శతాబ్ది ఉత్సవాలకు ఓయూ ముస్తాబు
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్ల ఉత్సవాల ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో పనులను వేగవంతం చేశారు. వీటిపై వేసిన వివిధ కమిటీల చైర్మన్లు... రోడ్లు, భవనాలకు మరమ్మతులు, రంగులు వేయించడం వంటి పనుల్లో నిమగ్నమ య్యారు. ఈ పనులు దాదాపు పూర్తికావొచ్చా యి.
క్యాంపస్‌కు ఆనుకొని ఉన్న ఎ–గ్రౌండ్స్‌లో 15 వేల మంది కూర్చొనేలా శతాబ్ది ఉత్సవాల సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా హాజరు కానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోసం ఆర్టీసీ ఆసుపత్రి వద్ద, తార్నాకలోని ఆరాధన థియోటర్ సమీపంలో గల ప్రహారీలను కూల్చివేసి ప్రత్యేక ద్వారాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్రపతి వాహనం సభాస్థలికి నేరుగా చేరుకునేల ప్రత్యేక రోడ్డు, ఆయన సేద దీరేందుకు వేదికపై ఏసీ గదిని నిర్మిస్తున్నారు.
270 సీసీ కెమెరాలు...
భద్రతా చర్యల్లో భాగంగా క్యాంపస్‌లో 270 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల్లోని ఓయూ పూర్వవిద్యార్థులు కుటుంబ సమేతంగా నగరానికి చేరుకుంటున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నర్సింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి ప్రకాష్‌జవదేకర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నారు. ఈ నెల 26 ప్రారంభ వేడుకల రోజున క్యాంపస్‌లోని 25 హాస్టళ్లలో విద్యార్థులు, ఫ్యాకల్టీ క్లబ్‌లో అధ్యాపకులు, నాన్‌టీచింగ్ హోమ్‌లో ఉద్యోగులకు మాంసాహార భోజనం ఏర్పాటు చేశారు.