డి రోల్‌మోడల్‌గా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్రపతి 1.42 గంటలకు తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రపతి ఇంగ్లీష్‌లో ప్రసంగించగా.. మంత్రి రఘువీరారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముగింపు ఉపన్యాసం చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్‌ను కోరారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి.. సభను ముగించారు. సభాస్థలి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎం ప్రత్యేక హెలికాప్టర్లలో 2.07 గంటలకు పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. పుట్టపర్తి విమానాశ్రయానికి 2.35 గంటలకు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలు నేరుగా ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌కు సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు బాబా చిత్రపటాన్ని అందజేసి, సన్మానించారు. తర్వాత సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో ప్రత్యేక విమానంలోనే రాష్ట్రపతి ప్రణబ్ ఆలస్యంగా భోజనం చేశారు.