సాక్షి ప్రతినిధి, అనంతపురం : సాయుధ బలగాల పహారా.. సమైక్యవాదుల నిర్బంధం.. అధికారుల హడావుడి నడుమ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడున్నర గంటల జిల్లా పర్యటన సాగింది. శీతాకాల విడిది కోసం ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం అనంతపురంలో నిర్వహించిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని.. హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జిల్లాకు చేరుకోక మునుపే అనంతపురంలో సమైక్యవాదులు, వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీ, ఎస్కేయూ విద్యార్థులను హాస్టళ్ల నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి 11.40 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక హెలికాప్టర్‌లో, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరో హెలికాప్టర్‌లో, రాష్ట్రపతి భద్రత, వ్యక్తిగత సిబ్బంది మూడో హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12.16 గంటలకు అనంతపురంలోని ఎన్‌హెచ్-44కు సమీపంలోని ‘సాక్షి’ దినపత్రిక కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
అక్కడి నుంచి ఎన్‌హెచ్-44, నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా పోలీసు శిక్షణ కేంద్రంలోని స్టేడియానికి 12.35 గంటలకు చేరుకున్నారు. నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకల సభ వేదికపైకి రాష్ట్రపతి చేరుకున్న అనంతరం జాతీయగీతాలాపన చేశారు. అనంతరం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగుజాతి ఐక్యత కోసం నీలం సంజీవరెడ్డి పాటుపడ్డారని.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతిని కోరారు. అనంతరం నీలం సంజీవరెడ్డి తోడల్లుడు జస్టిస్ ఎం.రంగారెడ్డి, నిరుపమాన త్యాగధనుడు పుస్తక రచయిత్రి డాక్టర్ కేవీ కృష్ణకుమారి, నీలం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ వై.రామసుబ్బయ్య, నీలం నివాస సంరక్షకుడు శివారెడ్డిని రాష్ట్రపతి ప్రణబ్ సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నీలం సంజీవరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా సమైక్యాంధ్ర ప్రదేశ్ అన్న మాటను కూడా ఉచ్చరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం కేవీ కృష్ణకుమారి రచించిన ‘నిరుపమాన త్యాగధనుడు నీలం’, ఎస్కేయూ రూపొందించిన ‘ఏ హిస్టారికల్ స్టడీ అండ్ అస్సెస్‌మెంట్’ పుస్తకాలను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆవిష్కరించి.. తొలి ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు. నీలం సంజీవరెడ్డి జీవితంపై నిర్వహించిన రాత, వకృ్తత్వ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఎనిమిది మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను రాష్ట్రపతి అందజేశారు.
అనంతరం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని తెలుగు వజ్రం అంటూ కొనియాడుతూ అచ్చ తెలుగులో ప్రసంగించి.. అబ్బురపరిచారు. సరిగ్గా 1.17 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగాన్ని ప్రారంభించారు. చిత్తశుద్ధి కలిగిన రాజకీయ నేతగా.. పరిపాలనాదక్షుడిగా.. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా నీలం సంజీవరెడ్డి రోల్‌మోడల్‌గా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్రపతి 1.42 గంటలకు తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రపతి ఇంగ్లీష్‌లో ప్రసంగించగా.. మంత్రి రఘువీరారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముగింపు ఉపన్యాసం చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్‌ను కోరారు.
అనంతరం జాతీయ గీతాలాపన చేసి.. సభను ముగించారు. సభాస్థలి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎం ప్రత్యేక హెలికాప్టర్లలో 2.07 గంటలకు పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. పుట్టపర్తి విమానాశ్రయానికి 2.35 గంటలకు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలు నేరుగా ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌కు సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు బాబా చిత్రపటాన్ని అందజేసి, సన్మానించారు. తర్వాత సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో ప్రత్యేక విమానంలోనే రాష్ట్రపతి ప్రణబ్ ఆలస్యంగా భోజనం చేశారు.
నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి
Published Tue, Dec 24 2013 1:56 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM
Advertisement