
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చౌకబారుగా ఉందని, ఆయనకు ఇదే చివరి బడ్జెట్ అని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సమాజాన్ని అవమానించేలా మాట్లాడారని అన్నారు. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి చేసింది, పీవీ నరసింహారావును ప్రధానమంత్రిని, అంజయ్యను సీఎం చేసింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. కలియుగ వెంకటేశ్వరుడికే మోదీ శఠగోపం పెట్టారని, ఆయన సన్నిధిలో చేసిన హామీలే నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సొంత భాగస్వామి టీడీపీనే ఆయన తీరు పట్ల నిరసన తెలుపుతోందని, సహనం కోల్పోయి కాంగ్రెస్‌ను మోదీ విమర్శిస్తున్నారన్నారు.
‘తెలంగాణకు చట్టంలో ఉన్న ఏ హామీని మీరు నెరవేర్చలేదు. కేంద్రం సరైన పాత్రపోషించకపోవడం వల్లే విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విభజన సమస్యల పరిష్కారం కోసం ఏం చేశారు? ఏరోజైనా ఇద్దరు సీఎంలతో విభజన సమస్యలపై చర్చించారా? తెలంగాణ ఏర్పాటునే మోదీ అవహేళన చేసారు. దీనికి బీజేపీ క్షమాపణ చెప్పాల’ని రేవంత్ డిమాండ్ చేశారు.
వాజపేయి, అద్వానీ లాంటి వారు నడిపిన బీజేపీ ఇప్పుడు అదాని, అంబానీ చేతుల్లోకి పోయిందని ఆరోపించారు. మోదీ కేర్ పథకానికి వాజపేయి పేరు పెట్టాలని సూచించారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా లాంటి వారిని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. మోదీకి రాజకీయ ప్రయోజనమే తప్ప దేశ గౌరవం పట్టడం లేదని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment