పదవులకే వన్నె తెచ్చిన ‘నీలం’ | Neelam Sanjeeva reddy 100th birth anniversary tomorrow | Sakshi
Sakshi News home page

పదవులకే వన్నె తెచ్చిన ‘నీలం’

Published Mon, May 19 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

పదవులకే వన్నె తెచ్చిన ‘నీలం’

పదవులకే వన్నె తెచ్చిన ‘నీలం’

భారత రాజకీయాల్లో ఆయనో మేరువు. రాజకీయాలలో నైతిక విలువలకు పట్టంకట్టి తిరుగులేని మహా నాయకుడిగా వెలిగి తనకంటూ ప్రత్యేక పంథాను నిర్దేశించుకున్న మహోన్నతమూర్తి నీలం సంజీవరెడ్డి. ఆయన రాజకీయ జీవితం నిష్కళంక చరితం.
 
స్వశక్తితో, స్వీయ ప్రతిభతో, రాజకీయ చతురతతో రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహానేత నీలం సంజీవరెడ్డి. భారత రాజకీయాల్లో ఆయనో మేరువు. రాజకీయాలలో నైతిక విలువలకు పట్టంకట్టి తిరుగులేని మహానాయకుడిగా వెలిగి తనకంటూ ప్రత్యేక పంథాను నిర్దేశించుకున్న మహోన్నతమూర్తి నీలం. ఆయన రాజకీయ జీవితం నిష్కళంక చరితం. అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1913 సంవత్సరం మే 19న ఒక రైతు కుటుంబంలో పుట్టిన సంజీవరెడ్డి విద్యార్థి దశలోనే జాతీయ భావాల పట్ల ఆకర్షితులయ్యారు.1922,1929లలో గాంధీజీ రాయలసీమలో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగం సంజీవరెడ్డిని విశేషంగా ప్రభావితం చేసింది. అప్పటికే ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. చిన్న వయస్సులోనే సంజీవరెడ్డి అసాధారణ నాయకత్వ లక్షణాలు కాంగ్రెస్ నాయకులను అబ్బురపరిచాయి. కాంగ్రెస్ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.  1940లో వేలూరు జైలులో భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను పట్టాభి సీతారామయ్య చెపుతూ ఉండగా, సంజీవరెడ్డి రాశారు.  1959-60లో సంజీవరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

1951లో ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆచార్య రంగా, సంజీవరెడ్డి మధ్య జరిగిన పోటీలో సంజీవరెడ్డి ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదొక చరిత్రాత్మక సన్నివేశం. ఆ తర్వాత ప్రకాశం, రంగా కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీ పెట్టుకున్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తొలి ముఖ్యమంత్రిగా సంజీవ రెడ్డి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కాని నీలం వెంటనే ప్రకాశం పంతులు ఇంటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఆయన్ని అభ్యర్థించారు. ఇది విని ప్రకాశం నిర్ఘాంతపోయారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం గొప్ప త్యాగమూర్తి అయిన ప్రకాశం నాయకత్వం అ సమయంలో అవసరమని భావించి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన్ని ఒప్పించి తాను ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అతిపిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టారు. ఆయనది అందర్నీ కలుపుకొనిపోయే మనస్తత్వం. అప్పటికే తనపై పోటీ చేసి ఓడిపోయిన బెజవాడ గోపాలరెడ్డిని కేబినెట్‌లోకి ఆహ్వానించారు. అలాగే తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన యెహ్‌ద్ నవాజ్ జంగ్, కేవీ రంగారెడ్డిలను కూడా తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు.
 1962లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 18కి పైగా నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. అత్యున్నత పదవులను సైతం తృణప్రాయంగా త్యజించే సంస్కారం ఆయనకే చెల్లు.

కర్నూలు జిల్లాలో బస్‌రూట్లను జాతీయం చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నైతిక బాధ్యత వహిస్తూ 1964 ఫిబ్రవరి 26న ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. 1967లో హిందూపూర్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత స్పీకర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969లో హోరాహోరీగా జరిగిన రాష్ట్రపతి ఎన్నిక దేశ రాజకీయాలను కీలక మలుపుతిప్పాయి. రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా సంజీవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే నీలం అభ్యర్థిత్వం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి ఇష్టం లేదు. ఈ విషయం బయటకు చెప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి ‘అంతరాత్మ ప్రబోధం’ మేరకు ఓటు వేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఈ ఉత్కంఠ పోరులో అధికార అభ్యర్థి సంజీవరెడ్డి ఓడిపోయి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగిన వీవీ గిరి అనూహ్యంగా విజయం సాధించారు. తర్వాత కొంతకాలం సంజీవరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. జనతాపార్టీ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించిన ఆయన 1977 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఆ పార్టీ టికెట్‌పై గెలిచిన ఏకైక నాయకుడు. అంతేకాదు, రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి కూడా సంజీవరెడ్డి కావడం విశేషం. రాష్ట్రపతిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న తర్వాత  ఆయన బెంగళూరులో   స్థిరపడ్డారు.

 అనంతపురంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన సలహాలు తీసుకునేందుకు రాజకీయ ప్రముఖులు వచ్చేవారు. జ్ఞానీ జైల్‌సింగ్, వెంకట్రామన్, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు కూడా కలిసేవారు. తనను చూడవచ్చిన ఆత్మీయులతో మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు లుప్తం కావడం, హింసాకాండ పెరగడంపై ఆయన ఆవేదన చెందేవారు. ప్రస్తుతం చెలరేగిన ఈ ప్రాంతీయ దురభిమానాలనూ, సంకుచిత పోకడలనూ చూసి ‘నీలం’ ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో? ఆయన ఆత్మకు శాంతి కలగాలి.    
 
(నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగిసిన సందర్భంగా)     - డాక్టర్ కె.వి.కృష్ణకుమారి   (వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి)
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement