Neelam sanjeeva reddy
-
ఉమ్మడి ఏపీలో ఎన్నికలైన వెంటనే రెండుసార్లు సీఎంలైన వారు
నెలా పది రోజుల్లో తెలంగాణ మూడో అసెంబ్లీ ఎన్నికలు, మరో ఏడు నెలల్లో ఏపీ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలైన వెంటనే ఎంత మంది రెండేసిసార్లు లేదా మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారనే అంశంపై రాజకీయ, ఎన్నికల విశ్లేషకులు ఇప్పుడు చర్చిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో (1956–2014) శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి పదవిని రెండుసార్లు చేపట్టిన నేతలు నలుగురే ఉన్నారు. విశాల తెలుగు రాష్ట్రం అవతరించిన ఏడాదిలోపే జరిగిన 1957 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు రెండుసార్లూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు, కాని దామోదరం సంజీవయ్య గారు సీఎం పదవిలో ఉండగా జరిగిన 1962 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల వల్ల నీలం సంజీవరెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా చేజిక్కించుకున్నారు. ఇలా అయన ఎన్నికల తర్వాత రెండుసార్లు సీఎం అయిన నేతల్లో మొదటి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నాటి కాంగ్రెస్ సీఎంలలో అత్యధికంగా ఏడున్నరేళ్లకు పైగా పదవిలో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1967 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాని, 1972 అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు 1971 సెప్టెంబర్ 30న రాజీనామా చేయడంతో అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత రెండుసార్లు సీఎం అయిన నేతగా చరిత్రకెక్కే అవకాశం కోల్పోయారు. 1978 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో నాటి పీసీసీ అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి గారు తొలిసారి సీఎం అయ్యారు గాని రెండున్నరేళ్లకే 1980 అక్టోబర్ 11న రాజీనామా చేశారు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి మరోసారి చేపట్టిన చెన్నారెడ్డి 1989 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి సీఎం పదవిలో కొనసాగింది కేవలం ఏడాది రెండు వారాలే. ఉమ్మడి ఏపీలో మూడు అసెంబ్లీ ఎన్నికలయ్యాక సీఎం అయిన ఏకైక నేత ఎన్టీఆర్ ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే–ఈ పార్టీ స్థాపకుడు ఎన్.టి.రామారావు గారు 1983 ఆరంభంలో జరిగిన ఏపీ ఏడో శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ విజయం సాధించాక తొలిసారి ఆ ఏడాది జనవరి 9న ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1984 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్యకాలంలో టీడీపీ అంతర్గత సంక్షోభం కారణంగా ఎన్టీఆర్ సీఎం పదవి నుంచి బర్తరఫ్ కావడం, నెల రోజులకే మళ్లీ దాన్ని దక్కించుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఎన్టీఆర్ అప్పటి అసెంబ్లీని మూడేళ్ల ముందే 1984 చివర్లో రద్దుచేయించి 1985 మార్చిలో జరిపించిన ఏపీ తొలి మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. దీంతో రామారావు వరుసగా రెండోసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం అయ్యారు. 1994 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచాక ఎన్టీఆర్ –ఎన్నికలైన వెంటనే మూడుపార్లు ముఖ్యమంత్రి అయిన నేతగా కొత్త రికార్డు సృష్టించారు. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు కావడంతో సుదీర్ఘకాలం ఏపీని పాలించిన కాంగ్రెస్ నేతలకు సైతం దక్కని గొప్ప అవకాశం ఎన్టీఆర్ చేతికి చిక్కింది. ఎన్టీఆర్ తర్వాత ఎన్నికలయ్యాక రెండుసార్లు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి లభించింది. కొత్త శతాబ్దం, మిలేనియంలో జరిగిన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మే 14న ఆయన తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలిసారి పూర్తి పదవీకాలం (ఐదు సంవత్సరాల ఆరు రోజలు) ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా వైఎస్‌ది ఎవరూ చెరిపివేయలేని రికార్డు. అంతేగాక, ఐదేళ్లు సీఎంగా పనిచేశాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం కూడా వైఎస్ గారిదే రికార్డు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో రాజశేఖరరెడ్డి గారు మే 20న రెండోసారి సీఎం పదవి చేపట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అప్పటి అసెంబ్లీ ఎన్నికలయ్యాక అవతరించిన నవ్యాంధ్ర ప్రదేశ్ మొదటి సీఎం అయ్యారు. కాని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రెండోసారి ఎన్నికల తర్వాత మరోసారి పదవి దక్కించుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక విజయం సాధించాక సీఎం అయిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల తర్వాత కూడా రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ -
నిరుపమాన పాలనాదక్షుడు
భారతదేశ హృదయాల్లో పరి పాలనాదక్షుడిగా మహోన్నత స్థానాన్ని పొందిన వారిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి, రాజగోపాలాచారి, ఇందిరాగాంధీ, కామరాజ్ నాడార్ ముఖ్యులు. కాగా ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా అనేక పదవులు అలంకరించి తన పరిపాలనా చాకచక్యంతో ఆ పదవులకే వన్నె తెచ్చిన పరిపాలనాదక్షుడు నీలం సంజీవరెడ్డి. సామాన్య రైతుబిడ్డగా జన్మించి, దేశంలో అత్యున్నతమైన భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన నీలం 106వ జయంతి నేడు. దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయలసీమలోని అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1913 మే 19న నీలం సంజీవరెడ్డి జన్మించారు. గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు అన్ని కీలకపదవులు అలంకరించారు. ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా కొత్త సత్సంప్రదాయాలను సృష్టించిన మహా మనిషి. 1964లో కర్నూల్ జిల్లాలో బస్సు రూట్లను జాతీయం చేసే అంశంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అదే ఏడాది ఫిబ్రవరి 23న ఏపీ ముఖ్యమంత్రి పదవికి తనకు తానుగా రాజీనామా చేసి దేశంలోనే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 1967 లోక్‌సభ ఎన్నికల అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారు. ఏపీకి నీలం సంజీవరెడ్డి ఎంతో సేవ చేశారు. జిల్లా పరిషత్, పంచాయతీ సమితులు, విధాన పరిషత్ ఏర్పాటుకు కారకులయ్యారు. పంచాయితీ వ్యవస్థకు పరిపుష్టి చేకూర్చి జాతిపిత కలలు కన్న పంచాయితీ రాజ్ వ్యవస్థ పురోభివృద్దికి సోపానం వేశారు. ఆయన పరిపాలన విధానాలను నెహ్రూ సైతం ప్రశంసించారు. 1959లో ఏపీ పర్యటనకు వచ్చిన నెహ్రూ నీలం సంజీవరెడ్డి పరిపాలన విధానాలకు ఆకర్షితులయ్యారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ పాలనలో దిట్టగా పేరుగాంచి, తద్వారా సాధించిన అనుభవం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటానికి దోహపడింది. నీలం సంజీవరెడ్డి పరిపాలనాదక్షుడే కాదు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. అనంతపురం, మద్రాస్‌లలో విద్యనభ్యసించిన సంజీవరెడ్డి స్వాతంత్య్ర పోరాటంలో అనేకసార్లు జైలుకు వెళ్లారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని దీర్ఘకాలం అంటే 1942 నుంచి 1945 వరకు వేలూరు, అమరావతి జైళ్లలో నిర్బంధితులయ్యారు. 1946లో విడుదలైన తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మద్రాస్ రాష్ట్ర లెజిస్లేచర్ పార్టీకి కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత 1949 ఏప్రిల్‌లో అప్పటి ఉమ్మడి మద్రాస్ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి రాజా మంత్రివర్గంలో గృహనిర్మాణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1951–53 మధ్య ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1953 అక్టోబర్ నుంచి టంగుటూరి ప్రకాశం, బెజ వాడ గోపాల్‌రెడ్డి మంత్రి వర్గాల్లో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. వారితో కలిసి పనిచేయడం వల్ల పరిపాలన రంగంలో అపారమైన అనుభవం గడించారు. ఫలి తంగా 1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా నియమితులయ్యారు. తిరిగి 1962 మే నుంచి 1964 ఫిబ్రవరి వరకు సీఎంగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూకు అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు. 1956 నవంబర్ నుంచి 1959 డిసెంబర్ వరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. నెహ్రూ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీల మంత్రివర్గాలలో నీలం సంజీవరెడ్డి పనిచేశారు. 1967 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1977లో జనతాపార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జనతా పార్టీ తరఫున ఎన్నిక అయిన ఏకైక పార్లమెంట్ సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. అనంతరం అదే ఏడాది జూలైలో భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మంత్రిగా, ఏపీ సీఎంగా, ఉపముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు. తన హయాంలో అనేక భారీ పరిశ్రమలను స్థాపించారు. దేశానికి సేవలందించిన గొప్ప నాయకులలో ఒకడిగా తనదైన ముద్రవేశారు. అనేక క్లిష్టపరిస్థితుల్లో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దేశానికి నిరుపమాన సేవలందించిన నీలం సంజీవరెడ్డి 1996 జూన్ 1న తుది శ్వాసను విడిచారు. (నేడు నీలం సంజీవరెడ్డి 106వ జయంతి సందర్భంగా) డా. అగరాల ఈశ్వర రెడ్డి వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ -
ప్రధాని, రాష్ట్రపతిని అందించిన నంద్యాల
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని అందించిన ఘనత ఈ సెగ్మెంట్ దక్కించుకుంది. రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ప్రధాని పీవీ నరసింహరావు నంద్యాల నుంచి విజయం సాధించారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికంటే ముందు.. 1977లో జరిగిన ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా జనతా పార్టీ తరఫున ‘నీలం’ ఒక్కరే గెలిచి రికార్డు సృష్టించారు. ఇక 1991లో ప్రధానిగా పీవీ నరసింహరావు ఎన్నికవడంతో నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి పీవీ కోసం రాజీనామా చేశారు. ఇక్కడినుంచి పీవీ రెండుసార్లు విజయం సాధించారు. -
అప్పట్లో ఎమ్మెల్యే పదవి ఏడేళ్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 1957లో జరిగిన సాధారణ ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర, రాయలసీమ జిల్లాలు కలిసి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడ్డాయి. టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులు కాగా.. రాష్ట్రపతి పాలన అనంతరం 1955 మార్చిలో 196 అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. నీలం సంజీవరెడ్డి మొదటి సీఎం అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రప్రాంతంలోని 196 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పటికే మధ్యంతర ఎన్నికలు జరిగినందున తెలంగాణలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆంధ్ర, రాయలసీమకు చెందిన 196 మంది ఎమ్మెల్యేలు 1962 వరకూ ఏడేళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. -
విశేషాల కొలువు.. ఉద్దండుల నెలవు..
సాక్షి, ఎలక్షన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసనసభకు సంబంధించిన విశేషాల గురించి రాష్ట్రంలోని సీనియర్ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. శాసనసభకు ఎన్నికైంది ఒకే పర్యాయమైనా ఏడేళ్ల సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా కొనసాగిన అరుదైన అవకాశం, ఆంధ్ర రాష్ట్రం, ఏపీ అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఆంధ్ర ప్రాంతీయులకే సొంతమైంది. 1956లో ఏర్పాటైన ఏపీ మొదటి శాసనసభ.. మూడు ప్రాంతాలకు చెందిన ఉద్దండులతో మొత్తం తెలుగువారికి వేదికగా కనిపించేది. బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి తెలుగు ప్రముఖులంతా ఈ సభలో ప్రాతినిధ్యం వహించిన వారే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్న సమయంలో (1952) మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ ఉన్న ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం సీఎంగా ఎన్నికయ్యారు. మద్యనిషేధం అంశంపై అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు. 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణా(హైదరాబాద్ రాష్ట్రం) కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.తెలంగాణా ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే 1957లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లు మాత్రమే అయినందున 1957 సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారికి వేదికగా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావడం మొదటి శాసనసభలో కనిపించిన అరుదైన విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. నీలం సంజీవరెడ్డి.. తర్వాత కాలంలో దేశ ప్రథమ పౌరునిగా అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్‌రెడ్డి తన కింద ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి వద్ద తర్వాత మంత్రిగా పనిచేయడం ఈ కాలంలో చోటుచేసుకొన్న మరో ఆసక్తికర సన్నివేశం. 1955 నుంచి 1962 వరకూ ఏడేళ్లు సభలో ఉన్న వారిలో గౌతు లచ్చన్న, పీవీజీ రాజు, పుచ్చల పల్లి సుందరయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, కడప కోటిరెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రముఖులు ఉన్నారు.1952, 1955లో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినవారు కూడా మొదటి శాసనసభలో ఉన్నారు. – లేబాక రఘురామిరెడ్డి, సాక్షి ప్రతినిధి -
నంద్యాల ఖ్యాతి.. దేశ వ్యాప్తి
సాక్షి, నంద్యాల(ఎలక్షన్ డెస్క్): రాష్ట్రపతి, ప్రధానమంత్రులను అందించిన ఘనత నంద్యాల నియోజకవర్గానికి దక్కుతుంది. 1971లో దేశమంతా ఇందిరాగాంధీ గాలి వీస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలను కైవసం చేసుకుంది. నంద్యాలలో మాత్రం ఇందిరా గాంధీతో విభేదించి జనతాపార్టీ తరఫున పోటీ చేసిన నీలం సంజీవరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పెండెకంటి వెంకటసుబ్బయ్యపై 35,743 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికై మూడు నెలలు పనిచేసి తర్వాత 1977 నుంచి 1982 వరకు 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలాగే దేశ 10వ ప్రధానిగా పీవీ నరసింహరావు 1991 జూన్ 21న బాధ్యతలు చేపట్టారు. ఆయన పార్లమెంట్లో సభ్యుడు కాకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. అప్పటి నంద్యాల ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డిని రాజీనామా చేయించి ఇక్కడి నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై 5,80,035 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ తరువాత పీవీ 1996లో నంద్యాలతో పాటు ఒరిస్సాలోని బరంపురం నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ గెలవడంతో నంద్యాలకు రాజీనామా చేశారు. అలాగే బనగానపల్లెకు చెందిన పెండెకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికై ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. -
శింగనమల సీటు..ప్రభుత్వ ఏర్పాటుకు రూటు!
శింగనమల నియోజకవర్గానికి దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఉంది. మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి, కమ్యూనిస్ట్ పోరాట యోధుడు తరిమెల నాగిరెడ్డి ఈ నియోజకవర్గానికి చెందిన వారే. నిత్య చైతన్యశీలురైన ఈ నియోజకవర్గ ఓటర్లు తమదైన శైలిలో తీర్పునిస్తూ వస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా మంది నమ్ముతారు. గత ఎన్నికలు పరిశీలిస్తే ఇది వాస్తవ మనే తేలుతోంది. పార్టీలు మారి పోటీ చేసిన వారిని ఓడించడం ఈ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. చివరకు వారు రాజకీయాల నుంచే తప్పుకునేందుకు రణమవుతుంటారు. శింగనమల నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. 1978లో ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వుడు అయింది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగింది. పార్టీలు మారిన వారిని ఓడించారు 1985లో కాంగ్రెస్ పార్టీలోకి పామిడి శమంతకమణి చేరి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989లో ఆదే పార్టీ నుంచి పామిడి శమంతకమణి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. 1994లో కాంగ్రెస్ తరఫున శమంతకమణి పోటీ చేసి ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో శమంతకమణి టీడీపీలో చేరిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీపై పోటీ చేసిన శమంతకమణిని ఓటర్లు ఓడించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ రాకపోవడంతో కె.జయరాం పీఆర్పీలోకి మారారు. ఆ ఎన్నికల్లో జయరాంకు డిపాజిట్ కూడ దక్కలేదు. ప్రధాన సమస్యలు శింగనమల చెరువు లోకలైజేషన్ హమీగానే నిలిచిపోయింది. ఇంతవరకు నీటి కేటాయింపులు చేయలేదు. దీంతో శింగనమల మండలంలో దాదాపు 15 గ్రామాల రైతులు, ప్రజలు తిండి గింజలు, తాగునీటికి ఇబ్బం దులు పడుతున్నారు. గార్లదిన్నె మండలం యర్రగుంట్ల వద్ద బైపాస్ కెనాల్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేసినా.. పనులు చేపట్టలేకపోయారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేపట్టలేదు. మిడ్ పెన్నార్ డ్యాం కింద ఆయకట్టు 60 వేలు ఎకరాలు వరకూ నీరు పారక రైతులు అగచాట్లు పడుతున్నారు. నియోజకవర్గానికి ఇప్పటి వరకూ ఎన్నికైన ప్రజాప్రతినిధులు వైఫల్యాలకు నిదర్శనంగా సాగు, తాగునీటితో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్ చేయూత .. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గంలోని ఆన్ని మండలాల్లో ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు పంపిణీ విరివిగా చేపట్టారు. ఎర్రగుంట్ల నుంచి ముంటిముడుగు వరకూ 6 కిలోమీటర్లు బైపాస్ కాలువ ఏర్పాటు చేయాలని 43 ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయించారు. గార్లదిన్నెలో కేజీబీవీ, ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. హెచ్చెల్సీ చివరి అయుకట్టు వరకూ నీరు వచ్చాయి. బుక్కరాయసముద్రం మండలంలో కేజీబీవీ, నార్పలకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించారు. శింగనమలలో కేజీబీవీ ఏర్పాటు చేశారు. శింగనమల చెరువుకు నాలుగేళ్లపాటు పంట కోసం హెచ్చెల్సీ నీటిని విడుదల చేయించి రైతులను ఆదుకున్నారు. శింగనమల చెరువును లోకలైజేషన్ చేస్తానని, నార్పలలో జరిగిన ఎన్నికల సభలో హమీ ఇచ్చారు. కాని అయన మరణాంతరం చెరువుకు నీరు విడిపించేవారు లేకుండా పోయారు. నార్పల మండలంలో గూగూడు రోడ్డు నిర్మాణం, ఇందిరమ్మ గృహాలు, కేజీబీవీ ఏర్పాటు చేశారు. పుట్లూరు మండలంలో రూ.4.50 కోట్లతో రోడ్లు, కేజీవీ, ఆదర్శ పాఠశాలలు మంజూరు చేశారు. గండికోట నుంచి పార్నపల్లి వరకూ కృష్ణా జలాలను తరలించడం కోసం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అధికార పార్టీపై పెరిగిన వ్యతిరేకత నియోజవకర్గ ఎమ్మెల్యే యామినిబాల వ్యక్తిగత సంపాదనే ధ్యేయంగా పని చేయడంతో ఆమెపై వ్యతిరేకత బలపడింది. సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే ఆమెను వ్యతిరేకిస్తూ వస్తు న్నారు. సీఎం చంద్రబాబు చేపట్టిన అంతర్గత సర్వేలలో సైతం యామినిబాలకు వ్యతిరేకంగా నివేదికలు వెళ్లాయి. దీంతో ఆ పార్టీ అధిష్టానం కొత్త అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టింది. ఇప్పటికే బండారు శ్రావణితో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్లను టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. జేసీ వర్గీయులు తప్ప మిగిలిన నాయకులందరూ బండారు శ్రావణిని వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓడిపోయే పార్టీలోకి తాను రాలేనంటూ శైలజనాథ్ తెగేసి చెప్పినట్లు సమాచారం. కాగా, నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి దూసుకెళుతోంది. నిరంతరం ఏవో ఒక కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమవుతూ వచ్చారు. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాలతో పాటు, నవరత్నాలు పథకాలను వివరిస్తూ ప్రజలకు చేరువయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాలతో అనేక ప్రజా సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు పోరాటాలు చేశారు. దీంతో ప్రజలు కూడా వైఎస్సార్సీపీని ఆదరిస్తున్నారు. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యేలు సంవత్సరం గెలిచిన అభ్యర్థి సమీప ప్రత్యర్థి పార్టీ పార్టీ మెజారిటీ 1967 చిన్న రంగయ్య శెట్టి కాంగ్రెస్ కుమ్మెత రంగారెడ్డి సీపీఎం 1851 1972 తరిమెల రంగారెడ్డి స్వంతంత్ర తిమ్మారెడ్డి కాంగ్రెస్ 5355 1978 బి.రుక్మీణీదేవి జనత కె.ఆనందరావు కాంగ్రెస్ 3627 1983 గురుమూర్తి టీడీపీ కె.ఆనందరావు కాంగ్రెస్ 18,903 1985 కె.జయరాం టీడీపీ పామిడి శమంతకమణి కాంగ్రెస్ 14212 1989 పామిడి శమంతకమణి కాంగ్రెస్ బీ.సీ.గోవిందప్ప టీడీపీ 7079 1994 కె.జయరాం టీడీపీ పామిడి శమంతకమణి కాంగ్రెస్ 47,198 1999 కె.జయరాం టీడీపీ సాయిరాం కాంగ్రెస్ 4290 2004 సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పామిడి శమంతకమణి టీడీపీ 8586 2009 సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పామిడి శమంతకమణి టీడీపీ 3176 2014 యామినిబాల టీడీపీ జొన్నలగడ్డ పద్మావతి వైఎస్సార్సీపీ 4584 -
బ్యాంకుల జాతీయీకరణకు కారణం ‘నీలం’
సాక్షి, హైదరాబాద్: దేశంలో బ్యాంకుల జాతీయీకరణకు.. మాజీ రాష్ట్రపతి, తెలుగువాడు నీలం సంజీవరెడ్డి కారణమా? అప్పటి ప్రధాని ఇందిరాగాం«ధీ ఇష్టాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించడం పరోక్షంగా బ్యాంకుల జాతీయీకరణ వేగంగా జరిగేలా చేసిందా? దీనికి అవుననే సమాధానం చెపుతున్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్. రాష్ట్రపతిగా బాబూ జగ్జీవన్‌రామ్‌ను చూడాలని ఇందిర అనుకున్నారని, అయితే పార్టీ ఆమె అభీష్టానికి విరద్ధంగా నీలం పేరును ప్రతిపాదించడంతో ఇందిర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లండన్‌లో తన క్లాస్మేట్ అయిన పీఎన్ హక్సర్ సలహా మేరకు బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియను వేగవంతం చేశారని చెప్పారు. 1967–73 మధ్య అప్పటి ప్రధాని ఇందిరకు ‘ఆత్మ’గా వ్యవహరించినట్టు చెప్పే పీఎన్ హక్సర్ జీవిత చరిత్రను ‘ఇంటర్‌ట్వైన్డ్ లైవ్స్’పేరుతో జైరాం పుస్తకంగా రాశారు. ఈ పుస్తకం ఇటీవల విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చర్చా వేదిక మంథన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జైరాం ఈ పుస్తకం వెనక దాగున్న అనేక ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఇందిర హయాంలో అత్యంత శక్తివంతుడైన అధికారిగా హక్సర్ ఎన్నో సేవలు అందించారని, బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, అణ్వస్త్ర ప్రయోగాలు, అంతరిక్ష కార్యక్రమాల రూపకల్పన వంటి అనేక కీలకమైన విధానాల వెనుక ఉన్నది ఆయనేనని జైరాం తెలిపారు. దేశం బాగోగుల కోసం ప్రభుత్వ విధానాల రూపకల్పన చేసే వ్యవస్థగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని (అప్పట్లో ప్రధానమంతి సెక్రటేరియట్)ను ఏర్పాటు చేసింది కూడా హక్సర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడేనని వివరించారు. సర్వం తానై.. జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పగ్గాలు చేపట్టిన ఇందిర తన చిన్ననాటి మిత్రుడైన హక్సర్‌ను లండన్ నుంచి రప్పించుకుని మరీ కార్యదర్శిగా చేర్చుకున్నారని జైరాం తెలిపారు. 1967–73 మధ్య హక్సర్ సర్వం తానై అటు ప్రభుత్వాన్ని, ఇటు రాజకీయంగానూ ఇందిరకు సహరించారని, 1967 ఎన్నికల్లో 282 స్థానాలు మాత్రమే కలిగిన కాంగ్రెస్.. తర్వాత ఎన్నికలు వచ్చేనాటికి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించే స్థాయికి చేరడం వెనుక హక్సర్ మంత్రాంగం, ఇందిరకు ఆయన ఇచ్చిన సలహాలు కీలకమయ్యాయన్నారు. నెహ్రూ స్మారక గ్రంథాలయంతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో ఉన్న హక్సర్ లేఖలు, కార్యదర్శిగా ఆయన జారీ చేసిన మెమోలు, ఫైల్ నోటింగ్స్ అన్నింటినీ ఏడాది పాటు క్షుణ్ణంగా పరిశీలించి తాను ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. 1971లోనే ఎమర్జెన్సీ పెట్టమన్నాడు.. దేశ రాజకీయాల్లో చీకటి అధ్యాయంగా చెప్పుకునే ఎమర్జెన్సీని హక్సర్ సూచనల ప్రకారం 1971లోనే విధించి ఉంటే దేశం పరిస్థితి ఇంకోలా ఉండేదేమోనని జైరాం అభిప్రాయపడ్డారు. యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించి బంగ్లా దేశ్‌ను విముక్తం చేసిన తర్వాత కొన్ని లక్షల మంది శరణార్థులు దేశంలో ఉండేవారని.. ఆ నేపథ్యంలో విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నెపంతో ఎమర్జెన్సీ విధించి ఉంటే రాజకీయంగా ఇందిరకు లాభం కలిగేదని హక్సర్ భావించారని, అయితే ఇందిర ఆ సలహాను తోసిపుచ్చి.. ఆరేళ్ల తర్వాత రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు అత్యవసర పరిస్థితిని ప్రకటించారని వివరించారు. 1972లో జుల్ఫికర్ అలీ భుట్టోతో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందం కశ్మీర్ సమస్యకు కారణమన్న కొందరి వాదనను తాను అంగీకరించబోనన్న జైరాం.. ఆ ఒప్పందం ద్వారా భారత్‌కు మేలే జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, మంథన్ నిర్వాహకులు అజయ్, విక్రం గాంధీ పాల్గొన్నారు. -
మోదీ అవమానించారు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చౌకబారుగా ఉందని, ఆయనకు ఇదే చివరి బడ్జెట్ అని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని అవమానించేలా మాట్లాడారని అన్నారు. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి చేసింది, పీవీ నరసింహారావును ప్రధానమంత్రిని, అంజయ్యను సీఎం చేసింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. కలియుగ వెంకటేశ్వరుడికే మోదీ శఠగోపం పెట్టారని, ఆయన సన్నిధిలో చేసిన హామీలే నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సొంత భాగస్వామి టీడీపీనే ఆయన తీరు పట్ల నిరసన తెలుపుతోందని, సహనం కోల్పోయి కాంగ్రెస్‌ను మోదీ విమర్శిస్తున్నారన్నారు. ‘తెలంగాణకు చట్టంలో ఉన్న ఏ హామీని మీరు నెరవేర్చలేదు. కేంద్రం సరైన పాత్రపోషించకపోవడం వల్లే విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విభజన సమస్యల పరిష్కారం కోసం ఏం చేశారు? ఏరోజైనా ఇద్దరు సీఎంలతో విభజన సమస్యలపై చర్చించారా? తెలంగాణ ఏర్పాటునే మోదీ అవహేళన చేసారు. దీనికి బీజేపీ క్షమాపణ చెప్పాల’ని రేవంత్ డిమాండ్ చేశారు. వాజపేయి, అద్వానీ లాంటి వారు నడిపిన బీజేపీ ఇప్పుడు అదాని, అంబానీ చేతుల్లోకి పోయిందని ఆరోపించారు. మోదీ కేర్ పథకానికి వాజపేయి పేరు పెట్టాలని సూచించారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా లాంటి వారిని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. మోదీకి రాజకీయ ప్రయోజనమే తప్ప దేశ గౌరవం పట్టడం లేదని ధ్వజమెత్తారు. -
రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ అనివార్యమా?
న్యూఢిల్లీ: దేశ తదుపరి రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో ఇటు పాలకపక్ష భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే పార్టీలు, అటు ప్రతిపక్ష పార్టీలు పిల్లీ, ఎలుక ఆటకు తెరతీశాయి. ప్రతిపక్ష పార్టీలతో సంప్రతింపులు జరపడం ద్వారా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఖరారు చేసేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ శైరీలతో త్రిసభ్య కమిటీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ కమిటీ ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీ పార్టీలను సంప్రతించి శుక్రవారం ఆయా పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు సమయాన్ని కోరింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రతిపక్షాలు తమతో కలసి వస్తాయన్న నమ్మకం పాలకపక్షమైన బీజేపీకి ఇసుమంతా కూడా లేదు. కేవలం కాలయాపన చేయడానికి ఈ తతంగం, ఈ కసరత్తు అంతా కూడా. రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయాల్సిన ఆఖరి తేదీ జూన్ 28వ తేదీకాగా ఎన్నికలు జూలై 17వ తేదీ. చివరి వరకు ప్రతిపక్షాలను సరైన అభ్యర్థి ఎన్నుకోకుండా ఏదోరకంగా వారిని ఎంగేజ్ చేయడం బీజేపీ వ్యూహం. గోపాలకృష్ణ గాంధీ పేరు... ప్రతిపక్ష నాయకులేమీ అమాయకులు కాదు కసరత్తు మానేసి కాలయాపన చేయడానికి. ప్రతిపక్షాలకు చెందిన పది మంది సభ్యుల కమిటీ బుధవారం సమావేశమై తమ పక్షం నుంచి రాష్ట్రపతి అభ్యర్థికి పలువురి పేర్లను పరిశీలించింది. జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు, సీ రాజగోపాలచారి బంధువు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, రిటైర్డ్ ఉన్నతాధికారి గోపాల కృష్ణ గాంధీ అభ్యర్థిత్వం పట్ల ప్రతిపక్షంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది. జాతిపితను ఇప్పటికే ‘చతుర్ బనియా’ అంటూ విమర్శించిన అమిత్ షా ప్రతిపక్షంతో కలసివచ్చే అవకాశం ఏమాత్రం లేదు. లౌకిక భావాలు కలిగిన వ్యక్తిని తప్పా మరొకరి పేరును పాలకపక్షం ప్రతిపాదిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని లలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేయడం, ఆ మాటకు వామపక్షలు మద్దతు పలకడం తెల్సిందే. మరో లౌకిక అభ్యర్థిని పాలకపక్షం ప్రతిపాదించడంగానీ, ప్రతిపక్షం ప్రతిపాదిస్తే అంగీకరించేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఎవరి స్క్రిప్టు వారిదే... పాలకపక్షానికి తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన ఓట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలతోపాడు తమిళనాడులోని అన్నాడీఎంకే వర్గాలు తమకు మద్దతిస్తాయని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజూ జనతాదళ్ పార్టీ బీజేపీవైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రతిపక్షం కలసిరాకుండా పోటీకి సిద్ధమైనందున తాము పోటీకి సిద్ధపడాల్సి వచ్చిందని పాలకపక్షం బీజేపీ, పాలకపక్షం ప్రతిపాదించిన అభ్యర్థి తమకు నచ్చకపోవడం వల్ల పోటీ అనివార్యమైందని ప్రతిపక్షం అంతిమంగా చెప్పేది. మరి ఇరువర్గాల నుంచి ఈ కసరత్తు ఎందుకు? 2019 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా రాష్ట్రపతి ఎన్నికల పేరిట ప్రతిపక్షాలను కూడగట్టడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంకాగా, రాష్ట్రపతి ఎన్నికల్లోనే ప్రతిపక్షాలను ఘోరంగా చిత్తు చేయడం ద్వారా వారి భవిష్యత్తు ప్రణాళికలను తుంచివేయడం బీజేపీ రాసుకున్న స్రిప్టు. ఏకగ్రీవంగా నీలం ఒక్కరే... ఆ మాటకొస్తే 1977లో నీలం సంజీవ రెడ్డిని మినహాయిస్తే ఇంతవరకు ఏ రాష్ట్రపతి కూడా ఏకగ్రీంగా ఎన్నికకాలేదు. వాస్తవానికి నీలం సంజీవరెడ్డిని జనతా పార్టీ ప్రతిపాదించగా ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినందున నీలంను కాంగ్రెస్ పార్టీ సమర్థించాల్సి వచ్చింది. 2002లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి, రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాం ఆజాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. కలాం అభ్యర్థిత్వానికి కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు మద్దతిచ్చినా, వామపక్షాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్‌ను నిలబెట్టాయి. అలాగే ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీ విషయంలో కాంగ్రెస్ కూడా శివసేన. జేడీయూ లాంటి పార్టీల మద్దతును కూడగట్టాయి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రణబ్ ముఖర్జీ పేరునే పాలకపక్షం ప్రతిపాదిస్తే పరిస్థితి వేరుగా ఉండవచ్చు. దేశ చరిత్రలో తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాత్రమే రెండు సార్లు పోటీ చేసి, రెండు సార్లు విజయం సాధించారు. -
ఔట్ అనుకుంటే ఔటు అయ్యింది
శ్రీకారాలు - శ్రీమిరియాలు ఒకసారి రాజకీయాల్లో ఒక స్థాయికి వెళ్లి ఆగినవాడితో జాగ్రత్తగా ఉండాలి. అయిపోయాడులే, కొడిగట్టిన దీపం అనుకోకూడదు. నివురు కప్పిన నిప్పు ఆరిపోయినట్టే కనిపిస్తుంది. వత్తి మాత్రం కాలి ఆగిపోయిన ఔటుతో జరభద్రం. గోడమీది రావిచెట్టు ఒకందాన పోదు. కలుపుగడ్డి, సెలవేసిన కురుపు ఇందుకు మరికొన్ని ఉదాహరణలు. నీలం సంజీవరెడ్డి అత్యున్నత పదవులు అలంకరించి హాయిగా సొంతవూరు వెళ్లిపోయి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆయన పవర్లో ఉండగా పైకొచ్చిన వారు కొందరున్నారు కాని, ఎప్పుడైనా పిలిస్తే పలికేవారు కాదు. ఆరిపోయిన లక్ష్మీ ఔటుగా భావించి పక్కన పెట్టేశారు. ఒకరోజు వచ్చింది. ఒక్కసారి దేశాధ్యక్షపదవి సంజీవరెడ్డిని వరించింది. చింతనిప్పు కణకణమంది. దీపం మళ్లీ వెలిగింది. ఔటు పేలింది. పాతమిత్రులు నాలికలు కరుచుకున్నారు. గురువుగారు చిన్న పనికోసం ఫోన్ చేసినా దొరికేవారు కాదు. ఆయన ఎప్పుడు ఏ వేళలో ఫోను చేసినా బాత్రూంలో ఉన్నానని చెప్పించారు. రాజకీయాల్లో ఇలాంటి ఒడిదుడుకులు తప్పవని ఎంచి, ఒక శిష్యుడు అనకొండలాంటి గజమాలని బలగంతో పట్టించుకుని శ్రీవారిని దర్శించడానికి వెళ్లారు. అతి వినయాన్ని వొలకబోస్తూ నిలబడ్డారు. సంజీవరెడ్డి పెద్ద నవ్వుతో పులకరించి ‘‘...రండి... రండి... అన్నట్టు బాత్రూంలోంచి ఎప్పుడు బయటకు వచ్చారు’’ అంటూ పలకరించారు. హన్నా! హనుమంతుడి ముందా కుప్పిగంతులు! - శ్రీరమణ మన అమ్మాయే! హారిపోటర్ తెలుగింటి ఆడపడుచనీ, మూడుతరాల క్రితం పెద్దలు వలస వెళ్లారనీ కొందరు చరిత్రకారులు అంటున్నారు. అసలు పేరు హరిపోటర్ అనీ క్రమంగా యాసలో అది హారి అయిందని వాదిస్తున్నారు. అందుకే ఫాంటసీ బాగా రాస్తోందనీ, దాని వెనక హరికటాక్షం ఉందనీ తీర్మానించారు. రావి శాస్త్రీయం పది పదిహేనేళ్ల క్రితం ప్రసిద్ధ రచయిత రావిశాస్త్రి ప్రత్యేక అతిథిగా నల్లగొండ వెళ్లారు. ఆ పక్కనే ‘‘రాచకొండ’’ ఉందని విని, మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లారు. కొంతసేపు అక్కడ తిరిగాక, వచ్చేటప్పుడు చేతిరుమాలులో దోసెడు మట్టిని మూటకట్టుకు తెచ్చుకున్నారట. ‘‘ఇక్కడ మా పూర్వీకులు చాలా ఏళ్లు వున్నారు, ఇది నా స్వస్థలం’’ అంటూ ఎంతో ఆనందించారట! విప్లవకవి రాచకొండ విశ్వనాథ శాస్త్రికి ఎన్నో సెంటిమెంట్లు. జ్యోతిష్యం మీద ఆయనకు నమ్మకం. కాదు, నిజం చెప్పాలంటే పిచ్చి. నమ్మినంత మాత్రాన విప్లవకవి కాకుండా పోతాడా? అడిదము సూరకవి (1750-1830) పూసపాటి సీతారామరాజుని శ్లాఘిస్తూ పద్యం చెప్పాడు. కాని పద్యంలో రాజుని ఏకవచనంలో సంబోధించేసరికి రాజాగ్రహానికి గురయ్యాడు. సూరకవి వెంటనే కవితామర్యాదల్ని వివరిస్తూ ఈ పద్యం చెప్పాడు- చిన్నప్పుడు, రతికేళిని నున్నప్పుడు, కవితలోన, యుద్ధములోనన్ వన్నెసుమీ రా కొట్టుట చెన్నగునో పూసపాటి సీతారామా! ఇలాగ కందపద్యం విసిరి, ఏకవచన ప్రయోగమే కాదు, ‘ఏరా’ సైతం అనతగునని సమర్థించుకున్నాడు. ఆ రోజుల్లో కవి బతుకులు పులిమీద సవారీ. ఇప్పుడసలు అదే ‘‘కల్చర్’’ అయిపోయింది. ఆడామగా పరస్పరం రా కొట్టుకుంటున్నారు. కలిసి ‘‘రా’’ కొడుతున్నారు. విశ్వబాపు దిగ్దర్శకులు విశ్వనాథ్ బాపులకు ఒకరంటే ఒకరికి ఇష్టం, గౌరవం. విశ్వనాథ్‌కి బాగా పేరొచ్చాక కూడా బాపు వద్ద సహాయకుడిగా ఒక్క సినిమాకి అయినా పని చెయ్యాలని అనుకునేవారట. కాని ఆ కోరిక తీరనే లేదని ఇప్పటికీ విశ్వనాథ్ వాపోతుంటారు. అలాగే బాపుకి విశ్వనాథ్ అంటే చాలా అభిమానం. ఈ కార్టూన్ ద్వారా బాపు తన ఇష్టాన్ని ప్రకటించుకున్నారు. ఇది చూసి విశ్వనాథ్ కూడా హాయిగా నవ్వుకున్నారు. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్య ‘‘కళాతపస్వి’’ బిరుదుని సమర్థించి, దాన్ని ధరించమని చెబుతూ ఉంటారు. ఈ చిత్రంలో ఉన్నది ఇంద్రుడు, రంభ మరియు కళాతపస్వి. నయా కాన్సెప్ట్స్! కావాలంటే వాడుకోండి. ‘‘మీ టూత్‌పేస్ట్‌లో కర్వేపాకుందా?’’ తెల్లమొహం వేయును. ‘‘మీ టూత్‌పేస్ట్‌లో జీలకర్రుందా?’’ పిచ్చిమొహం వేయును. ‘‘అయితే ఈ టూత్‌పేస్ట్ వాడండి. మీ అవగుణాలకు అనువైన టూత్‌పేస్ట్!’’ పీకాక్ సబ్బు! నాట్య, సౌందర్యాల సమ్మేళనం! మీ జీవితాన్ని సంగీతభరితం చేస్తుంది! ప్రతి రుద్దు ఒక ముద్దు! ‘‘ఆధ్యాత్మిక పరిమళాల టీ! ప్రపంచంలోనే మొదటిసారి’’ ‘‘అదెలాగ’’ ‘‘హిమాలయ సానువుల్లో, కేదార్‌నాథ్‌కి అతి చేరువలో పెరిగిన తేయాకు తోటల నుంచి తయారించబడింది!’’ *** ధోవతులు! ధోవతులు! చేతి నేతల ధోవతులు! ఇవి మానసంరక్షణకే కాదు, మనసు సంరక్షణకు కూడా మేలైనవి! హెచ్చరికో! హెచ్చెరిక! శ్రీ ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర్లుని శ్రీ దివ్య అపాదారవిందములకు కోటి దణ్ణములు సేసి, శాయంగల విన్నపములు - దేవరా! తూకమైన బంగారు సాలిగ్రామ దండయున్నూ, అయిదు పేటల పచ్చహారమున్నూ అప్పనంగా వచ్చిందని మురిసిపోకు. ముందుంటది ముసళ్ల పండగ. రేపు ఎల్లుండి నీళ్లు కరెంటు పవరుకి సంబంధించి ఏ చీకు వచ్చినా, తమరు సిరికింజెప్పక వచ్చి రంగప్రవేశం చేయకపోతే... ఇంతే సంగతులు ‘‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు...’’ అంటూ పాత ట్యూన్లు వినిపిస్తాయి. ఇది మా నేల గుణం, మా జాతి లక్షణం. అన్నిటికీ సిద్ధపడి మరీ ఆ బంగారు బరువులేసుకో సామీ!ననుగన్న తల్లులాలా! ముక్కెరకి మురిసిపోతా చెవులు పక్కన పెట్టద్దు. పిలవగానే పలకండి. క్షణం జాగైతే, ‘‘నీ యబ్బ ఆకాశరాజు చేయించెనా, నీయన్న పోతరాజు చదివించెనా’’ అంటూ ఉగ్గుపాలతో సహా కక్కించే అవకాశం ఉంది. అమ్మలాలా! నా మాట నమ్మండి. చిత్తగించవలెను మీ భక్త రేణువు పెన్ డ్రాప్స్: * కొండమీదా పప్పన్నం, కొండకిందా పప్పన్నం అన్నట్టుగావుంది మన గవర్నర్ స్థితి. ఏ రాష్ట్రంలో గడప పచ్చన చేసుకున్నా హిజ్ఎక్స్లెన్సీకి రెండు తాంబూలాలు ముడుతున్నాయి. రేపు ఉభయసభల్లో, ఉభయ రాష్ట్రాల్లో దంచుతారు కాబోలు! * బడ్జెట్ పంచాంగ శ్రవణం లాంటిది. ఆ రోజు వినడానికి, మర్నాడు చదువుకోవడానికి మాత్రమే. తర్వాత ఏ పద్దులో ఏ తేడా పడ్డా ఎవరూ పట్టించుకోరు. ఈసారి సంకురుమయ్య నల్లధనం మీద వచ్చాడు. * పాపం, ఉద్యమంలో చెయ్యి విరగ్గొట్టుకున్నారు. నాల్రోజులు కట్లు ధరించి తిరిగారు. అయినా పొన్నాల శక్తియుక్తులను పైవాళ్లు గుర్తించలేదు. * ప్రపంచీకరణ తర్వాత జాతి జామకాయలు మానేసి యాపిల్స్ తింటోంది. పేలాల బదులు పాప్‌కార్న్ తింటోంది. ఇప్పుడే అందిన ఎస్ఎంఎస్ కేంద్రం వైఖరితో చంద్రబాబుకి పచ్చివెలక్కాయ గొంతున పడ్డట్టుందిట. కడుపు చించుకోడానికీ లేదుట! -
పదవులకే వన్నె తెచ్చిన ‘నీలం’
భారత రాజకీయాల్లో ఆయనో మేరువు. రాజకీయాలలో నైతిక విలువలకు పట్టంకట్టి తిరుగులేని మహా నాయకుడిగా వెలిగి తనకంటూ ప్రత్యేక పంథాను నిర్దేశించుకున్న మహోన్నతమూర్తి నీలం సంజీవరెడ్డి. ఆయన రాజకీయ జీవితం నిష్కళంక చరితం. స్వశక్తితో, స్వీయ ప్రతిభతో, రాజకీయ చతురతతో రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహానేత నీలం సంజీవరెడ్డి. భారత రాజకీయాల్లో ఆయనో మేరువు. రాజకీయాలలో నైతిక విలువలకు పట్టంకట్టి తిరుగులేని మహానాయకుడిగా వెలిగి తనకంటూ ప్రత్యేక పంథాను నిర్దేశించుకున్న మహోన్నతమూర్తి నీలం. ఆయన రాజకీయ జీవితం నిష్కళంక చరితం. అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1913 సంవత్సరం మే 19న ఒక రైతు కుటుంబంలో పుట్టిన సంజీవరెడ్డి విద్యార్థి దశలోనే జాతీయ భావాల పట్ల ఆకర్షితులయ్యారు.1922,1929లలో గాంధీజీ రాయలసీమలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగం సంజీవరెడ్డిని విశేషంగా ప్రభావితం చేసింది. అప్పటికే ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. చిన్న వయస్సులోనే సంజీవరెడ్డి అసాధారణ నాయకత్వ లక్షణాలు కాంగ్రెస్ నాయకులను అబ్బురపరిచాయి. కాంగ్రెస్ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. 1940లో వేలూరు జైలులో భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను పట్టాభి సీతారామయ్య చెపుతూ ఉండగా, సంజీవరెడ్డి రాశారు. 1959-60లో సంజీవరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1951లో ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆచార్య రంగా, సంజీవరెడ్డి మధ్య జరిగిన పోటీలో సంజీవరెడ్డి ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదొక చరిత్రాత్మక సన్నివేశం. ఆ తర్వాత ప్రకాశం, రంగా కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీ పెట్టుకున్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రిగా సంజీవ రెడ్డి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కాని నీలం వెంటనే ప్రకాశం పంతులు ఇంటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆయన్ని అభ్యర్థించారు. ఇది విని ప్రకాశం నిర్ఘాంతపోయారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం గొప్ప త్యాగమూర్తి అయిన ప్రకాశం నాయకత్వం అ సమయంలో అవసరమని భావించి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన్ని ఒప్పించి తాను ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అతిపిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టారు. ఆయనది అందర్నీ కలుపుకొనిపోయే మనస్తత్వం. అప్పటికే తనపై పోటీ చేసి ఓడిపోయిన బెజవాడ గోపాలరెడ్డిని కేబినెట్లోకి ఆహ్వానించారు. అలాగే తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన యెహ్ద్ నవాజ్ జంగ్, కేవీ రంగారెడ్డిలను కూడా తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు. 1962లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 18కి పైగా నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. అత్యున్నత పదవులను సైతం తృణప్రాయంగా త్యజించే సంస్కారం ఆయనకే చెల్లు. కర్నూలు జిల్లాలో బస్‌రూట్లను జాతీయం చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నైతిక బాధ్యత వహిస్తూ 1964 ఫిబ్రవరి 26న ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. 1967లో హిందూపూర్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత స్పీకర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969లో హోరాహోరీగా జరిగిన రాష్ట్రపతి ఎన్నిక దేశ రాజకీయాలను కీలక మలుపుతిప్పాయి. రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా సంజీవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే నీలం అభ్యర్థిత్వం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి ఇష్టం లేదు. ఈ విషయం బయటకు చెప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి ‘అంతరాత్మ ప్రబోధం’ మేరకు ఓటు వేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఈ ఉత్కంఠ పోరులో అధికార అభ్యర్థి సంజీవరెడ్డి ఓడిపోయి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగిన వీవీ గిరి అనూహ్యంగా విజయం సాధించారు. తర్వాత కొంతకాలం సంజీవరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. జనతాపార్టీ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించిన ఆయన 1977 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఆ పార్టీ టికెట్‌పై గెలిచిన ఏకైక నాయకుడు. అంతేకాదు, రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి కూడా సంజీవరెడ్డి కావడం విశేషం. రాష్ట్రపతిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న తర్వాత ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు. అనంతపురంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన సలహాలు తీసుకునేందుకు రాజకీయ ప్రముఖులు వచ్చేవారు. జ్ఞానీ జైల్‌సింగ్, వెంకట్రామన్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు కూడా కలిసేవారు. తనను చూడవచ్చిన ఆత్మీయులతో మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు లుప్తం కావడం, హింసాకాండ పెరగడంపై ఆయన ఆవేదన చెందేవారు. ప్రస్తుతం చెలరేగిన ఈ ప్రాంతీయ దురభిమానాలనూ, సంకుచిత పోకడలనూ చూసి ‘నీలం’ ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో? ఆయన ఆత్మకు శాంతి కలగాలి. (నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగిసిన సందర్భంగా) - డాక్టర్ కె.వి.కృష్ణకుమారి (వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి) -
ఏడున్నరేళ్ల పదవీయోగం...
ఫ్లాష్‌బ్యాక్: ఏపీ మొదటి శాసనసభ రికార్డు ఒకసారి ఎన్నికై ఏడున్నరేళ్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన అవకాశం తెలుగువారికే దక్కింది. హేమాహేమీలు కొలువుదీరిన 1956 ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభ ఇందుకు వేదికైంది. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న చివరి ఎన్నికల సందర్భంగా ఈ సభ విశేషాలను గుర్తు చేసుకుందాం. మూడు ప్రాంతాల ఉద్ధండుల వేదిక 1956లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభకు బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్‌రెడ్డి లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్నప్పుడు 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రత్యేకాంధ్ర ఉద్యమం, అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మధ్యనిషేధం అంశంపై ఎదుర్కొన్న అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత 1955లో ఈ ప్రాంతంలోని 196 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాల్‌రెడ్డి... 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) కలిసి తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ తర్వాతి సంవత్సరమే 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లే కావడంతో ఇక్కడ ఎన్నికలు జరపలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలోని 196 మంది శాసనసభ్యులు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారితో కొలువైంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి దగ్గరే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం, మరో ఆసక్తికర విషయం. -
నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సాయుధ బలగాల పహారా.. సమైక్యవాదుల నిర్బంధం.. అధికారుల హడావుడి నడుమ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడున్నర గంటల జిల్లా పర్యటన సాగింది. శీతాకాల విడిది కోసం ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం అనంతపురంలో నిర్వహించిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకుని.. హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జిల్లాకు చేరుకోక మునుపే అనంతపురంలో సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీ, ఎస్కేయూ విద్యార్థులను హాస్టళ్ల నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి 11.40 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక హెలికాప్టర్లో, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరో హెలికాప్టర్లో, రాష్ట్రపతి భద్రత, వ్యక్తిగత సిబ్బంది మూడో హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.16 గంటలకు అనంతపురంలోని ఎన్‌హెచ్-44కు సమీపంలోని ‘సాక్షి’ దినపత్రిక కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎన్‌హెచ్-44, నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా పోలీసు శిక్షణ కేంద్రంలోని స్టేడియానికి 12.35 గంటలకు చేరుకున్నారు. నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకల సభ వేదికపైకి రాష్ట్రపతి చేరుకున్న అనంతరం జాతీయగీతాలాపన చేశారు. అనంతరం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగుజాతి ఐక్యత కోసం నీలం సంజీవరెడ్డి పాటుపడ్డారని.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతిని కోరారు. అనంతరం నీలం సంజీవరెడ్డి తోడల్లుడు జస్టిస్ ఎం.రంగారెడ్డి, నిరుపమాన త్యాగధనుడు పుస్తక రచయిత్రి డాక్టర్ కేవీ కృష్ణకుమారి, నీలం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ వై.రామసుబ్బయ్య, నీలం నివాస సంరక్షకుడు శివారెడ్డిని రాష్ట్రపతి ప్రణబ్ సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నీలం సంజీవరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా సమైక్యాంధ్ర ప్రదేశ్ అన్న మాటను కూడా ఉచ్చరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం కేవీ కృష్ణకుమారి రచించిన ‘నిరుపమాన త్యాగధనుడు నీలం’, ఎస్కేయూ రూపొందించిన ‘ఏ హిస్టారికల్ స్టడీ అండ్ అస్సెస్మెంట్’ పుస్తకాలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆవిష్కరించి.. తొలి ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు. నీలం సంజీవరెడ్డి జీవితంపై నిర్వహించిన రాత, వకృ్తత్వ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఎనిమిది మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను రాష్ట్రపతి అందజేశారు. అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని తెలుగు వజ్రం అంటూ కొనియాడుతూ అచ్చ తెలుగులో ప్రసంగించి.. అబ్బురపరిచారు. సరిగ్గా 1.17 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగాన్ని ప్రారంభించారు. చిత్తశుద్ధి కలిగిన రాజకీయ నేతగా.. పరిపాలనాదక్షుడిగా.. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా నీలం సంజీవరెడ్డి రోల్‌మోడల్‌గా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్రపతి 1.42 గంటలకు తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రపతి ఇంగ్లీష్‌లో ప్రసంగించగా.. మంత్రి రఘువీరారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముగింపు ఉపన్యాసం చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి ప్రణబ్‌ను కోరారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి.. సభను ముగించారు. సభాస్థలి నుంచి హెలిప్యాడ్‌కు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎం ప్రత్యేక హెలికాప్టర్లలో 2.07 గంటలకు పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. పుట్టపర్తి విమానాశ్రయానికి 2.35 గంటలకు చేరుకున్న రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలు నేరుగా ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌కు సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు బాబా చిత్రపటాన్ని అందజేసి, సన్మానించారు. తర్వాత సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో ప్రత్యేక విమానంలోనే రాష్ట్రపతి ప్రణబ్ ఆలస్యంగా భోజనం చేశారు. -
‘అన్నపూర్ణ’ ఘనత.. నీలం చలవే
* సంజీవరెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణం * ‘నీలం’ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ప్రశంసలు * దేశాన్ని సమర్థంగా నడిపిన మేరునగధీరుడు * సీఎం పదవిని తృణప్రాయంగా త్యజించిన ధీశాలి * తెలుగు ‘వజ్రం’గా కొనియాడిన గవర్నర్ సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా వెలుగొందుతోందంటే ఆ ఖ్యాతి నీలం సంజీవరెడ్డికే దక్కుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, వంశధార ప్రాజెక్టులను ఆయన హయాంలో నిర్మించడంవల్లే దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నం పెడుతోందన్నారు. అనంతపురంలో సోమవారం నిర్వహించిన మాజీ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొప్ప రాజకీయ నాయకుడు.. సమర్థవంతమైన పరిపాలకుడు.. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన నీలం సంజీవరెడ్డి సుపరిపాలనను అందించడంలో రోల్ మోడల్ అని ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో మారుమూల గ్రామమైన ఇల్లూరులో రైతు కుటుంబంలో జన్మించిన నీలం సంజీవరెడ్డి విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారన్నారు. మహాత్మాగాంధీ 1929 జూలైలో అనంతపురంలో పర్యటించిన సందర్భంలో ఆయన స్ఫూర్తితో 16 ఏళ్ల వయసులో చదువును పక్కన పెట్టి.. స్వాతంత్య్ర సమరంలోకి అడుగుపెట్టారని చెప్పారు. అతిపిన్న వయసులో 25 ఏళ్లకే 1938లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై.. పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారన్నారు. 1940 -1945 మధ్య కాలంలో స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నీలంను పలుమార్లు బ్రిటిష్ ప్రభుత్వం జైల్లో నిర్బంధించిందని తెలిపారు. జైల్లో టంగుటూరి ప్రకాశం, కామరాజ్ నాడార్, వి.వి.గిరి, సత్యమూర్తి వంటి యోధుల సహచర్యంతో నీలం మరింత రాటుదేలారని చెప్పారు. 1946లో మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికై.. ఎక్సైజ్, అటవీ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సమర్థవంతమైన పాలనను అందించారని కొనియాడారు. 1952లో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం.. తెలుగు జాతిని ఐక్యం చేసేందుకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని పోరాడారన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందని.. ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారని చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌కు రెండోసారి 1962లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నీలం.. 1964లో ఆ పదవికి రాజీనామా చేశారన్నారు. ఓ కేసులో సుప్రీం కోర్టు ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డిని తప్పుపట్టకపోయినా.. సకాలంలో అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేకపోయారని ప్రశ్నించినందుకే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి ప్రజాస్వామ్య విలువలకు సరి కొత్త నిర్వచనం చెప్పారని ప్రశంసించారు. లోక్‌సభ స్పీకర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్న లక్ష్యంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తొలి రోజే స్పీకర్ హోదాలో ఆ అంశంపై చర్చ జరిగేలా చర్యలు తీసుకున్న దార్శనికుడు అని ప్రశంసించారు. 1977 నుంచి 1982 వరకు ఆయన రాష్ట్రపతిగా పనిచేశారని.. ఆ మధ్య కాలంలో కేంద్రంలో మొరార్జీదేశాయ్, చరణ్‌సింగ్, ఇందిరాగాంధీ నేతృత్వంలో మూడు ప్రభుత్వాలు కొలువుతీరి, రాజకీయ అస్థిరత ఏర్పడినా దేశాన్ని ప్రగతిపథం వైపు నడపడానికి ఆయన నాయకత్వ లక్షణాలే కారణమని కొనియాడారు. ఆయన పదవులకు అతీతం... అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా 1960లో ఎన్నికైన సంజీవరెడ్డి.. సీఎం పదవికి రాజీనామా చేసి పార్టీ బాధ్యతలు చేపట్టారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. పార్టీ పదవి తక్కువ.. ప్రభుత్వ పదవి ఎక్కువ అని ఏనాడూ భావించలేదన్నారు. మహాత్మాగాంధీ ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ఇంతటి వాడినయ్యాయని 1978లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారని చెప్పారు. ‘ఎవరినీ విజయం వెతుక్కుంటూ రాదు.. చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతలతో పోరాడితే విజయం పరిగెత్తుకుంటూ వస్తుందని జవహర్లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలే తనను రైతు బిడ్డ నుంచి రాష్ట్రపతిని చేశాయి’ అని నీలం సంజీవరెడ్డి తన ఆత్మకథ ‘విత్ అవుట్ ఫియర్ ఆర్ ఫేవర్’లో రాశారని గుర్తుచేశారు. అనంతపురం జిల్లా నుంచి నీలం సంజీవరెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ (అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు) రాష్ర్టపతులయ్యారని, ఈ జిల్లానుంచి మరికొందరు సమర్థమైన నేతలు రావాలని పిలుపునిచ్చారు. చివరలో ‘విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్.. హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ తన 25 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు. అంతకుముందు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతూ తెలుగు వజ్రం నీలం అని కొనియాడారు. డాక్టర్ కేవీ కృష్ణకుమారి రచించిన ‘నిరుపమాన త్యాగధనుడు నీలం’ పుస్తకాన్ని.. ఎస్కేయూ రూపొందించిన ‘ఏ హిస్టారికల్ స్టడీ అండ్ అసెస్మెంట్’ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించి.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. అనంతరం రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌లకు జ్ఞాపిక (లేపాక్షి నంది)లను అందజేశారు. కార్యక్రమంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి పుట్టపర్తి, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సత్యసాయి మహా సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతపురంలో నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం 2.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి భారీ భద్రత మధ్య 2.50 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. రెవెన్యూ అకాడమీకి నీలం సంజీవరెడ్డి పేరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ అకాడమీకి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పేరు పెడుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ఇకపై డాక్టర్ నీలం సంజీవ రెడ్డి రెవెన్యూ అకాడమీగా వ్యవహరించనున్నట్టు పేర్కొంది. -
నీలం సంజీవరెడ్డి జీవితం ఆదర్శనీయం:రాష్ట్రపతి
-
నీలం సంజీవరెడ్డి జీవితం ఆదర్శనీయం:రాష్ట్రపతి
అనంత:మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జీవితం ఒక ఆదర్శనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు నీలం స్పూర్తి దాయకమని ఆయన అభిప్రాయపడ్డారు. అనంత పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్.. నీలం సంజీవరెడ్డిని కొనియాడారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, వంశధార ప్రాజెక్టుల నిర్మాణానికి నీలం ఎంతో కృషి చేశారన్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా చేసిన ఘనత సంజీవరెడ్డికే దక్కుతుందన్నారు. దేశ ప్రజలకు క్రిస్మస్, కొత్త సంవత్సర శుభాకాంక్షలను ప్రణబ్ తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతికి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. -
భారతంలో ‘అనంత’ కీర్తి
కొద్ది కాలం ప్రధానిగా ఉన్న చరణ్‌సింగ్ కొన్ని నిముషాలలో బల నిరూపణ జరగవలసి ఉండగా రాజీనామా చేసి, లోక్‌సభ రద్దుకు సిఫారసు చేశారు. ఈ సిఫారసును నీలం ఆమోదించకుండా, జనతా పార్టీ నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ను లేదా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ను పిలిచి ఉంటే ఉప ఎన్నిక తప్పేదని ఒక వాదన ఉంది. కానీ ప్రధాని, మంత్రిమండలి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించడమనే విధిని నీలం నిర్వహించారన్న ఖ్యాతి కూడా ఉంది. స్వాతంత్య్రానంతర భారతచరిత్రలో, ఆంధ్రుల చరి త్రలో ఐదారు కీలక ఘట్టాలు పరిశీలిస్తే వాటిలో ప్రధాన పాత్రధారిగా కనిపించే నాయకుడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి (మే 19, 1913-జూన్1, 1996). ఆయన మహోద్య మం నుంచి వచ్చారు. మహోన్నతుల మధ్య ఎదిగారు. గాంధీజీ, నెహ్రూ, పట్టాభి, ప్రకాశం, మద్దూరి అన్నపూర్ణయ్య, బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, కళా వెంకటరావు, కామరాజ్ నాడార్, బెజవాడ గోపాలరెడ్డి వంటి వారితో నీలం భుజం భుజం కలిపి నడిచారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ- రెండు చారిత్రక ఘట్టాలలోను ఆయన పేరు చిరస్మరణీయం. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఆయనే. లాల్ బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వాలలో సభ్యుడు. రాయలసీమ వంటి కరవు ప్రాంతం దేశానికి అందించిన ఆరవ రాష్ట్రపతి. భూస్వాముల కుటుంబం నుంచి వచ్చిన నీలం సంజీవరెడ్డిని 1929 నాటి గాంధీజీ అనంతపురం యాత్ర సామాజిక కార్యకర్తగా మార్చింది. ఉప్పు సత్యాగ్రహం దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న వేళ, 18 ఏళ్ల వయసులో నీలం ఉద్యమంలో ప్రవేశించారు. పాతికేళ్ల వయసులో 1938 లోనే ప్రాంత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎంపికయ్యా రు. అక్కడ నుంచి సాగిన ఆయన ప్రయాణం సంభ్రమంగానే ఉంటుంది. ప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో 1959 లో నీలం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1967 లో లోక్‌సభ స్పీకర్‌గా ఎంపికయ్యారు. అంతరాత్మ ప్రబోధం చైనా దాడితో మొదలైన 60వ దశకం ‘అంతరాత్మ ప్రబో ధం’ వివాదంతో ముగిసింది. ఈ రెండూ భారతీయ సమాజానికి కుదుపులే. నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి అకాల మరణాల తరువాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటివి అప్పుడు ఇందిర తీసుకున్న సంచలన నిర్ణయాలు. కానీ అప్పటికే భారత జాతీయ కాంగ్రెస్‌లో చీలికకు సంకేతాలు పొడసూపుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత రాజకీయాలలో వచ్చిన కీలక పరిణామానికి నీలం కేంద్ర బిందువయ్యారు. 1969 మే మాసంలో జాకీర్ హుస్సేన్ హఠాన్మరణంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. సిండికేట్‌గా పేరుపడిన వర్గం పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇది ముమ్మాటికీ పార్టీ నిర్ణయ మే. నీలం స్పీకర్ పదవికి రాజీనామా చేసి, పోటీ చేశారు. కానీ ఇందిర ఉప రాష్ట్రపతి వీవీ గిరి పేరును రంగం మీద కు తెచ్చారు. అప్పుడే ఆమె ‘అంతరాత్మ ప్రబోధం’ పిలుపునిచ్చారు. ఇందిర తీసుకున్న ఈ నిర్ణయం, ఆ ధోరణి ఇప్పటికీ దేశ రాజకీయాలలో వివాదాస్పదమే. పార్టీ అధికారిక అభ్యర్థి నీలం (4,18,169 ఓట్లు), ఇండిపెండెంట్ అభ్యర్థి గిరి (4,20,077 ఓట్లు) చేతిలో ఓడిపోయారు. దీనితో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో ఇందిరకు నోటీసు ఇచ్చారు. నిజానికి పార్టీలో ఇందిర హవా ఏమిటో పార్టీ అభ్యర్థి ఓటమితోనే రుజువైంది. నోటీసుకు జవాబు ఇవ్వకుండా సిండికేట్‌లోని కామరాజ్ నాడార్, మొరార్జీదేశాయ్, ఎస్. నిజలింగప్ప, అత్యుల ఘోష్, ఎస్కె పాటిల్, హితేంద్రనాథ్ దేశాయ్, జీకే మూపనార్, రామకృష్ణ హెగ్డే, సికిందర్ భ క్త్ వంటి వారిని పార్టీ నుంచి నవంబర్ 12, 1969న ఇందిరే బహిష్కరించారు. పార్టీ చీలిపోయింది. వీరే తరువాత వ్యవస్థా కాంగ్రెస్‌ను స్థాపించుకున్నారు. నీలం మాత్రం రాజకీయాలు విరమించి స్వస్థలం ఇల్లూరు చేరుకున్నారు. సాక్షాత్తు ప్రధాని అనుసరించిన అనుచిత వైఖరి వల్ల దేశం ఎంతటి మూల్యం చెల్లించిందో పీవీ నరసింహారావు ‘లోపలి మనిషి’లో అంచనా వేశారు. భారత నాయకత్వంలో వచ్చిన ఈ స్ఫుటమైన చీలికను చూసిన పాకిస్థాన్, ప్రజానీకంలో కూడా ఈ చీలిక ఉందని నమ్మి, అది లాభిస్తుందనే ఆశతోనే 1971 యుద్ధానికి దిగిందని పీవీ అంటారు. రాష్ట్రపతిగా నీలం 1969 ఎన్నికలో ఓడినా, 1977లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఈ పదవిలోకి రావడం, నిర్వహణ రెండూ సున్నితంగా సాగలేదు. 1974లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవం’ ప్రారంభించారు. నాటి అవినీతి, ఆశ్రీత పక్షపాతాలకు వ్యతిరేకంగా బీహార్ నుంచి ప్రారంభమైన ఉద్యమమిది. ఇందిర ఎన్నిక (1971, రాయ్‌బరేలీ) చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టులో తీర్పునివ్వడం, దీనిపై సుప్రీంలో వీఆర్ కృష్ణయ్యర్ షరతులతో కూడిన స్టే ఇవ్వడం, దరిమిలా తొలిసారిగా అత్యవసర పరిస్థితి విధించడం వరసగా జరిగిపోయాయి. ఈ పరిణామాల పరాకాష్ట జనతా ప్రభుత్వ ఏర్పాటు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పెల్లుబికిన నిరసనోద్యమం ద్వారానే నీలం మళ్లీ రాజకీయాలలోకి వచ్చారు. దేశమంతా జనతా హవా వీచగా, రాష్ట్రంలో నీలం (నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం) ఒక్కరే ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవి ఆయనను వరించింది. అయితే, రెండున్నర సంవత్సరాల తరువాత జనతా పార్టీలో ద్వం ద్వ సభ్యత్వం వంటి సమస్యలతో మొరార్జీ ప్రభుత్వం కూలింది. నాటి ఆరోగ్యమంత్రి రాజ్నారాయణ్తో కలిసి హోంమంత్రి, ఉపప్రధాని చరణ్‌సింగ్ కూలదోశారు. కానీ కొద్ది కాలం ప్రధానిగా ఉన్న చరణ్‌సింగ్ కొన్ని నిముషాలలో బల నిరూపణ జరగవలసి ఉండగా రాజీనామా చేసి, లోక్‌సభ రద్దుకు సిఫారసు చేశారు. ఈ సిఫారసును నీలం ఆమోదించకుండా, జనతా పార్టీ నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ను లేదా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ను పిలిచి ఉంటే ఉప ఎన్నిక తప్పేదని ఒక వాదన ఉంది. కానీ ప్రధాని, మంత్రిమండలి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించడమనే విధిని నీలం నిర్వహించారన్న ఖ్యాతి కూడా ఉంది. చాలా అంశాలను నీలం తన ఆత్మకథ ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’లో నమోదు చేశారు. నీలం రాజకీయ చతురత, రాజనీతిజ్ఞత కలగలసిన కాలంలో రాణించారు. తన ముం దుకాలం నాటి రాష్ట్రపతులు మూటకట్టుకున్న ‘రబ్బరు స్టాంపు’ అపఖ్యాతిని ఒదిలించుకోగలిగారు. వ్యవస్థలో గ్రామీణ ప్రాతినిధ్యానికి నీలం నిలువెత్తు నిదర్శనం. డా॥గోపరాజు నారాయణరావు (నీలం శత జయంతి సభ కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు అనంతపురం వస్తున్న సందర్భంగా...) -
నాతోపాటు నా ‘పద్మశ్రీ’నీ సమాధి చేయండి
అది నా జీవితాన్ని నాశనం చేసింది ఓ నేత కార్మికుడి చివరి కోరిక లక్నో: ‘‘ఆయన హస్తకళ.. ప్రాచీన సంప్రదాయకంగా సాంస్కృతికంగా సుసంపన్నమైనది’’ అని నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి ప్రశంసలందుకున్న తివాచీ నేత కార్మికుడతడు. ఆ ప్రశంసలతో పాటు.. 1981లో దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డునూ అందుకున్నాడు. అప్పుడతడి ఖ్యాతి దేశమంతా మార్మోగింది. ఆయన నివసించే ప్రాంతంలో ఎంతో ప్రముఖుడైపోయాడు. ఆ అవార్డు రాకముందు వరకూ నేత పనితో అతడి కుటుంబం జీవిస్తుండేది. పద్మశ్రీ పురస్కారంతో తమ జీవితం మారిపోతుందని ఆశించింది. నిజంగానే మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే.. ఇక అతడు పని చేయటానికే అవకాశం దక్కలేదు. ఎవ్వరూ పని ఇవ్వలేదు. ఒకే ఒక్క జీవనాధారం కూడా కోల్పోయి.. దుర్భర దారిద్య్రంలోకి ఆ కుటుంబం దిగజారిపోయింది. ఆ పద్మశ్రీ గ్రహీత పేరు సీతారాంపాల్. ఇప్పుడతడి వయసు 72 సంవత్సరాలు. కంటిచూపు లేదు. పాతికేళ్ల కిందటే పోయింది. డాక్టర్‌కు ఫీజు కట్టలేకపోవటమే కారణం. ఏళ్ల తరబడి సరైన తిండి లేదు. సన్నగా బక్కచిక్కిపోయాడు. మంచం మీద జీవచ్ఛవంలా పడున్నాడు. చావు కోసం నిరీక్షిస్తున్నాడు. అతడిది ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా షేర్పూర్ కలాన్ గ్రామం. ‘‘నేను మా ప్రాంతంలో అకస్మాత్తుగా చాలా కీర్తివంతుడినయ్యాను. కానీ.. తివాచీ తయారుదారులు నాకు పని ఇవ్వటం మానేశారు. నన్ను రోజు కూలీగా పెట్టుకుంటే.. ప్రభుత్వానికి కోపం వస్తుందని వారు భయపడ్డారు. పద్మశ్రీ అవార్డుతో నా దుర్దినాలు మొదలయ్యాయి. చేతిలో సొమ్ములు లేక, వైద్యం చేయించుకోలేకపోవటంతో 1986లోనే నా కంటిచూపు పోయింది. నా పరిస్థితిని వివరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు లేఖలు రాశాను. ఫలితంగా నెలకు 300 రూపాయల వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేశారు. కానీ.. అవేవీ నా దుస్థితిని మార్చలేకపోయాయి. డాక్టర్‌కు ఫీజులు కట్టేందుకు పైసలు లేకపోవటంతో నా కొడుకు కూడా కంటి చూపు కోల్పోయాడు’’ అని మంచం మీద నుంచి బలహీనమైన గొంతుతో నిర్వేదంగా వివరించాడు సీతారాంపాల్. ‘‘ప్రభుత్వం మా తండ్రికి పద్మశ్రీ అవార్డు ఇవ్వకముందు మా జీవితం సాఫీగానే సాగిపోయేది. కానీ అవార్డు అందుకున్నప్పటి నుంచీ మా తండ్రికి ఉపాధి లేదు. ఆయనకు తెలిసిన కళను మేం నేర్చుకోలేకపోయాం. ఎందుకంటే.. అది నేర్చుకుని జీవనోపాధి సంపాదించగలమన్న ఆశ ఏకోశానా లేకుండా పోయింది. మా ఇంట్లో కరెంటు లేదు.. దీంతో నాకు శుక్లాలు వచ్చాయి. చివరికి కంటిచూపు పోయింది’’ అని సీతారాం కుమారుడు శ్రావణ్పాల్ వివరిం చారు. ఎన్నిసార్లు వేడుకున్నా ప్రభుత్వాలు ఆదుకోలేదని సీతారాం పాల్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ప్రభుత్వాలకు గత ముప్పై ఏళ్లలో కనీసం 20 సార్లు నేను లేఖలు రాశాను. సాయం అర్థిస్తూ చాలామంది రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను కలిశాను. కానీ నా కష్టాలు వారు అర్థంచేసుకోలేదు. నేనెలా ఉన్నానని అడగటానికి ఏ ఒక్కరూ రాలేదు’’ అని ఆయన చెప్పారు. అయితే తన చివరి కోరిక ఒకటి చెప్పారు. అదేమిటంటే... ‘‘ఇప్పుడు నేను మరణశయ్యపై ఉన్నాను. నా చివరి కోరిక ఒక్కటే.. నాతో పాటు నా పద్మశ్రీ పతకాన్ని కూడా సమాధి చేయండి.’’